నవంబరు - 2014 నివేదికలు - సర్వేలు


నవంబరు - 2 
¤ వాతావరణ మార్పులపై డిసెంబరులో పెరూ  రాజధాని లిమాలో ప్రపంచ దేశాలు సమావేశం అవుతున్న నేపథ్యంలో ఐపీసీసీ తన అయిదో నివేదికను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు:

 పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోకపోతే పెనుముప్పు తప్పదని నివేదిక పేర్కొంది.

 మూడు కీలక కర్బన ఉద్గారాల విడుదల గత ఎనిమిది లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత గరిష్ఠస్థాయికి చేరిందని తెలిపింది. దీంతో మరో 86 సంవత్సరాల్లో భూగోళం ఉష్ణోగ్రత మరో నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా కరవు కాటకాలు, వరదలు, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, కొన్ని జీవజాతులు అంతరించిపోవడం లాంటి విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించింది.

 ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఉష్ణోగ్రతల పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్ లేదా అంత కంటే తక్కువకు పరిమితం చేయడం ఒక్కటే మార్గమని తెలిపింది.

 ఇందుకోసం 2010 - 2050 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదలను 70 నుంచి 40 శాతానికి తగ్గించుకోవడంతో పాటు 2100 నాటికి సున్నా శాతాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవాలని ప్రపంచ దేశాలను ఐపీసీసీ కోరింది.

 ఐపీసీసీ - ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్.
నవంబరు - 4 
¤ దేశంలో అత్యధిక అంతర్జాల వినియోగదారులున్న నగరంగా ముంబయి నిలిచింది. దేశం మొత్తం మీద 24.3 కోట్ల మంది అంతర్జాలాన్ని వినియోగిస్తుంటే, వారిలో 1.64 కోట్ల మంది ముంబయిలోనే ఉన్నారని 'భారత అంతర్జాల చరవాని సంఘం' నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది.      
» రెండో స్థానంలో దిల్లీ(1.21 కోట్లు) నిలిచింది. దేశంలోని మొదటి 8 నగరాల్లో ఏడాది కాలంలో 50% పురోగతి సాధించిన ప్రాంతంగా దిల్లీ నిలించింది.      
» ముంబయి, దిల్లీ, కోల్‌కతా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణె నగరాల్లోనే 5.8 కోట్లకు పైగా అంతర్జాల వినియోగదారులు ఉన్నారు.
¤ భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఉగ్రవాద గ్రూపులను పాకిస్థాన్ ఉపయోగించుకుంటోందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ తన నివేదికలో అమెరికా కాంగ్రెస్‌కు తెలిపింది. ఆఫ్ఘానిస్తాన్, భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న మిలిటెంట్లు పాక్ భూభాగంలోనే అడ్డా వేశారని నివేదికలో పేర్కొంది. పొరుగు దేశాలను దెబ్బతీయడం ద్వారా ప్రాంతీయ అస్థిరతకు ఈ గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది.      
» ఆఫ్ఘాన్ పరిస్థితిపై ఆరు నెలలకోసారి అమెరికన్ కాంగ్రెస్‌కు ఇచ్చే నివేదికలో భాగంగా పెంటగాన్ ఈ విషయాలను వెల్లడించింది.
నవంబరు - 7 
¤ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఈసీఏ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేశారు.

ముఖ్యాంశాలు
 2015లో భారత ఉద్యోగులకు సగటున 10.9 శాతం వరకు వేతనాలు పెరగనున్నాయి.

 2015లో పాకిస్థాన్‌లో సగటున 12 శాతం మేర ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.

 జపాన్‌లోని ఉద్యోగులు 2015లో అతి తక్కువ వేతన పెంపు 2.3%ని పొందనున్నారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏమీ పెరగనట్టే.

 చైనాలోని కంపెనీలు ఈ సారీ సగటున 8 శాతం మేర జీతాలను పెంచాలని భావిస్తున్నాయి. ద్రవ్యోల్బణం తర్వాత కూడా వేతన పెంపు 5.5 శాతంగా ఉంటుంది.

 మొత్తం మీద ఆసియాలో సగటున 7.2 శాతం మీర వేతనాలు పెరగనున్నాయి. అందులో నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసివేస్తే 2.7 శాతం అధికమైనట్లు లెక్క. 

