మే - 2
|
¤ పురుషుల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో రెండో స్థానంలో ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్‌ను వాసన ద్వారా పసిగట్టే ఎలక్ట్రానిక్ ముక్కును ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
» ఇది మూత్రం నమూనాలను విశ్లేషించడం ద్వారా వ్యాధి ఆనవాళ్లను పట్టేస్తుంది. 'ఈ నోస్' అనే ఈ పరికరం మూత్రం పైనున్న ప్రాంతాన్ని 'వాసన చూడటం' ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ ప్లేసియా (బీపీహెచ్)కు మధ్య ఉన్న తేడాలను అత్యంత కచ్చితత్వంతో పసిగడుతుంది.
» ప్రస్తుతం వాడుకలో ఉన్న డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (పీఎస్ఏ) అనే రెండు విధానాల్లో ఎన్నో పరిమితులు ఉన్నాయి. అల్ట్రాసౌండ్ సాయంతో నిర్వహించే బయాప్సీలు ఖరీదైనవి కావడంతోపాటు, రోగికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
» 'ఈ నోస్'లో సెన్సర్లతో కూడిన సమూహం ఉంటుంది. మూత్రం నమూనాను ఈ పరికరానికి వాసన చూపినప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రొఫైల్ సిద్ధమవుతుంది. ప్రాథమిక పరీక్షల్లో ఇది విజయవంతంగా ప్రోస్టేట్ క్యాన్సర్లను గుర్తించినట్లు తేలింది.
¤ ఉబ్బసం రోగులకు ఎముక క్షీణత ముప్పు ఎక్కువగా ఉంటుందని దక్షిణ కొరియాలోని సియోల్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ రుగ్మత కారణంగా ఎముక ఖనిజ సాంద్రత తగ్గుతుందని వెల్లడైంది. |
మే - 4
|
¤ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉంటున్న వ్యోమగాములు అంతరిక్షంలో కూరగాయలను పండించేందుకు వీలుగా వెజ్జీ అనే 'ప్లాంట్ పిల్లో'లను భూమి నుంచి ఐఎస్ఎస్‌కు తరలించారు.
» దీన్ని ఉపయోగించి ఈ ఏడాది చివర్లోగా వ్యోమగాములు మొక్కలను సాగు చేయనున్నారు. ఫలితంగా కక్ష్యలోనే పండించిన పంటను తినే అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకూ వ్యోమగాములు భూమి నుంచి పంపిన ఆహారాన్ని తింటున్నారు.
¤ కెనడా శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం స్మార్ట్ ఫోన్‌ను తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ చూడటానికి ఫోన్‌లాగే ఉన్నా దీన్ని తెరిస్తే దాంట్లో ఉండే మూడు తెరలు (డిస్‌ప్లేలు) విచ్చుకుని ల్యాప్‌టాప్‌గా మారిపోతుంది.
» ఈ తెరలను ఫోన్‌తో అనుసంధానించుకోవచ్చు. లేదంటే, విడిగా కూడా పెట్టుకోవచ్చు. ప్రతీ డిస్‌ప్లేనూ దేనికదే విడిగా నోట్‌బుక్‌లా మడవటానికి వీలయ్యే మ్యాప్‌లాగా వాడుకోవచ్చు. మూడింటినీ కలిపి అనుసంధానించి ఒకటిగా ఉపయోగించుకోవచ్చు. దీనికి వీలుగా ఫోన్‌లో కమాండ్స్ ఉంటాయి.
» ఈ స్మార్ట్ ఫోన్‌కు 'పేపర్ ఫోల్డ్' అని పేరు పెట్టారు.
» ఈ 'పేపర్ ఫోల్డ్'ను టొరంటోలో జరిగిన సాంకేతిక ప్రదర్శనలో ఆవిష్కరించారు.
¤ రోజూ తీసుకునే ఓ కప్పు కాఫీ మూలంగా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని కార్నెల్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
» కాఫీలోని 'క్లోరోజెనిక్ యాసిడ్' (సీఎల్ఏ) అనే అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిండెంట్ మూలంగా రెటీనా ఆరోగ్యకరంగా ఉంటుంది. మధుమేహం, గ్లకోమా, వార్ధక్యం వంటి కారణాల వల్ల రెటీనా బలహీనపడుతుంది. కొంతకాలం తర్వాత మెల్లగా క్షీణించడం మొదలవుతుంది. కాఫీ తీసుకోవడం వల్ల ఈ సమస్య తీవ్రత బాగా తగ్గుతుందని తాము ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.
» అత్యంత సున్నితమైన పొరలాంటి రెటీనాకు అత్యధిక స్థాయిలో ప్రాణవాయువు అవసరం. ఆక్సిజన్ సరిగా అందకుంటే రెటీనా బలహీనపడుతుంది. అందుకే, రోజువారీ కనీసం ఒక కప్పు కాఫీ అయినా తీసుకుంటే కంటికి మంచిదని పరిశోధకులు పేర్కొన్నారు.
¤ మానవ మెదడును నమూనాగా తీసుకుని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 'న్యూరోగ్రిడ్' అనే సర్క్యూట్ బోర్డును తయారు చేశారు.
» ఐపాడ్ సైజులో ఉన్న ఈ బోర్డులో 16 న్యూరో కోర్ చిప్‌లు ఉన్నాయి. మెదడులో 10 లక్షల నాడీకణాలు, వందల కోట్ల సర్క్యూట్లంత వేగంగా ఈ చిప్‌లు పనిచేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
» ఈ బోర్డు కంప్యూటర్ కంటే 40 వేల రెట్లు తక్కువ విద్యుత్‌తో, 9 వేల రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోబోటిక్స్, కంప్యూటింగ్ రంగాల్లో కీలక మార్పులకు ఇది నాంది పలకనుందని భావిస్తున్నారు.
¤ నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకులు వర్షపాతాన్ని కొలిచే సరికొత్త స్మార్ట్ గొడుగును తయారు చేశారు.
» సాధారణంగా వర్షపాతం ఎంత నమోదైందో తెలుసుకోవడానికి రెయిన్ గేజ్‌పై ఆధారపడాలి. కానీ, ఇకపై వర్షం పడుతున్న సమయంలో ఈ గొడుగును వేసుకుని రోడ్డెక్కితే వర్షపాతం వివరాలను తెలుసుకోవచ్చు.
» నెదర్లాండ్స్‌లోని డెల్ట్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు రోల్ఫ్ హట్ ఈ స్మార్ట్ గొడుగును రూపొందించాడు. సెన్సార్లతో కూడిన ఈ గొడుగు తనపై పడిన నీటి బిందువుల తీవ్రతను లెక్కించి వివరాలను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌కు అందిస్తుంది.
¤ మనిషి మెదడును మరింత బాగా అర్థం చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.600 కోట్ల) వ్యయంతో నూతన కార్యక్రమాన్ని చేపట్టింది.
» మనుషుల జ్ఞాపకాలను తిరిగి తెప్పించే ఒక మెమొరీ స్టిములేటర్‌ను ఈ కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించాలని నిర్ణయించారు.
» డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డార్పా-DARPA) శాస్త్రవేత్తలు దీన్ని రూపొందిస్తున్నారు.
» ప్రస్తుతం వ్యక్తులను గుర్తు పట్టడం, సంఘటనలు, విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం వంటి నిర్ణయాత్మక జ్ఞాపకాలను కోల్పోతే తిరిగి తెప్పించడం సాధ్యం కావడం లేదు. అయితే మొదడులో జ్ఞాపక శక్తి ఏర్పడటం, నిర్వహణ, నిక్షిప్తానికి సంబంధించిన హిప్పోకాంపస్ భాగాన్ని ఇలాంటి పరికరాలతో ప్రేరేపిస్తే నిర్ణయాత్మక జ్ఞాపకాలనూ తిరిగి తేవచ్చని డార్పా పరిశోధకులు వెల్లడించారు.
¤ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు భారత్ తొలిసారిగా అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణి పరీక్ష దిగ్విజయంగా జరిగింది.
» పశ్చిమ సెక్టార్‌లోని ఒక నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి ఈ పరీక్ష జరిగింది. ఈ క్షిపణికి 'బియాండ్ విజువల్ రేంజ్' (బీవీఆర్) సామర్థ్యం ఉంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దీన్ని రూపొందించింది.
» భారత్ తొలిసారిగా దేశీయంగా రూపొందించిన బీవీఆర్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అయిన అస్త్ర అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పని చేస్తుంది. గగనతలంలో సుమారు 20 కి.మీ. నుంచి 80 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఇది ధ్వంసం చేస్తుంది.
» త్వరలో అస్త్ర క్షిపణికి వాస్తవ లక్ష్య ఛేదన పరీక్ష నిర్వహించనున్నట్లు, ఈ తర్వాత స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో అమర్చనున్నట్లు డీఆర్‌డీవో చీఫ్ అవినాష్ చందర్ ప్రకటించారు.
» 'అస్త్ర' ప్రయోగం కోసం సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, వైమానిక దళ నిపుణులు మార్పులు చేపట్టారు.
» ఈ క్షిపణికి సంబంధించి మరింత మెరుగైన మార్క్-2 వెర్షన్‌ను ఈ ఏడాది చివర్లోగా పరీక్షించాలని డీఆర్‌డీవో నిర్ణయించింది. |
మే - 5
|
¤ శాంతా బయోటెక్నిక్స్‌కు చెందిన చిన్న పిల్లలకు ఇచ్చే పెంటా వాలెంట్ టీకా మందు 'శాన్ 5'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 'ప్రి క్వాలిఫికేషన్' హోదా లభించింది. దీని వల్ల యునిసెఫ్ తరఫున అమలయ్యే వైద్య సేవల కార్యక్రమాలకు ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసే అవకాశం శాంతా బయోటెక్నిక్స్‌కు దక్కుతుంది. అంతేకాకుండా దాదాపు 50 అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ టీకా మందును అందించే అవకాశం ఏర్పడుతుంది.
» చిన్న పిల్లల్లో వచ్చే అయిదు రకాలైన వ్యాధులను (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హిబ్, హెపటైటిస్-బి) నివారించేందుకు శాన్ 5 దోహదపడుతుంది. దీన్ని ఇంజక్షన్ రూపంలో పిల్లలకు మూడు డోసుల్లో ఇస్తారు. వాస్తవానికి 2010 వరకు శాంతా బయోటెక్నిక్స్‌కు పెంటావాలెంట్ వ్యాక్సిన్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి ప్రి క్వాలిఫికేషన్ హోదా ఉంది. కానీ, తరువాత చిన్న సమస్య వల్ల (సెడిమెంటేషన్) దాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ సమస్యను అధిగమించి, ఇప్పుడు మళ్లీ ఆ హోదాను సంపాదించింది.
¤ స్వీడన్ శాస్త్రవేత్తలు గుండెపోటును నిరోధించే వ్యాక్సిన్‌ను తయారు చేశారు. పోలియో, ధనుర్వాతం రాకుండా చిన్నారులకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇప్పుడు హెపటైటిస్ వ్యాక్సిన్లు పెద్దలకూ ఇస్తున్నారు. ఇదే కోవలో గుండెపోటును నిరోధించే వ్యాక్సిన్‌ను రూపొందించారు.
» స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వ్యాక్సిన్‌తో గుండెపోటు వచ్చే ముప్పు 70% దాకా తగ్గిపోతుంది.
» ఈ పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్త బి.సంజీవి కూడా పాల్గొన్నారు. |
మే - 7
|
¤ అంతరిక్షంలోని సుదూర ప్రాంతంలో నక్షత్రాలు, పాలపుంతల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో పరిభ్రమిస్తున్న అతి చిన్న న్యూట్రాన్ నక్షత్రాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకూ గుర్తించిన న్యూట్రాన్ నక్షత్రాల్లో ఇదే అతి చిన్నది అని వారు ప్రకటించారు.
» అంతరిక్షంలోని ఇతర వస్తువులతో పోలిస్తే న్యూట్రాన్ నక్షత్రాలు అతి చిన్నవి. న్యూట్రాన్ నక్షత్రాల్లో కొన్నింటిని 'పల్సర్లు'గా పిలుస్తారు.
» తాజాగా గుర్తించిన న్యూట్రాన్ నక్షత్రానికి 'బి 0834 ప్లస్ 06 ఆర్' అని పేరు పెట్టారు.
» ఈ పరిశోధనకు కర్టిన్ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా)కి చెందిన జీన్‌పెర్రీ మెక్ క్వార్ట్ నేతృత్వం వహించారు. |
మే - 9
|
¤ సూర్యుడు పుట్టిన వాయు, ధూళి మేఘం నుంచే ఆవిర్భవించిన ఓ నక్షత్రాన్ని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
» మనకు 110 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న హెర్య్కూలెస్ నక్షత్ర మండలంలో ఈ కొత్త నక్షత్రం ఉంది.
» 'హెచ్‌డీ 162826' అని పేరు పెట్టిన ఈ నక్షత్రం మన సూర్యుడి కంటే 15 రెట్లు పెద్దగా ఉంది. భానుడికి తోబుట్టువును కనుక్కోవడం ఇదే తొలిసారి.
» ఇవాన్ రమిరెజ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు.
¤ జపాన్‌కు చెందిన 'టోక్యోఫ్లాష్' కంపెనీ 'కిసాయ్ నైట్ విజన్ ఉడ్‌వాచ్' పేరిట చెక్కతో సరికొత్త వాచీని రూపొందించింది. |
మే - 11
|
¤ విమానాల్లో ఉపయోగించే జెట్ ఇంధనం ధర భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల విధానాల్లో దీన్ని కృత్రిమంగా తయారు చేయాలనే ఐరోపా శాస్త్రవేత్తల కళ ఫలించింది.
» శాస్త్రవేత్తలు సౌరశక్తి, నీరు, కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉపయోగించి తొలిసారిగా 'హరిత' జెట్ ఇంధనాన్ని తయారుచేశారు. ఉష్ణ రసాయన ప్రక్రియ ద్వారా గాఢ సౌరశక్తిని ఉపయోగించి ఈ ఘనత సాధించారు.
» ఈ ఇంధనానికి సోలార్ కిరోసిన్ అని పేరు పెట్టారు. తాము రూపొందించిన 750 లీటర్ల సిన్ గ్యాస్‌ను జ్యూరిచ్ నుంచి ఆమ్‌స్టర్ డ్యామ్‌కు తరలించి అక్కడ షెల్ సంస్థకు చెందిన పరిశోధన కేంద్రంలో సౌర సిన్ గ్యాస్‌ను కిరోసిన్‌గా మార్చారు. |
మే - 12
|
¤ ఊహలను నియంత్రించి నిద్రపోవడానికి వీలు కల్పించే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ (యాప్)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
» 'మై స్లీప్ బటన్' అనే ఈ యాప్ నిద్రకు అంతరాయం కలిగించే ఆలోచనలను నియంత్రించడమే కాకుండా, నిద్రకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తుంది.
» కెనడాలోని సైమన్ ఫ్రేజర్ వర్సిటీకి చెందిన అధ్యయనకర్త లూక్ బ్యూడోయిన్ అభివృద్ధి చేసిన 'అవగాహన పునర్వ్యవస్థీకరణ' విధానం ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది.
¤ ప్రపంచంలోనే పూర్తిగా విద్యుత్‌తో నడిచే తొలి విమానం ఫ్రాన్స్‌లోని ఓ విమానాశ్రయంలో విజయవంతంగా పైకెగిరింది. » ఈ విమానాన్ని 'ఇ-ఫ్యాన్'గా పిలుస్తున్నారు. » ఇది 19 అడుగుల పొడవుంటుంది, 120 లిథియం-ఇయాన్ పాలిమర్ బ్యాటరీలతో పనిచేస్తుంది.
¤ సిడ్నీలో ఆస్ట్రేలియా దంపతులకు అరుదైన లక్షణాలతో అవిభక్త కవలలు జన్మించారు. వారిద్దరి శరీరం ఒకటే అయినప్పటికీ అచ్చంగా ఒకే పోలికలతో ముఖాలు ఉన్నాయి. వారిద్దరికీ కలిపి చిత్రమైన ఆకృతిలో ఒకే పుర్రె ఉన్నప్పటికీ, రెండు మెదళ్లూ వేర్వేరుగా ఉన్నాయి. » ఈ కవలలకు 'లిటిల్ అస్సీ ఫైటర్స్' అని వైద్యులు పేరు పెట్టారు. వారి తల్లిదండ్రులు మాత్రం ఆ చిన్నారులిద్దరికీ హోప్, ఫెయిత్ అని పేర్లు పెట్టారు. |
మే - 13
|
¤ సూర్యుడి ఉపరితలంపై చతురస్రాకారంలో ఒక అరుదైన రంధ్రం వెలుగు చూసింది. సౌరమండలం నుంచి శరవేగంగా సౌర వాయువులు దూసుకొస్తున్న ప్రాంతంలో ఈ కరోనల్ రంధ్రం ఏర్పడిందని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాస్త్రవత్తేలు తెలిపారు. ఈ సంస్థకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌డీవో) ఉపగ్రహం ఇటీవల సేకరించిన వీడియోలో ఇది కనిపించింది.
» ఈ రంధ్రం సూర్యుడిలో దక్షిణభాగంలో ఏర్పడటం వల్ల దాని నుంచి వచ్చే సౌర వాయువులు భూమిపై ప్రభావం చూపే అవకాశం తక్కువే అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. |
మే - 15
|
¤ హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రొయ్యల పైభాగంలో ఉండే పెంకులతో ప్లాస్టిక్ వస్తువులను రూపొందించే పరిజ్ఞానాన్ని తయారు చేశారు. » ఈ ప్లాస్టిక్ సాధారణ ప్లాస్టిక్‌తో పోలిస్తే ఎంతో గట్టిగా ఉంటుంది. చాలా త్వరగా భూమిలో శిథిలమై పోతుంది.¤ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 700 మైళ్లు నిరవధికంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ బస్సును అమెరికాలోని ప్రొటేరా కంపెనీ తయారు చేసింది. » సాధారణ డీజిల్ బస్సులతో పోలిస్తే దీని మైలేజ్ 27 మైళ్లు పర్ గ్యాలన్ ఈక్వలెంట్‌గా నమోదైంది. |
మే - 19
|
¤ దేశవ్యాప్తంగా 5% ప్రజల్లో పేగు పూత (పేగు వాపు) జబ్బు ఉందనీ, అది 2021 నాటికి 13 శాతానికి పెరగనుందనీ హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.
» పేగువాపు వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మే 19వ తేదీని 'ప్రపంచ పేగువాపు వ్యాధుల దినం'గా పాటించాలని అంతర్జాతీయ వైద్య సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి.
¤ క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించగల చిప్‌ను స్పెయిన్‌కు చెందిన ఫొటోనిక్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
» క్యాన్సర్ కణాల నుంచి ఉత్పత్తయ్యే ప్రోటీన్లు రక్తంలో అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నా, ఈ చిప్ గుర్తించగలదు. క్యాన్సర్ ప్రోటీన్లను గుర్తించే బంగారపు నానోపార్టికల్‌లను పైపూతగా పూసిన ఈ చిప్‌లో ద్రవాలు ప్రయాణించేలా సన్నని మార్గాలను ఏర్పాటు చేశారు. రక్తాన్ని ఈ చిప్‌లోకి ఎక్కించినపుడు ఈ మార్గాల ద్వారా అది ప్రవహిస్తుంది. ఈ క్రమంలో క్యాన్సర్ ప్రోటీన్లు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నా, ఈ చిప్ పసిగట్టి హెచ్చరిస్తుంది.
¤ 'ధూమపానం అలవాటును మానుకోవాలంటే ఎలక్ట్రానిక్ సిగరెట్లు తాగడం మేలు' అంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. కానీ, అవి కూడా హాని కలిగిస్తున్నాయంటూ తాజాగా తేలింది.
» ఎలక్ట్రానిక్ సిగరెట్లవల్ల హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా, అవి శ్వాసకోశ నాళం వద్ద శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌డీగో, వాన్‌డీగో హెల్త్‌కేర్ సిస్టం శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో తేలింది.
» మామూలు సిగరెట్ల వల్ల కూడా ఈ హానికారక బ్యాక్టీరియా ఉత్తేజితమవుతోందని ఈ బృందం వెల్లడించింది. దీంతో సాధారణ సిగరెట్ల ధూమపానంతో పోలిస్తే, ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల కూడా ఎంతో కొంత కీడు జరిగే అవకాశాలున్నాయని తేలింది.
¤ కాలుష్యాన్ని నివారించే ఒక బోర్డును ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లో ఏర్పాటు చేశారు. 65 అడుగుల ఎత్తైన ఈ బిల్ బోర్డుమీద 'గాలిని పొగుడుతూ...' అని పేరు పెట్టిన ఒక కవితను టైటానియం డయాక్సైడ్‌తో తయారు చేశారు.
» ఈ బోర్డు ఆ పరిసరాల్లోని గాలిలో పేరుకుపోయిన నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులను (రోజుకు 20 కార్లు విడుదల చేసే కాలుష్యాన్ని) హరిస్తుంది. |
మే - 20
|
¤ జపాన్‌కు చెందిన హిటాచీ కంపెనీ హాస్య స్ఫూర్తి కలిగి, మనుషులను తన సంభాషణలతో నవ్వించే రోబోను అభివృద్ధి చేసింది.
» దీనికి ఇమియు (EMIEW)-2గా పేరు పెట్టారు. స్క్రిప్ట్ ఇవ్వకపోయినా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఇమియు తన మాటలతో నవ్విస్తుంది. తాను వేసిన జోక్‌కు ఎదుటివారు నవ్వారా? లేదా? అనేది కూడా తెలుసుకుని ప్రతిస్పందిస్తుంది. మనుషుల భావోద్వేగాలను పసిగట్టే విధంగా శాస్త్రవేత్తలు ఈ రోబోను రూపొందించారు.
» EMIEW అంటే 'ఎక్సలెంట్ మొబిలిటీ అండ్ ఇంటరాక్టివ్ ఎగ్జిస్టెన్స్ యాజ్ వర్క్‌మేట్'.
¤ ఎండనక, వాననక సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడే సైనికుల కోసం 'ఎయిర్ కండిషన్డ్ హెల్మెట్'ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
» హెల్మెట్‌లో గాలిని శుద్ధి చేసే రెస్పిరేటర్‌ను అమెరికా ఆర్మీ పరిశోధక విభాగంలోని ఎడ్జ్‌వర్డ్ కెమికల్ బయొలాజికల్ సెంటర్ అభివృద్ధి చేసింది. దాంట్లో సైనికుల వీపులకు తగిలించుకునేలా ఓ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఆ బ్యాటరీ నుంచి హెల్మెట్‌లోని ఫేస్‌మాస్క్‌కు గాలిని పంపించే ఓ పైపును ఏర్పాటు చేశారు. దీంతో ఏసీ హెల్మెట్ ద్వారా చల్లటి గాలితో సైనికులు ఎంతో సౌకర్యంగా ఉంటారు.
¤ శాన్‌ఫ్రాన్సిస్కోలోని వెలోలాబ్‌కు చెందిన పరిశోధకులు తాళం చెవి లేని సౌరశక్తితో పనిచేసే కొత్త తాళాన్ని కనిపెట్టారు.
» బైకుల్లో ఏర్పాటు చేసే ఈ 'స్కైలాక్' వ్యవస్థ బ్లూటూత్, వైఫై వంటి వాటి ద్వారా బైక్ యజమాని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై ఉంటుంది.
» బైక్ యజమాని దగ్గరికి వెళ్లగానే బైక్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఎవరైనా బైక్‌ను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే యజమానిని అప్రమత్తం చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు గుర్తించి వెంటనే హెచ్చరిస్తుంది.
» ఈ 'స్కైలాక్'కు ఎలాంటి అదనపు విద్యుత్ అవసరం లేదు. బైక్‌పై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ఫలకాల ద్వారా బ్యాటరీని నింపుకొంటుంది. |
మే - 22
|
¤ అమెరికా వైమానిక దళం అత్యంత రహస్యమైన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అట్లాస్-5 రాకెట్ ద్వారా కేప్ కెనవెరాల్ వైమానిక స్థావరం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇందులోని ఉపగ్రహాన్ని జాతీయ నిఘా కార్యాలయం రూపొందించింది. |
మే - 23
|
¤ అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' తొలిసారిగా భూమికి సంబంధించిన 'సెల్ఫీ' చిత్రాన్ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 113 దేశాలు, ప్రాంతాలకు చెందిన దాదాపు 36 వేల మంది తీసిన ఫోటోలను కలిపి దీన్ని తయారు చేశారు.
» ఈ ఏడాది ఏప్రిల్ 22న ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వెలుపలికి వచ్చి సొంతంగా ఫొటోలు (సెల్ఫీ) తీసి, సామాజిక మీడియాలో పెట్టాలని నాసా సూచించింది. ఆ చిత్రాలతో భూమిని తయారు చేసింది. తాజాగా దాన్ని విడుదల చేసింది.
» ఇది 3.2 గిగా పిక్సల్ చిత్రం. దీన్ని జూమ్ చేసి అందులో ఇమిడి ఉన్న ఆయా వ్యక్తుల ఫొటోలను చూడవచ్చు.
» పర్యావరణ స్పృహను పెంచేందుకు, భూ పరిరక్షణకు తాను చేపట్టిన కార్యక్రమాలను ప్రచారంలోకి తెచ్చేందుకు నాసా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. |
మే - 25
|
¤ చైనా తొలిసారిగా యుద్ధ విమానాలను జాతీయ రహదారిపై పరీక్షించి, విజయం సాధించింది.
» చైనాలోని హెన్నన్ ప్రావిన్స్‌లోని జెహన్‌జుహోమిన్ క్వీన్ రహదారిపై ఈ ప్రయోగాలు చేపట్టింది.
» పలు విమాన ప్రయోగాలతో పాటు మూడో తరానికి చెందిన యుద్ధ విమానాలను మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆధ్వర్యంలో విజయవంతంగా పరీక్షించారు.
¤ చెక్కతో తయారైన 1200 ఏళ్ల నాటి పురాతన కంప్యూటర్‌ను తుర్కిష్ పురాతత్వ శాస్త్రవేత్తలు తుర్కిష్ రాజధాని ఇస్తాంబుల్ వద్ద ఎనికపీ ప్రాంతంలోని ఓ పురాతన ఓడలో కనుక్కున్నారు.
» ఈ ఓడ 9వ శతాబ్దం నాటిదని, ఇక్కడి ఓడరేవును 4వ శతాబ్దంలో నిర్మించారని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ ఓడలు నల్ల సముద్రం మీదుగా సామగ్రిని క్రిమియా నుంచి కెర్సోనిసస్‌కు రవాణా చేసేవని నిర్ధారించారు. |
మే - 28
|
¤ వీవీఐపీలను హతమార్చడానికి అధునాతన ఆయుధాలతో ఎక్కడో ఓ చోట నక్కి ఉండే ఆగంతకుల్ని గుర్తించడానికి ఉపయోగపడే మహత్తరమైన లేజర్ పరికరాన్ని 'రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ' (డీఆర్‌డీఓ) రూపొందించింది.
» దుండగులు ఎక్కడ ఉన్నారో ఈ పరికరం చిటికెలో గుర్తిస్తుంది. లేజర్ కిరణాల ఆధారంగా ఇది పని చేస్తుంది. దీన్ని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. 300 మీటర్ల దూరంలోపు ఉన్న లక్ష్యాలను ఇది విజయవంతంగా గుర్తించగలుగుతుంది.
¤ ప్రయాణానికి అనువుగా టూవీలర్‌లా ఉండే సూట్‌కేస్ వాహనాన్ని చైనాకు చెందిన హి లియాంగ్ రూపొందించాడు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 20 కి.మీ. వేగంతో 50-60 కి.మీ. వరకు దీనిపై సులువుగా ప్రయాణం చేయవచ్చు. |
మే - 29
|
¤ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'పినాక రాకెట్ల'ను భారత్ మూడుసార్లు విజయవంతంగా పరీక్షించింది. బహుళ బ్యారెల్ ప్రయోగ వ్యవస్థ ద్వారా ఈ పరీక్ష జరిగింది.
» ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ప్రూఫ్ అండ్ ఎక్స్‌పరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పీఎక్స్ఈ) ఇందుకు వేదికైంది. ఈ రాకెట్లను 1995 నుంచి అనేక కఠిన పరీక్షలకు గురి చేశారు. ఇప్పటికే ఇవి సైన్యం అమ్ములపొదిలో చేరాయి. |
మే - 31
|
¤ క్యాన్సర్ కణాల్లోకి ఔషధాలను చేరవేసే సరికొత్త నానో విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డైసీ పువ్వు ఆకారంలో ఉండే ఈ నానో ఆకృతులు క్యాన్సర్ నిరోధక ఔషధాలతో తయారయ్యాయి. అవి క్యాన్సర్ కణాల్లోకి బహుళ ఔషధాలతో కూడిన మిశ్రమాన్ని చేరవేయగలవు. ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ ఘనత సాధించారు. |
|
|