నవంబర్ కరెంట్ అఫైర్స్


2014 ఫోర్బ్స్‌ జాబితాలో మోడీ
2014 ప్రపంచ అత్యంత శక్తిమంతుల జాబితాను ఫోర్బ్స్‌ పత్రిక 2014 నవంబరు 5న వెల్లడించింది. ఈ జాబితా వారి ఆర్థిక సామర్థ్యం, పరిధి, వారు ప్రభావితం చేయగల ప్రజల సంఖ్య ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన 72 మంది పేపర్లతో వార్షిక ర్యాంకింగ్‌ ఇస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో మొదటిసారిగా స్థానం సంపాదించి 15వ స్థానంలో నిలిచారు. గుజరాత్‌లో విస్తృతమైన పునర్నిర్మాణాల ప్రాజెక్టులకు గుర్తింపు, అలాగే భారతదేశ ఆర్థికవ్యవస్థను పునరుత్తేజం చేయడానికి అతని పరిపాలన హామీలకు ఈ జాబితాలో స్థానం దక్కింది. ఈ జాబితాలో ముఖేష్‌ అంబానీకి 36వ స్థానం దక్కింది. మొదటిస్థానంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, రెండోస్థానంలో బరాక్‌ ఒబామా, మూడోస్థానంలో చైనా అధ్యక్షుడు జీజిన్‌ పింగ్‌,, నాల్గోస్థానంలో పోప్‌ ఫ్రాన్సిస్‌, ఐదోస్థానంలో జర్మనీ అధ్యక్షురాలు ఏంజెలా మార్కెల్‌ నిలిచారు. బిల్ గేట్స్‌ ఏడోస్థానంలో ఉన్నారు.


గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ప్రమాణస్వీకారం
గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ 2014 నవంబరు 8న ప్రమాణస్వీకారం చేశారు. మనోహర్‌ పారికర్‌ కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కొత్త ముఖ్యమంత్రిగా పర్సేకర్‌ను ఎంపిక చేశారు. పారికర్‌ మంత్రివర్గంలో ఉపముఖ్య మంత్రిగా ఉన్న డిసౌజా కొత్త మంత్రివర్గంలో కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. గోవాకు పర్సేకర్‌ 18వ ముఖ్యమంత్రి. 2012లో గోవాలో బిజెపి విజయకేతనం ఎగరేసిన తరవాత ఈయన మంత్రి పదవి చేపట్టారు. అప్పుడు ఆయన ఆరోగ్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన గోవా శాసనసభకు మండ్రం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత గోవా అధికార భాష కొంకణి.


వన్డేల్లో వేగంగా ఆరువేల పరుగులు సాధించిన విరాట్‌ కోహ్లి
భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌కోహ్లి వన్డేల్లో అత్యంత వేగంగా ఆరువేల పరుగులు పూర్తిచేసుకున్న అరుదైన ఘనతను 2014 నవంబరు 9న సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగులు చేయడం ద్వారా వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం విలియన్‌ రిచర్డ్స్‌ రికార్డును అధిగమించాడు. కోహ్లి 144 మ్యాచ్‌ల్లో 136 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. 1989లో వివ్‌ రిచర్డ్స్‌ 156 మ్యాచ్‌లలో 141 ఇన్నింగ్స్‌లో ఆరువేల పరుగుల మార్కును చేరుకున్నారు. వన్డే క్రికెట్‌లో ఆరువేల పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో వ్యక్తి విరాట్‌ కోహ్లి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్‌ సాధించిన 47వ క్రికెటర్‌ కూడా. 2008 ఆగస్టులో దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో విరాట్‌ కోహ్లి అరంగేట్రం చేసి మొత్తం 20 శతకాలు, 32 అర్థ శతకాలతో ఈ మైలురాయిని చేరుకున్నాడు.