 అంతర్జాతీయంగా వేతన పెంపు వచ్చే ఏడాది 5.8 శాతంగా ఉండనుంది. ప్రస్తుత ఏడాది పెరిగింది 5.6 శాతం. 
నవంబరు - 8
¤ మతిమరుపుతో బాధపడేవారి సంఖ్య 2050 నాటికి భారత్‌లో కోటీ ఇరవై లక్షలకు, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 7 కోట్ల పది లక్షలకు చేరనుందని అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ (ఏడీఐ) సంస్థ 'డెమెన్సియా ఇన్ ఆసియా పసిఫిక్ రీజియన్' పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

      

» దిల్లీలో జరిగిన ఏడీఐ 17వ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ సదస్సులో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ ఈ నివేదికను విడుదల చేశారు.
నవంబరు - 13
¤ ప్రపంచంలోని అత్యంత వినూత్న, ప్రభావశీల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అంతర్జాతీయ గణాంక సంస్థ కేపీఎంజీ రూపొందించిన జాబితాలో ఆరు భారత ప్రాజెక్టులకు చోటు లభించింది.
      

» 'కేపీఎంజీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 100: వరల్డ్ మార్కెట్ రిపోర్ట్' లో దిల్లీ మెట్రో, యమునా ఎక్స్‌ప్రెస్ వే, టాటా పవర్‌కు చెందిన ముంద్రా అల్ట్రా మెగాపవర్ ప్రాజెక్టు (గుజరాత్), గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ (గిఫ్ట్) ఇంటర్‌సెప్టార్ సీవేజ్ సిస్టమ్, నర్మదా కాలువపై సౌర విద్యుత్తు ప్రాజెక్టులు చోటు పొందాయి.
      

» రాజధాని దిల్లీ, ఆగ్రా నగరాలను కలుపుతూ 2012లో 165 కిలోమీటర్ల మేర 1.9 బిలియన్ డాలర్ల (ప్రస్తుతం రూ.11,400 కోట్లకు సమానం) ఖర్చుతో నిర్మించిన 6 లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్ వే, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు దేశ ఆర్థిక వృద్థికి తోడ్పడుతోంది.
      

» ప్రభుత్వ పథకాలు సమర్థంగా, ప్రభావశీలంగా ఉంటాయనేందుకు 2.3 బిలియన్ డాలర్ల (రూ.13,800 కోట్లు) దిల్లీ మెట్రో ప్రాజెక్టు నిదర్శనం. మొదటి లైన్ ప్రారంభించిన పదేళ్ల తర్వాత, విస్తరణ సాగుతూనే ఉంది.
      

» గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలకు సేవలందించేలా గుజరాత్‌లో 4.4 బిలియన్ డాలర్ల (రూ.26,400 కోట్లు) పెట్టుబడితో చేపట్టిన ముంద్ర అల్ట్రామెగా పవర్ థర్మల్ ప్రాజెక్టు, ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్టుల్లో మైలురాయిగా చెప్పొచ్చు.
      

» నర్మదా కాలువపై 17.9 మిలియన్ డాలర్ల (రూ.108 కోట్లు) పెట్టుబడితో 5.5 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు ఫలకాలు, ప్రాజెక్టు వల్ల నీరు ఆవిరికాకపోవడంతోపాటు పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి జరుగుతుంది. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) ఈ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో 25 ఏళ్లు నిర్వహించనుంది.
      

» రవాణా, అనుసంధానం, అధునాతన మౌలిక సదుపాయాలతో 20 బిలియన్ డాలర్ల (రూ.1.20 లక్షల కోట్లు) తో నిర్మితమవుతున్న 'గిఫ్ట్' సంప్రదాయ ఆర్థిక సేవలు, ఐటీ కేంద్రాలకు చిరునామాగా నిలుస్తుంది.
నవంబరు - 16 
¤ 'స్నాతకోత్తర విద్యార్థుల గమన తీరు తెన్నులు - 2014' పేరిట బ్రిటిష్ కౌన్సిల్ నివేదికను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు:

 వచ్చే దశాబ్దంలో విద్యార్థుల గమ్యస్థానం అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ దేశాలు అవుతాయి.

 అత్యధిక సంఖ్యలో విద్యార్థులను విదేశాలకు పంపడంలో చైనా, భారత్ మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. వచ్చే పదేళ్లలో భారత్ నుంచి విదేశాల్లో చదివే విద్యార్థుల సంఖ్య శరవేగంగా పెరుగుతుంది.

