¤ ఈ ఏడాది ఛార్‌దామ్ యాత్ర ప్రారంభానికి గుర్తుగా అక్షయ తృతీయ సందర్భంగా మే 2న హిమాలయాల్లోని గంగోత్రి ఆలయ ద్వారాలను మధ్యాహ్నం 12 గంటలకు తెరవాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. » యమునోత్రి ఆలయ ద్వారాలను కూడా అదే రోజు తెరవాలని నిర్ణయించినప్పటికీ సమయాన్ని మాత్రం ఖరారు చేయలేదు.
¤ సంక్షేమం, సంస్కరణల్లో సొంత ముద్రను ప్రతిఫలించేలా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. సామాన్య ప్రజల నుంచి పారిశ్రామిక వర్గం వరకు ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేలా తాము పాలన అందిస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయం, యువతకు శిక్షణ, ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశవిదేశాల నుంచి వచ్చిన లక్షల సూచనలను పరిగణనలోకి తీసుకుని తయారుచేసినట్లు మేనిఫెస్టో రూపకర్త మురళీమనోహర్ జోషీ ప్రకటించారు. దేశ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ 'ఏక్‌భారత్... శ్రేష్ఠభారత్' పేరుతో తయారుచేసిన 42 పేజీల ఎన్నికల వాగ్దానపత్రాన్ని భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, ఇతర అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, ఎల్.కె.అద్వానీ, సుష్మాస్వరాజ్, మురళీమనోహర్‌జోషీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. భాజపా సంప్రదాయ హామీలైన అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, రాజ్యాంగంలోని 370వ అధికరణ తొలగింపు అంశాలనూ ఇందులో చేర్చారు.
| ¤ తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురలో జరిగిన ఈ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. తొలి దశలో భాగంగా అసోంలోని అయిదు నియోజకవర్గాల్లో, త్రిపురలోని ఓ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు. పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 85 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోంలోని అయిదు నియోజకవర్గాల్లో 76 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. | |
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...
అందరికీ అందుబాటులో మెరుగైన ఆరోగ్య సేవలు
జాతీయ ఆరోగ్య హామీ మిషన్ (నేషనల్ హెల్త్ అస్యూరెన్స్ మిషన్) ఏర్పాటు
ప్రతి రాష్ట్రానికి ఎయిమ్స్ తరహా ఆసుపత్రి
యోగా, ఆయుష్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ నిధుల కేటాయింపు
అత్యవసర వైద్యసేవలు అందించే 108ని దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తేవడం
ధరల స్థిరీకరణ నిధి
స్వతంత్ర, వ్యూహాత్మక అణు కార్యక్రమం
ప్రతి ఎకరాకూ నీరు అందించే లక్ష్యంతో 'ప్రధానమంత్రి గ్రామ సించయీ యోజన' ఏర్పాటు
స్వతంత్ర, వ్యూహాత్మక అణు కార్యక్రమం
రాష్ట్రాల అభివృద్ధికోసం 'ప్రత్యేక ప్రాంతీయ మండళ్ల' ఏర్పాటు
దేశాన్ని ఏకం చేసే విధంగా హైస్పీడ్ డిజిటల్ హైవేల ఏర్పాటు
దేశవ్యాప్తంగా 100 కొత్త నగరాల అభివృద్ధి.
¤ లోక్‌సభ ఎన్నికల నిర్వహణ వ్యయం తొలి ఎన్నికలతో పోల్చితే 80 రెట్లకు పైగా పెరిగిందని కేంద్రం ప్రకటించింది. 1952లో నిర్వహించిన మొదటి లోక్‌సభ ఎన్నికలకు రూ.10.45 కోట్లు ఖర్చవగా, 2009లో ఎన్నికలకు రూ.846.66 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. 1991లో రూ.359 కోట్లు, 1996లో రూ.597 కోట్లు, 1998లో రూ.666 కోట్లు, 1999లో రూ. 947 కోట్లు, 2004లో రూ. 1,113 కోట్లు ఖర్చయింది. అయితే ఇలా ప్రతి దఫా పెరుగుతు వస్తోన్న నిర్వహణ వ్యయం 2009లో రూ.846.66 కోట్లకే పరిమితమైందని తెలిపింది. » లోక్‌సభ ఎన్నికలకయ్యే వ్యయాన్ని కేంద్రప్రభుత్వం; శాసనసభ ఎన్నికల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు ఖర్చును ఇవి రెండు 50 : 50 శాతం భరిస్తాయి. కేవలం లోక్‌సభకు ఎన్నికలు జరిగినప్పటికి శాంతిభద్రతలు కాపాడటానికి చేసే ఖర్చు మాత్రం సంబంధిత రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. » ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు చేయనున్న ఖర్చు రూ. 5000 కోట్లకు పైగా ఉంటుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది.
