మే - 2014 జాతీయం



మే - 1
¤ చెన్నైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఆగిన గౌహతి ఎక్స్‌ప్రెస్ (నెంబరు 12509 బెంగళూరు-గౌహతి)లో జంట బాంబు పేలుళ్లు సంభవించిన ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది గాయపడ్డారు.      » ఎస్-4, ఎస్-5 బోగీల్లో వరుసగా బాంబులు పేలాయి. ఈ దుర్ఘటనలో ఎస్-5 లో ఉన్న టీసీఎస్ ఉద్యోగిని దుర్మరణం పాలయ్యారు.¤ నల్లధనం కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సుప్రీంకోర్టు పునర్వ్యవస్థీకరించింది. ఈ బృందానికి మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎం.బి.షా ను ఛైర్మన్‌గా, జస్టిస్ అరిజిత్ పసాయత్‌ను వైస్ ఛైర్మన్‌గా నియమించింది. దేశంలోని, విదేశాల్లోని నల్లధనం కేసులకు సంబంధించి దర్యాప్తుపై సిట్ దిశానిర్దేశం చేస్తుంది.      » లోగడ సిట్‌కు ఛైర్మన్‌గా జస్టిస్ బి.పి.జీవన్‌రెడ్డిని నియమించగా, ఆ పదవిలో కొనసాగేందుకు ఆయన అశక్తత వ్యక్తం చేయడంతో, తాజా పునర్వ్యవస్థీకరణ అవసరమైంది. వైస్ ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్ షా కు ఛైర్మన్‌గా పదోన్నతి కల్పించారు.      » సిట్ పునర్వ్యవస్థీకరణతోపాటు జర్మనీలోని లీచెన్ స్టెయిన్ బ్యాంక్‌లో అక్రమంగా డబ్బు దాచడానికి సంబంధించిన 26 కేసుల్లో అన్ని పత్రాలనూ పిటిషనర్లు అయిన రామ్ జెఠ్మలానీ తదితరులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 మే - 2
¤ అసోంలోని బోడోల్యాండ్ ప్రాదేశిక పరిపాలనా ప్రాంతం (బీటీఏడీ) పరిధిలోని రెండు సమస్యాత్మక జిల్లాలైన కోక్రాఝర్, బక్సాల్లో సాయుధ తీవ్రవాదులు 23 మందిని కాల్చి చంపారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.      » ఎన్‌డీఎఫ్‌బీ-ఎస్ తీవ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు.¤ హిందువులు పవిత్రంగా భావించే ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది.      » ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లా గంగోత్రి ధామ్ వద్ద పూజలు నిర్వహించి యాత్ర ఆరంభించారు.      » బద్రీనాథ్ ఆలయ ప్రధాన పూజారిగా ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి నియమితులయ్యారు. 
 మే - 3
¤ అసోంలో ఎన్‌డీఎఫ్‌బీ - ఎస్ (నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ - సొంగ్‌బిజిత్) తీవ్రవాదులు దాడులకు తెగబడిన కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో మృతుల సంఖ్య 32కు చేరింది.      » ఈ ఘర్షణలకు బాధ్యులను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది.      » అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్.      » అసోంలో చెలరేగిన హింసతో తమకు సంబంధం లేదని ఎన్‌డీఎఫ్‌బీ - ఎస్ ప్రకటించింది. 
 మే - 4
¤ ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. సూర్యోదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు భీమశంకర్ లింగ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.      » తొలిరోజు 1,252 మంది భక్తులు దర్శించుకున్నారని, వారిలో 8 మంది విదేశీయులు కూడా ఉన్నారని ఆలయ కమిటీ వెల్లడించింది.      »  హిమాలయ పర్వత సానువుల్లో నెలకొన్న గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శనం కోసం చార్‌ధామ్ యాత్ర పేరిట ఏటా వేసవిలో యాత్రికులు భారీగా తరలి వస్తుంటారు. గత ఏడాది పెద్ద ఎత్తున సంభవించిన ఆకస్మిక వరదలు, జల ప్రళయంలో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో తొలి రోజే భారీగా భక్తులు తరలిరావడం విశేషం.¤ నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే తన సిబ్బందికి దేశీయంగా తయారు చేసిన ఇన్‌సాస్ తుపాకుల స్థానంలో అత్యాధునిక ఏకే సిరీస్ తుపాకులు అందించాలని సీఆర్‌పీఎఫ్ నిర్ణయించింది.      » వామపక్ష తీవ్రవాద ప్రాబల్య రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో విధులు నిర్వహించడానికి ఇన్‌సాస్ తుపాకుల సామర్థ్యం సరిపోవడం లేదని తేలడంతో, వాటి స్థానంలో తమ బలగాలకు ఏకే 47, 56 సిరీస్ ఆయుధాలను సీఆర్‌పీఎఫ్ అందించనుంది.      » సీఆర్‌పీఎఫ్ అధినేత దిలీప్ త్రివేది.¤ అటవీ ప్రాంతాల పరిసరాల్లో నివసించే ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజల జీవనశైలి మారుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాలపై ఆ పరిసర గ్రామస్థులు ఏ మేరకు ఆధారపడుతున్నారనే అంశాన్ని నిర్ధారించుకునే దిశగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాలనేది కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ లక్ష్యంగా ఉంది.      » కలప, వంటచెరకు, పశుగ్రాసం, ఇతర అటవీ ఉత్పత్తులపై ప్రజలు ఆధారపడుతున్న తీరును స్పష్టంగా తెలుసుకోవాలి. పేరొందిన సోషియాలజిస్టులు, ఆర్థిక నిపుణులు, సంబంధిత రంగంలో గుర్తింపు పొందిన సంస్థలకు ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించవచ్చు. అటవీ ప్రాంతాల అంచుల వెంబడి ఉన్న గ్రామాలు అంటే అడవులకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పల్లెసీమల జనాభాను ఈ అధ్యయనం నిమిత్తం ఎంపిక చేసుకుంటారు.¤ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బద్నాఘర్ బాణసంచా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 18కు చేరింది.      » మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల పరిహారం ప్రకటించింది.¤ అసోంలోని కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో ఎన్‌డీఎఫ్‌బీ-ఎస్ తీవ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది. 
 మే - 5
¤ చార్‌ధామ్ యాత్రలో చివరి క్షేత్రమైన గర్వాల్ హిమాలయాల్లోని బద్రీనాథ్ ఆలయం పునప్రారంభమైంది.      » ఆలయ ప్రధాన అర్చకుడు ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి సమక్షంలో బద్రీనాథ్ క్షేత్ర ద్వారాలను వేద మంత్రోచ్ఛారణల మధ్య తెరిచారు.      » సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉత్తరాఖండ్‌లో హిమాలయ పర్వత సానువుల్లో విష్ణుమూర్తి కొలువుదీరిన బద్రీనాథ్ ఆలయాన్ని తొలిరోజు దాదాపు 5 వేల మంది భక్తులు సందర్శించుకున్నారు.¤ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో మే ఒకటో తేదీన పేలుళ్ల ఘటనలో మృతి చెందిన గుంటూరు అమ్మాయి పరుచూరి స్వాతికి దక్షిణ రైల్వే అరుదైన గౌరవం కల్పించింది.      » స్వాతి స్మారకార్థం ఇకపై ఏటా మే నెలలో తొలి పని దినాన్ని 'స్వాతి డే' గా పాటించనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల భద్రతకు పునరంకితమవుతూ 'స్వాతి డే'ని నిర్వహిస్తామని దక్షిణ రైల్వే వెల్లడించింది.      » దక్షిణ రైల్వే కేంద్ర కార్యాలయం చెన్నైలో ఉంది.      » దక్షిణ రైల్వే ప్రస్తుత జీఎం రాకేష్ మిశ్రా.
మే - 6
¤ అవినీతి ఆరోపణలున్న ఉన్నతాధికారులను కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే సీబీఐ విచారించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.      » ఇంతవరకూ వారికి రక్షణగా ఉన్న నిబంధనలను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం అవినీతిపరులైన ప్రభుత్వోద్యోగులు ఏ స్థాయి వారైనప్పటికీ వారిని విచారించే విషయంలో ఒకేలా వ్యవహరించాలని పేర్కొంది.      » సంయుక్త కార్యదర్శి, అంతకంటే పైస్థాయి అధికారులను సీబీఐ విచారించాలంటే కేంద్రప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరన్న 'ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (డీఎస్‌పీఈఏ)'లోని సెక్షన్ 6ఎ నిబంధనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నిబంధన నేరం చేసిన వారిని కాపాడేలా ఉందని, నిష్పాక్షిక విచారణకు అది ఆటంకమవుతుందని ఈ సందర్భంగా పేర్కొంది.      » ప్రభుత్వ సర్వీసులోని స్థాయి ఆధారంగా సెక్షన్ 6ఎలో ఉన్న అధికారుల వర్గీకరణ వల్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులపై ప్రాథమిక దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది. రాజ్యాంగంలోని 14వ అధికరణం ప్రకారం సెక్షన్ 6ఎ చెల్లదని స్పష్టం చేసింది.      » 14వ అధికరణం ప్రకారం 'చట్టం' ముందు అందరూ సమానులే అనే విషయాన్ని రాజ్యాంగం పేర్కొంది.      » కీలకమైన ఈ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ లోధాతో పాటు జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఫ్.ఎం.ఐ.ఖలీఫుల్లా ఉన్నారు.¤ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాతీయ సలహామండలి (ఎన్ఏసీ) న్యూఢిల్లీలో చివరిసారిగా భేటీ అయింది.      » ఈ సమావేశం సోనియా అధ్యక్షతన జరిగింది.      » ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడంలో పౌర సమాజాన్ని భాగస్వామిని చేయడానికి ఎన్ఏసీని ఏర్పాటు చేశారు.      » ఎన్ఏసీలో సభ్యుడు కాకపోయినప్పటికీ చివరి సమావేశం కావడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్ దీనికి హాజరయ్యారు.      » ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, భూసేకరణ చట్టం లాంటి పలు ప్రతిష్ఠాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టడంలో ఎన్ఏసీ కీలకపాత్ర పోషించింది.      » ఎన్ఏసీలో మొత్తం సభ్యులు 18 మంది.¤ విద్యాహక్కు చట్టం మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదని, ఆ చట్టం వారి హక్కులను హరిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థలకు ఈ చట్టం వర్తిస్తుందని 2010లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరికాదని పేర్కొంది. అదే సమయంలో విద్యాహక్కు చట్టానికి రాజ్యాంగబద్ధత లేదని నాన్ మైనారిటీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలు చేసిన వాదనను తోసి పుచ్చింది.      » 6 - 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఉచిత విద్యాభ్యాసాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం 2009లో చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో పేద పిల్లలకు 25% సీట్లు కేటాయించాలి. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల సమాఖ్య, ముస్లిం మైనారిటీ పాఠశాలల మేనేజర్ల సంఘం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలో జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఫ్.ఎం.ఐ.ఖలీఫుల్లాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.      » ప్రాథమిక పాఠశాలల్లో బోధన మాధ్యమంగా మాతృభాష ఉండాల్సిందేనంటూ భాషాపరమైన మైనారిటీలపై ప్రభుత్వం బలవంతంగా రుద్దజాలదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు అది భంగం కలిగిస్తుందని పేర్కొంది.      » బోధన మాధ్యమంగా వారి మాతృభాషే ఉండాలంటూ భాషాపరమైన మైనారిటీలపై బలవంతంగా రుద్దే అధికారం రాజ్యాంగంలోని 350 ఎ ప్రకారం రాష్ట్రాలకు లేదని పేర్కొంది. 
 మే - 7
¤ ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లా దేవప్రయాగ సమీపంలో బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.¤ ఎడ్లను హింసకు గురిచేసే జల్లికట్టు, ఇతర బండిలాగుడు పందాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.      » ప్రభుత్వాలు, భారత జంతువుల సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) జంతువులు బాధలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్ నేతృత్వంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.      » జంతువుల పట్ల క్రూరత్వ నియంత్రణ చట్టం - 1960 లోని సెక్షన్ 3 కింద ఎడ్లకు కల్పించిన హక్కులను జల్లికట్టు నిర్వాహకులు కాలరాస్తున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.¤ ముళ్ల పెరియార్ డ్యాంకు ముప్పు ఉందంటూ 136 అడుగులకు మించి జలమట్టం పెంచరాదని కేరళ ప్రభుత్వం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. జలమట్టాన్ని 142 అడుగుల వరకు పెంచుకోవచ్చని, డ్యాంను మరింత పటిష్టం చేశాక 152 అడుగులకు పెంచుకునేందుకు తమిళనాడు రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. 120 ఏళ్ల కిందటి ఈ రాతి ఆనకట్ట భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.      » ఆనకట్ట భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్రం, తమిళనాడు, కేరళకు చెందిన ప్రతినిధులతో త్రిసభ్య కమిటీని నియమించింది. 
 మే - 10
¤ మహారాష్ట్ర పండరీపూర్‌లోని విశ్వ విఖ్యాత విఠోబా ఆలయానికి తొలిసారిగా బ్రాహ్మణేతర మహిళా అర్చకులను నియమించాలని విఠల్ రుక్మిణి ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది.      » ఈ ఆలయం తొమ్మిది వందల ఏళ్లనాటి అత్యంత పురాతనమైంది. 
 మే - 11
¤ భారత్‌కు చెందిన అత్యంత ప్రతిభావంతులైన 18 మంది విద్యార్థులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రారంభమైన ఇంటెల్ అంతర్జాతీయ సైన్సు, ఇంజినీరింగ్ ప్రదర్శన (ఐఎస్ఈఎఫ్)లో పాల్గొన్నారు.¤ వివాహ ధృవీకరణ పత్రాన్ని తత్కాల్ విధానంలో అదనపు రుసుంతో పొందే విధానాన్ని ఢిల్లీ రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టింది.      » ఈ విధానంలో రూ.10వేల రుసుం చెల్లిస్తే 24 గంటల్లోనే ధ్రువపత్రం చేతికి వస్తుంది.      » 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి వివాహ నమోదును ఢిల్లీ ప్రభుత్వం కూడా తప్పనిసరి చేసింది. వివాహం జరిగిన 60 రోజుల్లోగా వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. 
 మే - 12
¤ పోలింగ్ శాతం విషయంలో 2014 ఎన్నికలు సరికొత్త రికార్డు నెలకొల్పాయి.      » తొమ్మిది విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో సరాసరి 66.38% ఓటింగ్ నమోదైంది. దీంతో 1984 ఎన్నికల నాటి 64.04% ఓటింగ్‌ను అధిగమించింది.      » 2009 ఎన్నికల్లో 58.19% ఓటింగ్ నమోదైంది.      » 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2009 కంటే అధికంగా ఓటింగ్ నమోదైంది.      » ఎన్నికల నియమావళి అమలు కోసం ఎలక్షన్ కమిషన్ 2014 లో రూ.3,426 కోట్లు ఖర్చు చేయగా, 2009లో రూ.1,483 కోట్లు ఖర్చు చేసింది.      » లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి చివరి దశ పోలింగ్(మే 12) ముగిసే నాటికి దేశవ్యాప్తంగా రూ.313 కోట్లు జప్తు చేసినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. మొత్తం డబ్బులో ఒక్క ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ కలిపి)లోనే రూ.153 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. తర్వాత స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (రూ.28 కోట్లు), తమిళనాడు (రూ.25.6 కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ.24 కోట్లు)లు ఉన్నాయి. 
 మే - 13
¤ ప్రజా వేగుల పరిరక్షణ కోసం రూపొందించిన 'ప్రజావేగుల రక్షణ చట్టం 2011కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు.      » అవినీతి లేదా మంత్రులు సహా ప్రభుత్వ ఉద్యోగుల అధికార దుర్వినియోగంపై సమాచారం ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించే వ్యవస్థకు ఈ చట్టం అండగా ఉంటుంది. చట్టాన్ని అనుసరించి ఓ వ్యక్తి ప్రజాహితం దృష్ట్యా అవినీతి సమాచారాన్ని అధికృత సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది.      » ప్రసుత్తం అవినీతిపై ఫిర్యాదులను కేంద్ర విజిలెన్స్ కమిషన్ స్వీకరిస్తుంది. ఇలాంటి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఇతర సంస్థను కూడా నియమించవచ్చని తాజా చట్టం చెబుతోంది. అదే సమయంలో తప్పుడు ఫిర్యాదులు చేసేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.30,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.¤ మున్సిపాలిటీల ఘన వ్యర్థాలను పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) తరహా విధానంలో నిర్వహించాలని ప్రణాళికా సంఘం కార్యాచరణ బృందం సూచించింది. కె.కస్తూరి రంగన్ నేతృత్వంలోని బృందం ఈ నివేదికను ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు న్యూఢిల్లీలో సమర్పించింది. 
 మే - 15
¤ తమిళ తీవ్రవాద సంస్థ 'ఎల్‌టీటీఈ'పై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం అయిదేళ్లపాటు పొడిగించింది.      » ఎల్‌టీటీఈని 'చట్ట వ్యతిరేక సంస్థ'గా పేర్కొంటూ, దీనిపై విధించిన నిషేధాన్ని 2014 మే 14 నుంచి అయిదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.      » రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు కారణమైన ఎల్‌టీటీఈని 2009లో శ్రీలంక సైన్యం పూర్తిగా తుడిచి పెట్టేసింది.      » 1991లో భారత ప్రభుత్వం ఎల్‌టీటీఈపై నిషేధం విధించింది. 
 మే - 16
¤ దేశంలో 16వ లోక్‌సభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.      » మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 సీట్లు అవసరం. భాజాపా ఒక్కటే 282 స్థానాలు సాధించి, అధికారానికి దూసుకెళ్లింది. భాజపా 24 పార్టీలతో కలిసి 'ఎన్‌డీఏ' కూటమిగా ఏర్పడింది. ఈ కూటమికి మొత్తం 335 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. యూపీఏ మిత్రపక్షాలు మొత్తం (కాంగ్రెస్‌తో కలుపుకొని) కేవలం 59 స్థానాలకే పరిమితమయ్యాయి. ఇతరులు 149 చోట్ల గెలుపొందారు.      » 1984లో రాజీవ్‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ 417 స్థానాలు సాధించిన తర్వాత తాజాగా.. అంటే 30 ఏళ్ల తర్వాత సొంతంగా లోక్‌సభలో భాజపా స్పష్టమైన ఆధిక్యం సాధించడం విశేషం.      » వడోదర, వారణాసి రెండు నియోజక వర్గాల నుంచీ నరేంద్రమోడీ విజయ దుందుభి మోగించారు. వడోదర నుంచి 5.7 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధుసూధన్ మిస్త్రీపై గెలుపొందారు.      » ఒడిశాలో బిజూ జనతాదళ్ పార్టీ (బీజేడీ) అసెంబ్లీ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 114 సీట్లు గెలుచుకుంది. దీంతో వరుసగా నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాన్ని నవీన్ పట్నాయక్ పొందారు.      » దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను భాజపా తన ఖాతాలో వేసుకుంది. అయిదు నెలలక్రితం అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన 'ఆప్' ఇప్పుడు కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.      » లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే చరిత్రాత్మక విజయం సాధించింది. ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని ఈ పార్టీ తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు 37 చోట్ల గెలుపొంది, సత్తా చాటింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకున్న ఏకైక పార్టీగా రికార్డు సృష్టించింది. భాజపా, డీఎంకేలు ఒక్కో స్థానాన్ని పొందాయి.      » పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కూడా తిరుగులేని గెలుపు సాధించింది. మొత్తం 42 లోక్‌సభ స్థానాలకుగాను 34 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ 4 చోట్ల, భాజపా, వామపక్షాలు రెండేసి చోట్ల విజయం సాధించాయి.      » మధ్య ప్రదేశ్‌లో కూడా అధికార భాజపా లోక్‌సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 29 స్థానాల్లో 27 చోట్ల భాజపా అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తక్కిన రెండు స్థానాల్లో విజయం సాధించింది.      » రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలనూ భాజపా గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇక్కడ వసుంధర రాజే నేతృత్వంలో భాజపా అధికారంలో ఉంది.      » గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లనూ భాజపా గెల్చుకుంది. కాంగ్రెస్ గుజరాత్‌లో ఒక్కసీటునూ గెలుచుకోలేకపోవడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.

¤ 16వ లోక్‌సభలో స్వతంత్రులు కాకుండా మొత్తం 35 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది.      » లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి అతి తక్కువగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. 1952 నుంచి మొదలైన ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఇదో రికార్డు. 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 8241 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 3234 మంది స్వతంత్రులే. ఈ స్వతంత్రుల్లో ముగ్గురు విజయం సాధించగా, వారిలో ఇద్దరు కేరళకు చెందినవారు. అస్సాంలోని కోఖ్రాజర్ నుంచి పోటీ చేసిన నబకుమార్ సరానియా, కేరళకు చెందిన హాస్యనటుడు ఇన్నోసెంట్, న్యాయవాది జోయిస్ జార్జి ఈ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీలుగా నెగ్గారు. 1957లో రికార్డు స్థాయిలో 42 మంది స్వతంత్రులు లోక్‌సభకు నెగ్గారు.      » ఈ దఫా లోక్‌సభలో మహిళా నేతల సంఖ్య 61కి పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో విజేతలై చట్టసభకు వచ్చిన మహిళలు 59 మంది కాగా ప్రస్తుతం ఈ సంఖ్య 61కి చేరింది. మొత్తం 543 మంది పార్లమెంటేరియన్లలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 11 శాతమే. మిగిలిన 89 శాతానికి పురుషులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.      » ప్రస్తుత 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కేవలం 20 మంది ముస్లింలు మాత్రమే గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధికంగా ఏడుగురు, బీహార్ నుంచి నలుగురు ముస్లిం వర్గానికి చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. గత లోక్‌సభలో మాత్రం 25 మందికి పైగా ఎంపీలు ఉన్నారు.      » ప్రస్తుతం దేశంలో 1687 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో కేవలం 35 పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. దేశవ్యాప్తంగా 1652 రాజకీయ పార్టీలు సున్నా ఫలితాలను సాధించాయి. ఖాతా తెరవని ప్రముఖ పార్టీల జాబితాలో బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ), అసోం గణ పరిషత్ (ఏజీపీ) ఉన్నాయి.
 మే - 18
¤ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం 15వ లోక్‌సభను రద్దు చేయాలని కోరిన నేపథ్యంలో రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేశారు.      » భారత ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యుల జాబితాను అందజేశారు. ఈ జాబితా ఆధారంగా రాష్ట్రపతి కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తారు.¤ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ప్రయోగించిన నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ - NOTA)కు అనూహ్య స్పందన లభించింది. బరిలో నిలిచిన అభ్యర్థులపై అసంతృప్తికి ఇది అద్దం పడుతోంది.      » ఈ సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులపై ఓటర్ల అసంతృప్తి భారీగానే వెల్లడయింది. దేశవ్యాప్తంగా ఈ ఆప్షన్‌ను రికార్డు స్థాయిలో 59,97,054 మంది ఓటర్లు వినియోగించుకున్నారు.      » దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 1.1% నోటా ఓట్లే. జేడీయూ, జేడీఎస్ తదితర 21 పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే నోటా ఓట్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.      » కేంద్ర మంత్రి ఎ.రాజా బరిలో దిగిన తమిళనాడు లోని నీలగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 46,559 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఒడిషాలోని నబరంగ్‌పూర్‌లో 44,405 ఓట్లు, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నియోజకవర్గంలో 38,772 ఓట్లు, రాజస్థాన్‌లోని బాన్స్‌వారా నియోజకవర్గంలో 34,404, ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నందగావ్ నియోజక వర్గంలో 32,384 ఓట్లు నోటాకు పోలయ్యాయి.      » శాతాల వారీగా చూస్తే పుదుచ్చేరి తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ మొత్తం 22,268 నోటా ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇవి 3%.      » ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 80 నియోజక వర్గాల్లో అత్యధికంగా 5.92 లక్షల ఓట్లు నోటాకు పోలయ్యాయి. కానీ ఇవి మొత్తం పోలైన ఓట్లలో 0.7% మాత్రమే.      » ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 1,85,504 ఓట్లు నోటాకు వచ్చాయి. అత్యధికంగా అరకు పార్లమెంటరీ నియోజక వర్గంలో 16,532 ఓట్లు నమోదయ్యాయి. తక్కువగా 4,358 కాకినాడలో వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో సగటున 7,420.16 ఓట్లు నోటాకు వచ్చాయి.      » తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1,54,581 మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. అత్యధికంగా ఆదిలాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో 17,084 ఓట్లు వచ్చాయి. ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో అతి తక్కువగా 4,938 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం పరిధిలో సగటున 9,093 ఓట్లు నోటాకు వచ్చాయి.      » భాజపా ప్రధాని అభ్యర్థి మోడీ పోటీ చేసిన గుజరాత్‌లోని వడోదరాలో 18,053 నోటా ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ నోటాదే మూడో స్థానం.¤ అరుణాచల్‌ప్రదేశ్ ఎనిమిదో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత నబమ్ టుకి ప్రమాణ స్వీకారం చేశారు.      » ప్రస్తుత ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపిన ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.      » రాష్ట్ర రాజధాని ఇటానగర్ లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్భయ్ శర్మ ఆయనతో ప్రమాణం చేయించారు.      » నబమ్ టుకి అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల గ్రామం ఒంపులిలో 1964 జులై 7న జన్మించారు. 
 మే - 19
¤ బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జీతన్ రాం మాంఝీ (68) నియమితులయ్యారు. ముఖ్యమంత్రి పదవికి మాంఝీ పేరును మాజీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సూచించారు.      » అత్యంత వెనుకబడిన 'ముసాహర్' కులానికి చెందిన మాంఝీ బాల్యంలో కొన్నేళ్లపాటు వెట్టిచాకిరీ కార్మికుడిగా ఉన్నారు. దాన్నుంచి బయటపడిన అనంతరం విద్యావంతుడై, చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. వివిధ పార్టీల్లో ఉన్న తర్వాత 1980లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రిగా నియమితులయ్యారు.      » 1990లో ఆర్జేడీలో చేరి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ ప్రభుత్వంలో ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005లో జేడీ (యూ) లో చేరి నితీష్‌కుమార్ వెన్నంటి నడిచిన మాంఝీ ఆయన మంత్రివర్గాల్లో పనిచేశారు.      » ముఖ్దంపూర్ ఎమ్మెల్యేగా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గయ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 
 మే - 20
¤ న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో నరేంద్ర మోడీని భాజపా పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. భాజపా సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ప్రధాని పదవికి నరేంద్ర మోడీ పేరును ప్రతిపాదించగా, నేతలు హర్షం ప్రకటించారు.      » ఎన్డీయే కూటమిలోని 29 పక్షాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.      » ఎల్.కె.అద్వానీ నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మోడీని ఎన్డీయే కూటమి నేతగా ఎన్నుకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో మోడీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ఆహ్వానించారు. మోడీని ప్రధానిగా నియమిస్తూ రాష్ట్రపతి లేఖ అందించారు.¤ బీహార్ ముఖ్యమంత్రిగా జీతన్ రాం మాంఝీ ప్రమాణ స్వీకారం చేశారు.      » పాట్నాలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాంఝీతో గవర్నర్ డి.వై.పాటిల్ ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులుగా మరో 17 మంది ప్రమాణ స్వీకారం చేశారు.¤ జమ్ము కాశ్మీర్‌లో రాంబన్ జిల్లాలోని డిగ్డోల్ వద్ద 400 అడుగుల లోయలో బస్సు పడిపోయిన ఘటనలో 17 మంది మృతి చెందారు.
 మే - 21
¤ దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన భూకంపం ప్రజలను ఆందోళనకు గురి చేసింది.      » దేశంలో తూర్పు, ఉత్తర ప్రాంతాలకు చెందిన పలు చోట్ల, ఢిల్లీ, చెన్నైలలో భూమి తీవ్రంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది.      » పారాదీప్‌కు తూర్పు దిశగా బంగాళాఖాతంలో 60 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.      » ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రలో భూకంప తీవ్రత కనిపించింది. విశాఖపట్నంలోని చాలా ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.¤ పన్నెండేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసిన నరేంద్రమోడీ ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. తన మంత్రివర్గ రాజీనామాను గవర్నర్ కమలా బేణీవాల్‌కు సమర్పించారు.      » 2001 అక్టోబరు 7 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.      » మోడీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ వాజూవాలాకు రాజీనామా లేఖ సమర్పించారు.      » అహ్మదాబాద్‌లోని మణినగర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు.      » నరేంద్రమోడీ స్థానంలో భాజపా శాసనసభ పక్ష నేతగా ఆనంద్‌బెన్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.¤ ఒడిశా ముఖ్యమంత్రిగా బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు.      » ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్‌తో రాష్ట్ర గవర్నర్ ఎస్.సి.జమీర్ భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. నవీన్‌తో పాటు 11 మంది క్యాబినెట్ మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.      » నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి పదవిని వరుసగా నాలుగుసార్లు చేపట్టినట్లయింది.¤ పవన్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ శ్రీనివాస్ పాటిల్ గాంగ్‌టక్‌లోని రాజ్‌భవన్‌లో పవన్ చామ్లింగ్‌తో ప్రమాణం చేయించారు.      » పవన్ చామ్లింగ్ అయిదోసారి సిక్కిం ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించారు.      » పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎన్డీఎఫ్) ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 32 శాసనసభ స్థానాల్లో 22 సీట్లు గెలుచుకుంది.      » సిక్కిం సంస్థానం 1975లో భారత్‌లో విలీనమైంది. 1994 నుంచి 20 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి చామ్లింగే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా 23 ఏళ్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న దివంగత జ్యోతిబసు రికార్డును చామ్లింగ్ త్వరలో అధిగమించనున్నారు.¤ భారత దేశ నూతన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సార్క్ దేశాల అధిపతులకు ఆహ్వానం పంపారు.      » ఒక భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధిపతులను ఆహ్వానించడం ఇదే ప్రథమం. ఈనెల 26న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా సార్క్ దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, భూటాన్, నేపాల్, మాల్దీవుల దేశాధినేతలకు భారత విదేశాంగ శాఖ ఆహ్వానాలు పంపింది.
 
మే - 22 
¤ గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతోపాటు 20 మంది మంత్రులతో గవర్నర్ కమలా బేణీవాల్ గాంధీనగర్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ మంత్రివర్గంలో నలుగురు కొత్తవారు. మోడీ మంత్రివర్గంలోని ముగ్గురికి ఈ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు.      » ఆనందిబెన్ పటేల్ మోడీ కంటే ఎక్కువగా మంత్రిత్వ శాఖలను నిర్వహించనున్నారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా, 10 మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు ఆనందిబెన్ పటేల్ 13 శాఖలను తనవద్దే అట్టిపెట్టుకున్నారు. 
మే - 23 
¤ 67వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఒకే ఒక భారతీయ చిత్రం 'తిత్లి' సందడి చేసింది.      » కను భెల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణవీర్ షోరే, అమిత్ సియల్ నటించారు. శశాంక్ అరోరా ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయమయ్యారు. 
మే - 24 
¤ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ తిరిగి ఎన్నికయ్యారు. 1998 నుంచి సీపీపీకి సోనియా సారథ్యం వహించడం ఇది అయిదోసారి.¤ మీడియా రంగంలో తలెత్తుతున్న పరిణామాలపై లా కమిషన్ ఒక అధ్యయన పత్రాన్ని వెలువరించింది.      » ఒపీనియన్ పోల్స్, చెల్లింపు వార్తలు, మీడియా నియంత్రణ, సామాజిక మీడియా వినియోగం లాంటి అంశాలపై ఒక విధానాన్ని రూపొందించడానికి వీలుగా ఈ పత్రాన్ని తయారు చేశారు.      » మనదేశంలో మీడియా విస్తృతం కావడంపై ఒక వైపు హర్షం ప్రకటిస్తూనే, కొత్త సవాళ్లపై దృష్టి సారించింది.      » మీడియా స్థాయి పెరుగుతున్న కొద్దీ చెల్లింపు వార్తలు, నకిలీస్టింగ్ ఆపరేషన్లు, మీడియా తానే సొంతంగా విచారణ చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛను అతిక్రమించడం లాంటివి పెరుగుతున్నాయని పేర్కొంది.¤ నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ నేత టి.ఆర్.జెలియాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులతో గవర్నర్ అశ్వినికుమార్ కోహిమాలోని రాజభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.
మే - 26 
¤ భారత 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ న్యూఢిల్లీలోని రైసినాహిల్స్‌లోని రాష్ట్రపతి భవన్ ముందుభాగంలోని విశాల ప్రాంగణంలో నరేంద్ర మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు.      » ఒకనాటి సాదాసీదా చాయ్‌వాలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రభుత్వాధినేత సింహాసనాన్ని అధిష్టించారు.      » 45 మంది మంత్రులతో నరేంద్ర మోడీ భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారత రాజకీయాల్లో 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరింది.      » 45 మంది మంత్రుల్లో 23 మందికి క్యాబినెట్, 10 మందికి స్వతంత్ర హోదా, 12 మందికి సహాయ మంత్రుల హోదాను కల్పించారు.      » తెదేపా నుంచి అశోక్ గజపతి రాజుకు క్యాబినెట్‌లో చోటు కల్పించారు.      » నరేంద్ర మోడీతో ప్రారంభమైన ప్రమాణ స్వీకారం జార్ఖండ్ ఎంపీ సుదర్శన్ భగత్‌తో ముగిసింది.      » సార్క్ సమావేశాల్లో మినహాయించి, బయటెక్కడా కలవని సార్క్ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలంతా ఒక్కచోటికి చేరి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్త రంగు, హంగు తీసుకొచ్చారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూం, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, భూటాన్ ప్రధాని లియోంచెన్ త్సేరింగ్ తాబ్గే హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తరపున ప్రతినిధిగా స్పీకర్ షిరిన్ చౌధురి హాజరయ్యారు. సార్క్ దేశ అగ్రనేతలతో పాటు మారిషెస్ ప్రధాని నవీన్ రాంచంద్ర గులామ్ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను, ప్రభుత్వాధినేతలను ఆహ్వానించడం ఇదే తొలిసారి.      » రాష్ట్రపతి భవన్‌లోని పచ్చిక మైదానంలో ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. 1990లో చంద్రశేఖర్, 1998లో వాజ్‌పేయి ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేశారు.భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివరాలు పూర్తి పేరు: నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జననం: 1950 సెప్టెంబరు 17, వాద్‌నగర్, మోహ్‌సానా జిల్లా, గుజరాత్. విద్య: గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పీజీ. తల్లిదండ్రులు: దామోదర్ దాస్ మూల్‌చంద్ మోడీ, హీరాబెన్. వీరి ఆరుగురు సంతానంలో మూడోవ్యక్తి నరేంద్ర మోడీ. కౌమార దశలో మోడీ తన సోదరుడితో కలిసి టీస్టాల్ నడిపారు. చాలా చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్‌లో సభ్యుడిగా చేరారు. విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో పూర్తి స్థాయి ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా మారారు. భార్య: జశోదాబెన్. 1968లో మోడీ వివాహం జరిగింది. రాజకీయ నేపథ్యం: 1995లో అయిదు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా, భాజపా జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో భాజపా ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2001 అక్టోబరులో గుజరాత్ సీఎంగా పదవిని చేపట్టేవరకూ ఈ బాధ్యతలను నిర్వహించారు.      » 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.      » 45 మంది సభ్యుల నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు స్థానం లభించింది. నిర్మలా సీతారామన్ మినహా మిగిలిన ఆరుగురు మహిళలకు క్యాబినెట్ హోదా ఇచ్చారు. వీరిలో నజ్మా హెప్తుల్లా, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమా భారతి, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, స్మృతి జుబిన్ ఇరానీలు ఉన్నారు. నిర్మలా సీతారామన్‌కు సహాయమంత్రి (స్వతంత్ర హోదా) పదవిని ఇచ్చారు.      » మోడీ మంత్రి వర్గంలో అతిపిన్న, అతిపెద్ద వయసున్న మంత్రులిద్దరూ మహిళలే. 38 ఏళ్ల స్మృతి ఇరానీ అతిపిన్న వయసున్న మంత్రి. 74 ఏళ్ల నజ్మాహెప్తుల్లా అందరికంటే పెద్ద వయసున్న మంత్రి.కేంద్ర మంత్రివర్గ స్వరూపంనరేంద్ర మోడీ: ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం, అన్ని ముఖ్య విధానపర నిర్ణయ అంశాలు, మంత్రులకు కేటాయించని ఇతరత్రా అన్ని శాఖలు.క్యాబినెట్ మంత్రులు:

 రాజ్‌నాథ్ సింగ్: హోం వ్యవహారాలు. సుష్మా స్వరాజ్: విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు. అరుణ్ జైట్లీ: ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు, రక్షణ. ఎం.వెంకయ్యనాయుడు: పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ దారిద్య్ర నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు. నితిన్ జయరాం గడ్కరీ: రహదారి రవాణా, జాతీయ రహదారులు, నౌకాయానం. డి.వి.సదానంద గౌడ: రైల్వే. ఉమాభారతి: జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ. నజ్మాహెప్తుల్లా: మైనారిటీ వ్యవహారాలు. గోపీనాథ్ రావ్ ముండే: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం. రాం విలాస్ పాశ్వాన్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ. కల్‌రాజ్ మిశ్రా: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. మేనకా సంజయ్ గాంధీ: స్త్రీ, శిశు సంక్షేమం. అనంత కుమార్: రసాయనాలు, ఎరువులు. రవిశంకర్ ప్రసాద్: కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా అండ్ జస్టిస్. పూసపాటి అశోక్ గజపతి రాజు: పౌర విమానయానం. అనంత్ గీతే: భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్: ఆహార శుద్ధి, పరిశ్రమలు. నరేంద్రసింగ్ థోమర్: గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి. జుయల్ ఓరం: గిరిజన వ్యవహారాలు. రాధామోహన్ సింగ్: వ్యవసాయం. తావర్ చంద్ గెహ్లోత్: సామాజిక న్యాయం, సాధికారికత. స్మృతి జుబిన్ ఇరానీ: మానవ వనరుల అభివృద్ధి. హర్షవర్థన్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం.సహాయం - స్వతంత్ర హోదా జనరల్ వి.కె.సింగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి (స్వతంత్ర హోదా), విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు. రావ్ ఇందర్‌జిత్ సింగ్: ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్వతంత్ర హోదా), రక్షణశాఖ. సంతోష్ గంగ్వార్: జౌళి (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ. శ్రీపాద యశోనాయక్: సాంస్కృతికం, పర్యాటకం (స్వతంత్ర హోదా). ధర్మేంద్ర ప్రదాన్: పెట్రోలియం, సహజ వాయువులు (స్వతంత్ర హోదా). శర్బానంద సోనోవాల్: నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యువజన వ్యవహారాలు, క్రీడలు (స్వతంత్ర హోదా). ప్రకాష్ జవదేకర్: సమాచార - ప్రసారాలు, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు. పీయూష్ గోయల్: విద్యుత్, బొగ్గు, నూతన, సాంప్రదాయేతర ఇంధనం (స్వతంత్ర హోదా) జితేందర్ సింగ్: శాస్త్ర-సాంకేతికం (స్వతంత్ర హోదా), భౌగోళిక శాస్త్రాలు (స్వతంత్ర హోదా), పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుఇంధనం, అంతరిక్ష వ్యవహారాలు. నిర్మలా సీతారామన్: వాణిజ్యం - పరిశ్రమలు (స్వతంత్ర హోదా), ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు.సహాయ మంత్రులు జి.ఎం.సిద్ధేశ్వర: పౌర విమానయానం. మనోజ్ సిన్హా: రైల్వే. నిహాల్‌చంద్: రసాయనాలు, ఎరువులు. ఉపేంద్ర కుష్వాహా: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం. పొన్ రాధాకృష్ణన్: భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు. కిరణ్ రిజిజు: హోం. క్రిషన్ పాల్: రహదారి రవాణా, జాతీయ రహదారులు, నౌకాయానం. సంజీవ్‌కుమార్ బాల్‌యాన్: వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు మన్‌సుఖ్ భాయ్ ధాన్‌జీ భాయ్ వసావా: గిరిజన వ్యవహారాలు. రావ్ సాహెబ్ దాదారావ్ దాన్వే: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ. విష్ణుదేవ్ సాయ్: గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి. సుదర్శన్ భగత్: సామాజిక న్యాయం, సాధికారికత. 
మే - 27 
¤ నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి అడుగులోనే అవినీతిపై యుద్ధం ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే నల్లధనం వెలికితీత పై తన సంకల్పాన్ని చాటుకుంది.      » భారతీయ సంపన్నులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.      » సిట్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.షా ఛైర్మన్‌గా, సుప్రీంకోర్టు మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ ఉప ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
 మే - 28 
¤ జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణంపై వివాదం మరింత రాజుకుంది. ఈ అధికరణాన్ని రద్దు చేసే అంశంపై జమ్మూకాశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామంటూ ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది.      » దీనిపై ఇప్పటికే నిరసన వ్యక్తం చేసిన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన విమర్శలను తీవ్రతరం చేశారు. భారత్‌లో జమ్మూకాశ్మీర్ విలీనాన్ని ఆమోదించిన రాజ్యాంగ సభను తిరిగి ఏర్పాటు చేస్తే గానీ 370వ అధికరణాన్ని రద్దు చేయటం కుదరదని, అది జరగడం అసాధ్యమని ఒమర్ పేర్కొన్నారు.¤ 16వ లోక్‌సభకు ప్రొటెంస్పీకర్‌గా కాంగ్రెస్ సభ్యుడు కమల్‌నాథ్ ఎంపికయ్యారు. 16వ లోక్‌సభలో అందరికంటే ఆయనే సీనియర్. కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నియోజక వర్గం నుంచి తొమ్మిదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.¤ భారత 14వ అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి (జి.ఇ.వాహనవతి స్థానంలో) ఎంపికయ్యారు. 
మే - 29 
¤ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు.      » ప్రధాని మోడీ వడోదరతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి గెలుపొందారు. నిబంధనల ప్రకారం రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థి ఫలితాలు వెలువడిన 14 రోజుల్లో ఒక స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వడోదర స్థానానికి మోడీ రాజీనామా చేశారు.      » వడోదర స్థానంలో మోడీ అయిదు లక్షలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. అయినా, ఇకపై వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగనున్నారు.      » సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కూడా తాను గెలుపొందిన రెండు స్థానాల్లో ఒకదాన్ని వదులుకున్నారు. ములాయం మెయిన్‌పురి, అజంగఢ్‌ల నుంచి గెలుపొందారు. ఆయన మెయిన్‌పురి వదులుకుని అజంగఢ్ నుంచి కొనసాగనున్నారు. 
మే - 30 
¤ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన నరేంద్ర మోడీ జీవిత ప్రస్థానం, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలను ప్రాథమిక పాఠశాల స్థాయి పాఠ్యాంశాల్లో చేర్చేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, మోడీ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 
మే - 31 
¤ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోఎం, ఈజీవోఎం ల వ్యవస్థలను ఎన్‌డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. మొత్తం 21 మంత్రుల బృందాల (జీవోఎం)ను తొమ్మిది మంత్రుల సాధికార బృందాల (ఈజీవోఎం)ను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారు.      » ఈజీవోఎంలు, జీవోఎం ల ముందు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇకపై సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిర్ణయాలు తీసుకుంటాయని పీఎంవో వెల్లడించింది.      » అవినీతి, అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలు, పరిపాలనా సంస్కరణలు, టెలికాం, గ్యాస్ ధరలు లాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ బృందాలను ఏర్పాటు చేసింది.¤ దేశ రాజధాని ఢిల్లీలో గాలి దుమారం జన జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. గంటకు 75 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీచాయి. గాలితోపాటు ఇసుక తుపానులా రావడంతో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్ - నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో 14 మంది మృత్యువాత పడ్డారు.