ఫిబ్రవరి - 2
|
¤ తక్కువ మొత్తం రుణాలు ఇచ్చే చిన్న బ్యాంకులు, చెల్లింపు సేవలు అందించే చెల్లింపు బ్యాంకుల లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. » ఈ బ్యాంకులు తమ డిపాజిట్లలో 75 శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో పెట్టుబడి పెట్టాలి. 25 శాతాన్ని మాత్రమే లావాదేవీల నిమిత్తం వాణిజ్య బ్యాంకుల కరెంట్ ఖాతాల్లో ఉంచుకోవచ్చు. చెల్లింపు బ్యాంకు శాఖల్లో నాలుగో వంతు గ్రామాల్లో ఉండాలి.
|
ఫిబ్రవరి - 5
|
¤ ప్రజల నుంచి నిధులు సమీకరించకుండా 'అగ్రిగోల్డ్ ఫార్మ్స్ ఎస్టేట్స్ ఇండియా'ను సెబీ నిషేదించింది. » ఇకపై నూతన పథకాలు ప్రవేశ పెట్టొద్దని ఆదేశించింది. అనుమతి లేకుండా అగ్రి గోల్డ్ సామూహిక పెట్టుబడుల పథకాలను నిర్వహిస్తున్నట్లు సెబీ తన ఉత్తర్వుల్లో తెలిపింది.
|
ఫిబ్రవరి - 7
|
¤ తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.6,990 కోట్ల మూలధనాన్ని సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. » అంతర్జాతీయ నష్ట భయ నిబంధనలను చేరడానికి ఈ నిధులు తోడ్పడతాయి. 2014-15 బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన రూ.11,200 కోట్లలో ఇది తొలి విడత. ఈ నిధుల్లో ఎస్‌బీఐకి అత్యధికంగా రూ.2,970 కోట్లు అందనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1260 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.870 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.570 కోట్లు చొప్పున పొందనున్నాయి. » సిండికేటు బ్యాంక్ రూ.460 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ.320 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.280 కోట్లు, దేనా బ్యాంక్ రూ.140 కోట్లు, ఆంధ్రాబ్యాంక్ రూ.120 కోట్లు పొందనున్నాయి.
|
ఫిబ్రవరి - 9
|
¤ వృద్ధి రేటును గణించేందుకు ప్రామాణిక సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు సవరించడంతో పాటు అంచనాలు గణించే పద్ధతిలో మార్పులు జరిపిన నేపథ్యంలో తాజా వృద్ధిరేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.4 శాతం ఉండవచ్చని ప్రభుత్వం ముందస్తు అంచనాల్లో పేర్కొంది. సెప్టెంబరు-డిసెంబరు త్రైమాసికంలో 7.5శాతం వృద్ధిరేటు సాధించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం వెల్లడించింది. సేవారంగం అధికంగా విస్తరించడం వల్లే మూడో త్రైమాసికంలో వృద్ధి గణనీయంగా పెరిగింది. » వ్యవసాయంలో 1.1%, అటవీ మత్స్య 2.3%, గనులు 4.5%, నిర్మాణ తయారీ రంగాల్లో 6.8% వృద్ధి లభించింది. » ప్రస్తుత ధరలను అనుసరించి 2014-15లో జీడీపీ రూ.126.54 లక్షల కోట్లకు చేరొచ్చని గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్ అంచనాల కంటే ఇది కొంచెం తక్కువ. 2013-14 నాటి రూ.113.45 లక్షల కోట్ల కంటే ఇది 11.5% అధికం. » జాతీయ స్థాయి పౌరుల తలసరి ఆదాయం 2014-15కు రూ.88,538గా పేర్కొన్నారు. 2013-14 నాటి రూ.80,500తో పోలిస్తే 10.1% అధికం.
|
ఫిబ్రవరి - 10
|
¤ ఐసీఐసీఐ బ్యాంకు ఒక కొత్త ఏకీకృత మొబైల్ బ్యాంకింగ్ సేవ 'పాకెట్స్' ను ప్రారంభించింది. » దేశంలోనే తొలి డిజిటల్ బ్యాంకు (మొబైల్ ఫోన్లో) ఇదేనని ఆ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్ ప్రకటించారు.
|
ఫిబ్రవరి - 11
|
¤ ప్రముఖ తెలుగు ఛానెల్స్ గ్రూప్ 'మా టీవీ'ని స్టార్ ఇండియా కొనుగోలు చేసింది.¤ మహాత్మాగాంధీ విగ్రహాన్ని లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లో స్థాపించడానికి నిధులను సేకరిస్తున్న ట్రస్ట్ కొత్తగా నలుగురు ధర్మకర్తలను నియమించింది. » వీరిలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి (బ్రిటన్‌లో పెట్టుబడి సంస్థను నడుపుతున్నారు), ఆర్థిక నిపుణుడు కార్సెటెన్ జార్గెన్‌సెన్, బ్రిటన్ మాజీ అటార్నీ జనరల్ లార్డ్ పీటర్ గోల్డ్ స్మిత్, ప్రవాస భారతీయుడు వివేక్ చద్దా ఉన్నారు. » గాంధీ విగ్రహ స్థాపనకు 7.5 లక్షల పౌండ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ట్రస్ట్ దీన్ని ఇటీవల సాధించింది.
|
ఫిబ్రవరి - 13
|
¤ ముడిచమురు దిగుమతులు భారం తగ్గడం వల్ల జనవరిలో భారత వాణిజ్యలోటు 11 నెలల కనిష్ఠానికి చేరింది. 2014 డిసెంబరులో 9.43 బిలియన్ డాలర్లు (రూ.56,580 కోట్లు)గా ఉన్న లోటు జనవరిలో 8.32 బి.డా.కు (రూ.49,920 కోట్లు) చేరిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వాణిజ్య లోటు 9.45 బి.డా. (రూ.56,700 కోట్లు)గా ఉంది. » ఎగుమతులు సైతం 11.2% తగ్గి 23.9 బి.డా. (రూ.1,43,400 కోట్లు)కు చేరాయి. 2014 జనవరిలో చమురు దిగుమతుల విలువ 13.19 బి.డా. కాగా, గత నెలలో 37.5 శాతం తగ్గి 8.25 బి.డా.కు చేరాయి. జనవరిలో చమురేతర దిగుమతులు 3.5 శాతం పెరిగి 23.96 బి.డా. గా నమోదయ్యాయి.
|
ఫిబ్రవరి - 16
|
¤ టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం దాదాపు అయిదున్నరేళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. మూడు నెలల వ్యవధిలో ద్రవ్యోల్బణం రెండో సారి ప్రతికూలంగా నమోదైంది. » పెట్రోలియం, ఆహార ధరలు తగ్గడంతో జనవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం -0.39 శాతానికి చేరింది. డిసెంబరులో ద్రవ్యోల్బణం 0.11 శాతంగా నమోదైంది. నవంబరులో -0.17 శాతానికి దిగివచ్చింది. (అంత క్రితం ప్రాథమికంగా సున్నాగా లెక్కగట్టారు.) జూన్ 2009లో ద్రవ్యోల్బణం -0.4 శాతానికి చేరింది. » ఇంధన, విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణం జనవరిలో -10.69 శాతంగా నమోదైంది. తయారీ ఉత్పత్తుల ధరల్లో పెరుగుదల 1.05 శాతానికి చేరింది.¤ 2జీ, 3జీ మొబైల్ సేవలకు అవసరమైన స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. 8 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. » ప్రస్తుతం ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ టెలికాం సంస్థల అధీనంలో ఉన్న స్పెక్ట్రమ్‌లో అధిక భాగానికి గడువు 2015 - 16లో పూర్తవుతున్నందున, వేలం నిర్వహించనున్నారు.
|
ఫిబ్రవరి - 18
|
¤ విదేశాల నుంచి బంగారు నాణేలు, మెడళ్లు దిగుమతి చేసుకునేందుకు బ్యాంకులు, వాణిజ్య సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతిచ్చింది. అయితే బ్యాంకులు వీటిని విక్రయించకూడదు. » కరెంటు ఖాతా లోటు పెరుగుతుండటంతో 2013 ఆగస్టులో వీటి దిగుమతిని ఆర్‌బీఐ నిషేధించింది.
|
ఫిబ్రవరి - 19
|
¤ దేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ బ్రాండ్ విలువ ఈ ఏడాది రూ.52,200 కోట్ల (8.7 బిలియన్ డాలర్లు)కు చేరింది. ఫలితంగా ఐటీ రంగంలో అత్యధిక బ్రాండ్ బలానికి ప్రతీకగా నిలిచే ''ఏఏ+" రేటింగ్‌ను టీసీఎస్ నిలబెట్టుకుంది. దీంతోపాటు అంతర్జాతీయ అగ్రశ్రేణి నాలుగు ఐటీ సేవల సంస్థల్లో ఒకటిగా టీసీఎస్ వరుసగా ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది.
|
ఫిబ్రవరి - 26
|
రైల్వే బడ్జెట్ 2015 - 16¤ ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలు కానున్న 2015 -16 ఆర్థిక సంవత్సరానికి రూ.1,00,011 కోట్లతో రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.ముఖ్యాంశాలు... ప్రణాళికా వ్యయం కింద రూ.1,00,011 కోట్లు కేటాయించారు. (గత బడ్జెట్ మొత్తం కంటే ఇది 52 శాతం ఎక్కువ). ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు స్థూల బడ్జెటరీ మద్దతు (జీబీఎస్) కింద రూ.40,000 కోట్లను కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 10,000 కోట్లు అధికం. మొత్తం ప్రణాళిక వ్యయం రూ.1,00,011 కోట్లలో జీబీఎస్ వాటా 41.6 శాతం. వచ్చే అయిదేళ్లలో రైల్వేల విస్తరణ, సామర్థ్యం పెంపుకోసం రైల్వే శాఖ నాలుగు లక్ష్యాలను పెట్టుకున్నట్లు సురేష్ ప్రభు వివరించారు.1. పరిశుభ్రత, సౌకర్యాలు, సేవల్లో నాణ్యత, రైళ్ల వేగం లాంటి అంశాల్లో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు.2. సురక్షిత ప్రయాణానికి రైల్వే చిరునామా అయ్యేలా కృషి.3. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా రైల్వేల సామర్థ్యం పెంపు, మౌలిక వసతుల ఆధునికీకరణ.4. భారతీయ రైల్వే ఆర్థిక స్వావలంబన సాధించడం. వీటితో పాటు రైల్వేల అభివృద్ధికి దోహదపడేలా ముఖ్యమైన 11 రంగాలపై దృష్టి పెడతామని ప్రకటించారు. రైల్వే శాఖను లాభాల బాట పట్టించేందుకు నిర్వహణ నిష్పత్తి (రాబడిలో మొత్తం ఖర్చు)ని రానున్న ఆర్థిక సంవత్సరంలో 88.5 శాతానికి తీసుకురావాలనేది తమ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. రాబడిని రూ.25 వేల కోట్లకు పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఆర్థిక సంవత్సరం |
నిర్వహణ నిష్పత్తి
|
2013 - 14
|
93.6
|
2014 - 15
|
91.8
|
2015 - 16 (లక్ష్యం)
|
88.5
|
రాబడి
|
2014 - 15
|
రూ. 1,63,450.13 కోట్లు
|
2015 - 16 (లక్ష్యం)
|
రూ. 1,88,556.70 కోట్లు
|
|
|
సురేష్ ప్రభు తన తొలి రైల్వే బడ్జెట్‌లో భద్రతకు పెద్ద పీట వేశారు. రైలు ప్రమాదాల్లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న కాపలా లేని లెవెల్ క్రాసింగులను తొలగించి రైలు లేదా రోడ్డు వంతెనల నిర్మాణానికి అత్యధిక నిధులను కేటాయించారు. 3,438 లెవల్ క్రాసింగులను తొలగించి, 970 చోట్ల రూ.6,581 కోట్లతో రోడ్డు/ రైలు వంతెనలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది కేటాయింపులతో పోలిస్తే ఇది 26 రెట్లు అదనం. మిగిలిన కాపలాలేని లెవల్ క్రాసింగుల వద్ద ఇస్రో సాయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దృశ్య, శ్రవణ హెచ్చరికలు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఐఐటీ కాన్పూర్ సాయంతో రూపొందిస్తున్న రేడియో ఆధార సిగ్నల్ వ్యవస్థను కూడా లెవెల్ క్రాసింగుల వద్ద ఉపయోగించుకుంటారు. మహిళల రక్షణ కోసం ప్రధాన రైళ్లలో, సబర్బన్ రైళ్లలోని మహిళా బోగీల్లో నిఘా కెమరాలు పెడతారు. భద్రతకు సంబంధించి అనిల్ కకోద్కర్ కమిటీ నివేదికను ఏప్రిల్‌లోగా అధ్యయనం చేస్తామని ప్రకటించారు. రాజకీయ నిర్ణయాలకు తలొగ్గుతూ, నడుం విరుగుతున్నా పెను నష్టాలు భరిస్తూ సాగుతున్న భారతీయ రైల్వే వ్యవస్థలో ఓ కీలక పరిణామం రైలు ఛార్జీల నియంత్రణ వ్యవస్థ (ఆర్టీఏ) ఏర్పాటు. పార్లమెంటుకు రైల్వేమంత్రి సురేష్ ప్రభు సమర్పించిన శ్వేత పత్రంలో దీన్ని ప్రస్తావించారు. యూపీఏ సర్కారు హయాంలో రూపు రేఖలు దిద్దుకున్న ఈ వ్యవస్థ ఏర్పాటు బాలారిష్టాలను అధిగమించి, గతేడాది కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందింది. రైల్వేల పరంగా రైల్వే బోర్డు స్థానే ఏర్పడే అత్యున్నత స్థాయి కమిటీ ఇకపై ఇదే అవుతుంది. అయిదేళ్ల కాలపరిమితితో ఐదుగురు సభ్యులతో కీలక నిర్ణయాధికారం తీసుకోగల వ్యవస్థగా దీనికి ప్రాధాన్యం లభిస్తుంది. రైల్వే రంగంపై పరిశోధనల్ని ప్రోత్సహించడానికి వారణాసిలోని ఐఐటీలో భారతరత్న మదన్‌మోహన్ మాలవ్య పేరిట ఒక పీఠాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ఆదాయం 17 శాతం పెరిగి రూ.50,175 కోట్లకు చేరుతుందని రైల్వేశాఖ అంచనా వేసింది. ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో రూ. 36,532 కోట్ల ఆదాయం అంచనా వేయగా రూ. 43,002 కోట్ల ఆదాయం వచ్చింది. 2015 -16లో సరకు రవాణా ద్వారా రూ.1,21,423 కోట్ల ఆదాయం అంచనా వేశారు. ఇది 2014 -15లో రూ.1,06,927 కోట్లుగా ఉంది. రైల్వేల ఆదాయాన్ని పెంచడంలో భాగంగా 12 రకాల సరుకుల రవాణా ఛార్జీలను పెంచారు. 0.8 శాతం నుంచి 10 శాతం వరకూ వేర్వేరు సరుకులపై వేర్వేరుగా ఈ పెంపుదల ఉంది. సిమెంటుపై 2.7 శాతం, బొగ్గుపై 6.3 శాతం, ఇనుము/ఉక్కుపై 0.8 శాతం, ఆహార ధాన్యాలు, కాయ ధాన్యాలపై 10 శాతం, యూరియాపై 10 శాతం, వేరుశనగ నూనెపై 2.1 శాతం, ఎల్‌పీజీపై 0.8 శాతం, కిరోసిన్‌పై 0.8 శాతం పెరిగింది. కనిష్ఠ రవాణా ఛార్జీలను 10 శాతం పెంచారు. స్పీడ్ డీజిల్ రవాణా ఛార్జీని ఒక శాతం తగ్గించారు. లైమ్‌స్టోన్, డోలమైట్, మాంగనీస్‌ల రవాణా ఛార్జీని 0.3 శాతం తగ్గించారు. సరుకు రవాణా ద్వారా రైల్వేలకు లభించే ఆదాయం తాజా పెంపు నిర్ణయంతో 14 శాతం (నికరంగా రూ.4000 కోట్లు) పెరుగుతుంది. ఫలితంగా 2015 -16 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ఆదాయం రూ.1,21,423 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. దీంట్లో బొగ్గు రవాణా ద్వారా అత్యధికంగా రూ.50398 కోట్లు, సిమెంటు ద్వారా రూ.10813 కోట్లు, ఆహారధాన్యాల ద్వారా రూ.10158 కోట్లు లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కొత్తగా 77 ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో మంత్రి పచ్చజెండా ఊపారు. వీటి వ్యయ అంచనా రూ.96,182 కోట్లు. ఈ ప్రాజెక్టులకు రుణాలను బడ్జెట్ ద్వారా కాకుండా ఆర్థిక సంస్థల సాయంతో సమీకరించుకుంటామని మంత్రి ప్రకటించారు. దేశంలో రైల్వేల పురోగతికి రూ.8,56,020 కోట్ల వ్యయంతో కార్యాచరణ ప్రణాళికను సురేష్‌ప్రభు ప్రకటించారు. అయిదేళ్ల కాలంలో అమలు చేసే ఈ ప్రణాళికలో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా రైల్వేల భద్రత, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, మౌలిక వసతుల ఆధునికీకరణ, స్వయం సమృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
|
రైల్వేల్లో సేవలను మెరుగుపర్చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. బడ్జెట్‌లో మంత్రి పలు చర్యలను ప్రకటించారు. అవి...1. నవ్యాలోచన మండలి: ఈ మండలి పేరు 'కాయకల్ప'. రైల్వేల్లో నవ్యాలోచన స్ఫూర్తిని నింపుతుంది. రీ ఇంజినీరింగ్ దిశగా కృషి చేస్తుంది.2. పోర్టల్: రైల్వే రంగంలో విశిష్ట సాంకేతిక పరిజ్ఞాన పరిష్కారాలను ఆహ్వానించడానికి పోర్టల్ అభివృద్ధి.3. పరిశోధన: గుర్తించిన రైల్వే ప్రాజెక్టుల పరిశోధనకు రైల్వే, మానవ వనరుల అభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమల మంత్రిత్వ శాఖలతో కన్సార్టియం ఏర్పాటు. ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల్లో ప్రాథమిక పరిశోధనకు 4 రైల్వే పరిశోధన కేంద్రాల ఏర్పాటు.4. విదేశీ రైలు సాంకేతిక పరిజ్ఞాన సహకార పథకం: రైళ్ల వేగం పెంపు, స్టేషన్ల పునఃఅభివృద్ధి వంటి క్లిష్టమైన, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎక్కువగా ఉండే ప్రాజెక్టుల్లో ప్రత్యేక సంస్థల సహకారం తప్పనిసరి. ప్రాజెక్టుకు సంసిద్ధం చేయడం, ఏయే సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులో ఉన్నాయో గుర్తించడం, బిడ్డింగ్ ప్రకియలను నిర్వహించడం లాంటి అంశాల్లో ప్రత్యేక సంస్థలు అవసరం. ఇందుకోసమే ఈ పథకం.5. ఆన్‌లైన్‌లో ఖర్చుల వివరాలు: ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, రైల్వే లైన్ల నిర్వహణ వంటి వాటికి అయ్యే ఖర్చుల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ లెక్కల గణనకు ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థను మార్చేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు. జమ్మూకశ్మీర్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వేల విస్తరణను వేగంగా చేపడతామని సురేష్‌ప్రభు ప్రకటించారు. జమ్మూ ప్రాంతం, కశ్మీర్ లోయ అనుసంధానంతోపాటు బనిహాల్ సొరంగం ద్వారా దేశంలోని మిగతా ప్రాంతాలకు మార్గాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మేఘాలయను భారతీయ రైల్వే పటంలో చేరుస్తామని, అసోంలోని బరాక్ లోయ మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మారుస్తామని ప్రకటించారు.
సంస్థాగత పనితీరు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులను భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం చేసేందుకు 2015 -16 వార్షిక సంవత్సరంలో రైల్వే విశ్వవిద్యాలయం నెలకొల్పుతున్నట్లు సురేష్ ప్రభు ప్రకటించారు.
800 కిలోమీటర్ల గేజ్ మార్పిడి సహా 77 కొత్త ప్రాజెక్టులకు రూ.96,182 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో 9400 కి.మీ. మేర డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులతో పాటు కొత్త విద్యుదీకరణ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ప్రకటించారు.
జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కి తిరిగి వచ్చి వందేళ్లు అయిన సందర్భంగా 'గాంధీ సర్క్యూట్'ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఐఆర్‌సీటీసీ ద్వారా పర్యాటకులను ఆకర్షించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. 'కిసాన్ యాత్ర' ప్రత్యేక ప్రయాణ పథకం పేరిట రైతులకు వ్యవసాయ, వ్యాపార సలహాలు అందిస్తారు.
పరిశుభ్రతకు రైల్వే బడ్జెట్ అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నమైన 'స్వచ్ఛభారత్ అభియాన్' స్ఫూర్తిగా 'స్వచ్ఛ రైల్' కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నదే లక్ష్యమని సురేష్ ప్రభు ప్రకటించారు. 'స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్' నినాదాన్ని మంత్రి ప్రకటించారు. శీతల సౌకర్యం లేని బోగీల్లోనూ ఇకపై చెత్తకుండీలు ఏర్పాటు చేస్తారు.
కొత్తగా 650 స్టేషన్లలో మరుగుదొడ్లు నిర్మిస్తారు. రైలు బోగీల్లో బయో-టాయిలెట్లు. ఈ ఏడాది 17 వేల మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రధాన మెట్రో నగరాల మధ్య తిరిగే రైళ్ల వేగాన్ని పెంచాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన తొమ్మిది కారిడార్లలో రైళ్ల వేగాన్ని గంటకి 200 కి.మీ. పెంచనున్నట్లు మంత్రి ప్రకటించారు. దిల్లీ -కోల్‌కతా, దిల్లీ -ముంబయి మెట్రో నగరాల మధ్య ప్రయాణం ఒక్క రాత్రిలో పూర్తయ్యేలా చూస్తారు. గూడ్స్ రైళ్ల వేగాన్నీ పెంచుతారు. ఖాళీగా వెళ్లే గూడ్స్ రైలు గంటకి 100 కి.మీ. వేగంతో, సరుకుతో వెళ్లే గూడ్సు రైలు గంటకు 75 కి.మీ. వేగంతో వెళ్లేలా చూస్తారు.
ప్రయాణికుల సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనికి ఇచ్చే నిధుల్ని 67% పెంచుతున్నట్లు చెప్పారు.
రిజర్వేషన్ అవసరం లేని సాధారణ టికెట్లు అయిదు నిమిషాల్లో జారీచేయడానికి 'ఆపరేషన్ ఫైవ్ మినిట్స్'కు శ్రీకారం చుడతామని ప్రకటించారు.
'ఏ -1', 'ఏ' తరగతి స్టేషన్లలో వై -ఫై సదుపాయం కల్పిస్తామన్నారు.
ఏడాది పొడవునా ఆదరణ ఉన్న రైళ్లలో కొన్నింటిని గుర్తించి ఇప్పుడు గరిష్ఠంగా ఉన్న 24 పెట్టెలను 26కు పెంచుతారు. తక్కువ ఆదరణ ఉన్న రైళ్లలో బోగీలు తగ్గిస్తారు.
సుఖంగా ప్రయాణించడంతోపాటు 20% సమయాన్ని ఆదా చేయడానికి 'ట్రైన్ సెట్స్' పేరుతో అత్యంత అధునాతన రైలు వ్యవస్థను ప్రవేశపెడతామని ప్రకటించారు. చూడటానికి ఇవి బుల్లెట్ రైళ్లలా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఇంజిన్ ఉండదు. తక్కువ ఇంధనంతో ఎక్కువ మందిని తీసుకుపోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
ముందస్తు రిజర్వేషన్ చేయించుకోవడానికి ఇప్పుడున్న 60 రోజుల గడువును 120 రోజులకు పొడిగించారు.
ఫిర్యాదులు చేసేందుకు వీలుగా 182, 138 సంఖ్యలతో జాతీయస్థాయి సహాయ వాణిల (హెల్ప్‌లైన్) ఏర్పాటు. 24 గంటలూ ఇవి అందుబాటులో ఉంటాయి.
రైల్వే బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.2,768 కోట్లు మంజూరు చేశారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.528 కోట్లు అదనం.
బీవోటీ ప్రాతిపదికన నిర్మించాలని నిర్ణయించిన ఖాజీపేట-విజయవాడ మార్గానికి రూ.100 కోట్లు, పెద్దపల్లి-కరీంనగర్-విజయవాడ మార్గానికి రూ.141 కోట్లు, మేళ్లచెరువు - విష్ణుపురం మార్గానికి రూ.100 కోట్లు, నంద్యాల-యర్రగుంట్ల మార్గానికి రూ.130 కోట్లు, విజయవాడ-భీమవరం-నిడదవోలు మార్గానికి రూ.150 కోట్లు కేటాయించారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 38 బ్రిడ్జిల నిర్మాణానికి (రోడ్డు ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి) రూ.1587 కోట్లు కేటాయించారు.
తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.20 కోట్లు, గుంతకల్లు స్టేషన్‌కు రూ.15 కోట్లు, వైజాగ్ యార్డుకు రూ.20 కోట్లు కేటాయించారు.
దేశవ్యాప్తంగా మరో 200 స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దుతామన్నారు.
రోజూ ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతమున్న 2.1 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచేలా రైల్వే సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.
ప్రయాణికుల ఛార్జీలు పెంచలేదు. ప్రయాణికులకు ఎంఎంఎస్ సేవల అలర్ట్ విస్తరణ, ఆహారాన్ని ఈ కేటరింగ్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు.
ప్రత్యేక ఈ -టికెటింగ్ వెబ్‌సైట్ రూపకల్పన, డెబిట్ కార్డుతో టికెట్లు పొందే సౌకర్యాన్ని మంత్రి ప్రకటించారు.
|
ఫిబ్రవరి - 27
|
ఆర్థిక సర్వే 2014-15¤ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. » కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. దేశ ప్రస్తుత ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించిన ఈ సర్వే భవిష్యత్తు అవకాశాలను వివరించింది. పెట్టుబడులను, వృద్ధిని ప్రోత్సహించేందుకు అవసరమైన సంస్కరణలను సూచించింది. ప్రభుత్వ విధానాల్లో రావాల్సిన మార్పులను వెల్లడించింది.ముఖ్యాంశాలు ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు గణనీయ ప్రభావాన్ని చూపుతున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరత్వాన్ని సంతరించుకొంది. ఆర్థిక వృద్ధి మందగమనం ముగిసింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు కనబడుతోంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థ (విదేశాలు)ల్లోని సవాళ్లు భారత్‌ను పెట్టుబడిదారుల గమ్యంగా మార్చాయి.
రాబోయే సంవత్సరాల్లో ద్రవ్యలోటును స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతానికి తగ్గించాలి. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 2015-16లో 1 శాతానికి పడిపోతుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా. 2013 నుంచి ద్రవ్యోల్బణం 6 శాతం పాయింట్లు తగ్గింది. విదేశీ మారకద్రవ్య నిధులు 26 బిలియన్ అమెరికా డాలర్లు పెరిగి 2015 మార్చి నాటికి ముగిసే ఆర్థిక సంవత్సరానికి 340 బిలియన్ అమెరికా డార్లకు చేరుకుంటాయని అంచనా. సత్ఫలితాల సాధనకు కావాల్సిన గుణగణాలు భారత్‌కు ఇప్పటికే సమకూరాయి. భారీ ఎత్తున సంస్కరణలకు ఇప్పుడు అవకాశం ఉంది. సంస్కరణల కోసం ప్రజలు రాజకీయంగా ఇచ్చిన తీర్పు, స్నేహపూరిత బాహ్య వాతావరణం రెండంకెల వృద్ధి పథంలోకి భారత్‌ను మళ్లించే చరిత్రాత్మక అవకాశాన్ని కల్పించాయి. ద్రవ్య బలోపేత ప్రక్రియను కొనసాగించాలి. కేంద్ర విధానాల్లో నిర్ణయాత్మక మార్పులు, సంకల్ప బలంతో భారీ సంస్కరణలు సాధ్యం. అంచనాలకు తగినట్లు, పారదర్శక రీతిలో పన్ను విధానాలు తీసుకురావడంపై బడ్జెట్ దృష్టి సారించాలి. ఇలాంటి విధానాల వల్ల మూలధన భారం తగ్గుతుంది. పొదుపునకు ప్రోత్సాహం అందుతుంది. పన్ను చెల్లింపుదారులు నిబంధనలు పాటిస్తారు. పన్ను వ్యవస్థను మెరుగుపర్చుకోవాలి. కార్మిక, భూ సంస్కరణలు తీసుకురావాలి. రాయితీలను హేతుబద్ధీకరించాలి. పెట్టుబడుల ఉపసంహరణను వేగిరపర్చాలి. దీర్ఘకాలిక వృద్ధికి ప్రైవేటు పెట్టుబడులే ప్రాథమిక చోదకశక్తిగా ఉండాలి. తాత్కాలిక ప్రభుత్వ పెట్టుబడులు ముఖ్యంగా రైల్వేల్లో పెట్టే పెట్టుబడులు వృద్ధి పునరుద్ధరణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అనుసంధానాన్ని పెంచుతాయి. అయితే రైల్వేల్లో పెట్టుబడులను ఆ రంగంలో సంస్కరణలతో ముడిపెట్టాలి. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం అమలుతో సత్ఫలితాలు వస్తాయి. జామ్ (జేఏఎం- జనధన్ ఆధార్ మొబైల్) ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయడం వల్ల ప్రతి పేదవాడికి మేలు జరుగుతుంది. భారత ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. అయితే ఇంతటితో సంతృప్తి చెంది ఆగిపోకూడదు. మధ్యకాలిక ద్రవ్యలోటు లక్ష్యమైన మూడు శాతాన్ని భారత్ చేరుకోవాలి. వృద్ధిని బలోపేతం చేయడానికి స్వల్పకాలిక ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించాలి. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఈ రెండింటి మధ్య సమతౌల్యాన్ని భారత్ సాధించగలదు. రాబోయే బడ్జెట్‌లోనూ, మధ్యకాలికంగాను వ్యయ నియంత్రణ, వినియోగం నుంచి పెట్టుబడులకు వ్యయాన్ని మరల్చడం ఎంతో ముఖ్యం. వడ్డీ రేట్లకు ఆర్‌బీఐ కోత విధించడం వృద్ధిని ప్రోత్సహించే ముఖ్యమైన రంగాల్లో ఒకటి. ముడిచమురు ధరల్లో తగ్గుదల, సంస్కరణలు, సాధారణ వర్షపాతం గణనీయ వృద్ధికి దోహదపడతాయి. నీతి ఆయోగ్ ఏర్పాటు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆమోదం ప్రభుత్వ విధానమైన సహకార సమాఖ్య స్ఫూర్తికి దోహదపడతాయి. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచడానికి, న్యాయపరమైన సందిగ్ధతలు లేకుండా చేయడానికి బొగ్గు కేటాయింపులు, భూసేకరణ, బీమాకు సంబంధించి తీసుకొచ్చిన ఆర్డినెన్సులకు చట్టరూపం ఇవ్వాలి. దేశ సామాజిక-ఆర్థిక వ్యవస్థలో మహిళలకు తగిన స్థానం కల్పించాలి. పురుషాధిక్య భావనను మార్చడానికి నిరంతర విధానాల ద్వారా ప్రభుత్వం చొరవ చూపాలి. మహిళా రాష్ట్రపతి, మహిళా ప్రధానమంత్రి, ప్రధాన రాజకీయ పార్టీలకు అధ్యక్ష స్థానాల్లో, పారిశ్రామిక రంగంలో ఉన్నత స్థానాల్లో మహిళలను భారత్ చూసింది. అయినప్పటికీ బాలబాలికల నిష్పత్తిలో అసమానత కొనసాగుతోంది. కుటుంబ నియంత్రణ పాటించే విషయంలో మహిళల పట్ల వివక్ష కనబడుతోంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ లేదు. కుటుంబ నియంత్రణ కూడా బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసానికి కారణమవుతోంది. కొద్దిమంది పిల్లలే ఉండాలని నిర్ణయించడం వల్ల వారిలో కనీసం ఒక్కరన్నా మగ పిల్లాడు ఉండాలన్న భావన ఏర్పడుతోంది. ఉద్యోగాల సృష్టికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం చాలా అవసరం. నియత వృత్తివిద్య లేకపోవడం, ఉన్నత పాఠశాల చదువులు మధ్యలోనే వదిలేసే వారిసంఖ్య ఎక్కువగా ఉండటం, సరిపడా నైపుణ్య శిక్షణ సామర్థ్యం లేకపోవడం, ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ ఉద్యోగిత నైపుణ్యాలపై దృష్టి పెట్టకపోవడం భారత శ్రామిక శక్తిలో నైపుణ్యాల లేమికి ప్రధాన కారణాలు. మానవ వనరుల నాణ్యతను పెంచుకోవడం, మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం ద్వారా జన భారాన్ని అవకాశాలుగా మలుచుకోవాలి. 'భారత్‌లో తయారీ' కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక వనరుల వినియోగాన్ని తప్పనిసరి చేయడం, నియంత్రణలను, పన్ను విధానాలను సరళీకరించడం, ఎగుమతి సంబంధిత ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దేశీయ కంపెనీలను విదేశీ కంపెనీల పోటీ నుంచి రక్షించాలి. 'భారత్‌లో తయారీ', 'నైపుణ్య భారత్' మధ్య సమతౌల్యం ఉండాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014-15 ఏడాదికి 257.07 మిలియన్ టన్నులు ఉంటుందని అంచనా. గత అయిదేళ్ల సగటు కంటే 8.5 మిలియన్ టన్నులు ఎక్కువ. వ్యవసాయ, ఆహార రంగాలకు సంబంధించి పరిశోధన, విద్య, విస్తరణ, సాగునీరు, ఎరువులు, భూసార పరీక్షా కేంద్రాలు, నీరు, నిత్యావసరాలు, గోదాములు, శీతల గిడ్డంగులు, తదితరాల్లో భారీ పెట్టుబడులు అవసరం. వ్యవసాయ రంగంలో ఇంతవరకు పెట్టిన ప్రభుత్వ పెట్టుబడులన్నీ రాయితీల పైనే దృష్టిసారించి ఉన్నాయి. ఉత్పాదకత పెంచే దిశగా పెట్టుబడులను మరల్చాలి. జాతీయ ఉమ్మడి మార్కెట్‌ను ఏర్పాటుచేసే దిశగా రాష్ట్రాలను ఒప్పించాలి. రాష్ట్రాలు మద్దతు ఇవ్వకపోతే రాజ్యాంగ నిబంధనలను వినియోగించుకోవాలి. నగరాలు, ఇతర స్థానిక సంస్థలను సహకార, సమాఖ్య స్ఫూర్తి పరిధిలోకి తీసుకురావడం తదుపరి విధాన నిర్ణయం కావాలి. ప్రస్తుతం సబ్సిడీల నుంచి ధనికులే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని తేలింది. పేదరికంతో పోరాడటానికి సబ్సిడీలు అత్యుత్తమ ఆయుధంగా కనిపించడం లేదు. ముడిచమురేతర, బంగారేతర దిగుబడులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. మరోపక్క ఎగుమతుల వృద్ధిలో మందగమనం కూడా ఆందోళన కలిగించే విషయం. నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు జీడీపీలో 7 శాతానికి సమానం. బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరుగుతున్నాయి. కఠిన ద్రవ్య విధానం వల్ల గిరాకీ ఒత్తిళ్లను తట్టుకోవచ్చు. బ్యాంకులు, బీమాల్లో భారీ సంస్కరణలతో 2013 బీమా వ్యాప్తి 3.9 శాతానికి చేరింది. 2000లో ఇది 2.3 శాతంగా ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇ-కామర్స్ మార్కెట్ 50 శాతం పైగా వృద్ధి చెందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి పరిమితం చేయగలమని, ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక సర్వే ధీమా వ్యక్తం చేసింది. ఆదాయాలు అనుకున్నంతగా పెరగకపోతే వ్యయాల్లో కోత వేసి ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరాలని సర్వే సూచించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో మనుగడ సాధించేందుకు దేశీయ బ్యాంకింగ్ రంగంలో 4 ప్రధాన మార్పులు జరగాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. విధాన నిర్ణయాల వల్లే బ్యాంకింగ్ కుంటుపడటంతో పాటు, పొదుపరులకు, బ్యాంకులకు ప్రతిఫలం తగ్గడంతో పాటు, ప్రజాధనం అన్యాక్రాంతం అవుతోంది. ఫలితంగా ప్రజలు పొదుపు చేయడం కూడా తగ్గిపోతోంది. వీటి నివారణకు 'చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి' (ఎస్ఎల్ఆర్)ని క్రమంగా తగ్గించాలని, మరిన్ని రంగాలకు ప్రాధాన్యతా రుణాల అవకాశం కల్పించి ఈ విషయంలో బ్యాంకులపై నియంత్రణ తొలగించాలి. అదనపు మూలధన పెట్టుబడి సమకూర్చడం, యాజమాన్య మార్పులో ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్యే వివక్ష చూపకూడదు. బ్యాంకులు అంతర్గతంగా, బయట నిధుల సమీకరకణకు భిన్న అవకాశాలుండాలి. బ్యాంకులను మోసగించే, రుణాలు ఎగవేసే వారిపై కఠిన చర్యలకు అవకాశం కల్పించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో త్వరితగతి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నిరర్ధక ఆస్తులు మూడేళ్లలో మూడింతలై, 2014 మార్చికి రూ.2.17 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం తగ్గిన పరిస్థితుల్లో, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని, వృద్ధి కోసం ప్రైవేట్ బ్యాంకింగ్‌కు కూడా అవకాశమివ్వాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (జనవరి 9 వరకు) ఆహార సబ్సిడీ బిల్లు రూ.1,07,823.75 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 20 శాతం పెరిగింది. సబ్సిడీల క్రమబద్ధీకరణకు తోడు లబ్ధిదార్లను మరింత మెరుగ్గా గుర్తించాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా ఆహార సబ్సిడీ బిల్లు పెరుగుతూనే ఉండటం వల్ల ఖజానాపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. సబ్సీడీ ధరలకు ఆహార ధాన్యాలను అందించడం ద్వారా పేదలకు కనీస పౌష్టికాహారాన్ని అందించడం; వివిధ రాష్ట్రాల్లో ధరలను స్థిరంగా ఉంచడం ఆహార భద్రత లక్ష్యాలు. దేశంలో సొంత ఇల్లు కోరుకుంటున్న వారి సంఖ్యకు, జరుగుతున్న నిర్మాణాల మధ్య అంతరం పెరుగుతోందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. తక్కువ ధర ఇళ్ల నిర్మాణానికి రుణాలు/ ఆర్థిక సాయం అందించడం, విధానపరమైన ఆలస్యాన్ని నివారిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని తెలిపింది. పట్టణాలు, నగరాల్లో 1.88 కోట్ల నివాసాలు నిర్మించాల్సి ఉందని, ఇందులో పేదల కోసమే 95.6 శాతం కావాలని తేల్చింది. ఈ రంగానికి సంస్థాగత పెట్టుబడులు తక్కువగానే ఉంటున్నాయి. 2013-14లో జీడీపీలో 7.8 శాతం వాటా స్థిరాస్థి రంగానిదే. మౌలిక, ఇనుము-ఉక్కు, జౌళి, గనులు, విమానయానాలు కలిపి మొత్తం ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల్లో 54 శాతం వాటాను కలిగి ఉన్నాయని సర్వే పేర్కొంది. మౌలిక రంగం ఒక్కటే మొత్తం అడ్వాన్సుల్లో 17.5 శాతం నిరర్ధక ఆస్తులకు కారణమైంది. గత కొన్నేళ్లుగా పెట్టుబడుల్లో ఆలస్యం కారణంగా డిసెంబరు చివరి నాటికి రూ.8.8 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని సర్వే స్పష్టం చేసింది. మొత్తం ఆగిపోయిన ప్రాజెక్టుల్లో మౌలికం కంటే తయారీ రంగానివే ఎక్కువ ఉండటం గమనార్హం. డిజిటల్ ప్రకటనలు, గేమింగ్ విభాగాలే దేశీయ వినోద, ప్రసార మాధ్యమాల్లో వృద్ధికి ఆధారం కానున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. నూరు శాతం ఎఫ్‌డీఐలను అనుమతించడంతో అంతర్జాతీయ స్టూడియోలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 2014-15 తొలి 9 నెలల్లో దేశంలో 18.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ఈ రంగంలోకి వచ్చాయి. దేశీయ సంస్థలతో కలిపి డిస్నీ, ఫాక్స్, సోనీ, వాగ్నర్ బ్రదర్స్ చలనచిత్ర నిర్మాణం, పంపిణీ చేపడుతున్నాయి. 2013లో రూ.91,800 కోట్ల స్థాయిలో ఉన్న ఈ పరిశ్రమ 2018 నాటికి రూ.1,78,600 కోట్ల స్థాయికి చేరుతుందని పేర్కొంది. దేశంలో విమానాశ్రయాల నిర్మాణంలో పీపీపీ విధానం సత్ఫలితాలనిస్తోందని ఆర్థికసర్వే వెల్లడించింది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఆదాయం కూడా పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ నెలల్లో దేశీయ విమానాశ్రయాల నుంచి 10.13 కోట్ల మంది దేశీయంగా, 3.67 కోట్ల మంది అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించారు. 2013-14 ఇదే కాలంతో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణికులు 7.1 శాతం, దేశీయ ప్రయాణికులు 10.3 శాతం పెరిగారు. దేశంలో ఆహారం, ఇంధనం, ద్రవ్య, ఎరువుల రూపేణా ఏటా రూ. 3.77 లక్షల కోట్ల మేర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇందులో అర్హులకు చేరేది కొంతేనని ఆర్థికసర్వే తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నుంచి లబ్ధిదారుల ఖాతాలకే సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎల్‌పీజీలో ఈ విధానాన్ని ప్రారంభించింది. దేశ వాణిజ్యం మెరుగవుతున్నందున, పసిడి దిగుమతిపై ఆంక్షలు తొలగించేందుకు ఇదే సరైన సమయం అని ఆర్థిక సర్వే పేర్కొంది. 2012-13లో దేశ వాణిజ్య లోటు 190.3 బిలియన్ డాలర్లు (రూ. 11,41,800 కోట్లు) కాగా, 2013-14లో 135.8 బి.డా. (రూ.8,14,800 కోట్లు)కు దిగి వచ్చింది. బంగారం, వెండి దిగుమతులు అంతకు ముందటి సంవత్సరం కంటే తగ్గగా, చమురు దిగుమతి 0.4 శాతమే పెరిగింది. ఫలితంగా 2013-14లో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.7 శాతానికి (32.4 బి.డా.) పరిమితమైంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 28 కోట్లు దాటింది. ప్రతినెలా భారీగా కొత్త ఖాతాదారులు పెరుగుతున్నందున, రాబోయే అయిదేళ్లలో ఇ-కామర్స్ వ్యాపారంలో 50 శాతం కంటే అధిక వృద్ధి లభించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. దేశంలో ఉద్యోగవకాశాలు కల్పించడం కంటే, ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆర్థిక సర్వే తేల్చింది. 2009-10 నుంచి 2011-12 మధ్య 1.39 కోట్ల మంది ఉద్యోగానికి సిద్ధం అయ్యారు. అయితే ఉద్యోగాల కల్పన ఆ స్థాయిలో జరగలేదు. 2013-14 చివరి త్రైమాసికంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,82,000 మందికి కొత్తగా అవకాశాలు లభించాయి. కానీ ఉద్యోగాల కల్పనలో తయారీ రంగం, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల వాటా తక్కువగా ఉంటోంది. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలంటే, ఈ రంగం అభివృద్ధి చెందాలి. దేశీయ కార్మికుల్లో నైపుణ్యం కలిగినవారు 2 శాతమే. అదే దక్షిణ కొరియాలో 96 శాతం, జపాన్ లో 80 శాతం మంది ఉన్నారు. రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను మరింత సరళీకరించాలని ఆర్థిక సర్వే సూచించింది. దేశ ప్రజల్లో 58.3 శాతం మంది 30 ఏళ్ల లోపు వారేనని, వీరిలో 31 శాతం మంది పట్టణ/ నగర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరి వద్ద ఖర్చు పెట్టేందుకు, మిగులు నిధులున్నందున, రిటైల్ రంగానికి ఉజ్వల భవిత ఉందని వివరించింది. అధిక వేగం (హై స్పీడ్) బ్రాడ్ బ్యాండ్ అందించేందుకు వీలున్న ఆప్టిక్ ఫైబర్‌తో ఇప్పటివరకు 5,000 గ్రామాలను అనుసంధానించారని ఆర్థిక సర్వే తేల్చింది. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్ఓఎఫ్ఎన్) కింద 2016 డిసెంబరు కల్లా 2.5 లక్షల గ్రామాలను అనుసంధానించి, 100 ఎంబీపీఎస్ వేగం ఉన్న బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించేందుకు రూ.30,000 కోట్లు వెచ్చించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఈ ఏడాది మార్చి ఆఖరుకు 50,000 గ్రామాల పనులు పూర్తి చేయాలనుకున్నారు. 2016 మార్చి ముగిసేసరికి మరో లక్ష గ్రామాలను, అదే ఏడాది డిసెంబరు ఆఖరుకు మరో లక్ష గ్రామాలను అనుసంధించాలన్నది ఆశయం. స్టాక్ మార్కెట్‌ను అద్భుతమైన నిధుల వనరుగా అభివర్ణించిన సర్వే బ్యాంకులపై ఆధారపడటం తగ్గించి స్టాక్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ చేసుకోవాలని చెప్పింది. ఆర్థిక సర్వే రూపకల్పనలో ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కీలకపాత్ర పోషించారు.
|
ఫిబ్రవరి - 28
|
కేంద్ర బడ్జెట్ 2015-16 ¤ ఉపాధి కల్పన, సామాజిక భద్రత, వృద్ధిరేటు పెంపు ప్రధానాంశాలుగా 2015-16 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం విలువ రూ.17,77, 477 కోట్లు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.4,65,277 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు.
వివిధ రంగాలు - కేటాయింపులు
|
ఆరోగ్య రంగం: ఈసారి ఆరోగ్య రంగానికి రూ.33,152 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపు రూ.35,163 కోట్లు. ప్రజలందరికీ ఆరోగ్యం కల్పించే లక్ష్యంతో, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెద్ద ఎత్తున ప్రజలను ఆరోగ్యబీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు బడ్జెట్ ద్వారా ప్రోత్సాహమార్గాన్ని వేశారు. జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ల ఏర్పాటు. బిహార్‌లో ఎయిమ్స్ లాంటి సంస్థ ఏర్పాటు. ఖాతాదారులెవరూ తమదిగా ప్రకటించుకోని పీపీఎఫ్ ఖాతాల్లోని భారీ మొత్తం నుంచి, ఈపీఎఫ్ మూలనిధి నుంచి సేకరించిన మొత్తంతో 'వృద్ధుల సంక్షేమ నిధి' ఏర్పాటు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వికలాంగ వృద్ధులకు అవసరమైన పరికరాలను అందించేందుకు కొత్త పథకం ఆరంభం. ఏడాదికి రూ.330 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా కల్పించే 'ప్రధాన్‌మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన'కు శ్రీకారం. 18 - 50 ఏళ్లవారికి ఉద్దేశించిన ఈ పథకం కింద ప్రమాద, సహజ, ఎలాంటి మరణాలకైనా పరిహారం. ఏడాదికి రూ.12 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు త్వరలో 'ప్రధాన్‌మంత్రి సురక్షా బీమా యోజన' ఆరంభం. ఆరోగ్య సేవలకు ప్రస్తుతం మన జీడీపీలో వెచ్చిస్తున్న 1.2 శాతాన్ని (తలసరి వ్యయం రూ.957) 2.5 శాతానికి పెంచాలన్నది ప్రతిపాదన. (తలసరి రూ.3,800). 'జాతీయ ఆరోగ్య హామీ మిషన్' కింద వచ్చే నాలుగేళ్లలో రూ.1.6 లక్షల కోట్లు వెచ్చించనున్నారు.పట్టణాభివృద్ధి శాఖ: పట్టణాభివృద్ధి శాఖకు 2015 - 16 బడ్జెట్‌లో రూ.16,832 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇది రూ.11,013 కోట్లు. గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.5,634.37 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇది రూ.3,400 కోట్లు. దేశంలో ప్రజలందరికీ 2022 నాటికి సొంతింటి కలను సాకారం చేస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.22,407 కోట్లు కేటాయించారు.నిర్భయ నిధి: మహిళల భద్రత, రక్షణ, చైతన్య కార్యక్రమాల నిమిత్తం 'నిర్భయ నిధి'కి మరో వెయ్యి కోట్లు కేటాయించారు.ఐసీడీఎస్: సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి (ఐసీడీఎస్) రూ.8,754 కోట్లు కేటాయించారు. ఒకవేళ పన్నుల ద్వారా మరింత ఆదాయం సమకూరితే ఐసీడీఎస్‌కు రూ.1500 కోట్లు, సమగ్ర శిశు సంరక్షణ పథకానికి (ఐసీపీఎస్) రూ.500 కోట్లు అదనంగా ఇస్తామంటూ ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు.సుకన్య సమృద్ధి యోజన: బాలికల చదువులు, భవిష్యత్తు కోసం ఉద్దేశించిన పథకమే 'సుకన్య సమృద్ధి యోజన'. ఆడపిల్లల పేరిట ప్రారంభించే బ్యాంకు ఖాతాలకు ఆకర్షణీయమైన వడ్డీ, చక్కటి రాయితీలు కల్పించారు. అరుణ్‌జైట్లీ ఈ ఖాతాల డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇతరాలకు పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించారు. 'బేటీ బచావో - బేటీ పఢావో'కు రూ.100 కోట్లు కేటాయించారు.శాస్త్ర సాంకేతిక శాఖ: ప్రస్తుత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.7,288 కోట్లు కేటాయించారు. 2014 - 15కు సంబంధించిన సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది రూ.1793 కోట్లు ఎక్కువ. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖలో మూడు ఉప విభాగాలు ఉన్నాయి. ఇందులోని శాస్త్ర, సాంకేతిక విభాగానికి అత్యధికంగా రూ.3,401 కోట్లు దక్కాయి. కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలికి (సీఎస్ఐఆర్) రూ.2,280 కోట్లు, బయోటెక్నాలజీ విభాగానికి రూ.1606 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. భూ విజ్ఞాన శాస్త్రాలకు రూ.1179 కోట్లు, సాగర సరిశోధనకు రూ.669 కోట్లు, వాతావరణ పరిశోధనకు రూ.425 కోట్లు కేటాయించారు.రోడ్లు, జాతీయ రహదార్ల రంగం: బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.42,913 కోట్లు కేటాయించారు. 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి జరిపిన కేటాయింపులు రూ.28,882 కోట్లు మాత్రమే. తాజా బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో దేశంలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం, స్వర్ణ చతుర్భుజి పథకం పరిధిలో నిర్మించిన రోడ్లను ఎక్స్‌ప్రెస్ రహదారులుగా మార్చడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో ఆరు వరుసలతో రహదారి విస్తరణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తారు. దేశంలోని 1,78,000 మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యమే లేదు. వాటికి ఆ సౌకర్యం కల్పించడానికి లక్ష కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకు 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రోజుకు 30 కిలోమీటర్ల మేర హైవేలను నిర్మించాలన్న లక్ష్యంతోపాటు నిలిచిపోయిన ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేసింది.ఆధార్: యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా అమలు చేస్తున్న 'ఆధార్ కార్డు' పథకానికి 23.63 శాతం అధికంగా నిధులు కేటాయించారు. గతేడాది రూ.1,617.73 కోట్లు ఖర్చు చేసినట్లు సవరణ బడ్జెట్‌లో చూపించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,039.64 కోట్లు ఇచ్చారు. ఇంతవరకు దేశవ్యాప్తంగా 77.91 కోట్ల మందికి ఆధార్ కార్డులు మంజూరైనట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు.అణు విద్యుత్: 2015 - 16 బడ్జెట్‌లో రూ.10,912 కోట్లు కేటాయించారు. 2014 - 15 బడ్జెట్‌లో రూ.10,446.59 కోట్లు కేటాయించగా సవరించిన 2014 - 15 బడ్జెట్‌లో ఇది రూ.8912.60 కోట్లుగా ఉంది. ముంబయిలోని భాభా అణు ఇంధన కమిషన్‌కు, కల్పకంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రానికి కలిపి రూ.1912 కోట్లు ఇస్తారు. అణు పరిశోధనల్లో ఈ రెండు సంస్థలు దేశంలో ప్రతిష్ఠాత్మకమైనవిగా భావిస్తారు. అణు ఇంధన విభాగం (డి.ఏ.ఈ.) ఆధ్వర్యంలో జరిగే పరిశోధనలకు రూ.200 కోట్లు మంజూరు చేశారు.స్వచ్ఛభారత్: దేశవ్యాప్తంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమానికి నిధుల సమీకరణకు ప్రత్యేకంగా 2 శాతం 'స్వచ్ఛ భారత్ పన్ను' విధించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అన్ని లేదా నిర్ణీత పన్ను పరిధిలోని సేవలపై 2 శాతం చొప్పున స్వచ్ఛ భారత్ పన్ను విధిస్తారు. ప్రకటించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కార్పొరేట్లు సహా ఇతర వర్గాల నుంచి ఈ కార్యక్రమానికి నిధుల సేకరణకు 'స్వచ్ఛ భారత్ నిధి (కోష్)' ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఈ నిధికి విరాళం ఇచ్చే వారికి 100 శాతం పన్ను రాయితీ ప్రకటించారు. అయితే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ఈ నిధికి విరాళం ఇచ్చే వారికి పన్ను రాయితీ ఉండదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం 2019 నాటికి రూ.62 వేల కోట్లను వెచ్చించే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 25 శాతం నిధులను సమకూరుస్తాయి. ఈశాన్య, ప్రత్యేక రాష్ట్రాలకు మాత్రం 90 శాతం నిధులను కేంద్రమే అందిస్తోంది.డిజిటల్ ఇండియా: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ఈసారి నిధులు పెంచారు. ఈ బడ్జెట్‌లో రూ.2510 కోట్లు కేటాయించారు. రూ.లక్ష కోట్ల వ్యయ అంచనాలతో, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 'డిజిటల్ ఇండియా'ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత బడ్జెట్‌లో రూ.500 కేటాయించగా ఈసారి దాన్ని అయిదింతలు చేశారు. సమాచార, సాంకేతిక రంగంలో కొత్తగా కంపెనీలు ప్రారంభించాలనుకునేవారికి ప్రోత్సాహకంగా రూ.1000 కోట్లను కేటాయించారు. ఈ రంగంలో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసే సత్తా ఉన్న పథకం 'డిజిటల్ ఇండియా'. 2018 నాటికి మొత్తం ప్రభుత్వ సేవలన్నింటినీ ఎలక్ట్రానిక్ విధానంలోనే (ఆన్‌లైన్‌లో) అందించడం, అందరికీ సాంకేతికత సదుపాయాలను అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం. ఈ పథకం కింద 2.5 లక్షల గ్రామాలకు హైస్పీడ్ ఆప్టికల్ కేబుళ్లతో అనుసంధానం చేసి బ్రాడ్‌బ్యాండ్, దూరవాణి సేవలకు విస్తరిస్తారు. 2.5 లక్షల పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ సదుపాయం కల్పిస్తారు. సాధారణ పౌరుల కోసం 4 లక్షల అంతర్జాల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల్లో వై-ఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా 1.55 లక్షల కేంద్రాల్లో ఉన్న తపాలా కార్యాలయాలను కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా సద్వినియోగం చేసుకోనున్నారు. ప్రధానమంత్రి జన్‌థన్ యోజనను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా తపాలా కార్యాలయాలను 'చెల్లింపు బ్యాంకులు'గా మార్చనున్నారు.అంతరిక్ష రంగం: ఈ బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.7388.19 కోట్లు కేటాయించారు. 2014 - 15 సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.5826 కోట్లుగా ఉంది. ఈసారి ప్రధానంగా వాహక నౌకల పరిజ్ఞాన ప్రాజెక్టులకు ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారు. వీటికి రూ.2148 కోట్లు కేటాయించారు. ప్రయోగ వ్యవస్థకు తోడ్పాటు, ఉపగ్రహాల గమనాన్ని పరిశీలించడానికి రూ.651 కోట్లను ప్రత్యేకించింది. ఇన్‌శాట్ కార్యక్రమానికి (జీశాట్, ఇన్‌శాట్ ఉపగ్రహాలు) రూ.1281 కోట్లు, 40 ట్రాన్స్‌పాండర్లతో కూడిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 15 ప్రయోగానికి రూ.165 కోట్లు, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి రూ.385 కోట్లు, చంద్రయాన్‌కు రూ.40 కోట్లు, సూర్యుడిపై అధ్యయనం కోసం ఉద్దేశించిన 'ఆదిత్య' ఉపగ్రహానికి ఈ 20 కోట్లు కేటాయించారు.సూక్ష్మ నీటిపారుదల రంగం: దేశంలోని ప్రతి రైతు పొలానికి నీరందించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యానికి అనుగుణంగా గత బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లతో 'ప్రధానమంత్రి గ్రామ సించయీ యోజన' (పీఎంజీఎస్‌వై) ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సూక్ష్మ నీటిపారుదలను ప్రోత్సహించేందుకు, వాటర్‌షెడ్ల అభివృద్ధికి 'పీఎంజీఎస్‌వై'కు రూ.5,300 కోట్లు కేటాయించారు. పీఎంజీఎస్‌వైలో భాగంగా జిల్లా స్థాయిలోనే చెరువులు, జల వనరుల అభివృద్ధికి ప్రణాళిక రచించి కేంద్రానికి పంపాలి. ఆ తర్వాత ఉపగ్రహం ద్వారా 3 - డి ఫొటో తీసి గ్రామీణులకు ఇచ్చి, వాటి సంరక్షణకు ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం సలహాలు కోరుతుంది. దీనికి అభ్యుదయ రైతుల సహకారం తీసుకుంటారు. దీన్ని ఉపాధి హామీ, ఇతర పథకాలతో అనుసంధానం చేస్తారు. నిధుల్లో కేంద్ర వాటా 75 శాతం కాగా, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.జల వనరులు: ఈ బడ్జెట్‌లో రూ.2232.43 కోట్లు కేటాయించారు. 2014 - 15 సవరించిన బడ్జెట్ ప్రకారం ఇది రూ.2728.76 కోట్లుగా ఉంది. బడ్జెట్‌లో కేంద్ర జలవనరుల శాఖకు కేటాయింపులు తగ్గినా ఆ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న 'గంగా ప్రక్షాళన' (క్లీన్ గంగ) కార్యక్రమానికి నిధులు పెంచారు. గంగా ప్రక్షాళన్‌కు రూ.2,100 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ (సవరించిన)తో పోల్చితే ఇది రూ.600 కోట్లు ఎక్కువ. జాతీయ శుద్ధ ఇంధన నిధి (ఎన్‌సీఈఎఫ్) నుంచి దీనికి ఈ మొత్తం ఇస్తారు. గంగా ప్రక్షాళన నిధికి ఇచ్చే విరాళాలకు 100 శాతం పన్ను మినహాయింపు ఇచ్చారు. కార్పొరేట్ల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ల భాగంగా ఇచ్చే విరాళాలకు మాత్రం ఇది వర్తించదు.నదుల అనుసంధానం: బడ్జెట్‌లో నదుల అనుసంధానానికి రూ.4,232.43 కోట్లు కేటాయించారు. నదుల అనుసంధానానికి సంబంధించిన సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) తయారీకి రూ.100 కోట్లు, వరదల నివారణకు రూ.244.64 కోట్లు ఇచ్చారు.విద్యుత్ రంగం: ప్రస్తుత బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ.61,404 కోట్లను కేటాయించారు. 2014 - 15 సవరించిన అంచనా ప్రకారం రూ.55,488 కోట్లు వ్యయం చేశారు. దేశంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని భారీ ఎత్తున చేపట్టాలని 2022 నాటికి 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడుతున్న పలు ప్రాంతాల్లో 5 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను (యూఎంపీపీ) రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంతవరకు నాలుగు యూఎంపీపీలను దేశంలో చేపట్టారు. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్), సనన్ (మధ్యప్రదేశ్), తిలాయిమా (ఝార్ఖండ్), ముంద్రా (గుజరాత్)లలో ఇవి ఉన్నాయి. మొదటి మూడింటిని రిలయన్స్ పవర్, నాలుగో దాన్ని టాటా పవర్ నిర్వహిస్తున్నాయి. 4 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను యూఎంపీపీలుగా పేర్కొంటారు.ఉపాధి హామీ పథకం: ఉపాధి హామీ పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.34,699 కోట్లు కేటాయించారు. 2014 - 15 సవరించిన బడ్జెట్ ప్రకారం ఇది రూ.31,000 కోట్లు. అనుకున్న విధంగా ఖజానాకు నిధులు సమకూరితే మరో రూ.5000 కోట్లను అదనంగా కేటాయిస్తామని కూడా జైట్లీ ప్రకటించారు.పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్‌యూ) పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.69,500 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.41,000 కోట్లు పీఎస్‌యూలలో తక్కువ వాటా విక్రయంపై, మరో రూ.28,500 కోట్లు లాభాలు ఆర్జిస్తున్న, నష్టాలు తెస్తున్న కంపెనీల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించింది. |
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment