ఫిబ్రవరి - 2015 జాతీయం - February -2015 National




ఫిబ్రవరి - 1

¤ రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన మనూ అనే 30 సంవత్సరాల వ్యక్తికి దేశంలోనే తొలిసారిగా చేతుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
       » మరో రోడ్డు ప్రమాద బాధితుడి చేతులను మనూకు విజయవంతంగా అమర్చారు.
       » కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు.

ఫిబ్రవరి - 2

¤ 'విశ్వాస పూరితమైన శునకం నమ్మకమైన స్నేహితుడులాంటిది' అని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ప్రజలకు చికాకుగా మారాయన్న కారణంతో వీధి శునకాలను చంపడానికి పురపాలక సంస్థలకు ఏ అధికారం ఉందని ప్రశ్నించింది.
       » జంతు సంక్షేమ బోర్డు, శునక ప్రేమికులు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
       » జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పి.సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది.
       » ప్రజలకు చికాకు కలిగిస్తున్న శునకాలను చంపడానికి మహారాష్ట్ర పురపాలక సంస్థకు అనుమతిస్తూ ముంబయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
¤ మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 10వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
       » కూలీలను నిపుణత ఉన్న కార్మికులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఇకపై ఈ పథకాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఫిబ్రవరి - 4

¤ రాజస్థాన్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటివల్ల విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
       » ప్రతి పాఠశాలలోను ఉదయపు ప్రార్థన అనంతరం విద్యార్థులందరూ పది నిమిషాలపాటు వీటిని ఆచరించాలని సూచించింది.
¤ శారదా గ్రూపు సంస్థల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తులో కల్పించుకున్నందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది.
       » గోస్వామి స్థానంలో కేరళ క్యాడర్‌కు చెందిన 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్.సి.గోయోల్‌ను నియమించారు. ఆయన ఇప్పటివరకు గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా ఉన్నారు.
       » పశ్బిమ బంగ రాష్ట్రంలో చోటు చేసుకున్న శారదా కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సిన్హ్‌ను అరెస్టు చేయకుండా మెతకగా వ్యవహరించాలంటూ సీబీఐ అధికారులపై గోస్వామి ఒత్తిడి తీసుకురావడం, దానిపై ప్రధాన మంత్రి కార్యాలయానికి సీబీఐ నివేదిక అందించడం ఇటీవల చోటుచేసుకున్నాయి.

ఫిబ్రవరి - 5

¤ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.సి.గోయల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనిల్ గోస్వామి స్థానంలో ఈయన నియమితులయ్యారు.
¤ నాగాలాండ్ ముఖ్యమంత్రి జెలియాంగ్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. మొత్తం 60 మంది సభ్యులున్న శాసనసభలో 59 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు.
       » అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు 38 మంది శాసనసభ్యులున్నారు. వీరిలో 22 మంది గతనెలలో జెలియాంగ్ నేతృత్వంపై తిరుగుబాటు చేయండంతో సంక్షోభం తలెత్తింది.
¤ మైనర్ ఖనిజాల జాబితాకు మరో 31 ఖనిజాలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం మేజర్ ఖనిజాల జాబితాలో ఉన్నాయి.
       » దిల్లీలో జరిగిన 'కేంద్ర భూగర్భ కార్యక్రమాల బోర్డు' 54వ సమావేశంలో కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
       » ఈ 31 ఖనిజాల తాలూకు లీజులు మొత్తం లీజుల్లో 55 శాతం వరకు ఉన్నాయని, మొత్తం లీజు ప్రాంతంలో వీటి వాటా 60 శాతం వరకు ఉంటుందని మంత్రి తెలిపారు.
       » రాష్ట్రాలకు మరిన్ని అధికారాలను ఇవ్వడం, దేశంలో ఖనిజాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఫిబ్రవరి - 6

¤ 'నీతి ఆయోగ్' తొలి సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రముఖ ఆర్థికవేత్తల అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు.
       » చమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను దేశ ఆర్థిక వృద్ధికి అవకాశంగా మలచుకోవాలని కృత నిశ్చయంతో ఉన్న ప్రధాని ఈ విషయంలో ప్రముఖ ఆర్థికవేత్తల సూచనలు కోరుతూ నీతి ఆయోగ్ తొలి సమావేశాన్ని నిర్వహించారు.
       » ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా, పూర్తికాలపు సభ్యులు బిబేక్ దేబ్రాయ్, వి.కె.సారస్వత్; ఆర్థికవేత్తలు విజయ్ కేల్కర్, నితిన్ దేశాయ్, బిమల్ జలాన్, రాజీవ్ లాల్, ఆర్.వైద్యనాథన్, సుబిర్ గోకర్ణ్, పార్థసారధి షోమ్, పి.బాలకృష్ణన్, రాజీవ్ కుమార్, అశోక్ గులాటీ, ముకేష్ బుతానీ, జి.ఎన్.బాజ్‌పాయ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
       » నీతి ఆయోగ్ సీఈఓ సింధుశ్రీ ఖుల్లర్ కొత్త సంస్థ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు.
       » పీఎమ్‌జేడీవై, వంటగ్యాస్ రాయితీ ప్రత్యక్ష బదిలీ, స్వచ్ఛభారత్ సహా ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రధాని వివరించారు.

ఫిబ్రవరి - 7

¤ దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 67.14 శాతం పోలింగ్ నమోదైంది.
       » మొత్తం 70 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1.33 కోట్ల మంది ఓటర్లలో 67.14 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
       » గోకల్‌పూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 73.46%, దిల్లీ కంటోన్మెంట్‌లో అత్యల్పంగా 58.47% పోలింగ్ జరిగింది.

ఫిబ్రవరి - 8

¤ అణు ఒప్పందానికి సంబంధించి ఇటీవల అమెరికా తో కుదిరిన అవగాహనను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అణు ప్రమాదం జరిగితే బాధితులు అణు రియాక్టర్లకు పరికరాలను సరఫరా చేసే విదేశీ కంపెనీలపై దావా వేయజాలరని ఇది స్పష్టం చేస్తోంది. అయితే ఆ సరఫరాదారులను ఆపరేటర్ మాత్రమే జవాబుదారు చేయగలడని వివరించింది. పౌర అణు జవాబుదారీ చట్టం (సీఎల్ఎన్‌డీఏ)లో సవరణలు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం పేర్కొంది.
¤ దేశంలో టెలిఫోన్ వినిమోగదారుల సంఖ్య 97 కోట్లకు చేరిందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వెల్లడించింది. గత నవంబరు నెలాఖరుకి వినియోగదారుల సంఖ్య 96.42 కోట్లు కాగా, డిసెంబరు ఆఖరుకు ఈ మొత్తం 97.10 కోట్లకు చేరింది.
       » ఇందులో మొబైల్ వినియోగదారులే 94.39 కోట్లు ఉన్నారు. టెలీ సాంద్రత 77.58 (ప్రతి 100 మందిలో ఫోన్ కనెక్షన్ ఉన్నవారు) గా నమోదైంది.
¤ మారిషస్ సముద్ర గర్భంలో భారత్ త్వరలో ఖనిజ అన్వేషణ చేపట్టనుందని అంటార్కిటిక్ సముద్ర పరిశోధన జాతీయ సంస్థ (ఎన్‌సీఏఓఆర్) ప్రకటించింది.
       » కొచ్చిన్‌లో జరిగిన 'ప్రపంచ సముద్ర అధ్యయన సమావేశం-2015' లో ఈ విషయాన్ని ఎన్‌సీఏఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రాజన్ వెల్లడించారు. 10 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సముద్రం మధ్యలో ఈ శోధన కొనసాగించడానికి అంతర్జాతీయ సముద్ర గర్భ ప్రాధికార సంస్థ (ఐఎస్ఏ) నుంచి అనుమతి లభించిందని రాజన్ పేర్కొన్నారు.

ఫిబ్రవరి - 9

¤ సెలవు ప్రయాణ రాయితీ (ఎల్టీసీ)ని కేవలం ఏడాదికి ఒక్కసారే నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
       » కేంద్ర పౌర సేవలు (సెలవులు) నిబంధనలు, 1972 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు రకాల ఎల్టీసీలను (స్వస్థలం, దేశవ్యాప్తంగా ఎక్కడికైనా) పది రోజుల వరకు నగదుగా మార్చుకోవచ్చు.
¤ ప్రముఖ ఇతిహాసమైన రామాయణంలో ప్రస్తావించిన 'పంచవటి' ఉద్యానవనం ఆధారంగా దేశంలోని ప్రతి గ్రామంలో అయిదు మొక్కలను నాటాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నిర్ణయించింది. వీటిలో భాగంగా మర్రి, రావి, అత్తి, రాం అంజీర్ (పకాడ్), అశోక మొక్కలను ఎంచుకుంది. వీటికి తోడు తులసి మొక్కను కూడా ఇంటికి ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది.

ఫిబ్రవరి - 10

¤ దిల్లీ శాసనసభ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 70 స్థానాలకు 67 స్థానాలను కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది.
       » భాజపా కేవలం మూడు స్థానాలను గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానమూ దక్కలేదు.
       » ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ఠాత్మక కొత్త దిల్లీ నియోజక వర్గం నుంచి 31,500 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి నూపుర్ శర్మపై ఘన విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్‌ను 25,864 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడించారు.
       » భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి ఎస్.కె.బగ్గా చేతిలో 2,277 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
       » ఆప్ 54.3% ఓట్లను గెల్చుకుంది. భాజపాకు 32.7%, కాంగ్రెస్‌కు 9.7%, ఇతరులు 3.3% పొందారు.
       » ఈ స్థాయిలో ఒక పార్టీ రాష్ట్రాల్లో విజయం సాధించడం అరుదు. 1989 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం సంగ్రామ్ పరిషద్ మొత్తం 32 స్థానాలనూ గెల్చుకుంది.
       » కేజ్రీవాల్ 2014 ఫిబ్రవరి 14న 49 రోజుల పాలన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లుకు దిల్లీ శాసనసభలో భాజపా, కాంగ్రెస్ అడ్డుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఆయన 2013లో అధికార కాంగ్రెస్‌ను ఓడించి దిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా 2013 డిసెంబరు 28న బాధ్యతలు చేపట్టారు.
       » వికాస్‌పురి నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మహీందర్ యాదవ్ 77,665 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్థి సంజయ్ సింగ్‌పై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ. నజాఫ్‌గఢ్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కైలాస్ గెహ్లాట్ సమీప ఐఎన్ఎల్‌డీ (ఇండియన్  నేషనల్ లోక్‌దళ్) లో అభ్యర్థిపై 1,555 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ.
       » 70 మంది తాజా ఎమ్మేల్యేల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరంతా ఆప్ నుంచే విజయం సాధించారు. మొత్తం 66 మంది మహిళలు పోటీ పడ్డారు. రాఖీ బిర్లా, సరితాసింగ్, వందన కుమారి, ప్రమీలా తోకాస్, భావన గౌర్, అల్కా లంబా గెలిచారు. రాఖీ బిర్లా గత ఆప్ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేశారు.
       » దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 36,000 మంది ఓటర్లు తమ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యుర్థులెవరూ నచ్చలేదని తిరస్కరించారు. పోలింగ్ శాతంలో 0.4 శాతం మంది ఓటర్లు నోటా మీట నొక్కారు.
       » ముగ్గురు భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. రోహిణి నియోజక వర్గం నుంచి భాజపా దిల్లీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, ముస్తఫాబాద్ నిమోజకవర్గం నుంచి జగదీష్ ప్రధాన్, విశ్వాస్ నగర్ నియోజకవర్గం నుంచి ఓం ప్రకాష్ శర్మ విజయం సాధించారు.
       » అరవింద్ కేజ్రీవాల్ ఆగస్టు 16, 1968న హరియాణాలోని భివానీ జిల్లా సివానీలో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యసించారు. ఐఆర్ఎస్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆదాయపు పన్నుశాఖలో పనిచేస్తూ సామాజిక అంశాలపైనా, సహ చట్టం విస్తృతి కోసం పాటు పడ్డారు. అందుకు ఆయన ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె పురస్కారాన్ని పొందారు. ఈ పురస్కారానికి వచ్చిన రూ.30 లక్షలతో మూలనిధిగా ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2011లో ఉద్యమ కర్త అన్నా హజారేతో కలిసి జనలోక్‌పాల్ బిల్లు కోసం పోరాడారు. 2012 నవంబరు 26న 'ఆప్‌'ను స్థాపించారు.
¤ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన 'జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధి, ఆర్థిక సంస్థ' (ఎన్ఎండీఎఫ్‌సీ) లో అధీకృత వాటా ధనాన్ని రూ.1500 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది.
¤ సునామీ వచ్చే సమయంలో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై నావికా దళం లక్షద్వీప్‌లో కవాతు నిర్వహించింది.
       » తూర్పు, పశ్చిమ నౌకాదళానికి చెందిన 20 యుద్ధ నౌకలు, విమానాలు దీనిలో పాలు పంచుకున్నాయి. హిందూ మహా సముద్రంలోని దాదాపు 8000 చదరపు మైళ్లలో కవరత్తి, కల్పేని, ఆండ్రోత్, అగ్గటి ప్రాంతాల్లో దీన్ని చేపట్టారు. భారీ సునామీ ద్వీపాన్ని తాకినప్పుడు భారీ విధ్వంసం జరిగి, ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడితే ఎలా స్పందిస్తారో కవాతు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన కవాతుల్లో ఇదే అతి పెద్దది.

ఫిబ్రవరి - 13

¤ బెంగళూరు సమీపంలోని ఆనేకల్ శివార్లలో బెంగళూరు-ఎర్నాకుళం (12677) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 9 మంది మరణించారు.
¤ దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్యానోత్సవం - 2015ను ప్రారంభించారు. మార్చి 15 వరకు ఈ ఉద్యానవనాన్ని ప్రజలు సందర్శించవచ్చు.
¤ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను నియమించారు. మరో ఆరుగురిని (మనీష్ సిసోడియా, ఆసిం అహ్మద్‌ఖాన్, సందీప్ కుమార్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, జితేంద్రసింగ్ తోమర్) కేజ్రీవాల్ సలహా మేరకు మంత్రులుగా నియమించారు.
       » వీరంతా ప్రమాణ స్వీకరణ చేసిన నాటి నుంచి అధికారంలోకి వస్తారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
¤ అధికార వికేంద్రీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడగు వేసింది. కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ప్రాంతీయ కార్యాలయాలకు మరింత అధికారం కల్పించింది. దీనిలో భాగంగా రూ.200 కోట్ల మేర వ్యయంతో చేపట్టే పనుల టెండర్లను ఆమోదించడం, అనుమతులు ఇచ్చే అధికారాన్ని ఇక మీదట సీపీడబ్ల్యూడీ ప్రాంతీయ కార్యాలయాలకే అప్పజెప్పారు.
¤ వివాదాస్పద చిత్రం 'ఎమ్ఎస్‌జీ ది మెసెంజర్' నిరసనల మధ్య దేశ వ్యాప్తంగా విడుదలైంది.
       » ఈ చిత్రాన్ని నిషేధించాలని పంజాబ్‌లోని అధికార శిరోమణి అకాలీదళ్ కేంద్రాన్ని కోరింది. చిత్రంలోని 'డేరా సచ్ఛా సౌదా' అధినేత గుర్మీత్ రాం రహీమ్ సింగ్ పాత్ర మతపరమైన అలజడికి కారణమౌతోందని ఆరోపించింది.
¤ ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారిన పడి 70 మంది మరణించారని, దీంతో ఈ సంవత్సరం స్వైన్‌ఫ్లూ మరణాల సంఖ్య 485కు చేరుకుందని కేంద్రం వెల్లడించింది.
       » ఈ ఏడాది ఫిబ్రవరి 12 వరకు 6,298 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం అత్యధికంగా రాజస్థాన్‌లో 1631 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, వీరిలో 130 మంది మరణించారు. గుజరాత్‌లో 1233 మంది ఈ జబ్బు బారిన పడగా 117 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 56, మహారాష్ట్రలో 51, దిల్లీలో ఆరుగురు మరణించారు.
       » తెలంగాణలో 969 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా 45 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అయిదుగురు మరణించారు.
       » దేశంలో స్వైన్‌ఫ్లూ మూలంగా 2009లో 981 మంది, 2010లో 1763 మంది, 2011లో 75 మంది, 2012లో 405 మంది, 2013లో 699 మంది, 2014లో 218 మంది మరణించారు.

ఫిబ్రవరి - 14

¤ పుణెకు సమీపంలోని ఛకాన్ వద్ద జీఈ సంస్థ ఏర్పాటు చేసిన తయారీ కర్మాగారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పెట్టుబడిదారులకు మరిన్ని సంస్కరణలను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
       » ముంబయి హైకోర్టు ప్రాంగణంలో ప్రధాని 'జ్యుడీషియల్ మ్యూజియం'ను ప్రారంభించారు. అందులో మహాత్మాగాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కె.ఎం.మున్షీ, జస్టిస్ ఎం.సి.ఛగా తదితర ప్రముఖుల బారిస్టర్ సర్టిఫికెట్లను ఈ ప్రదర్శనశాలలో ఉంచారు. వీటితో పాటు విద్యుత్ వసతిలేని రోజుల్లో కోర్టు గదుల్లో ఉపయోగించిన క్యాండిల్ స్టాండ్లు, సిరాబుడ్డీలు, పేపర్ వెయిట్లు, వెండి దండం తదితరాలు ఉన్నాయి. 150 ఏళ్ల నాటి హైకోర్టు సుసంపన్న చరిత్రకు ఈ ప్రదర్శనశాల అద్దం పట్టింది. 1864లో ముంబయి కోటను కూల్చివేసిన తర్వాత సేకరించి పెట్టిన ఫిరంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
¤ మొదటి బొగ్గు గనుల వేలంలో జీఎంఆర్, రిలయన్స్ సిమెంట్‌లు తలొక బ్లాకును దక్కించుకున్నాయి.
       » సెప్టెంబరు 2014లో 204 గనుల కేటాయింపును సుప్రీం కోర్టు రద్దుచేసిన తర్వాత బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం ద్వారా వచ్చిన నిధులను తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
       » ఒడిశాలోని తాలబిరా-1 బొగ్గు బ్లాకును జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ రూ.1375 కోట్ల బిడ్‌తో గెలుచుకుంది.
       » అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సిమెంట్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన సియాల్ ఘోఘ్ని గనిని సొంతం చేసుకుంది. దీనికి రూ. 798 కోట్ల బిడ్‌ను సమర్పించింది.
¤ దిల్లీలోని రాంలీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
       » మనీష్ సిసోడియా ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
దిల్లీ నూతన మంత్రి మండలి
 అరవింద్ కేజ్రీవాల్: ముఖ్యమంత్రి
 మనీష్ సిసోడియా: ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్య, రెవెన్యూ సర్వీసులు, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఐటీ, పరిపాలన సంస్కరణలు, పట్టణాభివృద్ధి భూములు, భవనాలు, విజిలెన్సులతో పాటు ఇతరులకు కేటాయించని శాఖలు
 జితేంద్ర సింగ్ తోమార్: హోం, న్యాయ, పర్యటకం, కళలు, సాంస్కృతిక శాఖలు
 సందీప్ కుమార్: మహిళా, శిశు సంక్షేమం, సామాజిక సంక్షేమం, భాషలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి శాఖలు
 గోపాల్‌రాయ్: ఉద్యోగిత, అభివృద్ధి, కార్మిక, సాధారణ పరిపాలన శాఖలు
 ఆసిం అహ్మద్ ఖాన్: ఆహార, పౌర సరఫరాలు, అటవీ, పర్యవరణం, ఎన్నికల శాఖలు
 సత్యేంద్ర జైన్: విద్య, ఆరోగ్య, పరిశ్రమలు, గురుద్వారా నిర్వహణ, ప్రజాపనులు, నీటి పారుదల, వరద నియంత్రణ శాఖలు
 మంత్రుల్లో సత్యేంద్ర జైన్ అత్యంత పెద్ద వయస్కుడు (50 ఏళ్లు), అతి చిన్న వయస్కుడు సందీప్‌కుమార్ (34 ఏళ్లు).
దిల్లీ ముఖ్యమంత్రులు
1. చౌధరి బ్రహ్మ ప్రకాష్ (కాంగ్రెస్) : 1952 మార్చి 17 - 1955 ఫిబ్రవరి 12
2. జి.ఎన్.సింగ్ (కాంగ్రెస్) : 1955 ఫిబ్రవరి 12 - 1956 నవంబరు 1
1956 - 1993 వరకు దిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది.
3. మదన్‌లాల్ ఖురానా (భాజపా): 1993 డిసెంబరు 2 - 1996 ఫిబ్రవరి 26
4. సాహెబ్ సింగ్ వర్మ (భాజపా): 1996 ఫిబ్రవరి 26 - 1998 అక్టోబరు 12
5. సుష్మాస్వరాజ్ (భాజపా): 1998 అక్టోబరు 12 - 1998 డిసెంబరు 3
6. షీలా దీక్షిత్ (కాంగ్రెస్): 1998 డిసెంబరు 3 - 2013 డిసెంబరు 28
7. అరవింద్ కేజ్రీవాల్ (ఆప్): 2013 డిసెంబరు 28 - 2014 ఫిబ్రవరి 14
రాష్ట్రపతి పాలన: 2014 ఫిబ్రవరి 14 - 2015 ఫిబ్రవరి 14
8. అరవింద్ కేజ్రీవాల్ (ఆప్): 2015 ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం

ఫిబ్రవరి - 15

¤ అవినీతి నిరోధక కేంద్ర నిఘా సంఘం (సీవీసీ)లో గతేడాది 63,288 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సారి 79 శాతం కేసులు పెరిగాయి.
       » సీవీసీకి నాలుగు నెలలుగా ప్రధాన అధిపతి లేకపోయినప్పటికీ రికార్డు స్థాయిలో 5,743 కేసులు విచారణ చేపట్టినట్లు సీవీసీ వెల్లడించింది.
సంవత్సరం
మొత్తం కేసులు
విచారించిన కేసులు
2013
37,037
4,801
2012
16,929
5,720
2011
16,260
5,341

       » కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) మాజీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సీవీసీ కి తాత్కాలిక అధిపతిగా కొనసాగుతున్నారు.

ఫిబ్రవరి - 17

¤ ఇండోర్ లోని విజయనగర్‌లో ఉన్న 'ప్రెస్టీజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్' కళశాలకు చెందిన 401 మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎత్తు ఆధారంగా అవరోహణ క్రమంలో నిల్చుని వారు ఈ రికార్డు నెలకొల్పారు.
       » 2013 మార్చి 21న 311 మంది పోలీష్ బ్యాంకు ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి సృష్టించిన రికార్డును వీరు తిరగరాశారు.
¤ ఏటా 2.5 - 7 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల్లో, విమానాశ్రయ సేవల నాణ్యతకు సంబంధించి, ప్రపంచంలోనే దిల్లీలోని 'ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐఐజీ)' అగ్రస్థానంలో నిలిచింది.
       » జెనీవాకు చెందిన ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఐసిఐ), ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ)కి సంబంధించి 2014 సంవత్సరానికి ప్రకటించిన జాబితాలో దిల్లీ మొదటి స్థానంలో, ముంబయి అయిదో స్థానంలో ఉన్నాయి.
       » దిల్లీ విమానశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), జీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
       » ఏడాదికి 50 లక్షలు నుంచి 1.5 కోట్ల ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం ఉన్న విమానశ్రయాల్లో ప్రపంచంలో మూడో అత్యుత్తమ విమానాశ్రయంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు లభించింది. (ఈ అవార్డు లభించడం వరుసగా ఇది ఆరోసారి)

ఫిబ్రవరి - 18

¤ బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో పదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన 'ఏరో ఇండియా 2015'ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ వైమానిక ప్రదర్శన అయిదు రోజులపాటు కొనసాగనుంది.
       » రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.
       » 'ప్రపంచంలో కెల్లా రక్షణ పరికరాలు, వ్యవస్థల్ని అత్యధికంగా 60% మేర దిగుమతి చేసుకునే దేశంగా భారత్‌కు పేరుంది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా బలమైన అడుగులు వేయాలి' అని ప్రధాని పిలుపునిచ్చారు. రక్షణ రంగ ఉత్పత్తుల నమూనాల తయారీకి కేంద్రం 80% వరుకు నిధుల్ని సమకూర్చే విధానాన్ని త్వరలో ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.
¤ పట్టణాభివృద్ధిలో ప్రణాళికల రూపకల్పన నుంచి అమలు వరకు ప్రతిస్థాయిలో పౌరులకు అధిక భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే లక్ష్యంతో 'నూతన పట్టణ, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ఆచరణ మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు దిల్లీలో విడుదల చేశారు.

ఫిబ్రవరి - 19

¤ రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో 'భూసార కార్డు పథకం'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
       » ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎక్కువ ఎరువులను, నీటిని వాడటం వల్ల భూ సారం నాశనమైందని, అందువల్లే భూసార పరీక్షా కార్డు పథకాన్ని ప్రారంభించామని ప్రధాని పేర్కొన్నారు. ఎరువులను సమతౌల్యంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే మూడేళ్లలో 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ పంటకు ఏ ఎరువు అవసరమో కార్డులో వివరంగా సిఫార్సు చేస్తారు.
¤ భారత నౌకాదళాన్ని బలోపేతం చేసేలా రూ.లక్ష కోట్ల వ్యయంతో దేశీయంగా జలాంతర్గాములను నిర్మింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
       » 24 జలాంతర్గాముల నిర్మాణానికి 30 ఏళ్ల కార్యక్రమాన్ని 1999లో ఆమోదించారు. దీనిలో భాగంగా పి-75 పేరుతో తొలిదశలో ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది. మరో ఆరింటిని నిర్మింపజేయడానికి వచ్చే నెలలో 'ప్రతిపాదనకు అభ్యర్థన (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ - ఆర్.ఎఫ్.పి)' జారీ చేస్తారు. సంప్రదాయ ఇంధనాలకు భిన్నంగా అణు ఇంధనంతో నడిచేలా వీటిని తీర్చిదిద్దుతారు. అదే విధంగా గోప్యంగా వ్యవహారాన్ని చక్కబెట్టే నాలుగు యుద్ధ నౌకల్ని ముంబయిలోని మజిగావ్ డాక్స్‌లో, మూడింటిని కోల్‌కత లోని గార్డెన్ రీచ్ నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మింపజేస్తారు.

ఫిబ్రవరి - 20

¤ బిహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ శాసనసభ బలపరీక్షలో ఓటమి తప్పదని గ్రహించి తన పదవికి రాజీనామా చేశారు.
       » జేడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని కలిశారు.
¤ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బంద్‌గలా నీలం రంగు సూటును వేలంలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీపటేల్, ఆయన కుమారుడు రూ.4.31 కోట్లకు సొంతం చేసుకున్నారు.
       » ఈ సూటును సూరత్‌లో ఫిబ్రవరి 18 నుంచి వేలానికి పెట్టారు. దీంతో పాటు ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు వచ్చిన సుమారు 455 బహుమతులను కూడా వేలానికి పెట్టారు.
       » మొత్తం మూడు రోజులపాటు జరిగిన ఈ వేలంలో సూటుతో కలిపి అన్ని వస్తువులకు సుమారు రూ.8.33 కోట్లు వచ్చాయి.
¤ ఇటానగర్‌లో నిర్వహించిన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్తగా ఆరు వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. 18 ఎఫ్ఎం ఛానళ్లను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
       » నాగర్ లగూన్ (అరుణాచల్‌ప్రదేశ్) - హర్‌ముటి (అసోం) మధ్య ఏర్పాటు చేసిన బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతో, అరుణాచల్‌ప్రదేశ్ భారత రైల్వే మ్యాప్‌లోకి లాంఛనంగా వచ్చినట్లయింది. తర్వాత ఓ విద్యుత్ పథకానికి శంకుస్థాపన చేశారు. అరుణాచల్‌లో రైలు ప్రాజెక్టులకు రూ.4,200 కోట్లు, విద్యుత్ ప్రసార పథకానికి రూ.3,200 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
       » దేశంలో ప్రజలు ఒకరినొకరు 'జై హింద్' అంటూ పలకరించుకునే సంప్రదాయం ఒక్క అరుణాచల్‌ప్రదేశ్‌లో మాత్రమే ఉందనీ, ఈ రాష్ట్ర ప్రజల దేశభక్తికి తన జోహార్లని మోదీ ప్రశంసించారు.
       » ప్రధాని ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ పట్టణ రైల్వేస్టేషన్‌కు ప్రారంభోత్సవం చేసి, 'హజారీ బాగ్ - కోడెర్మా' రైలును ప్రారంభించారు.

ఫిబ్రవరి - 21

¤ విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు దౌత్య కార్యాలయాలపరంగా ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఈ-పోర్టల్‌ను ప్రారంభించింది. దీనికి 'మదత్ (చేయూత)' అని పేరు పెట్టింది.
       » దౌత్య కార్యాలయాలపరంగా సమస్యలను ఎదుర్కొనేవారు వాటిని ఇక ఆన్‌లైన్‌లోనే నమోదు చేయవచ్చు. అత్యధిక జవాబుదారి తనంతో ఆయా ఫిర్యాదులను సత్వరం పరిష్కరిచేందుకు 'మదత్' పోర్టల్ సాయపడుతుంది.
       » భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ దిల్లీలో ఈ పోర్టల్‌ను ప్రారంభించారు.

ఫిబ్రవరి - 22

¤ బిహార్ నూతన ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ (63 సంవత్సరాలు) ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన సీఎం పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి.
       » పట్నాలోని రాజ్‌భవన్‌లో నితీష్‌తో పాటు 22 మంది మంత్రులతో గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ప్రమాణం చేయించారు.
       » నితీష్ కుమార్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి బాధ్యత వహిస్తూ బిహార్ సీఎం పదవి నుంచి 2014 మే 17న వైదొలిగారు. ఆ తర్వాత మే 20న జీతన్‌రామ్ మాంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిది నెలల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మాంఝీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని నితీష్‌పై ఒత్తిడి తీసుకురావడంతో మాంఝీ ఇటీవల రాజీనామా చేశారు.
¤ ఆకాశవాణి ద్వారా 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. త్వరలో పరీక్షలు రాయబోతున్న పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో భయాన్ని పోగోట్టేందుకు, మానసిక స్థైర్యాన్ని నింపడానికి ఆయన తన ప్రసంగంలో ఓ నిపుణుడిలా ప్రయత్నించారు.

ఫిబ్రవరి - 23

¤ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం కొలువు దీరాక 9 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలను, కార్యక్రమాలను, విధానాలను గంటపాటు సాగిన 18 పేజీల ప్రసంగ పాఠంలో రాష్ట్రపతి వివరించారు.
ముఖ్యాంశాలు:
      » 'అందరితో కలిసి...అందరి అభివృద్ధి' అనేది తన ప్రభుత్వ ప్రాథమిక సూత్రమని రైతులు, కుటుంబాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది.
      » విలువ ఆధారిత వ్యవసాయం అవసరం. మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అవసరం.
      » తాజా అంచనాల ప్రకారం మన స్థూల జాతీయోత్పత్తి 7.4 శాతం వృద్ధిరేటుతో ఉంది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది.
      » 'ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం' ద్వారా రూ.11వేల కోట్లు జమ అయ్యాయి. ఈ అనూహ్య లక్ష్యాన్ని ఆరు నెలల కంటే తక్కువ కాలంలోనే సాధించాం. ఇలాంటి కార్యక్రమాల్లో ఇది ప్రపంచంలోనే పెద్దది.
      » ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ కార్యక్రమం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం.
      » 2022 నాటికి అందరికీ గృహవసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గృహనిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రభుత్వం సరళీకరించింది.
      » పాఠశాల విద్యకు ప్రాధాన్యత. పాఠశాలలులేని ఆవాసాలను జీఐఎస్ పరిజ్ఞానంతో గుర్తించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంచడానికి 'పండిట్ మదన్‌మోహన్ మాలవ్య' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
      » దేశంలో అత్యధికంగా ఉన్న యువశక్తిని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కొత్తగా నైపుణ్యాభివృద్ధి మంత్రత్వ శాఖను ఏర్పాటు చేసింది. నైపుణ్య భారత్‌లో భాగంగా 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన'ను ప్రకటించింది.
      » భారత్‌ను సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత మార్పునకు సంసిద్ధం చేయడానికి 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది.
      » వ్యాపార ప్రక్రియలను సరళతరం చేయడానికి ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకరించడం, హేతుబద్ధీకరించడం జరిగింది. అనుమతులకు 'ఏక గవాక్ష' పద్ధతిని అమల్లోకి తెచ్చాం. ఇందుకోసమే ప్రభుత్వం 'ఈబిజ్' వెబ్‌సైట్‌ను రూపొందించింది.
      » భారత్‌ను తయారీ కేంద్రంగా మలచడానికి 'భారత్‌లో తయారీ' (మేక్ఇన్ ఇండియా) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
      » గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాలను ప్రారంభించాం.
      » పట్టణ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి 'స్మార్ట్ నగరాల' ప్రాజెక్టును చేపట్టాం.
¤ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ లోక్‌సభ ఆమోదం కోసం భూసేకరణ, బీమా రంగంలో ఎఫ్‌డీఐలు, బొగ్గు వేలం, ఇ-రిక్షాలు, గనులు- ఖనిజాలు, పౌరసత్వ సవరణకు సంబంధించిన ఆరు ఆర్డినెన్స్‌లను సభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్డినెన్స్‌ల కాలపరిమితి మార్చి 20 నాటికి ముగియనుంది.

ఫిబ్రవరి - 24

¤ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాను ఎప్పుడూ లేని విధంగా గణనీయంగా పది శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
      » కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా గతంలో 32 శాతం ఉండగా 42 శాతానికి పెంచాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును కేంద్రం ఆమోదించింది.
      » తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం 2015-16లో అదనంగా రూ.1.78 లక్షల కోట్లు ఇవ్వనుంది. అయితే రాష్ట్రాలకు గ్రాంట్లు సిఫార్సు చేసే విషయంలో ఈ ఆర్థిక సంఘం ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రాల మొత్తం ఆదాయ వ్యయ అవసరాలను పరిగణనలోకి తీసుకుంది.
      » విభజన కారణంగా ఆదాయలోటు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంట్ మంజూరు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఏపీకి 2015 నుంచి 2020 వరకు దక్కే మొత్తం రూ.22,113 కోట్లు.
      » ఆదాయ లోటు ఏర్పడిన మరో పది రాష్ట్రాలకు గ్రాంట్ మంజూరు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2015-16 కాలంలో మొత్తం 11 రాష్ట్రాలకు దక్కే మొత్తం రూ.48,906 కోట్లు. 2020 వరకు రూ.1.94 లక్షల కోట్లకు పైనే ఉంటుంది.
      » రెవెన్యూ లోటు భర్తీకి 11 రాష్ట్రాలకు కేంద్ర సాయం 2015-20 కాలానికి ఈ విధంగా ఉంది. జమ్మూకశ్మీర్ రూ.59,666 కోట్లు; హిమాచల్ ప్రదేశ్ రూ.40,626 కోట్లు; ఆంధ్రప్రదేశ్ రూ.22,113 కోట్లు; నాగాలాండ్ రూ.18,475 కోట్లు; మిజోరాం రూ.12,183 కోట్లు; పశ్చిమబంగ రూ.11,760 కోట్లు; మణిపూర్ రూ.10,227 కోట్లు; కేరళ రూ.9,519 కోట్లు; త్రిపుర రూ.5,103 కోట్లు; అసోం రూ.3,379 కోట్లు; మేఘాలయ రూ.1170 కోట్లు.
      » విపత్తు నిర్వహణ కింద అయిదేళ్లకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,429 కోట్లు, తెలంగాణకు రూ.1364 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
      » 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్రాలకు గ్రాంటు కింద రూ.5,37,354 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు రూ.2,87,436 కోట్లు, ప్రకృతి విపత్తుల నిర్వహణకు రూ.55,097 కోట్లు, ఆదాయ లోటు ఉన్న 11 రాష్ట్రాలకు రూ.1,94,821 కోట్లు కలిపి ఉన్నాయి.
      » 14వ ఆర్థిక సంఘం నివేదికను ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాకు సంబంధించి ఇది రికార్డు స్థాయి పెంపు. గతంలో ఈ పెంపు 1-2 శాతమే ఉండేది. 2015-16లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు సంప్రాప్తించే మొత్తం నిధులు రూ.5.26 లక్షల కోట్లు. 2014-15లో ఈ మొత్తం రూ.3.48 లక్షల కోట్లు ఉంది. అంటే 1.78 లక్షల కోట్లు పెరిగింది. 2019-20 వరకు మొత్తం అయిదేళ్లలో సంప్రాప్తించే మొత్తం నిధులు రూ.39.48 లక్షల కోట్లు. అయిదేళ్ల కాలానికి పంచాయతీలు, పురపాలక సంఘాలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంటును ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
      » 2015-16 ఏడాదికి ద్రవ్యలోటు లక్ష్యం 3.6 శాతంగా ఉండాలని, తర్వాతి సంవత్సరాల్లో 3 శాతంగా ఉండాలని ఆర్థిక సంఘం సూచించింది.
      » వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అంశంపైనా ఆర్థిక సంఘం సూచనలు చేసింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి మూడేళ్లూ రాష్ట్రాలకు 100 శాతం పరిహారం చెల్లించాలని, నాలుగో ఏడాది 75 శాతం, చివరిదైన అయిదో ఏడాది 50 శాతం పరిహారం చెల్లించాలని సూచించింది.
      » కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. పన్నుల వాటా అధిక పెంపును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు బదిలీ చేయడానికి 30 పథకాలను గుర్తించింది. అయితే ఆయా పథకాల ప్రాముఖ్యాన్ని న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 8 పథకాలను మాత్రమే కేంద్రం పరిధి నుంచి తప్పిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
      » 1971 నాటి జనాభాను, అప్పటి నుంచి జనాభాలో వచ్చిన మార్పులను, ఆదాయ వ్యత్యాసాలను, అటవీ విస్తీర్ణం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ 42 శాతం వాటాలో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది.
      » రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం, తెలంగాణకు 2.437 శాతం వాటాగా ఆర్థిక సంఘం నిర్ణయించింది. అలాగే సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్) లో ఏపీ వాటా 4.398 శాతంగా, తెలంగాణ వాటా 2.499 శాతంగా నిర్ధారించింది. వీటికి అదనంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లను కూడా సిఫార్సు చేసింది.
      » పన్నుల్లో వాటాతో పాటు స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2015-20 వరకు మొత్తం రూ.7,788.68 కోట్లు, పట్టణ, స్థానిక సంస్థలకు రూ.2,908.64 కోట్లు ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,837.75 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.2,711.12 కోట్లు చొప్పున కేటాయించాలని సిఫార్సు చేసింది. వీటితో పాటు పనితీరు ఆధారిత గ్రాంట్లను కూడా స్థానిక సంస్థలకే కేటాయించాలని చెప్పింది. ఆ ప్రకారం ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు అయిదేళ్ల పాటు రూ.865.41 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.727.16 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. అదే రీతిలో తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.537.53 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.677.78 కోట్లు ఇవ్వాలని సూచించింది.
      » ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు భర్తీ కోసం అయిదేళ్ల పాటు గ్రాంట్లను ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీనిలో భాగంగా ఏపీకి మొత్తం రూ.22,113 కోట్లు కేటాయించింది. 2015-16లో రూ.6,609 కోట్లు, రెండో సంవత్సరంలో రూ.4,930 కోట్లు, మూడో సంవత్సరంలో రూ.4,431 కోట్లు, నాలుగో సంవత్సరంలో రూ.3,644 కోట్లు, అయిదో సంవత్సరంలో రూ.2,499 కోట్లు చొప్పున కేటాయించాలని సిఫార్సు చేసింది. తెలంగాణకు రెవెన్యూ లోటు లేనందున ఈ జాబితాలో చోటు కల్పించలేదు.
      » ఆర్థిక సంఘం తన నివేదికలో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాను రూ.1,69,969 కోట్లుగా పేర్కొంది. 2015-16 సంవత్సరంలో రూ.24,938 కోట్లు, 2016-17లో రూ.28,776 కోట్లు, 2017-18లో రూ.33,248 కోట్లు, 2018-19లో రూ.38,462 కోట్లు, 2019-20లో రూ.44,546 కోట్లుగా పేర్కొంది. అన్ని రాష్ట్రాలకు కేటాయించిన రూ.39,48,186 కోట్ల మొత్తంలో ఇది 4.305 శాతానికి సమానం.
      » ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 - 05 నుంచి 2012 - 13 వరకు వచ్చిన ఆదాయం, వ్యయం ఆధారంగా రెండు రాష్ట్రాలకు మధ్య వనరుల పంపిణీ చేసినట్లు 14వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ ఆర్థిక సంఘం పని చేస్తుండగానే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగింది. దీంతో కాగ్ అధికారులతోనూ, రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతోనూ పలు దఫాలు చర్చించిన ఆర్థిక సంఘం 2004-13 వరకు ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రతి పనికి చేసిన ఖర్చును తీసుకుని ప్రాంతాల వారీగా లెక్క గట్టింది. వ్యాట్, ఎక్సైజ్ పన్నులను హైదరాబాద్ అర్బన్, రంగారెడ్డి జిల్లా మినహా ఏ ప్రాంతంలోనివి ఆ ప్రాంతానికి పరిగణనలోకి తీసుకుంది. దీని ఆధారంగా సొంత ఆదాయం, వ్యయాలను లెక్కించింది.
వచ్చే అయిదేళ్లలో ఏపీ ఆదాయం, వ్యయాల (రూ.కోట్లలో) అంచనా చిత్రం


వచ్చే అయిదేళ్లలో తెలంగాణ ఆదాయం, వ్యయాల (రూ.కోట్లలో) అంచనా చిత్రం


వచ్చే ఐదేళ్లలో పన్నులు, జీఎస్‌డీపీ నిష్పత్తి అంచనా (శాతంలో)
రాష్ట్రం

2015-16

2016-17

2017-18

2018-19
2019-20

ఆంధ్రప్రదేశ్

7.98

8.2

8.31

8.36

8.41

తెలంగాణ

9.99

10.06

10.12

10.19

10.26

      » కేంద్రానికి లభించే పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా కేటాయించాలంటూ చరిత్రాత్మక సిఫార్సు చేసిన 14వ ఆర్థిక సంఘానికి నేతృత్వం వహించిన డాక్టర్ యాగ వేణుగోపాల్‌ రెడ్డి తెలుగు వ్యక్తి. ఆగస్టు 17, 1941న కడపలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళిక, ఆర్థికశాఖ కార్యదర్శిగా, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నిపుణుల ప్యానెల్ సభ్యుడిగా, ప్రపంచ బ్యాంకు కార్యనిర్వాహక డైరెక్టర్ సలహాదారుగా సేవలందించారు. 2003 నుంచి 2008 వరకూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2010లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 2013 జనవరి 2న 14వ ఆర్థికసంఘం ఛైర్మన్‌గా వై.వి.రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
14వ ఆర్థిక సంఘం సభ్యులు: సుష్మానాథ్, (కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి), డాక్టర్ ఎం.గోవిందరావు (జాతీయ ప్రజా ఆర్థిక, విధాన జాతీయ సంస్థ డైరెక్టర్), డాక్టర్ సుదీప్తో ముండ్లే (జాతీయ గణాంక కమిషన్ మాజీ యాక్టింగ్ ఛైర్మన్) కార్యదర్శిగా అజయ్ నారాయణ్ ఝా, పార్ట్ టైం సభ్యుడిగా ప్రొఫెసర్ అభిజిత్ సేన్ ఉన్నారు.
¤ వేలం పాట విధానంలో గనులను కేటాయించడానికి వీలుగా చట్ట సవరణకు ఉద్దేశించిన బిల్లును ప్రతిపక్షాల నిరసనల నడుమ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
¤ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్ లోక్‌సభలో భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టారు. విపక్షాలు (దాదాపు సగం) సభ నుంచి వాకౌట్ చేశాయి. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వమని భాజపా స్వపక్షం శివసేన కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది.
¤ ఈ ఏడాది ఆరంభం నుంచి ఫిబ్రవరి 23 వరకు స్వైన్‌ఫ్లూతో దేశవ్యాప్తంగా 875 మంది మృతి చెందినట్లు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. మొత్తం 15,413 మంది ఈ వ్యాధి బారినపడ్డారు.

ఫిబ్రవరి - 25

¤ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన రెండు ముఖ్య హామీలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలబెట్టుకున్నారు. నెలకు 400 యూనిట్లలోపు వాడుకునే విద్యుత్తు వినియోగదారులకు 50 శాతం రుసుమును తగ్గించడంతో పాటు ప్రతి ఇంటికీ నెలకు 20,000 లీటర్ల ఉచిత నీటి సరఫరాను మార్చి 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
¤ ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన 'నీతి ఆయోగ్' పాలక మండలిలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సభ్యుడయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
¤ జాతీయ సౌరశక్తి పథకం కింద ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 15,000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్మాణం పూర్తయ్యాక, ఈ ప్రాజెక్టులను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. 3 విడతల్లో జరిగే ఈ పనులను ఎన్‌టీపీసీకి చెందిన విద్యుత్ వ్యాపార నిగమ్ (ఎన్‌వీవీఎన్) పర్యవేక్షిస్తుంది.
¤ అయిదు దేశాల (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) భాగస్వామ్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన బ్రిక్స్ బ్యాంక్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
      » మౌలిక సదుపాయాల కల్పనకు, వర్ధమాన దేశాలు చెల్లింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటే స్వల్పకాలిక రుణాలు అందించేందుకు ఈ బ్యాంకును ఉద్దేశించారు.
      » 100 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నిధితో ఏర్పాటయ్యే ఈ బ్యాంకును న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)గా పేర్కొంటున్నారు.
      » ఈ బ్యాంక్ అధ్యక్ష బాధ్యత తొలి ఆరేళ్లు భారత్‌కు ఉంటుంది.
      » చైనా ఆర్థిక కేంద్రమైన షాంఘై కేంద్రంగా ఈ బ్యాంక్ పని చేస్తుంది.
¤ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమ అమలుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు పది రాష్ట్రాలకు 2014-15కి రూ.459.93 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
      » మొత్తం నిధుల్లో రూ.310.10 కోట్లను మరుగుదొడ్ల నిర్మాణానికి ఉద్దేశించి మంజూరు చేశారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా 2018 నాటికి పట్టణ ప్రాంతాల్లో 1.04 కోట్ల వ్యక్తిగత సామాజిక మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 7.93 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తొలి విడత నిధుల వివరాలు: మహరాష్ట్ర (రూ.135కోట్లు), కర్ణాటక (రూ.80.01 కోట్లు), పశ్చిమ బంగ (రూ.64.02 కోట్లు), గుజరాత్ (రూ.40.95 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ.40 కోట్లు), బిహార్ (రూ.37.72 కోట్లు), ఛత్తీస్‌గఢ్(రూ.30.79 కోట్లు), మధ్యప్రదేశ్ (రూ.18.81 కోట్లు), మణిపూర్ (రూ.11.21 కోట్లు), ఒడిశా (రూ.14.3 కోట్లు).
¤ మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్‌ను రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. మధ్యప్రదేశ్ వృత్తివిద్య పరీక్షల మండలి (ఎంపీపీఈబీ) నియామకాల కుంభకోణంలో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైన ఒకరోజు వ్యవధిలోనే కేంద్రం ఈ చర్య తీసుకుంది. అటవీ శాఖలో గార్డులుగా నియమించడానికి అయిదుగురి పేర్లను యాదవ్ సిఫార్సు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వివాదం నెలకొంది. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.

ఫిబ్రవరి - 26

¤ పౌరసత్వ సవరణ బిల్లు 2014ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నుంచి ఉపసంహరించుకుంది. ఈ బిల్లును గత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. దీని స్థానంలో తీసుకొచ్చే నూతన బిల్లులో భారత సంతతి ప్రజలు (పీఐవో), ఖండాతర భారత పౌరులు (ఓసీఐ) అనే రెండు వీసా విభాగాలను కలిపి ఒకే వీసా ఇచ్చే ఏర్పాట్లతో పాటు ఇతర అంశాలను చేర్చనున్నారు.
¤ దేశంలో స్వైన్‌ఫ్లూ మరణాల సంఖ్య 965కి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారినపడ్డ వారిసంఖ్య 17,000 దాటిందని వెల్లడించింది.
¤ ఇరాక్, సిరియాలో వరుస హత్యలు దాడులతో మారణ కాండను కొనసాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను భారత్ నిషేధించింది.
      » భారత్ సహా వివిధ దేశాల యువతను ఉగ్రవాదులుగా ఆ సంస్థ నియమించుకుంటోందని, ఉగ్రవాద శిక్షణ పొందిన యువత తిరిగి దేశంలోకి ప్రవేశిస్తే జాతీయ భద్రతకే పెనుముప్పు కలుగుతుందని, అందుకే ఇస్లామిక్ స్టేట్/ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్/ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా / డైష్ ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను చట్ట వ్యతిరేక కార్యలకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
¤ దేశంలోని వివిధ ట్రైబ్యునళ్లను ఒకే నిబంధనల కిందకు తీసుకొస్తూ సిఫార్సు చేసిన స్థాయీ సంఘం నివేదిక పార్లమెంటుకు చేరింది. దీని ప్రకారం ఇకపై అన్ని ట్రైబ్యునళ్లలోని ఛైర్ పర్సన్లకు, సభ్యులకు అయిదేళ్ల పదవీ కాలపరిమితితో పాటు రిటైర్‌మెంట్ వయసు, వారికిచ్చే భత్యాలు ఒకే రీతిగా ఉండనున్నాయి.

ఫిబ్రవరి - 27

¤ పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ''భారత దేశం ముందుండాలి (ఇండియా ఫస్ట్)... ఇదే మా మతం.. భారత రాజ్యంగమే మా మత గ్రంథం. భారత్ భక్తి. మా దీక్ష. అందరి సంక్షేమమే మా ప్రార్థన. మన త్రివర్ణపతాకంలోని మూడు రంగులనే నేను చూస్తాను కానీ మరో రంగుని కాదు.." అని ప్రధాని మోదీ చెప్పారు. ఐక్యతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజ్యాంగం పరిధిలో అన్ని మతాలూ పురోభివృద్ధి సాధించాలనేదే తమ సంకల్పమని చెప్పారు. ఉపాధి హామీ పథకం, నల్లధనం, అవినీతి, బొగ్గు క్షేత్రాల కేటాయింపు, సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడం, స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, సుపరిపాలన లాంటి అంశాల గురించి వివరించారు.
¤ జాతీయ జల రవాణా మార్గం-4 నిర్మాణంలో ఒక అడుగు మందుకు పడింది. ఈ మార్గంలో తొలి భాగమైన ఉత్తర బకింగ్‌హామ్ కాలువ (ఎన్‌బీసీ)ని నౌకాయానానికి అనువుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది.
      » ఉత్తర బకింగ్‌హామ్ కాలువ ఆంధ్రప్రదేశ్‌లోని రాంపేరు లాక్ (పెద్ద గంగిం) వద్ద మొదలై తమిళనాడులోని ఎన్నూరు సముద్ర ముఖం వరకూ 316 కి.మీ. మేర ప్రవహిస్తుంది. ఈ మార్గం అభివృద్ధికి రూ.353.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తంలో పూడిక తీత (డ్రెడ్జింగ్)కే రూ.256 కోట్లు మేర ఖర్చు కానుంది.
      » జాతీయ జలరవాణా-4లో కేంద్రం ఆమోదించిన కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో ఉత్తర బకింగ్‌హామ్ కాలువ భాగం తొలిదశలో ఉంది. రెండో దశలో కొమ్మమూరు కాలువ, ఏలూరు కాలువ, కాకినాడ కాలువ (సుమారు 302 కి.మీ.), చివర్లో భద్రాచలం-రాజమండ్రి, వజీరాబాద్-విజయవాడ మార్గాలను నౌకాయానానికి అనువుగా అభివృద్ధి చేస్తారు. ఈ జలరవాణాలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరుగుతుంది.
¤ భారత సంతతి వ్యక్తులకు శాశ్వత వీసా సదుపాయం కల్పించే 'పౌరసత్వ (సవరణ) చట్టం -2015'ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజూ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీంతో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐఓ), ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు పథకాలు కలిసిపోనున్నాయి.
      » ఈ రెండింటినీ కలుపుతామంటూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లో భారతీయులకు ఇచ్చిన హామీని ఈ బిల్లు నెరవేరుస్తుంది.

ఫిబ్రవరి - 28

¤ 'యోగా'కు ధార్మిక ప్రాచుర్యం కల్పించడాన్ని ధార్మిక కార్యకలాపంగా వర్గీకరించడం ద్వారా ప్రత్యేక హోదానివ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
      » 'యోగా' అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి అని ప్రభుత్వం ప్రకటించింది.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment