జనవరి - 2015 సైన్స్ అండ్ టెక్నాలజీ




జనవరి - 1

¤ నాఫ్తోక్విన్, ఆర్టిమిసినిన్ మందుల సమ్మేళనం చిన్నారుల్లో మలేరియా చికిత్సకు అత్యంత ప్రభావవంతమైన ఔషధమని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్వహించిన పరిశోధన పేర్కొంది.

జనవరి - 2

¤ బొగ్గు గనుల నుంచి వచ్చే మీథేన్ వాయువును విద్యుత్‌గా మార్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్‌ను చైనా నిర్మించింది. దీని వల్ల ఈ హానికారక వాయు ఉద్గారాలను తగ్గించడానికి వీలవుతుంది.
        » ఉత్తర చైనాలోని షాంక్షి ప్రావిన్స్‌లోని ఈ విద్యుత్ యూనిట్‌ను లువాన్ గ్రూప్ నిర్మించింది.

జనవరి - 3

¤ విమానం ఆకారంలో భారీ బెలూన్‌లా కనిపించే ఎయిర్‌షిప్‌ను (గగన నౌక) అమెరికా సైన్యం తీరప్రాంత నిఘా కోసం రూపొందించింది.
     » ఈ ఎయిర్‌షిప్ 24 గంటలపాటు 360 డిగ్రీల కోణంలో వస్తువుల కదలికలపై నిఘా పెడుతుంది. 500 కిలోమీటర్ల పరిధిలో కదులుతున్న మనుషులు, వాహనాలను పసిగడుతుంది.
     » రెండు ఎయిర్ షిప్‌లతో 'జ్లెన్స్' అనే ఈ వ్యవస్థను మేరీల్యాండ్‌లోని సైనిక కేంద్రం వద్ద రూ.17 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. 10వేల అడుగుల ఎత్తులోకి పంపే ఈ ఎయిర్ షిప్‌లలో ఒకటి నిరంతరం తీర ప్రాంతాన్ని స్కానింగ్ చేస్తుంది. మరోటి కచ్చితమైన రాడార్ సాయంతో నేలపై, సముద్రంపై, ఆకాశంలోని వస్తువులను గుర్తిస్తుంది.
     » ఈ ఎయిర్‌షిప్‌లను తీరప్రాంత భద్రత కోసమని సైన్యం చెబుతున్నప్పటికీ....సొంత పౌరులపై నిఘా పెట్టేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నారంటూ అమెరికాలో దుమారం చెలరేగింది.

జనవరి - 6

¤ బరువును సమర్థంగా తగ్గించే ఒక మాత్రను 'ఫెక్సారమైన్' పేరుతో అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
     » ఎక్కువ ఆహారం తిన్న భావనను ఇది కలిగిస్తుంది. అయిదు వారాల పాటు ఎలుకలపై చేసిన పరీక్షల్లో ఇది బరువును, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించింది.
¤ ఇండియా బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐఎన్ఓ)ను రూ.1500 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అధిక శక్తితో కూడిన పరమాణు భౌతికశాస్త్ర ప్రయోగాలను ఇందులో చేపడతారు. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) దీనికి ప్రధాన సంధానకర్తగా ఉంటుంది.
     » దీని నిర్మాణంతో ఐరోపాలో నిర్మించిన 'బిగ్ బ్యాంగ్' యంత్రం లాంటిది మనకూ రాబోతుంది.
     » ఈ అబ్జర్వేటరీని తమిళనాడులోని తేని జిల్లాలోని పొట్టిపురంలో 1300 మీటర్ల ఎత్తున్న పర్వతం కింద నేలమాళిగలో నిర్మిస్తారు. ఈ ల్యాబ్‌ను 2 కిలోమీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పున్న సొరంగంతో అనుసంధానిస్తారు.
     » అత్యంత చిన్న రేణువైన న్యూట్రినో గురించి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా అధ్యయనం చేస్తారు.
     » ఈ అబ్జర్వేటరీ భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, భూగర్భశాస్త్రంలో ఇతర అంశాలపై పరిశోధన చేసే పూర్తిస్థాయి సైన్స్ ల్యాబొరేటరీగా వృద్ధి చెందుతుందని టీఐఎఫ్ఆర్ ప్రకటించింది.
     » న్యూట్రినోల లక్షణాలను అధ్యయనం చేయడానికి 50 కిలోటన్ మ్యాగ్నటైజ్డ్ ఐరన్ కెలోరీమీటర్, డిటెక్టర్ నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ల్యాబొరేటరీని, డిటెక్టర్‌ను సాకారం చేయడానికి మదురైలో ఇంటర్ ఇన్‌స్టిట్యూషనల్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ ఫిజిక్స్ (ఐఐసీహెచ్ఈపీ)ని నిర్మిస్తారు. ప్రతిపాదిత ఐఎన్‌వోకు ఈ నగరం 110 కి.మీ. దూరంలో ఉంది. ఐఎన్‌వో ప్రాజెక్టును 15 ఏళ్ల కిందట ప్రతిపాదించారు. దీనికి అణుశక్తిశాఖ, శాస్త్రసాంకేతిక శాఖ తోడ్పాటును అందిస్తాయి.

