ఫిబ్రవరి - 1
¤ నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో రహదారులు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల, ఘనవ్యర్థాల నిర్వహణ, ఉద్యాన వనాలు, వినోద కేంద్రాలు, విద్యుదీకరణ, భూగర్భ కేబుళ్లు తదితర మౌలిక సౌకర్యాలకే దాదాపు రూ.85 వేల కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అంచనాలు సిద్ధం చేసింది.
» రాజధానికి అనుసంధానం చేసే ప్రధాన రహదారిని ఎనిమిది వరుసలతో 370 కిలోమీటర్ల పొడవున, ఆరు వరుసలతో 863 కిలోమీటర్ల పొడవున నిర్మించేందుకు కనీసం రూ.6,644 కోట్లు అవసరమని అంచనా వేసింది. ప్రధాన రహదారుల అనుబంధ రహదారులు నాలుగు నుంచి ఆరు వరుసల వెడల్పు ఉంటాయి. మొత్తం 2,413 కి.మీ పొడవున ఈ రోడ్లు వేసేందుకు రూ.11,395 కోట్లు కావాలి. కిలో మీటరు రోడ్డు నిర్మాణానికి రూ.3.63 కోట్లు నుంచి రూ.6.53 కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కించింది.
» రాజధాని ప్రాంతంలో రోజుకు 450 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని సీఆర్‌డీఏ పేర్కొంది. తాగునీటి సరఫరా పైపులైన్లు, విద్యుదీకరణ, మురుగునీటి పారుదల, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, వరదనీటి కాలువలు నిర్మాణానికి రూ.10,208.57 కోట్లు కావాలని అంచనా వేసింది. ఘన వ్యర్థాల నిర్వహణ, వాహనాల కొనుగోలు, రవాణా, తడి-పొడి చెత్తలను వేరుచేయడం, డంపింగ్ యార్డుల కోసం రూ.308 కోట్లు అవసరమని తేల్చింది. అతిథి గృహాలు, వినోద కేంద్రాలు, వాణిజ్య భవనాలు, రహదారులు తదితర సౌకర్యాలకు మరో రూ.50 వేల కోట్లు అవసరమని భావించింది.
» కృష్ణా నది ప్రక్షాళన, నదిని దాటేందుకు వీలుగా ఆరు వరుసల రహదారులు, నదీతర ప్రాంత సుందరీకరణకు రూ.1186 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ సర్కారుకు నివేదించింది.
ఫిబ్రవరి - 2
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సౌర, పవన విద్యుత్ విధానాన్ని ఖరారు చేసింది.
» ఆంధ్రప్రదేశ్‌లో 38,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదనకు అవకాశముంది. ప్రస్తుతం 127 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది.
» సౌర విద్యుత్ ఉత్పాదన లక్ష్యాలను దశలవారీగా సాధించాలని నిర్ణయించారు. 2018-19 నాటికి 5 వేల మెగావాట్లు, 2021-22 నాటికి 10 వేల మెగావాట్ల ఉత్పాదన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 619 మెగావాట్ల ఉత్పాదనకు ఇప్పటికే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదిరాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సౌర విద్యుత్ పార్కులు (2 వేల మెగావాట్లు) నెలకొల్పనున్నారు.
» వచ్చే 5 ఏళ్లలో 50 వేల వ్యవసాయ పంపు సెట్లకు సౌర ఫలకాలు అమరుస్తారు.
» ప్రభుత్వ భవనాల మీద 5 మెగావాట్ల సామర్థ్యం, కాలువలపై 6 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్న సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు.
» దేశంలో అత్యధికంగా గుజరాత్‌లో 929 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (839 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (353 మెగావాట్లు), మహారాష్ట్ర (287 మెగావాట్లు) ఉన్నాయి.
» ప్రపంచంలో అత్యధికంగా జర్మనీ (35,900 మెగావాట్లు)లో స్థాపిత సామర్థ్యం ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా (19,900 మెగావాట్లు), ఇటలీ (17,600 మెగావాట్లు), జపాన్ (13,600 మెగావాట్లు), అమెరికా(12,100 మెగావాట్లు) ఉన్నాయి.
» ఆంధ్రప్రదేశ్‌లో 13 వేల మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పాదనకు సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 877 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తమిళనాడులో అత్యధికంగా 7,251 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (3,427 మెగావాట్లు), గుజరాత్ (3,383 మెగావాట్లు), రాజస్థాన్ (2734 మెగావాట్లు), కర్ణాటక (2,312 మెగావాట్లు) ఉన్నాయి.
» ప్రపంచంలో పవన విద్యుత్ ఉత్పాదనలో 91,400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో చైనా మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో అమెరికాలో (61,100 మెగావాట్లు), జర్మనీ (34,700 మెగావాట్లు), ఉన్నాయి.
» 2018-19 నాటికి 5 వేల మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫిబ్రవరి - 3
¤ భారతీయ ప్రజారోగ్య ఫౌండేషన్ (పీహెచ్ఎఫ్ఐ) దక్షిణాది ప్రాంతీయ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని రాజేందర్ నగర్‌లో భూమిపూజ చేశారు.
» ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ అధిపతి ఎన్.ఆర్.నారాయణ మూర్తి, పీహెచ్ఎఫ్ఐ అధ్యక్షులు ప్రొఫెసర్ కె.శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
¤ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బాలకార్మికులు ఎక్కువగా కనిపిస్తున్నారని, వారికి విముక్తి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 'ఆపరేషన్ స్మైల్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటించారు.
» పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు ఇవ్వనున్నట్లు, అది ఇప్పటికే నల్గొండ జిల్లాలో అమలవుతుందని మంత్రి వెల్లడించారు.
ఫిబ్రవరి - 4
¤ రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడ్డ ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీతోపాటు రెవెన్యూలోటు భర్తీకి ఆర్థిక సాయం ప్రకటించింది.
» ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 46(2), 46(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు వెనుకబడ్డ జిల్లాలకు రూ.350 కోట్లను (ప్రతి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అభివృద్ధి కార్యకలాపాల కోసం ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని వెల్లడించింది.
» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటు భర్తీకోసం తాత్కాలిక సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
» దీంతోపాటు పారిశ్రామిక పన్ను రాయితీలను ఏపీతో పాటు తెలంగాణకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.
» నోటిఫై చేసిన వెనుకబడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తయారీ పరిశ్రమల్లో కొత్త ప్లాంటు, దానికి యంత్ర సామాగ్రిపై తొలి సంవత్సరం 15% అదనపు తరుగుదల ప్రయోజనం.
» నోటిఫై చేసిన వెనుకబడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు 15% అదనపు పెట్టుబడి అలవెన్స్.
» రూ.25 కోట్లకు పైన ఉన్న పెట్టుబడులకే ఈ రాయితీలు కల్పిస్తామన్న షరతు విధించకుండా అన్నింటికీ అదనపు తరుగుదల, పెట్టుబడి అలవెన్సులు వర్తిస్తాయి.
¤ సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్‌ను కూచిపూడి నాట్యారామం ఛైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
» ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్యోత్సవంలో మాట్లాడిన సందర్భంగా సీఎం చంద్రబాబు రూ.100 కోట్లతో నాట్యారామాన్ని నిర్మించి కూచిపూడి అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.
ఫిబ్రవరి - 5
¤ తెలంగాణ ఉద్యోగులకు మూలవేతనంలో 43 శాతం మేర పెంచాలని (ఫిట్‌మెంట్) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతన సవరణను ఖరారు చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2వ తేదీ నుంచి ఈ నగదు ప్రయోజనం అమలు కానుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం ఏటా రూ.6500 కోట్లకు పైగా ఉండనుంది.
¤ ఆచార్య హరగోపాల్ నేతృత్వంలోని తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ తన తుది నివేదికలను హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి; సభ్యులు విఠల్, చంద్రావతి, మతిన్-ఉద్దీన్ ఖాద్రీకు అందజేసింది.
» నియామకాల ప్రక్రియలో కొన్ని మార్పులు, చేర్పులు అవసరమైనప్పటికీ, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ సంధికాలాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ భారీ మార్పులను సూచించలేదు. సిలబస్‌లో మాత్రమే తెలంగాణ ఆర్థిక, రాజకీయ, చరిత్ర రంగాల్లో మార్పులు సూచించింది.
¤ విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అదనంగా 450 మెగావాట్ల విద్యుత్తును ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
» ఆంధ్రప్రదేశ్‌లోని మూడు సహజవాయువు (గ్యాస్) ఆధారిత విద్యుత్‌కేంద్రాల్లో ఈ విద్యుత్తును ఉత్పత్తి చేసి రెండు రాష్ట్రాలకూ పంచుతారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విద్యుత్‌లో 53.89 శాతం తెలంగాణకు, మిగతాది ఏపీకి సరఫరా కానుంది. 450 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవసరమైన సహజవాయువును ఇచ్చేందుకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ అంగీకరించింది.
¤ తెలంగాణ జెన్‌కో రూపొందించిన నివేదికలో వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం-1 (కేటీపీపీ-1) విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
» 95 శాతం పీఎల్ఎఫ్ సాధించడం ద్వారా కేటీపీపీ-1 ఈ ఘనత సాధించింది. ఒక విద్యుత్తు కేంద్రానికి ఉండే ఉత్పత్తి సామర్థ్యంలో ఎంత శాతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందనే అంశాలను 'పీఎల్ఎఫ్' గా పిలుస్తారు.
» తెలంగాణలో మొత్తం అయిదు థర్మల్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2282.50 మెగావాట్లు.
» తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు.
¤ తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి - 6
¤ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 'పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం' తొలిదశకు రూ.14,350 కోట్లను కేటాయించి ఆమోదం తెలిపారు.
» జూరాల బ్యాక్ వాటర్ నుంచి 70 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
¤ 'అప్పా (APPA - ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ)'గా ప్రసిద్ధి చెందిన రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి (ఆర్‌బీవీఆర్ఆర్) ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ పేరును మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 'ఆర్‌బీవీర్ఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీ'గా ఈ సంస్థను పిలవనున్నారు.
¤ తెలంగాణలో కొత్తగా అభయారణ్యం ఏర్పాటైంది. అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాన్ని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
» రాష్ట్ర విభజనకు ముందు నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ - శ్రీశైలం అభయారణ్యం (ఎన్ఎస్‌టీఆర్) ఉమ్మడిగా ఉండేది. దీని విస్తీర్ణం 3,568 చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ పరిధిలోకి వచ్చే అమ్రాబాద్ అటవీ ప్రాంతాన్ని నూతన అభయారణ్యంగా గుర్తించారు.
» మహబూబ్‌నగర్ - నల్గొండ జిల్లాల సరిహద్దులో మొత్తం 2166.37 చదరపు కలోమీటర్ల పరిధిలో అమ్రాబాద్ అభయారణ్యం విస్తరించి ఉంది. దీనికి అదనంగా 445.02 చ.కి.మీ. పరిధిని బఫర్ ప్రాంతంగా గుర్తించారు. అమ్రాబాద్ సమీపంలోనే అభయారణ్యం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అమ్రాబాద్ పేరుతో పులుల సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది.
» కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న పులులను రక్షించడానికి, పర్యాటకానికి అనుకూలంగా అభివృద్ధి చేయడానికి దీన్ని ప్రత్యేక ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా దీని ముఖ్య ఉద్దేశం.
» ఈ అభయారణ్యం కింద మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని అచ్చంపేట, నాగార్జునసాగర్ అటవీ డివిజన్లు ఉన్నాయి.
ఫిబ్రవరి - 8
¤ రాష్ట్రంలో తొలి విడతగా 9,470 ఆవాసాల్లోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించే పనులకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. అయిదు జిల్లాల పరిధిలో 14 చోట్ల గ్రిడ్‌లు ఏర్పాటు చేసే పనులను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.
» తొలి విడత పనులకు రూ.1,518.51 కోట్లు వ్యయం చేస్తారు. ఇందులో భాగంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 2,131 ఆవాసాలు, ఆదిలాబాద్ జిల్లాలో 3,224, మెదక్ జిల్లాలో 1,311, ఖమ్మం జిల్లాలో 3,224 ఆవాసాలకు నీటిని అందిస్తారు.
ఫిబ్రవరి - 9
¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం 43% ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై మధ్యంతర భృతి కాకుండా అదనంగా రూ.3,610.80 కోట్ల భారం పడనుంది. పదో వేతన సవరణ కింద రూ.9284.52 కోట్లు అదనంగా వేతనాల కోసం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. (ఇప్పటికే అమలు చేస్తున్న 27% మధ్యంతర భృతి కింద ప్రభుత్వంపై 5,673.72 కోట్లు భారం ఉంది).
» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి (2014 జూన్ 2) పీఆర్‌సీ అమల్లోకి వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి ఉద్యోగుల చేతికి అందనున్నాయి.
ఫిబ్రవరి - 10
¤ ఎస్టీ వధువు కుటుంబానికి 'గిరిపుత్రిక కళ్యాణ పథకం' కింద వివాహ సమయంలో రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందజేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది.
ఫిబ్రవరి - 11
¤ యువతలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు కొత్తగా నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, దాని బాధ్యతను మంత్రి అచ్చెన్నాయుడుకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
» ప్రస్తుతం ఆయన కార్మిక, ఉపాధి శాఖతోపాటు ఫ్యాక్టరీస్, యువజన, క్రీడల మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి - 12
¤ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో క్రికెట్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని తపాలాశాఖ ప్రత్యేకంగా ప్రపంచకప్ జ్ఞాపిక పత్రాన్ని (సావనీర్ షీట్) విడుదల చేసింది.
» సుమారు A4 పరిమాణంలో ఉండే జ్ఞాపిక పత్రంలో ఐసీసీ ప్రపంచకప్ లోగోతో పాటు ఇందులో పాల్గొంటున్న 14 జట్లకు సంబంధించిన దేశాల రంగులతో బంతి ఆకారపు స్టాంపులుంటాయి.
» తెలంగాణలోని 36, ఆంధ్రప్రదేశ్‌లోని 58 ప్రధాన తపాలా కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనూ ఈ జ్ఞాపిక పత్రాలు అందుబాటులో ఉంటాయని తపాలా శాఖ వెల్లడించింది.
» తపాలా శాఖ ప్రధాన పోస్ట్ మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్.
ఫిబ్రవరి - 13
¤ తిరుపతి శాసనసభ నియోజవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 49.92 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 2,94,781 మంది ఓటర్లు ఉండగా అందులో 1,47,153 ఓట్లు పోలయ్యాయి.
» ఈ నియోజకవర్గంలో తెదేపా ఎమ్మేల్యేగా ఉన్న వెంకటరమణ మృతితో ఉపఎన్నిక జరిగింది.
ఫిబ్రవరి - 15
¤ అంతర్జాతీయ విమాన సేవల్లో భాగంగా విశాఖపట్నం నుంచి నేరుగా మలేషియా వెళ్లేందుకు మలిందో ఎయిర్ విమాన సేవలు ప్రారంభమయ్యాయి.
ఫిబ్రవరి - 16
¤ తిరుపతి ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, దివంగత శాసనసభ్యుడు డాక్టర్ ఎం.వెంకటరమణ సతీమణి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రుద్ర రాజు శ్రీదేవిపై భారీ ఆధిక్యం సాధించారు.
» గతేడాది డిసెంబరులో స్థానిక శాసనసభ్యుడు వెంకటరమణ మరణించారు. ఆ స్థానానికి ఈ నెల 13న నిర్వహించిన ఉప ఎన్నికలో మొత్తం 2,94,781 ఓట్లకు 49.94% (1,47,216 ఓట్లు) పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో తెదేపా అభ్యర్థిని సుగుణమ్మకు 1,26,152 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవికి 9,628 ఓట్లు మాత్రమే వచ్చాయి. లోక్‌సత్తా పార్టీకి 3,819 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సహా లోక్‌సత్తా భారతీయ జనసంఘ్, జనతాదళ్(యు) పార్టీల అభ్యర్థులకు ధరావత్తు రాలేదు. నోటా ఓట్లు 2152 నమోదయ్యాయి.
¤ ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది పొడవునా జల రవాణాకు వీలుగా నీటి లభ్యత ఉందని నీటిపారుదల శాఖ కేంద్రానికి ప్రాథమికంగా నివేదించింది. ఇందుకు రెండు నుంచి మూడు టీఎంసీలు సరిపోతాయని అంచనా వేసింది.
» కాకినాడ - పుదుచ్చేరి మధ్య 1,078 కిలోమీటర్ల మేర జల రవాణా నిర్వహణపై 'ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' అధ్యయనం చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 888, తమిళనాడులో 188, పుదుచ్చేరిలో 2 కిలోమీటర్లు ఉంది.
ఫిబ్రవరి - 18
¤ విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అయిదువేల మొక్కలు నాటారు.
¤ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
» అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏటా ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో నవమి వేడుకలు జరిగేవి. రాష్ట్ర విభజన జరగడంతో భద్రాచలం తెలంగాణ పరిధిలోకి వెళ్లిపోయింది.
ఒంటిమిట్ట ఆలయ నేపథ్యం
» ఒంటిమిట్ట రామాలయంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఏటా రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. కళ్యాణోత్సవం రాత్రివేళ జరుగుతుంది. ఆలయ గర్భగుడి, ముఖమండపం, గాలిగోపురం వేర్వేరు సమయాల్లో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గుడిలో ఒకే శిలపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. 160 అడుగుల ఎత్తైన గాలిగోపురం, 32 స్థంభాలతో ముఖమండపం ఉంటాయి.
» ఆలయానికి రెండు రకాల కథలు ఉన్నాయి. త్రేతా యుగంలో మృకండ మహర్షి, శృంగ మహర్షి ఈ ప్రాంతంలో యజ్ఞాలు చేస్తున్నప్పుడు రాక్షసులు ఆటంకం కలిగించారని, మహర్షులు రాముడిని ప్రార్థించగా యజ్ఞాలు ప్రశాంతంగా జరిగాయని, ఈ నేపథ్యంలో ఆలయం వెలిసిందని అంటారు. ఈ గుడి నిర్మాణ సమయానికి వనవాసంలో రాముడిని హనుమంతుడు కలవలేదని, అందువల్లే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదని చెబుతారు. హనుమంతుడి విగ్రహంలేని ఏకైక రామాలయం ఇదే అని అంటారు.
» జానపదుల కథ ప్రకారం ద్వాపర యుగంలో ఒంటడు, మిట్టడు అనే దారిదోపిడీ దొంగలు ఓ గుహలో సొత్తు దాచుకునే వారు. ఒకసారి ఆ గుహలో సీతారామలక్ష్మణులు విగ్రహాల రూపంలో కనిపించి దొంగలిద్దరినీ బుద్దిగా బతకాలని చెప్పడంతో వారిలో మార్పువచ్చి ఈ రామాలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది.
ఫిబ్రవరి - 19
¤ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పరిహారాన్ని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో రూ.1.5 లక్షలుగా ఉన్న ఈ పరిహారం మొత్తాన్ని రూ.3.5 లక్షలకు పెంచింది.
» మొత్తం రూ.5 లక్షల ఆర్థిక పరిహారంతో పాటు ఆ కుటుంబం కుదుటపడే చర్యలు కూడా ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 7.21% వృద్ధిరేటు నమోదు కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ గణాంకాల శాఖ అంచనా వేసింది. దీని ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ రూ.2,64,521 కోట్లకు చేరనుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.17,797 కోట్లు అధికం. 'డిస్ట్రిక్ట్ ఎట్ గ్లాన్స్' పేరుతో రూపొందించిన గణాంకాల నివేదికను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆవిష్కరించారు. ప్రభుత్వం ఈ అంచనాలను 2004-05 నాటి ధరలను ప్రామాణికంగా తీసుకుని అంచనా వేసింది. తాజా ధరల ప్రకారం లెక్కిస్తే స్థూల ఉత్పత్తి విలువ రూ.5,20,030 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే ధరల ప్రకారం గతేడాది స్థూల ఉత్పత్తి విలువ రూ.4,64,184 కోట్లు ఉందని, దాంతో పోలిస్తే ఈ ఏడాది 12.03% వృద్ధిరేటు నమోదైనట్లు లెక్కించింది.
» వ్యవసాయ రంగంలో ఈ ఆర్థిక సంవత్సరం 5.90% వృద్ధి నమోదు కానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ రంగం స్థూల ఉత్పత్తి విలువ రూ.63,414 కోట్లకు చేరొచ్చని పేర్కొంది.
» పారిశ్రామిక వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.25% వృద్ధి నమోదు కానున్నట్లు అంచనా. దీని స్థూల ఉత్పత్తి విలువ రూ.51,771 కోట్లు ఉండనుంది.
» సేవల రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 8.48% వృద్ధిరేటుతో రూ.1,49,336 కోట్ల స్థూల ఉత్పత్తిని నమోదు చేయనున్నట్లు గణాంకాల శాఖ అంచనా వేసింది.
» 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.90,517గా నమోదు కానున్నట్లు అంచనా. 2013-14లో నమోదైన రూ.81,397తో పోలిస్తే ఇది 11.21% అధికం.
¤ అనంతపురం జిల్లాలోని ఎంపిక చేసిన ఆరు ఆసుపత్రుల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఉచిత రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు (డయాగ్నస్టిక్ సెంటర్లు) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద వీటిని ప్రయోగాత్మక ప్రాజెక్టులుగా ఏర్పాటు చేయనుంది.
¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం గుమ్మ సముద్రం చెరువులో 'నీరు-చెట్టు' కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
» భూగర్భ జలాలను పెంచి కరవును తరిమి కొట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన ప్రకటించారు.
ఫిబ్రవరి - 20
¤ 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.267 కోట్ల నిధుల విడుదలకు ఆర్థిక, వ్యయ సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉప్పునీటి ప్రభావిత ప్రాంతాల కింద రూ.134 కోట్లు, పంచాయితీరాజ్ సంస్థాగత పనుల కింద రూ.133 కోట్లు ఏపీకి కేటాయించారు.
ఫిబ్రవరి - 21
¤ ఆంధ్రప్రదేశ్‌లో జనన మరణాలు రెండూ తగ్గుముఖం పట్టినట్లు, అందుకే పసికందుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి.
» కుటుంబ నియంత్రణ, ఇతరత్రా కారణాల వల్ల 2001-11 మధ్య కాలంలో 0-4 మధ్య వయసు పిల్లల సంఖ్యలో వృద్ధి రేటు మైనస్‌లో పడిపోయింది. అదే సమయంలో 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
» గత పదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 0-4 వయసు పిల్లల సంఖ్య 13.97% తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో 18 శాతం పెరిగింది. రెండూ కలిపి చూస్తే ఈ వయసు పిల్లల సంఖ్యలో వృద్ధి రేటు -6.85 గా నమోదైంది.
» 2001-11 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్యలో 44.72% పెరుగుదల కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 34.9 శాతానికే పరిమితం కాగా, పట్టణాల్లో 80.4% పెరిగింది. 4.93 కోట్ల ఏపీ జనాభాలో 5-14 ఏళ్ల వారు అత్యధికంగా 88.08 లక్షల మంది, 80 ఏళ్లకు పైబడినవారు అత్యల్పంగా 4.15 లక్షల మంది ఉన్నారు.
» చదరపు కిలోమీటరుకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా 518 మంది జనాభా ఉంటే, కడప జిల్లాలో అత్యల్పంగా 188 మందే ఉన్నారు.
» గత పదేళ్లలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 14.85%, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 3.51% జనాభా వృద్ధి నమోదైంది.
» రాష్ట్ర మొత్తం జనాభాలో 29.47% మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నరు. ఈ పదేళ్లలో గ్రామీణ జనాభా 1.49% పెరిగితే, పట్టణ జనాభా 33.35% వృద్ధి చెందింది.
» అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 52,85,824 మంది జనాభా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 23,44,474 మంది ఉన్నారు.
» లింగ నిష్పత్తి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 994గా ఉంటే, పట్టణాల్లో మాత్రం 1,004కి చేరింది. శ్రీకాకుళం (1015), విజయనగరం (1019), విశాఖపట్నం (1006), తూర్పు గోదావరి (1007), పశ్చిమ గోదావరి (1004) జిల్లాలో లింగనిష్పత్తి వెయ్యికి పైగా ఉంది. గుంటూరు జిల్లాలో అత్యల్పంగా ఇది 981కే పరిమితమైంది.
» 2001లో ఏపీ మొత్తం జనాబా 4,52,22,736. 2011 నాటికి ఇది 4,93,86,799కి చేరింది. వృద్ధి 9.21% గా నమోదైంది.
ఫిబ్రవరి - 22
¤ ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల స్థాయిలో తొలిసారిగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ఇ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా పాఠాలను బోధించవచ్చు.
ఫిబ్రవరి - 27
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏడు మిషన్లలో ఒకటైన సామాజిక సాధికారత పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో ప్రారంభించారు.
» ఈ పథకం ద్వారా మాతా శిశు మరణాలు తగ్గించడమే కాకుండా డ్వాక్రా మహిళల్లో ప్రతిభను పెంచి ఆర్థికంగా రాణించేలా చేస్తామని సీఎం ప్రకటించారు. పేద పిల్లలకు విద్య, వైద్యం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభినట్లు ఆయన ప్రకటించారు.
» నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లలో మొదటిదైన ప్రాథమికరంగ మిషన్‌ను అనంతపురంలో గతంలో ప్రారంభించారు. ఇది రెండోది.
¤ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఛైర్మన్‌గా యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటైంది.
» వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా జి.కిషన్‌రావు, సభ్యులుగా భువనగిరి ఎంపీ బూర నర్సయ్య, ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి నియమితులయ్యారు.
» తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ అథారిటీ ఏర్పడింది.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment