ఏప్రిల్ - 2014 సైన్స్ అండ్ టెక్నాలజీ



ఏప్రిల్ - 4
¤  శ్రీహరికోటలోని స‌తీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి 'పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) - సి 24' రాకెట్‌ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ శ్రేణిలోని రెండో ఉపగ్రహం 'ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ - 1 బి'ని దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.   
»   దీంతో వరుసగా 25 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఘనతను పీఎస్ఎల్‌వీ దక్కించుకుంది. జీపీఎస్‌ తరహాలో ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యం దిశగా దేశం మరో ముందడుగు వేసింది.   
»   భార‌త్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న 'ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌' శ్రేణిలో ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. తాజాగా ప్రయోగించింది రెండోది. మొదటిదైన 'ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1 ఎ' ఉపగ్రహాన్ని ఇస్రో 2013 జులైలో 'పీఎస్‌ఎల్‌వీ - సి 22' ద్వారా కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఈ ఏడు ఉపగ్రహాలు క‌లిసి భారతదేశం చుట్టూ 1,500 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు దిక్సూచిలా పనిచేస్తాయి. ఈ వ్యవ‌స్థ భూ, జ‌ల, వాయు మార్గాల‌కు స్థితి, స్థానం, దిక్కుల‌ను తెలియ‌జేస్తుంది.   
»   ప్రస్తుతం ప్రయోగించిన‌ 'ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1 బి' బరువు 1430 కిలోలు. దీనిలో 800 కిలోగ్రాముల ద్రవ ఇంధనం ఉంటుంది.
 ఏప్రిల్ - 5
¤  పీఎస్‌ఎల్‌వీ - సీ24 రాకెట్‌తో నింగిలోకి పంపిన భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) - 1బి కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు పెంచారు. మొదట ఈ ఉపగ్రహాన్ని అపోజి (కక్ష్యలో భూమికి దగ్గరగా ఉండే బిందువు) 284 కిలోమీటర్లు, పెరిజి (కక్ష్యలో భూమికి దూరంగా ఉండే బిందువు) 20,652 కి.మీ. కలిగిన కక్ష్యలో ఉంచారు. ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించి కక్ష్య పెంపు కార్యక్రమాన్ని చేపట్టారు. పెరిజి 25 వేల కి.మీ. కలిగిన కక్ష్యకు ఉపగ్రహాన్ని బదలాయించారు.
 ఏప్రిల్ - 6
¤  శ్రీహ‌రికోట నుంచి ఏప్రిల్ 4న నింగిలోకి పంపిన భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) - 1బి కక్ష్య పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు రెండోసారి చేపట్టారు. 790 సెకన్ల పాటు ద్రవ ఇంధనాన్ని మండించి ఉపగ్రహాన్ని 284 కిలోమీటర్ల అపోజి (కక్ష్యలో భూమికి దగ్గరగా ఉండే బిందువు) నుంచి 350 కి.మీ. అపోజికి, 25 వేల కి.మీ. పెరిజి (కక్ష్యలో భూమికి దూరంగా ఉండే బిందువు) నుంచి 36 వేల కి.మీ. పెరిజికి బదలాయించారు.
ఏప్రిల్ - 14
¤  ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన మార్క్ టర్నర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం మానవ శరీరంలోకి ప్రవేశపెట్టేందుకు అనువైన ఎర్రరక్త కణాలను తయారు చేసింది. లోగడ ఇది పూర్తిస్థాయిలో సాధ్యంకాలేదు.   
»   పరిపక్వ చర్మం లేదా రక్తం నుంచి సేకరించిన కణాలను జన్యుపరంగా మార్పిడి చేసి, ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ (ఐపీఎస్)గా తీర్చిదిద్దారు. ఇవి మూలకణాల తరహాలోనే ఉంటాయి. ఆ తర్వాత మానవ శరీరంలో ఉండే పరిస్థితులను జీవరసాయన పద్ధతిలో సృష్టించి, అందులో ఐపీఎస్ కణాలను వృద్ధి చేశారు. ఫలితంగా అవి పరిపక్వ ఎర్రరక్త కణాలుగా మారిపోయాయి.  
 »   తాజా ప్రయోగంతో ప్రమాదాలకు గురైనపుడు శస్త్ర చికిత్స సమయంలో రక్తం కోసం, దాతల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
ఏప్రిల్ - 15
¤  రాత్రి సమయంలో స్వయంగా వెలిగిపోయే రోడ్డునునెదర్లాండ్స్‌లో రూపొందించారు.   
»   రోడ్డుపై రేడియం వంటి ఒక రకమైన పూత పూయడం ద్వారా ఈ రోడ్డు రోజంతా సూర్యకాంతిని గ్రహించి, రాత్రిపూట ఎనిమిది గంటల పాటు నెమ్మదిగా కాంతిని విడుదల చేస్తుంది.  
 »   ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల రోడ్ల మీద కరెంటు స్తంభాల అవసరం ఉండదు. కరెంటు ఖర్చూ ఉండదు.  
 »   డాన్ రూసెగార్డి అనే ఔత్సాహిక శాస్త్రవేత్త ఈ తరహా రహదారులకు రూపకల్పన చేశారు.