జనవరి - 8

¤ గొర్రెలు, మేకలు పట్ల ప్రాణాంతకంగా మారిన 'నీలి నాలుక వ్యాధి' నివారణకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ (ఐఐఎల్) సంస్థ 'రక్షా బ్లూ' పేరిట సరికొత్త టీకాను అందుబాటులోకి తీసుకొచ్చింది.
     » సామాన్య రైతులకు అందుబాటులో ఉండేలా ఐఐఎల్ రూ.5 కే ఈ టీకాను విపణిలోకి ప్రవేశపెట్టింది.

జనవరి - 9

¤ ప్రొస్టేట్ క్యాన్సర్‌కు పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ కారణమని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. అయితే బాగా ముదిరిపోయిన కొన్ని ప్రొస్టేట్ క్యాన్సర్‌లను అణిచివేయడంలో ఇది సాయపడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలోని 'జాన్స్ హాప్కిన్స్ కిమ్మెల్ క్యాన్సర్ సెంటర్‌'కు చెందిన శామ్యూల్ డెన్‌మీడ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనను నిర్వహించింది.

జనవరి - 10

¤ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) సరకులతో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ (స్పేస్ఎక్స్)కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక బయలుదేరింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ వైమానిక స్థావరం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
¤ పిండిపదార్థాలకు బదులు బాదంను అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఉదర భాగంలో కొవ్వు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
¤ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన తేలిక పాటి యుద్ధ విమానం తేజస్‌లో అధునాతన ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ (ఈడబ్ల్యూ) ను శాస్త్రవేత్తలు అమర్చారు. దీన్ని బెంగళూరులో విజయవంతంగా యుద్ధ విమానంలో పరీక్షించారు. విమానం వెళ్లే మార్గంలో శత్రుదేశపు రాడార్ సంకేతాలను ఇది గుర్తిస్తుంది. రాడార్ హెచ్చరికలతోపాటు ఇందులో జామర్ కూడా ఉంది. గుర్తించిన రాడార్ సంకేతాలను అడ్డుకోవడం ద్వారా యుద్ధ విమాన పైలట్‌కు అదనపు సామర్థ్యాన్ని ఇది కల్పిస్తుంది.
   » రాడార్ హెచ్చరిక వ్యవస్థ, జామర్ సాధనాలను అమర్చిన తొలి భారత యుద్ధ విమానం 'తేజస్' కావడం విశేషం. ప్రస్తుతం వివిధ యుద్ధ విమానాల్లో ఉపయోగిస్తున్న ఈడబ్ల్యూ వ్యవస్థలు ప్రాథమికమైనవి. వాటిలో రాడార్ హెచ్చరికల రిసీవర్ మాత్రమే ఉంది.

జనవరి - 11

¤ మానవ కణజాలం నుంచి చిన్నపేగును తయారు చేయడంలో లాస్ ఏంజెలిస్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇది అచ్చంగా సహజమైన చిన్నపేగు మాదిరిగానే పని చేస్తుందని వారు వెల్లడించారు. దీనికి 'టీఈఎస్ఐ' గా పేరు పెట్టారు.
జనవరి - 13

¤ మలేరియా వ్యాప్తి నివారణకు వాడే దోమ తెరలపై కీటక నాశనులను తట్టుకునే 'సూపర్' దోమను శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో రెండు మలేరియా దోమ తెగల మధ్య సంక్రమణం వల్ల ఇది పుట్టుకొచ్చిందని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అనాఫిలస్ గాంబియే అనే దోమ జాతి మలేరియా వ్యాప్తికి ప్రధాన వాహకంగా ఉంది. ఈ వ్యాధిని వ్యాపింపజేసే ఎ.కొలుజీ అనే మరో దోమతో ఇది కొన్ని చోట్ల సంక్రమణం చెందింది. కీటక నాశనులను అధిగమించే సామర్థ్యాన్ని ఈ కొత్త దోమ జాతిలో కొంత కాలం కిందట పరిశోధకులు గుర్తించారు. అయితే ఇటీవల ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో దోమ తెరల ప్రభావాన్ని నిర్వీర్యం చేసే స్థాయికి కూడా ఇవి పెరిగినట్లు తేలింది. క్రిమి సంహారక మందులు పూసిన ఈ దోమ తెరలు ఒక్క మాలిలోనే లక్షల మంది ప్రాణాలను కాపాడుతున్నాయి.
      » ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా మలేరియా మరణాలు 47 శాతం మేర తగ్గాయి. దీనికి ప్రధాన కారణం ఈ దోమ తెరలేనని పరిశోధకులు వెల్లడించారు.

జనవరి - 16

¤ మూడో తరానికి చెందిన, దేశీయంగా రూపొందించిన విమాన వాహక యుద్ధనౌక 'ఎల్‌సీయూఎల్ 53'ను  కోల్‌కతలో ఆవిష్కరించారు.
      » భారత నేవీ వైస్ అడ్మిరల్ సునీల్ లాంబ సమక్షంలో ఆయన సతీమణి రీనా లాంబ దీన్ని లాంచనంగా గంగానదిలోకి ప్రవేశపెట్టారు.
      » ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది.
¤ 2003 డిసెంబరు 19న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ప్రయోగించిన బీగిల్-2 స్పేస్ క్రాఫ్ట్ 11 ఏళ్ల తర్వాత కనిపించింది. వాస్తవంగా 2003 డిసెంబరు 25 నాటికి అంగారకుడి పైకి చేరుకుని సంకేతాలు పంపాల్సిన ఈ వ్యోమనౌక నుంచి అప్పట్లో ఎలాంటి స్పందనా లేకపోవడంతో 2004 ఫిబ్రవరిలో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఈఎస్ఏ ప్రకటించింది.
      » తాజాగా అంగారకుడిపై అన్వేషణకు నాసా పంపిన 'మార్స్ రికన్నైజెన్స్ ఆర్బిటర్' స్పేస్ క్రాఫ్ట్‌లోని 'హై రిజల్యూషన్ కెమెరా' తీసిన చిత్రాల్లో కుజుడి ఉపరితలంపై బీగిల్-2 కనిపించింది. దాని సౌర ఫలకాల్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల యాంటెనా పని చేయలేదని, అందుకే అది సంకేతాలు పంపలేకపోయిందని శాస్త్రజ్ఞులు తెలిపారు.
¤ ఇప్పటివరకు పలు రకాల సేవలందిస్తున్న డ్రోన్లు ఇకపై వార్తలు సేకరించనున్నాయి.
      » అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ సహా 10 అగ్రశ్రేణి మీడియా సంస్థలు ఈ అంశంపై ఒక నెట్ వర్క్‌గా ఏర్పడ్డాయి. హెలికాప్టర్‌ల సాయంతో వార్తలు సేకరించడానికి బదులుగా డ్రోన్‌లను వాడనున్నట్లు ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహాయం అందిస్తున్న వర్జీనియా టెక్ వర్సిటీ వెల్లడించింది. దీనికి అమెరికా ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది.

