జూన్ - 1
|
¤ బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయుడు సునీల్ చోప్రా లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. » చోప్రా అక్కడి ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్‌కు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. » లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి ప్రవాస భారతీయుడిగా సునీల్ చోప్రా ఇదివరకే రికార్డు సృష్టించారు. గతేడాది లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ డిప్యూటీ మేయర్‌గా చోప్రా ఎన్నికయ్యారు. ఆయన ఢిల్లీకి చెందినవారు. ¤ న్యూఢిల్లీలో నిర్వహించిన హార్వర్డ్ విశ్వ విద్యాలయ పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ పతకాన్ని ప్రదానం చేశారు. ఈ పతకాన్ని హార్వర్డ్ అధ్యక్షుడు డ్రూఫ్రాస్ట్ ఆయనకు అందజేశారు. » విశ్వవిద్యాలయానికి ఆనంద్ మహీంద్రా అందించిన సేవలు, విశ్వవిద్యాలయం పట్ల ఆయన చూపిన అంకితభావం, ఉదారతలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. » ఆనంద్ మహీంద్రా 1977లో కేంబ్రిడ్జిలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆనర్స్ పట్టభద్రుడయ్యాడు. 1981లో బోస్టన్‌లోని హర్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ డిగ్రీని కూడా సంపాదించారు. |
జూన్ - 6
|
¤ భాజపా సీనియర్ పార్లమెంట్ సభ్యురాలు సుమిత్రా మహాజన్ 16వ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » ఈ ఎన్నికతో ఇప్పటివరకూ మహారాష్ట్రకు చెందిన నలుగురు స్పీకర్ బాధ్యతలను చేపట్టినట్లయింది. లోక్‌సభ తొలి స్పీకర్ గణేష్ వాసుదేవ మౌలాంకర్, 1991-96 మధ్య స్పీకర్‌గా వ్యవహరించిన కాంగ్రెస్ నేత శివరాజ్‌పాటిల్, 2002-04 మధ్య స్పీకర్‌గా వ్యవహరించిన శివసేన నేత మనోహర్ జోషి కూడా మహారాష్ట్రకు చెందిన వారే. » మీరాకుమార్ తర్వాత సభాపతి స్థానాన్ని అధిష్టించిన రెండో మహిళగా సుమిత్రా మహాజన్ రికార్డులకెక్కారు. » సుమిత్ర 1943 ఏప్రిల్ 12న మహారాష్ట్రలోని చిప్లన్ గ్రామంలో ఉష, పురుషోత్తం దంపతులకు జన్మించారు. ఇండోర్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ గ్రాడ్యుయేషన్, ఎంఏ పట్టాలను పొందారు. » ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కార్పోరేటర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1984లో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. » 1989లో తొలిసారిగా ఇండోర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన సుమిత్ర ఇప్పటివరకు 8 సార్లు వరుసగా గెలుపొందారు. 2002 నుంచి 2004 వరకు కేంద్రంలో మానవ వనరులు, కమ్యూనికేషన్లు, పెట్రోలియం శాఖలను నిర్వహించారు. |
జూన్ - 8
|
¤ పుణేలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ భారత విభాగం పోటీలో సూరత్‌కు చెందిన అనుజ్ఞశర్మ విజేతగా నిలిచింది. » ముంబయికి చెందిన కృష్ణవర్మ తొలి రన్నరప్‌గా, గోవాకు చెందిన ఆద్రే డిసిల్వా రెండో రన్నరప్‌గా నిలిచారు. » ఈ నెల 20న అబుదాబిలో జరిగే మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీలో అనుజ్ఞ సహా 40 దేశాలకు చెందిన విజేతలు పోటీ పడతారు. |
జూన్ - 9
|
¤ లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా తెదేపా ఎంపీ కొణకళ్ల నారాయణరావు ఎంపికయ్యారు. ఇలా వివిధ పార్టీల నుంచి ప్యానెల్ స్పీకర్లుగా ఎంపికైన మొత్తం 10 మంది పేర్లను లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ వెల్లడించారు. » స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల తర్వాత స్థానంలో ఉండే ప్యానెల్ స్పీకర్లను ప్యానెల్ ఆఫ్ ఛైర్ పర్సన్స్‌గా కూడా పేర్కొంటారు. » సభా వ్యవహారాలను నడిపించడంలో స్పీకర్ పదవి చాలా కీలకమైంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు అందుబాటులో లేనప్పుడు సభ నడిపే బాధ్యత ఈ ప్యానెల్ స్పీకర్లకే దక్కుతుంది. గతంలో తెదెపా ఎంపీ కింజరపు ఎర్రన్నాయుడుకు ఈ అవకాశం దక్కింది. |
జూన్ - 12
|
¤ తెలంగాణ శాసనసభ తొలి ఉపసభాపతిగా పద్మా దేవేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఒక నామినేషన్ మాత్రమే రావడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ మధుసూధనాచారి ప్రకటించారు. ¤ ఇన్ఫోసిస్ తమ సంస్థకు కొత్త సీఈఓను ప్రకటించింది. జర్మనీ ఐటీ సంస్థ ఎస్ఏపీ (శాప్) ఎగ్జిక్యూటివ్ బోర్డు మాజీ సభ్యుడైన విశాల్ సిక్కా (47)ను నియమించింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా బయటి వ్యక్తికి ఆ బాధ్యతలను కట్టబెట్టడం విశేషం. » ఎస్.డి.శిబులాల్ స్థానంలో ఈ నియామకం జరిగింది. » ఎండీ బాధ్యతను కూడా సిక్కానే నిర్వహించనున్నారు. ఈ నియామకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. » ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ప్రెసిడెంట్, పూర్తికాల సభ్యుడిగా ఉన్న యు.బి.ప్రవీణ్‌రావును జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చేలా సీఓఓగా నియమించారు. |
జూన్ - 13
|
¤ సముద్ర వ్యవహారాలను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితి సంఘం 'కమిషన్ ఆన్ ది లిమిట్స్ ఆఫ్ కాంటినెంటల్ షెల్ఫ్ (సీఎల్‌సీఎస్)'లో సభ్యుడిగా భారత శాస్త్రవేత్త రసిక్ రవీంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » సీఎల్‌సీఎస్ సభ్యుడిగా ఆయన సాగర భూభౌతిక అధ్యయనాలను చేపడతారు. సముద్రాల్లో ఉండే భూభాగం మధ్యలో చొచ్చుకుని వచ్చినట్లుండే భారీ శిలల (కాంటినెంటల్ షెల్ఫ్)పై అధ్యయనం, వాటి ఉపరితల సరిహద్దుల నిర్ధారణ లాంటి బాధ్యతలను రవీంద్ర నిర్వర్తించాల్సి ఉంటుంది. ధ్రువప్రాంతాల్లో పర్యావరణ మార్పులపై పరిశోధనలు సాగించాల్సి ఉంటుంది. |
జూన్ - 14
|
| ¤ 'ది అమెరికన్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్'లో సభ్యుడిగా భారత అమెరికన్ శాస్త్రవేత్త సేథురామన్ పంచనాథన్ నియమితులయ్యారు. » సేథురామన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు పూర్వ విద్యార్థి. |
జూన్ - 15
|
¤ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) నూతన అధ్యక్షుడిగా శివ్‌కుమార్ రుంగేటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » సీనియర్ ఉపాధ్యక్షుడిగా వెన్నం అనిల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాప్సీ 97వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. 2014-15 సంవత్సరానికి వీరు బాధ్యతలు నిర్వహిస్తారు. » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక వృద్ధే ఫ్యాప్సీ లక్ష్యమని అధ్యక్షుడు శివకుమార్ రుంగేటా ప్రకటించారు. ¤ హైదరాబాద్‌లోని కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్, కన్సల్టెంట్ ఆంకో ప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ పి.రఘురాం ఏబీఎస్ఐ (అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. » కోల్‌కతాలో జరిగిన సర్వసభ్య సమావేశంలో రఘురాంను ఎన్నుకున్నారు. 2014-15 కాలానికి డాక్టర్ రఘురాం ఏబీఎస్ఐ ప్రెసిడెంట్ (ఎలెక్ట్)గా వ్యవహరిస్తారు. అనంతరం 2015-16 కాలానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. |
జూన్ - 17
|
¤ హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. » జస్టిస్ అశుతోష్ మోహంతాను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు, జస్టిస్ దామా శేషాద్రినాయుడును కేరళ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ప్రకటన జారీ చేశారు.¤ భారతీయ సంతతికి చెందిన వివేక్ బద్రీనాథ్ ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జరిగే తదుపరి సర్వసభ్య సమావేశం వరకూ ఆయన ఈ బాధ్యతలను నిర్వహిస్తారు.¤ తమ తమ రంగాల్లో అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు భారత సంతతికి చెందిన ప్రతిష్ఠ ఖన్నా అనే విద్యార్థిని సహా పదిమంది యువతీ యువకులకు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. వీరిని 'ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్'గా ఎంపిక చేసింది. » ఢిల్లీలో జన్మించిన ప్రతిష్ఠ మేరీల్యాండ్ రాష్ట్రంలోని లారెల్ నగరంలో నివాసముంటోంది. ప్రస్తుతం ఆమె బాల్టిమోర్ కౌంటీలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో డిగ్రీ చేస్తోంది. విశ్వవిద్యాలయానికి చెందిన 'డ్రీమర్స్ ఫర్ డ్రీమర్స్' విద్యార్థి సంఘంలోనూ, మరో రెండు కమిటీల్లోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు. » ప్రతిష్ఠ సహా ఈ పదిమంది 'డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్ (డీఏసీఏ)' కూడా అందుకున్నారు. |
జూన్ - 18
|
| ¤ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు ఏపీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. » రాష్ట్ర విభజన అనంతరం ఢిల్లీ పాత్ర కీలకంగా మారిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకం చేసింది.¤ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ తోప్నో నియమితులయ్యారు. |
జూన్ - 19
|
¤ ముంబయి మెట్రో రైలు మొదటి పైలట్‌గా రూపాలీ చవాన్ రికార్డు సృష్టించారు. » రూపాలీ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ చేసింది. ముంబయి మెట్రో రైలు పైలట్లుగా మొత్తం 64 మంది ఎంపిక కాగా వీరిలో అయిదుగురు మహిళలు ఉన్నారు. 27 సంవత్సరాల రూపాలీ అయిదుగురు మహిళల్లో అత్యంత చిన్న వయస్కురాలు కావడం విశేషం. మొత్తం 64 మందిలో రూపాలీకి మొదటి పైలట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది. |
జూన్ - 22
|
| ¤ భారత్‌కు చెందిన 11 ఏళ్ల చిన్నారి ప్రేరణ పాయ్ రూపొందించిన రెండు ప్రయోగాలు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికయ్యాయి. » చిన్నారి శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో ఇవి ఎంపికయ్యాయి. క్యూబ్స్ ఇన్ స్పేస్ (సీఐఎస్) గత నెలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని కింద అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయోగాత్మక పేలోడ్లను రూపొందించాలని విద్యార్థులకు పిలుపునిచ్చింది. » ఈ పోటీలో సీఐఎస్ 100 ప్రయోగాలను ఎంపిక చేసింది. వాటిలో ప్రేరణ రూపొందించిన ప్రయోగాలు రెండు ఉన్నాయి. వీటిని ఈ నెల 26న అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. » ప్రేరణ ప్రతిపాదించిన ఒక ప్రయోగం అంతరిక్షంలో వాతావరణ పీడనం లేకపోవడం వల్ల వివిధ రకాల జిగురులు ఎలా వ్యవహరిస్తాయో తెలుసుకోవడానికి ఉద్దేశించింది. ఇక రెండోది వాతావరణ పీడనం లేకపోవడం వల్ల రోదసిలో సీసాలు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి సంబంధించింది. » ప్రేరణ షార్జాలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూలులో చదువుతోంది. |
జూన్ - 23
|
| ¤ కెనడాలో ఉంటున్న పాకిస్థాన్ మతపెద్ద తాహిర్-ఉల్-ఖాద్రి పాకిస్థాన్‌కు తిరిగివచ్చారు. » పాకిస్థాన్ అనామీ తెహ్రీక్ (పీఏటీ) పార్టీ వ్యవస్థాపకుడైన తాహిర్-ఉల్-ఖాద్రి ఎన్నికల సంస్కరణల కోసం గతేడాది దేశంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. » నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించేందుకే ఆయన పాక్‌కు తిరిగొచ్చినట్లు పార్టీ ప్రకటించింది. » ఈ నేపథ్యంలో ఖాద్రీ ప్రయాణిస్తున్న విమానం ఇస్లామాబాద్‌లో దిగాల్సి ఉండగా, ప్రభుత్వం దాన్ని లాహోర్‌కు మళ్లించింది. ఆయన దేశ రాజధానిలో దిగితే అశాంతి తలెత్తవచ్చనే ఆందోళనతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. |
జూన్ - 24
|
| ¤ కోల్‌కతాలోని రెయిన్‌బో అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఏంజెలా బెర్నాడెట్టె రైల్ అనే అనాథ యువతి అమెరికా విదేశాంగశాఖ నిధులతో కొనసాగుతున్న కమ్యూనిటీ కాలేజ్ ఇనీషియేటివ్ ప్రోగ్రాం (సీసీఐపీ) ద్వారా అమెరికాలో చదివేందుకు ఎంపికైంది. » సీసీఐపీలో భాగంగా ఆ దేశంలోని వివిధ కమ్యూనిటీ కళాశాలల్లో చదివేందుకు భారత్ నుంచి 35 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 19 ఏళ్ల ఏంజెలా ఒకరు. » చిన్నారులకు బోధన ఎలా చేయాలో నేర్పించే 'ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సు' చేసేందుకు ఆమె వాషింగ్టన్ లేక్‌వుడ్‌లో ఉన్న పియర్స్ కమ్యూనిటీ కళాశాలలో చేరేందుకు ఎంపికైంది.¤ కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. |
జూన్ - 25
|
¤ బర్సన్ - మార్స్ టెల్లర్ ఆధ్వర్యంలోని గ్లోబల్ పబ్లిక్ రిలేషన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ట్విట్టర్‌లో ఎక్కువ మంది అనుసరించే వ్యక్తుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగో స్థానానికి చేరుకున్నారు. » ఇప్పటికే భారతదేశంలో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న మోడీ ఇప్పుడు ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. » ఈ జాబితాలో మొదటి, రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు సుశీలో బంబాంగ్ యుధయోనో మూడో స్థానంలో నిలిచారు. » ఒబామాకు 4.36 కోట్లు, పోప్‌కు 1.4 కోట్లు, సుశీలోకు 50.6 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. మోడీ 49,81,777 మద్దతుదారులతో నాలుగో స్థానంలో నిలిచారు. వైట్‌హౌస్ 49,80,207 అనుయాయులతో అయిదో స్థానంలో ఉంది. » ప్రపంచంలోని 161 దేశాలకు చెందిన 645 మంది వ్యక్తుల, సంస్థల ట్విట్టర్ ఖాతాలను ఈ సంస్థ పరిశీలించింది. » ఈ సంస్థ నిర్వహించిన మరో అధ్యయనం ప్రకారం పోప్ ఫ్రాన్సిస్, వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మాదురో ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులుగా నిలిచారు.¤ సింగపూర్‌లో స్థిరపడిన భారత సంతతి న్యాయమూర్తి జస్టిస్ వి.కె.రజా (57 సంవత్సరాలు) సింగపూర్ అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. » రజా 2004లో సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. |
జూన్ - 26
|
¤ జర్మనీలోని బ్రాడెన్‌బర్గ్‌లో ఉన్న అట్లాండిస్‌బర్గ్ నగర మేయర్‌గా ప్రవాసాంధ్రుడు గుజ్జుల రవీంద్రరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. » రవీంద్ర రెడ్డి 1993 నుంచి 21 ఏళ్లుగా ఈ నగరానికి మేయర్‌గా కొనసాగుతున్నారు. » రవీంద్ర రెడ్డి ప్రముఖ సీసీఐ నేత, ఒంగోలు మాజీ ఎంపీ యలమంద రెడ్డి, మహిళాభ్యుదయవాది సరళాదేవి దంపతులకు భద్రాచలంలో జన్మించారు. » 2012లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అత్యంత ప్రభావశీల ప్రవాసాంధ్రుడి అవార్డును రవీంద్ర రెడ్డి అందుకున్నారు.¤ 'హీరోస్ ఆఫ్ ఫిలాంథ్రపీ ఇన్ ఆసియా పసిఫిక్' పేరుతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సమాజం కోసం దానం చేస్తున్న పారిశ్రామికవేత్తలు, కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. » ఈ జాబితాలో మొత్తం 48 మంది ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, మలేసియా, ఫిలిప్ఫీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్‌లాండ్ నుంచి నలుగురి చొప్పున ఈ జాబితాలో స్థానం పొందారు. » భారత్ నుంచి ఈ జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని భార్య రోహిణి నీలేకని, ఔషధరంగ దిగ్గజం అజయ్ పిరమాల్, లుపిన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ దేశ్‌బంధు గుప్తా, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆశిష్ ధావన్ ఉన్నారు. వీరి దాతృత్వ కార్యక్రమాలను ఫోర్బ్స్ పత్రిక విశేష కార్యక్రమాలుగా అభివర్ణించింది.¤ జమ్మూ కాశ్మీర్‌లో పుట్టి పెరిగిన రువిద సలామ్ కాశ్మీర్ నుంచి తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ అధికారిణిగా గుర్తింపు పొందింది. » సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన ఆమె హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేసింది. తమిళనాడు క్యాడర్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించారు. |
జూన్ - 27
|
| ¤ తెలంగాణ రాష్ట్రంలో 'ఆంగ్లో ఇండియన్' కోటాలో ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్‌కు చెందిన జెరార్డ్ కార్ (58 సంవత్సరాలు)ను 'ఫెడరేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ ఇన్ ఇండియా' ప్రతిపాదించింది. రాష్ట్రంలో ఒకే ఒక ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సీటు ఉంది. |
|
|