కేదార్‌నాథ్‌సింగ్‌కు జ్ఞానపీఠ్‌ ప్రదానం
ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 2014 నవంబరు 10న జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందచేశారు. వాస్తవ ప్రపంచాన్ని, ఊహాజగత్తును కేదార్‌నాథ్‌ తన కవితల్లో ప్రతిబింబించారని రాష్ట్రపతి ప్రశంసించారు. కేదార్‌నాథ్‌ తన రచన ‘అకాల్‌మే సారాస్‌’ రచనకు 2013 జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన ఆధునిక హిందీ కవులలో ముఖ్యమైనవారు. 1934లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. గతంలో 1989లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. అకాల్‌మే సారాస్‌ అనగా ‘కరువులో కొంగలు’. సాహిత్యంలో అత్యున్నత పురస్కారం అయిన జ్ఞానపీఠ్‌ అవార్డును 1961లో స్థాపించారు. 1965లో మొదటిసారి మలయాళ రచయిత శంకర్‌కురూప్‌కు అందించారు. ఇప్పటివరకు 53 మందికి ఈ అవార్డు అందించారు. 2012లో తెలుగు రచయిత రావూరి భరద్వాజ్‌కు తన పాకుడురాళ్లు రచనకుగాను జ్ఞానపీఠ్‌ లభించింది. గతంలో 1970లో విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రచనకు, 1988లో సి.నారాయణరెడ్డి విశ్వంభర రచనకు జ్ఞానపీఠ్‌ అవార్డు పొందారు.


ట్రైవ్యాలి వ్యవస్థాపకురాలికి జైలు
విశ్వవిద్యాలయం పేరుతో మోసం చేసినందుకుగాను కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాలు సుసన్‌జియోపింగ్‌సూకి 16 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ విశ్వవిద్యాలయంలో చేరి వందలాదిమంది భారతీయ విద్యార్థులు తమ విద్య సంవత్సరాన్ని కోల్పోయారు. సుసన్‌ 2008లో ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి ఆన్‌లైన్‌లో ఇంజనీరింగ్‌, వైద్య, న్యాయవిద్య కోర్సులకు అవకాశం కల్పించారు. అక్రమ ఇమ్మి గ్రేషన్‌తో కోర్సులను నిర్వహిస్తున్నట్లు అమెరికన్‌ అధికారులు గుర్తించి ఆ విశ్వవిద్యాలయాన్ని మూసివేయడంతో వందలాది మంది భారతీయ విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


‘జయపూర్‌’ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని
భారత ప్రధాని నరేంద్రమోడీ 2014 నవంబరు 5న సాంసద్‌ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద వారణాసి వద్దగల జయపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. మోడీ 16వ లోక్‌సభలో వారణాసి నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారణాసికి 32 కిమీల దూరంలో ఉన్న జయపూర్‌ గ్రామం రోహానియ శాసనసభ స్థాన పరిధిలోకి వస్తుంది. ప్రధాని మోడీ 2014 నవంబరు 7న ఈ గ్రామాన్ని సందర్శించారు. 2002లో రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆదర్శ గ్రామ పథకం కింద దత్తత తీసుకొంది.


డార్జిలింగ్‌ జూకు ఎర్త్‌ హీరోస్‌ 2014 అవార్డు
డార్జిలింగ్‌లోని పద్మజానాయుడు హిమాలయన్‌ జూ పార్కు 2014 నవంబరు 1 న అంతర్జాతీయ అవార్డు ‘ది ఎర్త్‌ హీరోస్‌’ అవార్డుకు ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 300 జూపార్కులకు ఇప్పటివరకు ఈ అవార్డు లభించగా భారత్‌నుంచి ఇది మొదటిది. ఇది పశ్చిమ బెంగాల్‌లో ఉంది. హిమాలయ వృక్షజంతుజాలాన్ని కాపాడడంలో ఈ జూపార్కు ఎంతగానో కృషి చేసింది. ఈ జూపార్కును 1958లో ఏర్పాటు చేశారు. రాయల్‌ బ్యూరో ఆఫ్‌ స్కాట్లండ్‌, వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ జూస్‌ అండ్‌ అక్వేరియంస్‌ సంయుక్తంగా 2011 లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు.


కేంద్ర మంత్రివర్గ విస్తరణ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 నవంబరు 9న తన మంత్రివర్గాన్ని విస్తరించి కొత్తగా 21 మందికి స్థానం కల్పించారు. గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌కు కీలకమైన రక్షణశాఖ లభించింది. రైల్వేశాఖను మహారాష్ట్రకు చెందిన సురేశ్‌ ప్రభుకు ఆధ్వర్యంలోకి తీసుకువచ్చారు. తెలంగాణ ఎంపి బండారు దత్తాత్రేయకు స్వతంత్ర హోదాలో కార్మిక ఉపాధి శాఖ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుజనా చౌదరికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, భూ విజ్ఞానశాస్త్రాలశాఖ సహాయమంత్రి పదవి లభించింది. జగత్‌ ప్రకాష్‌ లడ్డా (హర్యానా)కు ఆరోగ్యం కుటుంబ సంక్షేమశాఖ, చౌదురి బీరేందర్‌సింగ్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, తాగునీరు పారిశుద్ధ్యశాఖను అప్పగించారు. తాజా విస్తరణతో మంత్రివర్గ సంఖ్య 66కు చేరింది. వీరిలో ప్రధాని సహా 27మంది కేంద్ర క్యాబినెట్‌ హోదాలో ఉన్నారు. 13మంది సహాయ మంత్రులకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. మిగిలిన 26 మంది సహాయ మంత్రులు.


లాడెన్‌ను తుదముట్టించింది రాబర్ట్‌ ఒనీల్‌
ఆల్‌ఖైదా అధినేత ఒసామాబిన్‌ లాడెన్‌ను తుదముట్టించిన అమెరికా నౌకదళంలోని సీల్స్‌ విభాగం కమాండ్‌ వివరాలు బహిర్గతమయ్యాయి.అతనిపేరు రాబర్ట్‌ ఒనీల్‌(38). 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లోని ఒక ఇంటిపై 23 మంది సభ్యుల సీల్స్‌ బృందం అత్యంత రహస్యంగా దాడిచేసింది. వారిలో ఒనీల్‌ లాడెన్‌ తలలోకి మూడుతూటాలు పేల్చి ప్రపంచంలో అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాదిని హతమార్చాడని సైనికవార్తల వెబ్‌సైట్‌ సాఫ్‌రెప్‌ తెలిపింది. 19 ఏళ్ల వయసులో సైన్యంలో చేరిన నీల్‌ పలుమార్లు ఇరాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ల్లో పోరాట విధులు నిర్వర్తించాడు. అతని సేవలకు 52సార్లు పురస్కారాలు దక్కాయి. సైన్యంలో మూడో అతిపెద్ద పురస్కారమైన సిల్వర్‌ స్టార్స్‌ను కూడా సాధించాడు.


నిరుపమారావుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఫెలోషిప్‌
దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంతి నేపథ్యంలో విదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమారావుకు 2014 నవంబర్‌ 12న ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ ఫెలోషిప్‌ ప్రకటించారు. ‘చరిత్ర రాజకీయాలు: భారత్‌-చైనా, 1949-1962’ ప్రాజెక్టుపై నిరుపమారావు పనిచేస్తారని జవహర్‌లాల్‌ నెహ్రూ స్మారక నిధి తెలిపింది.


సౌత్‌ కరోలినా గవర్నర్‌గా నిక్కీ హేలీ
సౌత్‌ కరోలినా గవర్నర్‌గా భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ వరసగా రెండోసారి విజయం సాధించారు. హేలీకి 57.8శాతం ఓట్లు రాగా ఆమె సమీప ప్రత్యర్థి డెమొక్రాటిస్‌ పార్టీకి చెందిన విన్సెంట్‌ షెహీన్‌కు 40శాతం కన్న తక్కువ ఓట్లు వచ్చా యి. సౌత్‌ కరోలినాకు మొదటి మహిళ గవర్నర్‌ హేలి నే. అమెరికా సెనెట్‌ మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రాతినిథ్యం వహిస్తున్న డెమొక్రాటిక్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎనిమిదేళ్లలో తొలిసారిగా రిపబ్లికన్‌ పార్టీ అమెరికా సెనెట్‌లో పట్టు సాధించింది. ప్రతినిధుల సభలోనూ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకొని మెజారిటీ దిశగా సాగుతోంది.


తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నాగిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తొలి కమిషనర్‌గా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి వి. నాగిరెడ్డిని నియమించారు. 1984బ్యాచ్‌కు చెందిన ఆయన ఇంతకు ముందు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్వస్థలం మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలంలోని పెద్దారెడ్డిపేట. రాష్ట్ర విభజన తరవాత తెలంగాణకు ప్రత్యేకంగా ఎన్నికల సంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌ను మాత్రం ఇటీవల నియమించింది.


దుబాయ్ వర్సిటీతో ఎస్‌ఆర్‌ఎం అగ్రిమెంట్‌
భారత దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ దుబాయ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ట్రాన్స్‌నేషనల్‌ ఎడ్యుకేషన్‌ను తిరగరాస్తామని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచం మొత్తం నుంచి టాలెంట్‌ ఉన్న విద్యార్థులను, ఫ్యాకల్టీని ఆకట్టుకోవడంలో యూనివర్సిటీ ఆఫ్‌ దుబాయ్కి మంచి పేరుంది. బిజినెస్‌. ఐటి రంగాలో విభిన్న ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. బిజినెస్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యావాతావరణం ఈ ఒప్పందంతో అందుబాటులోకి వస్తుందని ఎస్‌ఆర్‌ఎం వీసీ పేర్కొన్నారు. విద్యకు సంబంధించి అన్ని కోణాల్లో ఉమ్మడి లక్ష్యమైన అంతర్జాతీయకరణకు రెండు వర్సిటీలు ఇకపై కృషి చేస్తాయి. ట్విన్నింగ్‌ ప్రోగ్రామ్‌లకు తోడు క్రెడిటీ బదిలీ తదితర కార్యక్రమాలకు వీలుకల్పిస్తారు. ఆలోచనలు పంచుకుంటారు. అదేవిధంగా ఫాకల్టీ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌కూ సన్నాహాలు జరుగుతున్నాయి.


బెర్లిన్‌ గోడ కూల్చివేతకు పాతికేళ్లు
చారిత్రక బెర్లిన్‌ గోడ కూల్చివేత ఘట్టానికి 2014 నవంబరు 4 నాటికి 25 సంవత్సరాలు నిండాయి. ప్రచ్ఛన్నయుద్ధ క్రమంలో 1961లో బెర్లిన్‌ గోడను నిర్మించారు. నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం దీనిని నిర్మించింది. దీనిని నిర్మాణానికి ముందు దాదాపు 35లక్షల మంది తూర్పు జర్మన్‌ వాసులు తూర్పు బెర్లిన్‌ నుంచి పశ్చిమ బెర్లిన్‌లోకి వలస వెళ్లారు. ఈ గోడ నిర్మించిన తరవాత దీనిని దాటే ప్రయత్నంలో వందలాదిమంది మరణించారు. ఈ తరవాత రాజకీయ మార్పుల నేపథ్యంలో 1989 నవంబరు 9న తూర్పు జర్మనీలోని కమ్యూనిస్టు ప్రభుత్వం, పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులకు అనుమతినిచ్చింది. దీంతో ఆరోజున వేలమంది జర్మన్లు బెర్లిన్‌ గోడను కూల్చివేశారు. నాటి పరిమాణం జర్మనీ ఏకీకరణకు దారితీసింది.


పసుపు నుంచి కొత్త ఔషధం ఉత్పత్తి
పసుపులో ఉండే కుర్కుమిన్‌ అనే పదార్థం ఆధారంగా రూపొందించిన ఒక ఔషధం వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. మధుమేహం, గుండెజబ్బు, కీళ్లవాతం వంటి అనేక రుగ్మతల్లో ఈ వాపు తలెత్తుతుంది. కుర్కుమిన్‌ వాపుని తగ్గిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఆహారంలోని కుర్కుమిన్‌ జీర్ణాశయంలో ఉండిపోతుంది. గ్రహించిన కొద్ది భాగం కూడా త్వరగా జీవక్రియకు లోనవుతుంది. కుర్కుమిన్‌ కున్న జీవపరమైన ప్రభావాలను శరీరం మొత్తానికి అందుబాటులోకి తెస్తే అది చికిత్సకు ఉపయోగపడుతుంది.