 2024 నాటికి భారత్‌లో స్నాతకోత్తర (పీజీ) విద్యలో చేరే వారి సంఖ్య 4.80 కోట్లు ఉంటుంది. అదే సమయంలో చైనాలో 3.70 కోట్లు, అమెరికాలో 2.20 కోట్లు, ఇండోనేషియాలో 1.10 కోట్ల మంది ఉంటారు.

 అత్యధిక సంఖ్యలో విద్యార్థులను విదేశాలకు పంపడంలో చైనా ప్రథమ స్థానంలో ఉండనున్నప్పటికీ, అక్కడ యువకుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 10.9 కోట్ల నుంచి 2024 నాటికి 7.90 కోట్లకు తగ్గనుంది. అదే సమయంలో భారత్‌లో వారి సంఖ్య పెరగనుంది.

 చైనాలో యువకుల సంఖ్య తగ్గనున్నప్పటికీ 2024 నాటికి 3.38 లక్షల మందిని విదేశాలకు పంపుతూ అది మొదటి స్థానంలో నిలువనుంది. భారత్‌లో 2.09 లక్షల మంది విదేశాల్లో పీజీ చదువుతారు. 2024 నాటికి చైనా నుంచి 44 శాతం మంది అమెరికాలో స్నాతకోత్తర విద్యలో చేరితే, భారత్ నుంచి 54 శాతం మంది ఉండనున్నారు. అంటే అమెరికాకు పెద్ద మార్కెట్‌గా భారత్ నిలవనుంది.

 8.3 శాతం విద్యార్థుల పెరుగుదలతో నైజీరియా మొదటి స్థానంలో ఉండగా, భారత్ 7.5 శాతం, ఇండోనేషియా 7.2 శాతం, పాకిస్థాన్ 6.4 శాతం, సౌదీ అరేబియా 5.2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉంటాయి.

 మొత్తం 4.07 లక్షల మంది విదేశీ విద్యార్థులతో అమెరికా ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్ (2.41 లక్షలు), జర్మనీ (1.13 లక్షలు), ఆస్ట్రేలియా (1.12 లక్షలు) ఉంటాయి.

 అమెరికాకు ఏటా 4 శాతం విద్యార్థులు పెరుగుతారు. ఇంగ్లండ్‌కు మాత్రం 3.5 శాతానికి తగ్గిపోతారు. 2007 - 12 వరకు ఇంగ్లండ్‌లో వృద్ధి రేటు 4.1 శాతంగా నమోదైంది.
 ఇంగ్లండ్‌లో చదివే భారతీయుల సంఖ్య తగ్గనుంది. చైనా నుంచి మాత్రం పెరగనుంది. ప్రస్తుతం భారత విద్యార్థులు అమెరికా, ఆ తర్వాత ఇంగ్లండ్‌లో అత్యధికంగా చదువుకుంటున్నారు. 2024 నాటికి ఇంగ్లండ్ స్థానాన్ని ఆస్ట్రేలియా ఆక్రమించనుంది.
నవంబరు - 19 
¤ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ 'ఓఈసీడీ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా' పేరుతో నిర్వహించినసర్వేను విడుదల చేసింది.      
» ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5.4 శాతంగా ఉంటుందని సర్వేలో వెల్లడించింది. 2015-16లో 6.6 శాతం వృద్ధి చెందగలదని ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఓఈసీడీ తెలిపింది. 2016-17లో భారత వృద్ధి రేటు 6.8 శాతానికి చేరగలదని పేర్కొంది.      
» 2015-16 సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగలదని, ఆ తర్వాత ఏడాది 5.6 శాతానికి పెరగగలదని ఓఈసీడీ అంచనా వేసింది.
¤ స్మార్ట్ ఫోన్ల రాకతో పెరిగిన డేటా వాడకం వల్ల ఈ ఏడాది చివరికి భారత్‌లో అంతర్జాల (ఇంటర్నెట్) వినియోగదారుల సంఖ్య 30.2 కోట్లకు చేరుతుందని భారత అంతర్జాల, మొబైల్ సంఘం (ఐఏఎంఏఐ), ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్ రూపొందించిన నివేదికలో  వెల్లడించాయి.      
» అంతర్జాల వినియోగదారుల విషయంలో అమెరికాను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానానికి చేరుకుంటుందని నివేదిక తెలిపింది.      
» ప్రస్తుతం 60 కోట్ల మంది వినియోగదారులతో చైనా, 27.9 కోట్ల మందితో అమెరికా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ది మూడో స్థానం. 
నవంబరు - 21
¤ ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు మహిళలు శారీరక హింసను ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదిక వెల్లడించింది. సుమారు 7 కోట్ల మంది బాలికలకు 18 ఏళ్లకు ముందే వారి ఇష్టానికి విరుద్ధంగా పెళ్లయిపోతున్నట్లు ఈ నివేదిక తెలిపింది.
      

» ప్రపంచ వ్యాప్తంగా ఏడు శాతం మంది స్త్రీలు వారి జీవిత కాలంలో అత్యాచారం ముప్పును ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.
నవంబరు - 23
¤ భారత్‌లో 2012-13లో తీవ్రవాద కార్యకలాపాలు 70 శాతం పెరిగాయని ప్రపంచ తీవ్రవాద సూచీ-2014 వెల్లడించింది.
      

» తీవ్రవాద కార్యకలాపాల వల్ల 2012-13లో 238 నుంచి 404కు మరణాలు పెరిగినట్లు పేర్కొంది. వీటిలో ఎక్కువగా నక్సల్స్ కార్యకలాపాల వల్లే జరిగినట్లు తెలిపింది.
      

» ఈ సూచీని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్, పీస్(ఐఈపీ) రూపొందించింది.


¤ అణ్వాయుధ కార్యకలాపాల్లో పాకిస్థాన్ వేగంగా వృద్ధి చెందుతోందని అమెరికా విదేశాంగ సంబంధాల మండలి నివేదిక వెల్లడించింది. 2020 నాటికి పాకిస్థాన్ దగ్గర 220 అణ్వాయుధాలు ఉంటాయని పేర్కొంది.
      

» చైనా దాదాపు 250 అణ్వాయుధాలను కలిగి ఉందని నివేదిక వెల్లడించింది. భారత్ వద్ద 90 నుంచి 110 వరకు అణ్వాయుధాలు ఉన్నాయని తెలిపింది.
నవంబరు - 24
¤ 'ఫ్యూచర్ ఆఫ్ ఇండియా - ది విన్నింగ్ లీప్' పేరుతో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను విశ్లేషించింది.
ముఖ్యాంశాలు
:
      

» 2034 నాటికి 9 శాతం వార్షిక వృద్ధిరేటుతో 10 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.620 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సత్తా యువ భారతానికి ఉంది.
      

» 10 ట్రిలియన్ డాలర్లలో 40 శాతం వాటా కొత్త ఆలోచనలు, కొత్త పరిష్కారాల నుంచి సమకూరుతుంది.
      

» ప్రస్తుతం 5 శాతం వృద్ధిని సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి దిశగా ముందుకు సాగడంలో విద్య, ప్రజారోగ్యం, వ్యవసాయం, రిటైల్, విద్యుత్తు, ఉత్పత్తి రంగం, ఆర్థిక సేవలు, పట్టనీకరణ లాంటి కీలక రంగాలు ప్రధాన పాత్ర వహిస్తాయి.
      

» ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ.124 లక్షల కోట్లు) చేరువలో ఉంది.
      

» 9 శాతం జీడీపీ వృద్ధి రేటు ద్వారా తలసరి ఆదాయం ఇప్పుడున్న దాదాపు 1500 డాలర్ల (సుమారు రూ.93 వేలు) నుంచి 7000 డాలర్ల (సుమారు రూ.4.3 లక్షలు) స్థాయికి ఎగబాకవచ్చు.
      

» పీడబ్ల్యూసీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ డెన్సీస్ నాలీ. పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్మన్ దీపక్ కపూర్.
నవంబరు - 25
¤ నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరు పట్ల దేశ ప్రజల్లో 72 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు హిందీ వార్తా ఛానల్ 'న్యూస్ నేషన్' జరిపిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది.
      
» పనితీరు ప్రాతిపదికగా మంత్రుల్లో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొదటి స్థానంలో నిలిచారని ఛానల్ పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఉన్నారు.
నవంబరు - 30
¤ ఈ శతాబ్దం ద్వితీయార్థంలో భారత్‌లోని తీరప్రాంత నగరాలైన ముంబయి, కోల్‌కతలకు వరద ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల విభాగం (ఐపీసీసీ) నివేదికను వెల్లడించింది.
      

» పలు ప్రాంతాల్లో వేడి గాలులు, కరవు, వరదలు, తుపానులు లాంటి ప్రకృతి విపత్తులు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉందని, అలాంటి పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటున్న 20 దేశాల్లో భారత్ ఒకటని, అందులో ముంబయి, కోల్‌కత ప్రాంతాల్లో ఈ పరిస్థితి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐపీసీసీ నివేదిక వెల్లడించింది.