| ¤ ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలు కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల ద్వారాలను మే 4, 5 తేదీల్లో తెరవనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తెలిపారు. ఈ క్షేత్రాలతో పాటు గంగోత్రి, యమునోత్రిలను దర్శించుకునేందుకు చేసే చార్‌ధామ్ యాత్ర మే 2 నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ యాత్రకు రోజు వెయ్యి మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. |
|
| » హిమాలయ పర్వతశ్రేణులో సాగే ఈ యాత్రలో భక్తులకు సరైన భద్రతను కల్పించడంలో భాగంగా యాత్రికుల సంఖ్యను కుదించారు. |
» గతేడాది సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా చార్‌ధామ్ వెళ్లే దారులు చాలా వరకు ధ్వంసమైన నేపథ్యంలో భక్తులు ప్రయాణంలో గందరగోళానికి గురవకుండా సూచనలు ఇవ్వడానికి యాత్రాబృందాలపై పర్యవేక్షణ ఉంటుంది.
| ¤ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో ఆధారం కింద తన పాస్‌పోర్టు ప్రతిని అమెరికా కోర్టుకు సమర్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాకరించారు. వ్యక్తిగత భద్రత, గోప్యతలో భాగంగా భారత ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేదని ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశారు. |
|
ఏప్రిల్ - 9
|
| ¤ రెండో దశ కింద మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరు లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అస్సాం, నాగాలాండ్ మధ్య సరిహద్దు తగాదా వల్ల నాగాలాండ్‌లోని లడాయ్‌గఢ్ పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ నిర్వహించలేక పోయారు. నాగాలాండ్‌లో 81.47 శాతం పోలింగ్ నమోదవగా, మణిపూర్‌లో 80 శాతం, మేఘాలయలో 71 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 55 శాతం నమోదయినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. |
ఏప్రిల్ - 12
|
| ¤ ఏడు రాష్ట్రాల్లో 64 లోక్‌సభ స్థానాలకు మే 7న జరిగే ఎనిమిదో దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దశలో విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని 15 స్థానాలకు, బీహార్‌లో ఏడు స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు, జమ్మూ కాశ్మీర్‌లో రెండు, ఉత్తరాఖండ్‌లో అయిదు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. » మూడు రాష్ట్రాల్లోని 41 స్థానాలకు చివరి, తొమ్మిదో దశ ఎన్నికలు మే 12న జరుగుతాయి.¤ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, బస్తర్ జిల్లాల్లో ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న ఒక బస్సుతో పాటు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన ఘటనల్లో ఏడుగురు ఎన్నికల సిబ్బంది, ఆరుగురు జవాన్లు సహా మొత్తం 15 మంది మరణించారు. |
ఏప్రిల్ - 13
|
| ¤ కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహించే సరిహద్దు రక్షణదళం (సశస్త్ర సీమాబల్ - ఎస్ఎస్‌బీ)లో యువ మహిళా అధికారులను చేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. » నేపాల్, భూటాన్‌తో ఉన్న భారత సరిహద్దుల రక్షణలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోనికి 25 ఏళ్లలోపు యువతులను నేరుగా అసిస్టెంట్ కమాండర్ స్థాయి అధికారులుగా చేర్చుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. » ఇప్పటివరకు సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ దళాల్లోనే మహిళా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ బలగాల్లో మాత్రం ఇప్పటికీ మహిళలకు అవకాశం లేదు. » సరిహద్దు భద్రతాదళాల్లో రెండో అతిపెద్దదిగా ఎస్ఎస్‌బీ గుర్తింపు పొందింది. » ఎస్ఎస్‌బీలో 2007 నుంచీ మహిళలను జూనియర్ ర్యాంక్ క్యానిస్టేబుళ్లుగా నియమిస్తున్నారు. కమాండింగ్ అధికారులుగా మహిళలకూ అవకాశమివ్వాలనే ప్రతిపాదన ఎంతోకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. |
ఏప్రిల్ - 14
|
¤ దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ విద్యా రుణాలపై వడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. » ఈ పథకం వల్ల రుణం తీసుకున్న తొమ్మిది లక్షల మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. వీరికి రూ.2,600 కోట్ల వడ్డీ మాఫీ కానుంది. » ఫిబ్రవరి 17న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి చిదంబరం ఈ పథకాన్ని ప్రకటించారు. ¤ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 123 వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. » అంబేద్కర్ జయంతిని సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తారు. |
ఏప్రిల్ - 15
|
| ¤ హిజ్రా (ట్రాన్స్‌జెండర్)లకు హక్కులు కల్పిస్తూ, సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. » ఇప్పటివరకూ అధికారికంగా లింగ వర్గీకరణ విషయంలో స్త్రీలు, పురుషులు అనే కేటగిరీలు మాత్రమే ఉండగా, హిజ్రాలకు మూడో కేటగిరీ కింద చట్టబద్ధమైన గుర్తింపును సుప్రీంకోర్టు మంజూరు చేసింది. » హిజ్రాలను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలుగా గుర్తించి, విద్యాసంస్థల్లో, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి వీలు కల్పిస్తూ, వారు ఎదుర్కొంటున్న భయం, సిగ్గు, సామాజిక ఒత్తిడి, కుంగుబాటు, అపవాదు వంటి సమస్యలను తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. » కొతీ, అరవాణీ, జోగప్ప, శివ-శక్తి, కొజ్జా తదితర పేర్లతో కూడా వ్యవహరించే హిజ్రాలు ఎదుర్కొంటున్న వివక్ష అనూహ్యమని, వారు కూడా ఈ దేశ పౌరులేనని, స్త్రీ-పురుషులకు ఉన్నట్లే రాజ్యాంగం ప్రకారం వారికీ అన్ని హక్కులూ ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సి ఉందని న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.కె.సిక్రీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. » రాజ్యాంగంలోని మూడో భాగం కింద, పార్లమెంట్, శాసనసభలు చేసిన చట్టాల కింద లింగ నిర్ధారణలో స్త్రీ, పురుష వ్యత్యాసంతో (బైనరీ జెండర్) పాటు హిజ్రాలను లింగ నిర్ధారణలో మూడో కేటగిరీ వ్యక్తుల కింద సుప్రీంకోర్టు ప్రకటించింది. » నేపాల్, పాకిస్థాన్ సహా పలు దేశాలు హిజ్రాల హక్కులను గుర్తించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. హిజ్రాలను పంజాబ్ ప్రభుత్వం పురుషులుగా గుర్తించడం చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది. » తమ తీర్పు కేవలం హిజ్రాలకు మాత్రమే పరిమితమని, స్వలింగ సంపర్కులు (గే, లెస్బియన్), ద్విలింగ సంపర్కులు (బై సెక్సువల్) వంటి వారికి వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వారిని కూడా సాధారణంగా ట్రాన్స్‌జెండర్ అని పిలుస్తుండటంతో సుప్రీంకోర్టు ఈ వివరణ ఇచ్చింది. » ట్రాన్స్ జెండర్ వ్యక్తులను లింగ నిర్ధారణలో మూడో కేటగిరీగా గుర్తించాలంటూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.¤ కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు తమ చిన్నారుల సంరక్షణకు రెండేళ్లపాటు సెలవును పొందే వీలుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సంతానానికి సంబంధించిన పరీక్షలు, అనారోగ్యం వంటి అవసరాలకూ ఈ సెలవును వాడుకోవచ్చని వివరించింది. » '43-సి నిబంధన పరిశీలించిన మీదట 18 ఏళ్ల లోపు వయసున్న మైనర్ సంతానాన్ని కలిగిన ప్రభుత్వ ఉద్యోగిని గరిష్ఠంగా 730 రోజుల సీసీఎల్‌ను ఆమె సర్వీసు కాలంలో ఉపయోగించుకోవచ్చ'ని సుప్రీం పేర్కొంది. |
ఏప్రిల్ - 16
|
| ¤ దేశ ఎన్నికల ప్రక్రియను పరిశీలించడంతో పాటు ఎన్నికల నిర్వహణపై శిక్షణ పొందేందుకు 19 దేశాల నుంచి సీనియర్ అధికారులు న్యూఢిల్లీ చేరుకున్నారు. » ఈ కార్యక్రమంలో భూటాన్, కాంగో, ఎల్‌సాల్వడార్, ఇథియోపియా, జార్జియా, ఘనా, కిర్గిస్థాన్, లెబనాన్, లెసోతో, మలేషియా, మాల్దీవులు, పాలస్తీనా, సియెర్రాలియోన్, దక్షిణ సూడాన్, శ్రీలంక, సూడాన్, తజికిస్తాన్, టాంజానియా,, యెమెన్ దేశాలకు చెందిన 30 మంది అధికారులు ఎన్నికల నిర్వహణపై శిక్షణ పొందుతున్నారు. » విదేశాంగ మంత్రిత్వశాఖ చేపట్టిన 'భారత సాంకేతిక, ఆర్థిక సహకారం (ఐటీఈసీ)'లో భాగంగా సభ్యదేశాలకు గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.¤ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ తారలు నటించిన సినిమాలను దూరదర్శన్‌లో ప్రసారం చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. » ఎన్నికల కోడ్ అమలవుతున్న కాలంలో లోక్‌సభ బరిలో ఉన్న నటుల సినిమాలను దూరదర్శన్‌లో ప్రసారం చేయడాన్ని ఈసీ నిషేధించింది.¤ దేశ రాజధానిలో వివాహ నమోదును తప్పనిసరి చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. » వివాహమైన అరవై రోజుల్లోగా వివాహ నమోదును తప్పనిసరిగా చేసుకోవాలని, లేదంటే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించింది.¤ ఇంతవరకు దేశవ్యాప్తంగా నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయిన స్థానాలకు సంబంధించిన ఓటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. » మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 111 స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అందులో చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం, లక్ష్వద్వీప్‌లలో మహిళల ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. » గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఎన్నికలు జరిగిన 111 స్థానాల్లో సగటు ఓటింగ్ శాతం 68.29గా నమోదైంది. 2009లో ఇది 60.39 శాతంగా ఉంది. » మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే నాగాలాండ్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనా, 2009 ఎన్నికలతో పోల్చినపుడు తక్కువగానే ఉంది. నాగాలాండ్‌లో అత్యధికంగా 88.57% (2009లో 90.22%) నమోదైంది. లక్షద్వీప్‌లో 86.79%, త్రిపురలో 84.90% ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2009లో త్రిపురలో 86.25% ఓటింగ్ జరగ్గా, ఈసారి తగ్గింది.నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగిన మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ శాతం.. సిక్కిం (80.96), అరుణాచల్ ప్రదేశ్ (76.9), గోవా (76.83), కేరళ (74.02), ఛండీగఢ్ (73.57), హర్యానా (71.86), అండమాన్ నికోబార్ (70.77), మేఘాలయ (69.03), ఢిల్లీ (65.09), మిజోరాం (61.70). |
ఏప్రిల్ - 17
|
| ¤ దేశవ్యాప్తంగా అయిదో దశ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. 12 రాష్ట్రాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. » తొమ్మిది విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో తాజాగా జరిగిన అయిదో దశే అతిపెద్దది. 121 స్థానాలకు, 1,769 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. |
ఏప్రిల్ - 19
|
| ¤ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 'సర్వే ఆఫ్ ఇండియా' కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల సర్వేను ప్రారంభించింది. » మొదటి రోజు కర్ణాటకలోని మలపన గుడి, విఠలాపురం గ్రామాల హద్దులను గుర్తించారు. » 50 ఏళ్ల క్రితం మద్రాస్ ప్రభుత్వంలో రెండు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించినట్లు ఆనవాళ్లున్నాయి. అనంతరం ఇరు రాష్ట్రాల సరిహద్దును చెరిపివేసి, అక్రమంగా గనుల తవ్వకాలకు పాల్పడినట్లు సమాజ పరివర్తన సమితి, మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వే ప్రారంభించినట్లు 'సర్వే ఆఫ్ ఇండియా' ప్రకటించింది. » మే చివరిలోగా ప్రక్రియను పూర్తి చేసి సుప్రీంకోర్టుకు నివేదించనున్నట్లు 'సర్వే ఆఫ్ ఇండియా' పేర్కొంది. |
ఏప్రిల్ - 21
|
| ¤ గోవాలో అన్ని ఖనిజాల తవ్వకంపై తన ఆదేశాల ప్రకారం 18 నెలలుగా కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ఎత్తేసింది. » ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వుకోవడానికి అనుమతించింది. మైనింగ్‌పై తను నియమించిన నిపుణుల కమిటీ తుది నివేదిక ఇచ్చేంతవరకు తవ్వకాలపై గట్టి నియంత్రణ ఉంచాలని జస్టిస్ ఎ.కె.పట్నాయక్ నేతృత్వంలోని హరిత ధర్మాసనం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు, గోవా ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. |
ఏప్రిల్ - 22
|
| ¤ దేశంలోని రహదారులు మృత్యు మార్గాలని తేలిందని, తక్షణమే నివారణ చర్యలను చేపట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. » రహదారి భద్రత, పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే చర్యలను పర్యవేక్షించడానికి న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. » రహదారుల భద్రతకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించే ప్రభుత్వ విభాగాలన్నీ మూడు నెలల్లోగా ప్రాథమిక నివేదికలను ఈ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది.¤ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం-1989 కింద 2001-12 మధ్య దేశంలో 1.22 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటములు అధికారంలో ఉన్నాయి. » ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ 2001-12 మధ్య దేశవ్యాప్తంగా ఈ చట్టం కింద నమోదైన కేసుల్ని విశ్లేషించింది. » జాతీయ నేర సమాచార గణాంక (NCRB) నివేదికల ఆధారంగా ఈ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 2001లో అత్యధికంగా 13,113 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. 2009, 2010 సంవత్సరాల్లో తప్ప మిగిలిన సంవత్సరాల్లో ఇవి పెరుగుతూనే ఉన్నాయి.¤ ఆరేళ్లుగా సాగుతున్న రోహిత్ శేఖర్ పితృత్వ కేసును ఢిల్లీ హైకోర్టు పరిష్కరించింది. ఆయన కన్న తండ్రి, కాంగ్రెస్‌నేత ఎన్.డి.తివారీయేనని తేల్చి చెప్పింది. ఈ వాస్తవాన్ని బహిరంగంగా తిరస్కరించరాదని తివారీకి స్పష్టం చేసింది. డీఎన్ఏ పరీక్ష ఫలితం, రోహిత్ తన కూమారుడేనంటూ తివారీ ఇటీవల చేసిన అంగీకార ప్రకటనపై పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ మేరకు ఉత్తర్వు ఇస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. |
ఏప్రిల్ - 23
|
| ¤ ఇప్పటివరకూ విమానంలో ప్రయాణించేటప్పుడు పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల (పీఈడీ) వాడకం నిషిద్ధం. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విమాన ప్రయాణ సమయంలో వినియోగించడానికి వీలుండదు. » ఎలక్ట్రానిక్ పరికరాలను 'ప్లైట్ మోడ్'లోకి మార్చి ప్రయాణంలో వాడుకునే విధంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా నిబంధనల్లో మార్పులు చేసింది. » ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లైట్ మోడ్‌లోకి మారిస్తే, నెట్‌వర్క్‌తో అనుసంధానం తెగిపోతుంది. దీనివల్ల పరికరంలో లోడ్‌చేసి ఉన్న ఆటలు, పాటలు, సినిమాలు మొదలైన కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. ప్రయాణంలో సమయం వృథా కాకుండా ఇ-మెయిళ్లు మొదలైనవి రాసుకుని, నెట్‌లో పంపడానికి సిద్ధం చేసుకోవచ్చు. » ఈ మార్పు కోసం దీర్ఘకాలంగా విమానయాన సంస్థలు కోరుతున్నాయి. |
ఏప్రిల్ - 24
|
| ¤ దేశవ్యాప్తంగా ఆరోవిడత కింద 12 రాష్ట్రాల్లోని 117 సీట్లకు పోలింగ్ జరిగింది. తమిళనాడులోని అన్ని స్థానాలకు ఈ విడతలో ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. దాదాపు 73% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. » ఈ విడతలో దాదాపు అన్ని చోట్లా గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు 349 చోట్ల పోలింగ్ ప్రక్రియ పూర్తయినట్లయింది. » తమిళనాడులోని మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 39. పుదుచ్చేరిలోని ఒకే ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన పోలింగ్‌లో 83% ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.¤ జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన ఘటనలో 8 మంది మృతి చెందారు.¤ కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న అమూల్యమైన సంపదను తనిఖీ (ఆడిటింగ్) చేయించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. » ఈ తనిఖీ ప్రక్రియకు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ నేతృత్వం వహించాలని పేర్కొంది. » తిరువనంతపురం జిల్లా న్యాయమూర్తి సారథ్యంలో ఆలయం కార్యనిర్వాహక కమిటీని కొత్తగా ఏర్పాటు చేసింది. జిల్లా న్యాయమూర్తి హిందువు కాకపోతే, తదుపరి సీనియర్ న్యాయమూర్తి ఈ కమిటీకి నేతృత్వం వహించాలని సూచించింది. |
ఏప్రిల్ - 25
|
| ¤ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఏడుగురు దోషులకు విధించిన జీవిత ఖైదును మాఫీ చేయడానికి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. అదే సమయంలో వారి విడుదలకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ, తాము జారీ చేసిన మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. » ఈ ఏడుగురు దోషులకు శిక్షను మాఫీ (రెమిషన్) చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఈ అంశానికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు ఏడు ప్రశ్నలను రూపొందించింది. ఇలాంటి అంశం కోర్టు ముందుకు రావడం ఇదే మొదటిసారని పేర్కొంది. దీని ప్రభావం విస్తృత స్థాయిలో ఉండొచ్చని అందువల్ల దీనిపై మరింత సాధికార తీర్పు అవసరమని వివరించింది. » 'ఇలాంటి అంశం మొదటిసారిగా కోర్టు ముందుకొచ్చింది. రెమిషన్ అధికారాన్ని ప్రయోగించడానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిధిని నిర్థారించడంలో ఈ కేసు ప్రభావం చూపుతుంది. అందువల్ల 72వ అధికరణ కింద (రాష్ట్రపతి ద్వారా) లేదా 161వ అధికరణ కింద (గవర్నర్ ద్వారా) లేదా 32వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టు శిక్షను తగ్గించాక, మళ్లీ రెమిషన్ ఇచ్చే అంశాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ పరిశీలించవచ్చా? అనే అంశాన్ని తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తున్నాం' అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 'ఒక దోషికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన నేపథ్యంలో శిక్షాకాలం పూర్తి కాకుండానే దాన్ని మాఫీ చేస్తూ, ఖైదీని విడుదల చేయవచ్చా? అనేదానిపై రాజ్యాంగ ధర్మాసనం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది' అని పేర్కొంది. » రాజీవ్ హత్య కేసులో దోషులకు పడ్డ మరణశిక్షను సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 18న జీవిత ఖైదుగా మార్చింది. మరుసటి రోజే తమిళనాడులోని జయలలిత సర్కారు వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే మురుగన్, శాంతన్, అరివు అనే ముగ్గురు దోషుల విడుదల ఆదేశాలపై ఫిబ్రవరి 20న సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రభుత్వ నిర్ణయంలో విధానపరమైన లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత మిగతా నలుగురు దోషులైన నళిని, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌ల విడుదలపై కూడా స్టే విధించింది. |
ఏప్రిల్ - 27
|
| ¤ మన దేశంలో ఉన్న ఏకైక గొరిల్లా 'పొలో' మైసూరు జంతు ప్రదర్శనశాలలో మరణించింది. » వృద్ధాప్య సమస్యలు, శ్వాస సంబంధమైన ఇబ్బందులతో 'పొలో' మరణించినట్లు జూ అధికారులు ప్రకటించారు. » 1995లో డబ్లిన్ జూ (ఐర్లాండ్) నుంచి 'పొలో భారత్‌కు వచ్చింది. |
ఏప్రిల్ - 28
|
| ¤ దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో రాష్ట్రపతి నిర్ణయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించరాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. » క్షమాభిక్ష మంజూరు అనేది సార్వభౌమాధికారానికి ప్రతీక. అందుకే, ఈ ప్రత్యేకాధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించరాదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రప్రభుత్వం పేర్కొంది.¤ భాజపా ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 1,591 పోలింగ్ బూత్‌లలోనూ సీసీ టీవీల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. » ఒక నియోజకవర్గం మొత్తానికి ఈ విధంగా చేయడం దేశంలోనే తొలిసారి. దేశంలో ఉన్న 543 లోక్‌సభ నియోజకవర్గాలకు అన్ని పోలింగ్ బూత్‌లలో సీసీటీవీ లు ఉన్న ఏకైక స్థానం, మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించబోతున్న ఒకేఒక్క స్థానం వడోదర అవుతుంది. » ఏప్రిల్ 30న ఇక్కడ పోలింగ్ జరుగుతుంది.¤ సుప్రీంకోర్టు, హైకోర్టుల సిట్టింగ్ న్యాయమూర్తుల బంధుమిత్రులు, సన్నిహితులు ఆ న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తున్న కోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయకుండా నిషేధించాలనే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది. » ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాది ఎం.ఎల్.శర్మ దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసింది. |
ఏప్రిల్ - 29
|
| ¤ కేంద్ర ప్రభుత్వం ఏట్టకేలకు నల్లధనం కేసుల్లో 18 మంది నిందితుల పేర్లను సుప్రీంకోర్టుకు సమర్పించింది. వీరంతా లిచెన్‌స్టెయిన్‌లోని ఎల్‌జీటీ బ్యాంక్‌లో అక్రమ సొమ్మును దాచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ఆదాయ పన్ను శాఖ ప్రాసిక్యూషన్ మొదలు పెట్టినట్లు కేంద్రం తెలిపింది. » జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, జస్టిస్ మదన్ బి లోకుర్ తో కూడిన ధర్మాసనం ఎదుట కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. » ఈ జాబితాలో అంబ్రునోవా ట్రస్టు, మెర్లైన్ మేనేజ్‌మెంట్‌కు చెందిన మోహన్ మనోజ్ ధుపేలియా, అంబరీష్ మనోజ్ ధుపేలియా, భవ్య మనోజ్ ధుపేలియా, మనోజ్ ధుపేలియా, రూపాల్ ధుపేలియాల పేర్లు ఉన్నాయి. మానిచి ట్రస్టుకు చెందిన హస్ముఖ్ ఈశ్వర్‌లాల్ గాంధీ, చింతన్ హస్ముఖ్ గాంధీ, మధు హస్ముఖ్‌గాంధీ, దివంగత మిరావ్ హస్ముఖ్ గాంధీల పేర్లను కేంద్ర ప్రస్తావించింది. రువిష ట్రస్టుకు చెందిన చంద్రకాంత్ ఈశ్వర్‌లాల్ గాంధీ, రాజేష్ చంద్రకాంత్ గాంధీ, విరాజ్ చంద్రకాంత్ గాంధీ, ధనలక్ష్మి చంద్రకాంత్ గాంధీల పేర్లను తెలిపింది. ఇంకా డయనీష్ స్టిఫ్టంగ్ అండ్ డ్రయేడ్ సతీఫ్‌టన్ఫ్ ట్రస్టుకు చెందిన అరుణ్‌కుమార్ రమ్నిక్‌లాల్ మెహతా, వెబ్‌స్టార్ ఫౌండేషన్‌కు చెందిన కె.ఎం.మామెన్, ఉర్వశి ఫౌండేషన్‌కు చెందిన అరుణ్‌కొచ్చర్, రాజ్ ఫౌండేషన్‌కు చెందిన అశోక్ జైపూరియాల పేర్లు ఉన్నాయి. » కేంద్రం సమర్పించిన పత్రాల్లోని అంశాలను తాము చర్చించుకుని మే ఒకటో తేదీన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ధర్మాసనం తెలిపింది. » ఎల్‌జీటీ బ్యాంక్‌లో డబ్బు దాచిన ఖాతాదారుల వివరాలు జర్మన్ అధికారుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి 2009లో అందాయి. దీనికి సంబంధించి, ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం వేశారు. ఎల్‌జీటీ బ్యాంక్ ఖాతాదారుల్లో దర్యాప్తు పాక్షికంగా లేదా సంపూర్ణంగా పూర్తయిన కేసుల్లో పేర్లను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. ఇందుకు స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని దాదాపు మూడేళ్ల కిందటే ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం ఆదేశాలను అమలు చేసింది.¤ అత్యాచార కేసుల విచారణలో జాప్యాన్ని నివారించడంలో భాగంగా బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులకు బదులు నేరుగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌లే నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. » 'విచారణాధికారులు బాధితురాలిని వీలైనంత వేగంగా సమీపంలోని మహిళా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా మహిళా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేయించాలి' అని జస్టిస్ జ్ఞాన్‌సుధా మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లకపోతే అందుకు కారణాలను విచారణాధికారి కేస్ డైరీలో నమోదు చేయాలని, దాని ప్రతిని మేజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది.¤ దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. » ఉత్తర ఢిల్లీ మేయర్‌గా యోగేందర్ చందోలియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » తూర్పు ఢిల్లీ మేయర్‌గా మీనాక్షి తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. » దక్షిణ ఢిల్లీ మేయర్‌గా ఖుషీరాం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. » ఢిల్లీలోని మూడు మేయర్ స్థానాలనూ భాజపా అభ్యర్థులే కైవసం చేసుకున్నారు.¤ కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌పై కేంద్రం ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మధ్య వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆస్ట్రేలియా హైకోర్టు మాజీ న్యాయమూర్తి మైఖేల్ హుడ్‌సన్ మెక్‌హ్యూను ఇండిపెండెంట్ ఆర్బిట్రేటర్, త్రిసభ్య ఆర్బిట్రల్ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా నియమించింది. » ఆస్ట్రేలియా న్యూసౌత్‌వేల్స్ కోర్టు మాజీచీఫ్ జస్టిస్ జేమ్స్ స్పిగెల్‌మ్యాన్‌ను సుప్రీంకోర్టు గతంలో వివాద పరిష్కారానికి నియమించగా, కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలియజేసిన నేపథ్యంలో స్పిగెల్ మ్యాన్ స్థానంలో తాజాగా మైఖేల్ హుడ్‌సన్ మెక్ హ్యూను నియమించింది.¤ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి నూతన విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. » ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) ద్వారా వేసిన ఓటును సరిచూసుకునే అవకాశాన్ని కల్పించారు. » ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న దేశంలోని ఏడు నియోజక వర్గాల్లో గాంధీనగర్ కూడా ఒకటి. » ఈ విధానంలో ఈవీఎంలకు వీవీపీఏటీ వ్యవస్థను జత చేస్తారు. ఓటు వేసిన వెంటనే ఇది రసీదు ముద్రిస్తుంది. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోగానే ఆ లావాదేవీకి సంబంధించిన వివరాలతో రశీదు వచ్చినట్లే ఇది కూడా ముద్రించిన కాపీ ఇస్తుంది. ఓటరు పేరు, నియోజకవర్గం, పోలింగ్ బూత్ వివరాలతో పాటు ఏ పార్టీకి ఓటు వేశారో కూడా అందులో ఉంటుంది. » సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు జవాబుదారీతనం, పారదర్శకత కోసం ఈసీ ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది.¤ ఉత్తరాఖండ్‌లో కనీసం 23 ప్రతిపాదిత విద్యుత్ ప్రాజెక్టులను రద్దు చేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. » గతేడాది ఉత్తరాఖండ్‌ను మరుభూమిగా మార్చిన వరదలకు ఆ రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాలు కొంతమేరకు కారణమని కమిటీ వెల్లడించింది. |
ఏప్రిల్ - 30
|
| ¤ ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 నియోజక వర్గాలకు ఏడోదశ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 14 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. » రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 81.35% పోలింగ్ నమోదయింది. జమ్మూకాశ్మీర్‌లో అత్యల్పంగా 25.62% నమోదైంది. » ఈ దశతో కలిపి మొత్తం 438 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయినట్లయింది. » తెలంగాణాలోని 17 లోక్‌సభ స్థానాల్లో 73.1% పోలింగ్ నమోదైంది. మొత్తం పది జిల్లాల్లో సుమారు 73.1% పోలింగ్ నమోదైంది. తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు 119 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించారు. » తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 83% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువగా సుమారు 53% పోలింగ్ నమోదైంది. » తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.82 కోట్లు కాగా, సుమారు 2.10 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు.ఏడో దశలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు: ఉత్తర ప్రదేశ్ (14 స్థానాలకు ఎన్నిక నిర్వహించారు), బీహార్ (7), గుజరాత్ (26), పంజాబ్ (13), పశ్చిమబెంగాల్ (9), తెలంగాణ (17), జమ్మూకాశ్మీర్ (1), డామన్-డయ్యూ (1), దాద్రా నగర్ హవేలి (1).¤ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆడిటోరియంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రిపై స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు.¤ ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ప్రణాళికా సంఘం సభ్యులతో జరిగిన వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు.¤ దేశవ్యాప్తంగా 1,080 మంది భక్తులకు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే అవకాశం లభించింది. వీరిని కంప్యూటర్ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. » మొత్తం 1,080 మంది భక్తులను 60 మంది చొప్పున 18 బృందాలుగా విభజించారు. » జూన్ 12 నుంచి సెప్టెంబరు 9 వరకు ఈ తీర్థయాత్ర కొనసాగనుంది. » భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి సుజాతాసింగ్. |
|
|