జనవరి - 17

¤ దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) 'తేజస్' భారత వైమానిక దళంలో చేరింది. ఈ లోహ విహంగానికి సంబంధించిన పత్రాలను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ బెంగళూరులో ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహాకు అందించారు. దీంతో 4, 5వ తరానికి చెందిన ఈ సూపర్ సోనిక్ పోరాట విమాన శకం మొదలైంది.
      » భారత వైమానిక దళంలోని కాలం చెల్లిన మిగ్-21 పోరాట విమానాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎల్‌సీఏ ప్రాజెక్టును 1983లో ప్రభుత్వం మంజూరు చేసింది. డీఆర్‌డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) దీనికి నోడల్ సంస్థగా వ్యవహరిస్తోంది. బెంగళూరులోని హాల్ (HAL - హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్) ప్రధాన భాగస్వామిగా ఉంది. అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం జరిగింది.
      » అన్ని ఇబ్బందులను అధిగమించి ఎల్‌సీఏ 2001 జనవరి 4న తొలిసారి గగన విహారం చేసింది. 2003లో నాటి ప్రధాని వాజ్‌పేయీ ఈ యుద్ధ విమానానికి 'తేజస్' అని పేరు పెట్టారు.
      » ఈ లోహ విహంగం చాలా చురుగ్గా ఉంటుంది. ఎటుపడితే అటు విన్యాసాలు చేయగలదు. కర్బన ఫైబర్ మిశ్రమ పదార్థాల వినియోగం వల్ల తేజస్ బరువు తక్కువ. డిజిటల్ ఫ్లై బై వైర్ వ్యవస్థ, అధునాతన విమాన నియంత్రణ వ్యవస్థలు, ఓపెన్ ఆర్కిటెక్చర్ కంప్యూటర్ లాంటివి ఇందులో ఉన్నాయి.
      » హాల్ ఇప్పటి వరకూ వివిధ దశల్లో 15 తేజస్‌లను తయారు చేసింది. ఇందులో ఏడు పరిమిత శ్రేణి తరగతికి చెందినవి కాగా రెండు టెక్నాలజీ డెమోనిస్ట్రేటర్లు, మూడు ఫైటర్ ప్రొటో టైప్‌లు, రెండు శిక్షణ ప్రొటోటైప్‌లు, నౌకాదళ వెర్షన్‌కు సంబంధించిన ఒక విమానం ఉన్నాయి.
      » ఇవన్నీ ఇప్పటివరకూ 2800 సార్లు ఆకాశయానం చేశాయి. ఉష్ణ, శీతల ఉష్ణోగ్రతల్లో తేజస్‌ను పరీక్షించారు. ఆయుధాల ప్రయోగంతోపాటు బహుళ ప్రయోజనకారి రాడార్, రాడార్ హెచ్చరిక స్వీకరణ వ్యవస్థతోను ఈ యుద్ధ విమానాన్ని పరీక్షించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిపిన పరీక్షల్లో తేజస్ తన ఆయుధ ప్రయోగ పాటవాన్ని దిగ్విజయంగా ప్రదర్శించింది.
      » గగన తలం నుంచి గగనతలం, నేలమీద, సముద్రం మీదున్న లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందించారు.
      » తేజస్ ప్రమాణాలు: సిబ్బంది - ఒకరు, పొడవు - 13.2 మీ. ఎత్తు - 4.4 మీ, రెక్కల విస్తీర్ణం - 8.2 మీ., గరిష్ఠ వేగం - 1.6 మ్యాక్, ఇంజిన్ - ఎఫ్ 404 జీఈ ఐఎన్ 20, ప్రాజెక్టు అభివృద్ధి వ్యయం - రూ.17,269 కోట్లు, ఒక్కో విమానం ఖరీదు - రూ.220 - 250 కోట్లు, పైకి లేచేటప్పుడు గరిష్ఠ బరువు - 13,200 కిలోలు

జనవరి - 18

¤ అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 రికార్డుల్లోకి ఎక్కింది. 1880తో పోలిస్తే గతేడాది ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) శాస్త్రవేత్తలు తేల్చారు.
      » నాసాకు చెందిన గొడార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ (జీఐఎస్ఎస్) పరిశోధకులు భూతలంపై 6300 వాతావరణ కేంద్రాల సాయంతోను, నౌకల ద్వారా సముద్రంలోను, అంటార్కిటికా పరిశోధనల కేంద్రాల సాయంతో పరిశీలించి ఈ నిర్థారణకు వచ్చారు. ప్రామాణిక ప్రాతిపదికగా తీసుకున్న 1951 నుంచి 1980 మధ్య కాలంతో పోలిస్తే ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతలో వచ్చిన వైరుధ్యం ఆధారంగా ఈ మేరకు తేల్చారు.
      » భూగోళంపై దీర్ఘకాల వేడిమి పోకడ కొనసాగుతోందని, అందులో భాగంగానే గతేడాది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే ఇది కొనసాగుతున్నప్పటికీ పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం, చల్లబడటానికి సంబంధించిన ఎల్‌నినో, లానినా పరిస్థితులను బట్టి ఏటేటా సరాసరి ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయని వివరించారు. గతేడాది మాత్రం ఎల్‌నినో లేకపోయినా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయింది.
      » ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎక్కువగా గత మూడు, నాలుగు దశాబ్దాల్లోనే చోటు చేసుకుంది. 10 అత్యంత ఉష్ణ సంత్సరాల్లో తొమ్మిది 2000 సంవత్సరం తర్వాతే నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వివరించారు.
¤ చికిత్సకు వీలులేని రెటీనైటిస్ పిగ్మెంటోసా అనే నేత్ర సంబంధ రుగ్మతతో సంబంధమున్న మరో కొత్త జన్యువును అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.
      » మనం చూసిన దృశ్యాలను కంట్లోని రెటీనా విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. వాటిని మెదడు విశ్లేషిస్తుంది. రెటీనైటిస్ పిగ్మెంటోసా వల్ల రెటీనా దెబ్బతింటుంది. ఈ రుగ్మత వచ్చిన వారిలో మొదట రాత్రిపూట చూపు మందగిస్తుంది. క్రమంగా చూపు తగ్గుతూ వస్తుంది. చివరకు అంధత్వానికి కూడా దారి తీయవచ్చు. ఈ సమస్య ఉన్న అనేక కుటుంబాల పై శాస్త్రవేత్తలు 3 దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా హెక్సోకైనేస్ 1 (హెచ్‌కే 1) అనే జన్యువును వారు గుర్తించారు.
      » పరిశోధనకు నేతృత్వం వహించింది: స్టీఫెన్ పి డైగర్.

జనవరి - 26

¤ రోజుకు 10 నిమిషాలు చూయింగ్ గమ్‌ను నమలడం వల్ల నోటిలోని 100 మిలియన్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా నాశనం అవుతుందని నెదర్లాండ్స్‌లోని గ్రోనింగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.

జనవరి - 28

¤ దెబ్బతిన్న అన్నవాహిక మరమ్మతు, మార్పిడి కోసం అమెరికాలోని 'ఫీన్‌స్టీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్' పరిశోధకులు 3డీ ముద్రణతో అన్నవాహిక మృదులాస్థిని ముద్రించారు. ఇందుకోసం ముందుగా 3డీ ముద్రణ పరికరం సాయంతో కాండ్రోసైట్స్ కణాల మిశ్రమం, అన్నవాహిక ఆకారంతో కూడిన చట్రాన్ని నిర్మించారు. అనంతరం ఈ కణాలు చట్రం చుట్టూ వృద్ధి చెందుతూ మృదులాస్థిగా రూపొందాయి.
¤ దాదాపుగా భూగోళం కంటే కాస్త తక్కువ పరిమాణంలో ఉండే అయిదు గ్రహాలతో కూడిన పురాతనమైన నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
      » 'కెప్లర్' అనే నాసా ఉపగ్రహం పరిశీలనల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ పురాతన నక్షత్రం ఉనికిని కనుక్కున్నారు. అందుకే ఈ నక్షత్రానికి 'కెప్లర్ - 444' అని పేరు పెట్టారు.

జనవరి - 29

¤ 2014 చివరి వరకు ఉన్న గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 139 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులు ఉన్నారని ఫేస్‌బుక్ వెల్లడించింది.
      » వీరిలో 89 కోట్ల మంది ప్రతిరోజు ఫేస్‌బుక్‌ను చూస్తున్నారని, గతేడాదితో పోలిస్తే ఇది 18% ఎక్కువ అని సంస్థ వెల్లడించింది.
      » అమెరికా, కెనడాలో సుమారు 15.7 కోట్లమంది, యూరప్‌లో 21.7 కోట్ల మంది, ఆసియా పసిఫిక్‌లో 25.3 కోట్ల మంది రోజూ ఫేస్‌బుక్‌ను వీక్షిస్తున్నారు.