¤  పెన్సిలిన్‌ను పునరుత్తేజపరచడం కోసం సౌత్ కరోలినా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కోబాల్టో సీనియం అనే మెటాలో పాలిమర్‌ను రూపొందించారు. దీని సాయంతో పెన్సిలిన్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని వారి పరిశోధనల్లో తేలింది.   
»   వైద్య రంగంలో ఒకప్పుడు అనేక సంచలనాలకు వేదికగా నిలిచిన పెన్సిలిన్ ప్రస్తుతం బలహీనపడిపోయింది. వ్యాధికారక సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకోవడంతో పెన్సిలిన్ మునుపటిలా పనిచేయడం లేదు.   
»   ఈ నేపథ్యంలో సాధారణ సూక్ష్మజీవులే కాకుండా, అత్యాధునిక ఔషధాలకు లొంగని మొండి ఘటాల వంటి వ్యాధికారక క్రిములను కూడా సమర్థంగా ఎదుర్కొనే విధంగా పెన్సిలిన్‌ను తయారు చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కోబాల్టో సీనియంను శాస్త్రవేత్తలు రూపొందించారు.   
»   నూతనంగా రూపొందించిన ఈ పాలిమర్ వ్యాధికారక బ్యాక్టీరియా కణాలను మాత్రమే నాశనం చేస్తోందని, ఎర్రరక్త కణాలకు హాని చేయడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఏప్రిల్ - 18
¤  ఒక నక్షత్రం సమీపంలో సమశీతోష్ణస్థితికి వీలు కల్పించే ప్రాంతంలో తొలిసారిగా భూమిలాంటి గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అక్కడ ద్రవరూపంలో నీరు ఉండటంతోపాటు జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.   
»   తారల చుట్టూ ఉండే ఒక ప్రాంతంలో మరీ వేడిగా, మరీ శీతలంగా ఉండని పరిస్థితులు ఉంటాయి. దీన్ని గోల్డీలాక్స్ జోన్ అంటారు. అక్కడ పరిభ్రమించే గ్రహాల్లో ద్రవరూపంలో నీరు ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. మొత్తంమీద జీవం మనుగడకు అనువైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. భూమి కూడా సూర్యుడి చుట్టూ ఉన్న గోల్డీలాక్స్ ప్రాంతంలోనే ఉంది.    
»   తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' కు చెందిన కెప్లర్ టెలిస్కోప్‌ను ఉపయోగించి, ఒక తార చుట్టూ గోల్డీలాక్స్ జోన్‌లో తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారిగా గుర్తించారు. దీనికి కెప్లర్-186 ఎఫ్ అని పేరు పెట్టారు. ఇది మనకు 500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక తార చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ నక్షత్రం సూర్యుడి పరిమాణంలో సగం మేర ఉంది. దీన్ని అరుణ మరుగుజ్జు తారగా వర్గీకరించారు. మన పాలపుంత గెలాక్సీలో 70% గ్రహాలు ఇలాంటివే. కెప్లర్-186 ఎఫ్ గ్రహం 130 రోజులకు ఒకసారి మాతృతారను చుట్టి వస్తుంది.

¤  కార్బన్ పుష్కలంగా ఉన్న ఉల్కల ద్వారా భూమికి బి3 విటమిన్ వచ్చి చేరిందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.  
 »   జీవం మనుగడకు కారణమైన కొన్ని అణువులు అంతరిక్షంలో తయారయ్యాయని, తోకచుక్కలు, ఉల్కలు ఢీ కొట్టిన సందర్భంలో అవి భూమికి చేరాయనే ఒక సిద్ధాంతాన్ని ఇది బలపరుస్తోంది.  
 »   బి3 విటమిన్‌ను నికోటినిక్ యాసిడ్ లేదా నియాసిన్‌గా పేర్కొంటారు. ఇది నికోటినమైడ్ అడినైన్ డై న్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ)కి ముందు దశ. జీవక్రియలకు ఇది అవసరం. దీని మూలాలు చాలా పురాతనం.   
»   పరిశోధకురాలు కారెన్ స్మిత్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కార్బన్ పుష్కలంగా ఉన్న ఎనిమిది ఉల్కలకు సంబంధించిన నమూనాలను విశ్లేషించింది. వీటిలో బి3 విటమిన్ స్థాయి 30 నుంచి 600 పార్ట్స్ పర్ బిలియన్ మేర ఉండటాన్ని గుర్తించారు. దానికి సంబంధించిన పైరిడైన్ కార్బాక్సిలిక్ ఆమ్లాలను కూడా అదే స్థాయిలో కనుక్కున్నారు. తొలిసారిగా పైరిడైన్ డైకార్బాక్సిలిక్ ఆమ్లాలను కూడా గుర్తించారు.

¤  చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ, ఆ వాతావరణాన్ని, అక్కడి ధూళిని పరిశీలించేందుకు 2013 సెప్టెంబరులో జాబిలి కక్ష్యలోకి నాసా పంపిన కృత్రిమ ఉపగ్రహం'లేడీ (లునార్ అట్మాస్ఫియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్)' ముందుగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం చంద్రుడి చీకటి భాగంలో కూలిపోయింది.  
»   'లేడీ' గంటకు 5,800 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తూ తనకు నిర్దేశించిన కర్తవ్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు నాసా ప్రకటించింది.

¤  కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కేఏఐఎస్‌టీ) కి చెందిన శాస్త్రవేత్తల బృందం తొలిసారిగా ఎల్ఈడీ టీవీ పనిచేసే స్థాయిలో వైర్‌లెస్ విధానం ద్వారా కరెంట్‌ను సరఫరా చేయగలిగారు.   
»   సాధారణంగా సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టాలంటే చార్జర్ కావాలి. దాని ఒక కొన ఫోన్‌కి పెట్టి, పవర్ ప్లగ్ స్విచ్ బోర్డుకు అనుసంధానం చేయాలి. ఆపై స్విచ్ వేయాలి. కొత్తగా వస్తున్న కొన్ని సెల్‌ఫోన్లను చార్జింగ్ చేయడానికి ఇన్ని బాధలు లేవు. ఓ పవర్ ప్యాడ్‌మీద ఫోన్‌ను ఇలా పెట్టగానే అలా చార్జ్ అవుతుంది. అంటే వైర్‌లెస్ విధానంలో ఆ బ్యాటరీ చార్జ్ అవుతోందన్నమాట.   
»   2007లో మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు కనిపెట్టిన టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమవుతోంది. కానీ, ఆ విధానం ప్రభావం 2.1 మీటర్ల పరిధికి పరిమితం. అప్పట్లో వారు 60 వాట్ల విద్యుత్‌ను ఈ పద్ధతిలో పంపగలిగారు.  
 »   తాజాగా ఈ పరిధిని అయిదు మీటర్లకు అంటే.. 16 అడుగులకు కొరియా శాస్త్రజ్ఞులు పెంచారు. 209 వాట్ల విద్యుత్‌ను వైర్‌లెస్ విధానంలో ప్రసారం చేసి, 16 అడుగుల దూరంలో ఉన్న పెద్ద ఎల్ఈడీ టీవీని పని చేయించగలిగారు. ఈ విద్యుత్‌తో 40 స్మార్ట్‌ఫోన్లను లేదా 5 ఫ్యాన్లను లేదా పెద్ద ఎల్ఈడీ టీవీని పని చేయించవచ్చు.   
»   ఈ కొత్త విధానాన్ని 'డైపోల్ కాయిల్ రిజానెంట్ సిస్టమ్ (డీసీఆర్ఎస్)'గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు.
ఏప్రిల్ - 20
¤  జ్యూరిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం డ్రాగన్ వ్యోమనౌక ద్వారా మానవ రోగ నిరోధక కణాలను రోదసిలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్‌కు) పంపింది.   
»   గురుత్వాకర్షణ శక్తిలేని స్థితిలో ఈ కణాలు ఎలా వ్యవహరిస్తాయో తెలుసుకునేందుకు వారు ఈ చర్య చేపట్టారు. ఎముకలు, కండరాలపై గురుత్వాకర్షణ శక్తి చూపే ప్రభావాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు విస్తృత్తంగా పరిశోధనలు చేశారు. అయితే కణాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకా అంతుచిక్కకుండానే ఉంది. ఈ నేపథ్యంలో మానవ రోగ నిరోధక కణాలను శాస్త్రవేత్తలు ఐఎస్ఎస్‌కు పంపారు.   
»   ఆధునిక కణ జీవశాస్త్రం, అంతరిక్ష పరిజ్ఞానం కారణంగా భూమిపై జీవానికి అనుగుణంగా కణాలు ఎలా సర్దుబాటు చేసుకున్నాయో నిర్దిష్టంగా తెలుసుకోవడానికి వీలుకలుగుతుంది.   
»   భార రహిత స్థితిలో రోగనిరోధక వ్యవస్థ విధులు కుంటుపడతాయి. శరీరంపై దాడి జరిపే బ్యాక్టీరియాను చంపే ఫాగోసైట్లు మానవులను ఇన్ఫెక్షన్ల బారి నుంచి గరిష్ఠ స్థాయిలో అక్కడ కాపాడలేవు. అందుకే వ్యోమగాములు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. 
  »   అలీవర్ ఉల్‌రిచ్ పరిశోధనకు నేతృత్వం వహించారు.

¤  మనిషి ఎదురుగా నిలబడితే శరీరంలోని ఎముకలు, కీళ్లు, ఇతర అవయవాలన్నింటినీ చూపే త్రీడీ అద్దాన్ని యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్-సౌత్ శాస్త్రవేత్తలు తయారు చేశారు.  
 »   ముందుగా పీఈటీ స్కాన్, ఎక్స్-రే, ఎంఆర్ఐ స్కాన్‌లు చేయించుకుని, తర్వాత ఈ అద్దం ముందుకు వెళితే అది ఎముకలను, అవయవాలను స్పష్టంగా చూపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.   
»   మైక్రోసాఫ్ట్ కైనెక్ట్ మోషన్ కాప్చర్ కెమెరాతో అనుసంధానమై ఉండే ఈ అద్దం మనిషి కదిలినపుడు ఎముకలు, కీళ్లు, అవయవాల కదలికలను కూడా చూపిస్తుంది.  
 »   మనిషి శరీరం అంతర్భాగాలను స్పష్టంగా చూపే ఇలాంటి మరో రెండు వినూత్న అద్దాలను ఇటీవల జర్మనీ, అమెరికా శాస్త్రవేత్తలు కూడా తయారు చేయడం గమనార్హం.

¤  పగుళ్లు లేకుండా భవనాలు చిరకాలం ఉండేలా కొత్తరకం కాంక్రీట్‌ను విస్కన్సన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు.   
»   'సూపర్ హైడ్రో ఫోబిక్‌'గా పిలిచే ఈ కాంక్రీట్ తనలో ఉండే నీటిని విసర్జిస్తూ, గోడలు మన్నికగా ఉండేందుకు తోడ్పడుతుంది.

¤  లేజర్ కిరణాల ద్వారా మేఘాలను మధించి వాన కురిపించే నూతన విధానాన్ని తాము కనుక్కున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలోని కాలేజ్ ఆఫ్ ఆప్టిక్స్ అండ్ ఫోటానిక్స్, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా శాస్త్రవేత్తలు ప్రకటించారు.   
»   ఈ నూతన విధానంలో లేజర్ల శక్తిని పెంచడం ద్వారా వాటిని ఎక్కువ ఎత్తులకు పంపి, మేఘాల్లోని స్టాటిక్ చార్జ్‌డ్ పార్టికల్స్‌ను ఉత్తేజితం చేయడం ద్వారా వానలు కురిపించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

¤  స్వీడన్‌కు చెందిన ఫోరియో అనే కాస్మటిక్స్ కంపెనీ 'బ్రైటర్ మూన్' (ఎ సొల్యూషన్ ఫర్ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్) అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. చంద్రుడిని మరింత కాంతిమంతంగా వెలిగిపోయేలా చేసి, తద్వారా రాత్రి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌ను ఆదా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.  
 »   చంద్రుడి మీద నేలను భౌతిక, రసాయన నిర్మాణాన్ని మార్పులకు గురి చేయడం ద్వారా జాబిలిని ఎక్కువ కాంతి ప్రతిఫలించేలా, శాశ్వతంగా మరింత వెలుగులు కురిపించేలా మార్చేస్తారు. చంద్రుడి మీద 0.1% భాగం (దాదాపు స్విట్జర్లాండ్ అంత భూభాగం) మీద ఈ ప్రాజెక్టును చేపట్టినా, చందమామకున్న ప్రతిఫలింపజేసే శక్తి 80% పెరుగుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.   
»   ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు 52 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 313.51 కోట్లు) ఇప్పటికే సేకరించినట్లు ఫోరియో సంస్థ ప్రకటించింది. సంస్థ ప్రణాళిక ప్రకారం చంద్రుడి ఉపరితలాన్ని ఈ ప్రాజెక్టుకు అనుగుణంగా మార్చేందుకు 2020 నాటికి తొలి రోవర్‌ను పంపనున్నారు. 2040 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా చంద్రుడి ఉపరితలంలో ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతాలను చదును చేస్తారు. దీంతో ఇన్నాళ్లుగా మనకు మచ్చల్లా కనిపిస్తున్న లోయలు, కొండల్లో కొన్ని మనకు కనిపించకుండా పోతాయి.ఈ ప్రాజెక్టు వల్ల కలిగే రెండు ప్రధాన ప్రయోజనాలు:   »   ప్రపంచంలోని అన్ని దేశాల విద్యుత్ ఖర్చులో 40% రాత్రిపూట వెలిగే దీపాలదే. ఆ ఖర్చు 
సగానికి సగం తగ్గినా బోలెడంత ఆదా అవుతుంది.   
»   ఒక్కో వీధిలైటు ఏడాదికి 120 కిలోల కర్బన ఉద్గారాలను వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. ఉదాహరణకు ఒక్క అమెరికాలోని వీధి లైట్లే ఏడాదికి 36 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. యూరప్ దేశాల విడుదల 4 కోట్ల టన్నులకు పైమాటే. చంద్రుడి కాంతి ఎక్కువగా ఉంటే ఈ పర్యావరణ ముప్పు 90% దాకా తగ్గిపోతుంది.
 ఏప్రిల్ - 22
¤  అణ్వస్త్ర సామర్థ్యమున్న హతాఫ్-3 (ఘజ్నవీ) క్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్న లక్ష్యాలను ఛేదించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. 290 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను ఇది చేరుకోగలదు.

¤  మిరప మొక్కల పరిణామం, చరిత్రపై నాలుగు కోణాల్లో తాము నిర్వహించిన అధ్యయనం ప్రకారం మిరప మొక్క మెక్సికో దేశంలో పుట్టినట్లు వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ప్రకటించారు.   
»   వీరి పరిశోధన ప్రకారం మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం, ఒయాక్సానాలోని ఉత్తర ప్రాంతం, వెరాక్రజ్‌లోని నైరుతి ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతంలో మిరపను తొలిసారిగా సాగు చేశారు. 
 ఏప్రిల్ - 23
¤  దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది.   
»   ఇది ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించడానికి పనికొస్తుంది.   
»   25 కిలోమీటర్ల వరకూ దూసుకెళ్లగలదు. 60 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళుతుంది.   
»   పైలట్ రహిత విమానం 'లక్ష్య'కు వెనుక భాగంలో తగిలించిన వస్తువును దీనికి లక్ష్యంగా నిర్దేశించారు.   
»   మధ్యశ్రేణి క్షిపణి అయిన 'ఆకాష్' యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గగన తలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను సమర్థంగా నాశనం చేయగలదు.
ఏప్రిల్ - 25
¤  ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్ నగరంలోని విమానాశ్రయంలో తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు.   
»   30 కిలోవాట్ల సామర్థ్యం ఉండే రెండు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజిన్లతో పనిచేసే ఈ 6.7 మీటర్ల పొడవున్న బుల్లి విమానం గంటకు 177 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.   
»   ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ ఈ బుల్లి విమానాన్ని రూపొందించింది.   
»   ఈ విమానం పేరు 'ఈ-ఫ్యాన్'.
ఏప్రిల్ - 26
¤  మన సౌర కుటుంబానికి కేవలం 7.2 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న అతి చల్లని నక్షత్రం 'వైజ్ జే 085510.83071442.5' ను 'నాసా'కు చెందిన వైజ్, స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్‌ల ద్వారా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కెవిన్ లూమన్ కనుక్కున్నారు.   
»   ఇప్పటిదాకా కనుక్కున్న బ్రౌన్ డ్వార్ఫ్ నక్షత్రాల్లో ఇదే అత్యంత చల్లనిది. దీని ఉష్ణోగ్రత మైనస్ 48, మైనస్ 13 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీన్ని ఒక మంచు నక్షత్రంగా గుర్తించారు.   
»   మన సూర్యుడిలాంటి నక్షత్రాలు కేంద్రక సంలీనం చర్య వల్ల హైడ్రోజన్‌ను హీలియం వాయువులుగా మారుస్తూ నిరంతరం అంతులేని వేడి, వెలుగులు, రేడియేషన్ విరజిమ్ముతుంటాయి. కానీ బ్రౌన్ డ్వార్ఫ్ వంటి మరుగుజ్జు నక్షత్రాల్లో చాలా తక్కువ ద్రవ్యరాశి ఉంటుంది. కాబట్టి, వాటిలో కేంద్రక సంలీనం చర్యలు జరగవు. అందువల్ల అవి చల్లగానే ఉంటాయి.  
 »   తాజా మరుగుజ్జు నక్షత్రం ద్రవ్యరాశి గురుగ్రహం కంటే 10 రెట్లు మాత్రమే ఎక్కువ కావడంతో ఇది పూర్తిస్థాయి నక్షత్రంగా మారలేక పోయిందని పరిశోధకులు వెల్లడించారు.

¤  దేశీయంగా రూపొందించిన ఆకాష్ క్షిపణిని భారత్ ఒకేరోజు రెండుసార్లు విజయవంతంగా పరీక్షించింది.   
»   ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్‌రేంజ్ (ఐటీఆర్) నుంచి విజయవంతంగా రెండుసార్లు ప్రయోగించారు.
ఏప్రిల్ - 27
¤  భారత్ తొలిసారిగా పృథ్వి డిఫెన్స్ వెహికిల్ (పీడీవీ) అస్త్రాన్ని ఒడిశాలోని వీలర్ ఐలండ్ వద్ద విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగంలో భాగంగా ఇది నమూనా శత్రు క్షిపణిని నేలకూల్చింది.
   

»   ఈ ప్రయోగంతో భారత్ తన గగన తలాన్ని శత్రు క్షిపణుల నుంచి రక్షించే దిశగా కీలక ముందడుగు వేసినట్లయింది. రెండంచెల క్షిపణి రక్షణ కవచాన్ని సాధించే క్రమంలో కీలక విజయాన్ని నమోదు చేసింది.   
»   భారత్‌కు ఇరుగు పొరుగు దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా క్షిపణులు ఉండటంతో వాటి నుంచి రక్షణ పొందడానికి విశ్వసనీయమైన రక్షణ కవచం అవసరమైంది. ఈ నేపథ్యంలో రెండంచెల కవచం రూపకల్పనకు రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) నడుం బిగించింది. ఇవి భూవాతావరణం లోపల, వెలుపల, శత్రు క్షిపణిని నేల కూలుస్తాయి.  
 »   తాజాగా పరీక్షించిన పీడివీ భూవాతావరణానికి వెలుపల 120 కిలో మీటర్లకు పైగా ఎత్తులో లక్ష్యాలను ఛేదిస్తుంది.   
»   క్షిపణులను గుర్తించే రాడార్లు, పృథ్విని ప్రయోగించే లాంచ్ ప్యాడ్ ఆటోమేటిక్‌గా స్పందించేలా పీడీవీ వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి.   
»   లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు వీలుగా 'పీడీవీ'లో మైక్రో, ఇనర్షియల్ నావిగేషన్ పరికరాలు, ఇన్‌ఫ్రారెడ్ సీకర్ ఉంటాయి.   
»   ఇనర్షియల్ నావిగేషన్, ఐఆర్ సీకర్‌తో పాటు పీడీవీ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలుగుతుంది.
 ఏప్రిల్ - 29
¤  చిన్నారుల్లో వచ్చే డైలేటెడ్ కార్డియోమయోపతికి డీఎన్ఏ క్రమంలోని వైవిధ్యమే కారణమని అంతర్జాతీయ పరిశోధన బృందం తేల్చింది. జన్యువులోని ఉత్పరివర్తనమైన ఆర్ఏఎఫ్ 1 వల్లే ఈ సమస్య తలెత్తుతోందని గుర్తించారు.  
 »   ఈ వ్యాధి వల్ల పిల్లల్లో గుండె పరిమాణం పెరగడంతో పాటు బలహీనపడి రక్త ప్రసరణ వేగం క్షీణిస్తుంది. మారుతున్న జీవనశైలితో పాటు జన్యు సంబంధిత కారణాల వల్లా గుండె జబ్బులు పెరుగుతుండటంతో ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు సాగించారు.   
»   సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)తో పాటు అమెరికా, జపాన్, ఇటలీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనకు సంబంధించిన వ్యాసాన్ని ప్రఖ్యాత సైంటిఫిక్ జర్నల్ 'నేచర్ జెనెటిక్స్' ప్రచురించింది. 
  »   సీసీఎంబీ సంచాలకుడు సిహెచ్.మోహన్‌రావు.

¤  భారత్‌లో తీవ్ర వర్షాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు పెరుగుతూ, క్రమంగా కరవు, వరదల ముప్పు అధికమవుతోందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.  
 »   ఇటీవలి దశాబ్దాల్లో దక్షిణాసియా రుతుపవనాల సీజన్‌లో ముఖ్యంగా మధ్య భారతదేశంలో కీలక మార్పులు జరుగుతున్నాయని వీరి పరిశోధనలో తేలింది.   
»   భారత్‌లో వెట్ స్పెల్స్ (కొద్ది రోజులు పాటు వర్షాలు కురవడం), డ్రై స్పెల్స్ (కొద్ది రోజుల పాటు వర్షాభావం) పరిస్థితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఇద్దరు భారత సంతతి శాస్త్రవేత్తలతో కూడిన స్టాన్‌ఫర్డ్ బృందం గుర్తించింది.

¤  మనుషుల ప్రవర్తనను గమనిస్తూ, అనుమానాస్పద వ్యక్తులను కనిపెట్టే ప్రోగ్రామ్‌ను అల్జీరియా శాస్త్రవేత్తలు రూపొందించారు. సీసీటీవీల్లో దృశ్యాలు, వ్యక్తులను పరిశీలిస్తూ ఈ ప్రోగ్రామ్ అటోమేటిక్‌గా అనుమానాస్పదంగా ప్రవర్తించేవారిని 90% కచ్చితత్వంతో గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.  
 »   బహిరంగ ప్రదేశాల్లో నిరంతరం ఆటోమేటిక్ నిఘాకు ఈ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.

¤  మనం తాగేనీరు సురక్షితమైందా, కాదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే మాత్రను కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు.  
 »   ప్లాస్టిక్ లేదా గాజు సీసాలో నీటిని పోసి అందులో ఈ మాత్రను వేస్తే చాలు. నీరు రంగు మారడాన్ని బట్టి అది కలుషిత నీరో, మంచినీరో తెలుసుకోవచ్చు.

¤  భీకరమైన అలలతో కూడిన సునామీల నుంచి ప్రజల్ని రక్షించేందుకు హైటెక్ షెల్టర్‌ను జపాన్ శాస్త్రవేత్తలు రూపొందించారు.  
 »   అత్యవసర సందర్బాల్లో ఒక్క షెల్టర్ 20 మందిని కొన్ని రోజుల పాటు కాపాడుతుంది. నీళ్లతో తేలిపోయేలా దీన్ని ఫైబర్, ప్లాస్టిక్‌తో తయారు చేశారు. 
 ఏప్రిల్ - 30
¤  ప్రపంచలోనే తొలిసారిగా చెత్తా చెదారం, వ్యర్థ పదార్ధాల నుంచి ఇంధనాన్ని తయారు చేసి, విమానాలకు ఉపయోగించే మహత్తర కార్యక్రమానికి బ్రిటిష్ ఎయిర్‌వేస్ శ్రీకారం చుట్టింది.   
»   ఏటా 50,000 మెట్రిక్ టన్నుల విమాన ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును లండన్‌కు తూర్పు ప్రాంతంలో సొలెనా ఫ్యూయల్స్‌తో కలిసి బ్రిటిష్ ఎయిర్‌వేస్ నెలకొల్పనుంది.   
»   2017 కల్లా ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.