జనవరి - 31

¤ భారత్ అగ్ని-5 క్షిపణిని ఒడిశాలోని వీలర్స్ ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి విజయవంతంగా పరీక్షించింది.
      » 5 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని తొలిసారిగా గొట్టపు కవచం (క్యానిస్టర్) నుంచి ప్రయోగించారు. దీంతో ఈ అస్త్రాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి సులువుగా తీసుకెళ్లి, మెరుపు వేగంతో ప్రయోగించవచ్చు.
      » పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ఈ క్షిపణి టన్నుకు పైగా అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు.
      » ఐటీఆర్‌లోని సంచార లాంచర్‌పై ఉంచిన క్యానిస్టర్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. తొలుత క్యానిస్టర్ గొట్టం నుంచి ఈ అస్త్రం దూసుకొని వెలుపలికి వచ్చింది. దాదాపు 20 మీటర్ల ఎత్తుకు చేరాక క్షిపణిలోని మొదటి దశ మోటార్ రాజుకుంది. దీంతో అగ్ని-5 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా నిర్దేశించిన పథంలోనే అది ప్రయాణించింది. ఈ క్రమంలో మిశ్రమ పదార్ధాలతో రూపొందిన తేలికపాటి రెండో దశ మోటారు ప్రజ్వలించింది. తర్వాత మూడో దశ కూడా రాజుకుంది. వినూత్నంగా శంఖం ఆకారంలో రూపొందించిన ఈ దశ మోటారులో పూర్తిగా మిశ్రమ పదార్ధాలను ఉపయోగించారు. ఇది క్షిపణిని రోదసీలోకి తీసుకెళ్లింది. అంటే 600 కి.మీ. కు పైగా ఎత్తుకు చేరుకుంది. నిర్దేశిత గరిష్ఠ ఎత్తుకు చేరుకున్నాక క్షిపణి భూమి వైపునకు తిరిగింది. సముద్రంలో ఏర్పాటు చేసిన లక్ష్యం దిశగా ప్రయాణాన్ని కొనసాగించింది. క్షిపణిలో అధునాతన ఆన్‌బోర్డ్ కంప్యూటర్, ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థలు అత్యంత కచ్చితత్వం తో దాన్ని లక్ష్యం దిశగా నడిపించాయి.
      » ఈ క్షిపణి సైన్యం చేతికి అందించే వెర్షన్. దీన్ని ప్రయోగించడం ఇది మూడోసారి. లోగడ జరిపిన రెండు పరీక్షలను స్థిర లాంచర్ నుంచి చేపట్టారు. అయితే వీటిని శత్రుదేశాలు పసిగట్టి, దాడి చేసే వీలుంది. క్యానిస్టర్‌లో క్షిపణిని అమర్చడంవల్ల ఈ ఇబ్బంది తప్పుతుంది.
      » అగ్ని-5 క్షిపణి పొడవు 17 మీటర్లు, బరువు 50 టన్నులు, దిశలు మూడు, ఘన ఇంధనం ఉపయోగిస్తారు. వెడల్పు 2 మీటర్లు.
      » మూడు దశల్లో ఘన ఇంధనాన్ని వినియోగించుకుని మాక్-24 వేగంతో (ధ్వని వేగానికి 24 రెట్లు. అంటే దాదాపు గంటకు 30 వేల కిలోమీటర్ల వేగం) దూసుకెళుతుంది.
      » భూ వాతావరణంలో అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో క్షిపణి పైకవచం ఉష్ణోగ్రత దాదాపు 4,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ లోపల పరికరాలు, వ్యవస్థల ఉష్ణోగ్రతలు మాత్రం 50 సెంటీగ్రేడులలోపే ఉండేలా ఏర్పాట్లు చేశారు.
¤ మొబైల్ లాంచర్ నుంచి సైతం అగ్ని-5 ఖండాంతర క్షిపణి తొలిసారిగా సత్తా చాటడంతో డీఆర్‌డీవో చీఫ్‌గా అవినాష్ చందర్‌కు ఘనంగా వీడ్కోలు లభించింది. ఆయన 2014 నవంబరు 30తో పదవీ విరమణ పొందినప్పటికీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనవరి 31తో కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ బాధ్యతలను రక్షణ కార్యదర్శి ఆర్.కె.మాధుర్‌కు అదనంగా కేంద్రం అప్పగించింది.
¤ నేలలోని తేమకు సంబంధించిన కచ్చితమైన లెక్కలను సేకరించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 'సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ పాసివ్ (ఎస్ఎంఏపీ)' ఉపగ్రహాన్ని డెల్టా-2 రాకెట్ ద్వారా ప్రయోగించింది.
      » భూమి మీదున్న మొత్తం తేమలో ఒక్క శాతమే నేల మీద ఉంటుంది. 97 శాతం సముద్రాల్లో, మిగతాది మంచులో నిక్షిప్తమై ఉంది. స్వల్ప మొత్తంలో నేలలో ఉన్న తేమకు, భూమిపై ఉన్న వాతావరణ వ్యవస్థల (నీరు, శక్తి, కర్బన సైకిల్లు) తో సంబంధం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు లేదా కరవు తలెత్తడం వెనుక ఈ తేమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ తీరుతెన్నులన్నింటినీ పరిశీలించడానికి ఎస్ఎంఏపీ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
      » ఈ ఉపగ్రహం భూమికి 685 కి.మీ. ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశీలనలు జరుపుతుంది.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment