అక్టోబరు - 2014 నివేదికలు - సర్వేలు


అక్టోబరు - 5 
¤ దేశంలోనే అత్యధిక పోలీస్ స్టేషన్లు (1679) ఉన్న రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించింది.
      
» బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) 2013 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
     
 » పోలీసు వ్యవస్థ, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏటా బీపీఆర్‌డీ నివేదిక విడుదల చేస్తోంది.
      
» 2002లో దేశంలో 14.68 లక్షల మంది పోలీసులు ఉండగా, 2012 జనవరి నాటికి ఈ సంఖ్య 22.09 లక్షలకు పెరిగింది. అయితే ప్రతి లక్ష మంది జనాభాకు 2002లో 718 మంది పోలీసులు ఉండగా 2012 నాటికి 551కి పడిపోయింది.
      
» ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమంది జనాభాకు 665 మంది పోలీసులు ఉన్నారు.
      
» మహిళా పోలీస్ స్టేషన్ల విషయంలో 196 స్టేషన్లతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 
అక్టోబరు - 7
¤ 'క్లైమెట్ అసెస్‌మెంట్ టూల్ ఫర్ హైదరాబాద్' పేరిట జర్మనీ విద్యా విభాగం సహకారంతో జీహెచ్ఎంసీ, ప్రభుత్వం సంయుక్తంగా నాలుగేళ్ల పాటు పరిశోధన చేసి రూపొందించిన నివేదికను విడుదల చేశారు.
ముఖ్యాంశాలు

      
» ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏడాదికి రెండుసార్లు 8 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదవుతోంది. వాతావరణంలో పెరుగుతున్న బొగ్గుపులుసు వాయువులు, కాలుష్య ఉద్గారాల వల్ల వర్షపాతంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితి 2050 నాటికి మరో 60 శాతం తీవ్రమవుతుంది. మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయి.
      
» వాతావరణ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం ఏటా 12 రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో 2050 నాటికి ఏటా 20 రోజులు, 2100 నాటికి 40 రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉంటాయి.      
» హెచ్ఎండీఏ 2013 బృహత్తర ప్రణాళికలో వాతావరణ మార్పుల అంచనాలను పొందుపరచాలి.
      
» భవిష్యత్తులో వరదలకు గురయ్యే ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలి.
     
 » వాతావరణ మార్పులపై స్వచ్ఛంద సంస్థలు చర్చలు నిర్వహించాలి. ఈ విషయంలో శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేపట్టాలి.
¤ పని చేయడానికి ఎక్కువ మంది కోరుకునే దేశాలకు సంబంధించి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, టోటల్ జాబ్స్ డాట్ కామ్, ద నెట్‌వర్క్ సంయుక్తంగా రూపొందించిన నివేదికను విడుదల చేశాయి
.
ముఖ్యాంశాలు

      
» పని చేయడానికి ఎక్కువ మంది కోరుకునే దేశాల్లో భారత్‌కు 18వ స్థానం దక్కింది. అమెరికా తొలి స్థానంలో ఉంది.
      
» తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రిటన్, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇటలీ, స్వీడన్ ఉన్నాయి.
అక్టోబరు - 8 
¤ డెంగీ కేసుల సంఖ్య భారత్‌లో అధికారికంగా చాలా తక్కువగా నమోదవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.      
» భారత్‌లో 2006 - 2012 మధ్య ఏటా 60 లక్షల డెంగీ కేసులు నిర్ధరణ అయ్యాయని, ఇది అధికారికంగా నమోదైన సంఖ్య కంటే 300 రెట్లు అధికమని అధ్యయనకర్త డొనాల్డ్ షెపర్డ్ తెలిపారు. మొత్తం మీద దీని మూలంగా భారత్‌పై ఏటా కనీసం రూ.6,815 కోట్ల ఆర్థిక భారం పడుతోందని చెప్పారు.      
» ఇతర రాష్ట్రాల్లో కంటే డెంగీ కేసుల నమోదు బాగా జరుగుతున్న తమిళనాడులో చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని, అందువల్ల డెంగీ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.      
» బ్రాండీస్ విశ్వవిద్యాలయం, ఢిల్లీలోని ఇన్‌క్లీన్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, మదురైలోని భారత వైద్య పరిశోధన మండలి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.      
» ప్రతి సంవత్సరం 100 కు పైగా దేశాల్లో 5 కోట్ల నుంచి 39 కోట్ల మంది డెంగీ బారిన పడుతున్నారు. కనీసం 20 వేల మంది మృత్యువాత పడుతున్నారు. మరే దేశంలోనూ లేనంతగా భారత్‌లోనే ఎక్కువమంది డెంగీ బారినపడుతున్నారు. 
అక్టోబరు - 13
¤ ప్రపంచ ఆకలి సూచిక - 2014లో భారత్ స్థానం కాస్త మెరుగుపడింది. మొత్తం 76 దేశాల్లో భారత్ 55వ స్థానంలో నిలిచింది. గతేడాది పొందిన 63వ స్థానం కంటే ఈసారి కాస్త మెరుగుపడింది.  
    
» అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ, స్వచ్ఛంద సంస్థ 'వెల్త్ హంగర్ లైఫ్' సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.  
    
» ఈ జాబితాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ 57వ స్థానాల్లో నిలిచాయి.      

» నేపాల్ (44వ స్థానం), శ్రీలంక (39) భారత్ కంటే ముందు స్థానాల్లో నిలిచాయి.      

» కొన్నేళ్లుగా అయిదేళ్ల లోపు చిన్నారుల్లో ఉండాల్సిన కనీస బరువు విషయంలో భారత్ కాస్త పురోగతిని సాధించిందని నివేదిక తెలిపింది.
అక్టోబరు - 15
¤ క్రెడిట్ సూయిజ్ గ్లోబల్ వెల్త్ నివేదికను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు      
» అత్యంత ధనవంతులు (అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌కు 11వ స్థానం దక్కింది.
      
» భారత్‌లో 1800 మంది అత్యంత ధనవంతులు (50 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.300 కోట్ల కంటే అధిక సంపద) ఉన్నారు.
      
» అమెరికా 62,800 మంది సంపన్నులతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మొత్తం అంతర్జాతీయంగా ఉన్న ధనవంతుల సంఖ్యలో 49 శాతానికి సమానం.
      
» 7,600 మంది మిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది.
అక్టోబరు - 16
¤ భారత్‌లో పదవీ విరమణ విధానం దారుణంగా ఉందని ఓ అధ్యయనం పేర్కొంది. దాదాపు 25 దేశాల్లో పదవీ విరమణ విధానంపై చేసిన అధ్యయనంలో భారత్ అథమ స్థానంలో ఉంది.
     
 » ఈ జాబితాలో  డెన్మార్క్ అగ్రస్థానంలో ఉంది.
      
» భారత్‌లో ఆరు కంటే తక్కువ శాతం మంది శ్రామిక జనాభా ప్రైవేటు పింఛను ప్రణాళికల కింద ఉన్నారని అధ్యయనం తేల్చింది.
      
» మెల్‌బోర్న్ మెర్సర్ గ్లోబల్ పింఛను సూచీ (ఎంఎంజీపీఐ)-2014 పేరిట ఈ అధ్యయన ఫలితాలను విడుదల చేశారు.
అక్టోబరు - 24 
¤ ప్రపంచవ్యాప్తంగా కుబేరులను అందించిన విశ్వవిద్యాలయాల జాబితాలో ముంబయి వర్సిటీ 9వ స్థానంలో నిలిచింది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న 12 మంది పూర్వ విద్యార్థులు వంద కోట్లకు అధిపతులు అయ్యారు.
      
» వీటి తర్వాతి స్థానాల్లో వరుసగా కర్నెల్, స్టాన్‌ఫోర్డ్, కాలిఫోర్నియా, బెర్కెలి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ విశ్వవిద్యాలయాలు నిలిచాయి.      

» జాబితాలోని 20 విశ్వవిద్యాలయాల్లో 16 అమెరికాకు చెందినవే.     

» వెల్త్-ఎక్స్, యూబీయస్ బిలియనీర్ గణాంకాల నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 
అక్టోబరు - 27
¤ 'ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్' పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదికను విడుదల చేసింది.

ముఖ్యాంశాలు
:
      

» 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5.6%గా నమోదు కావచ్చు. 2015 - 16 లో 6.4 శాతం, 2016 - 17లో 7 శాతం వృద్ధి రేటు ఉండొచ్చు.
      

» జీఎస్‌టీ (వస్తువులు, సేవల పన్ను) అమలు దిశగా ప్రభుత్వం చర్యలను చేపట్టే అవకాశం ఉండటమే వృద్ధికి కారణం.
     

 » సంస్కరణలు అమలుపై ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో దీర్ఘకాలంలో భారత వృద్ధికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.


¤ దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే 'అత్యధిక సంఖ్యలో అనుబంధ కళాశాలలున్న విశ్వవిద్యాలయాల జాబితా'లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అయిదో స్థానంలో నిలిచింది.
      

» అతిపెద్ద అయిదు విశ్వవిద్యాలయాల్లో మూడు మహారాష్ట్రలోనే ఉన్నాయి.


      
» విదేశాల్లో విశ్వవిద్యాలయాలకు అనుబంధ కళాశాలలు ఉండవు. ఉన్నా కొద్ది సంఖ్యలోనే ఉంటాయి.
అక్టోబరు - 28
¤ లింగ భేదాలను రూపుమాపడంలో భారత్ పనితీరు పేలవంగా ఉంది. మొత్తం 142 దేశాల్లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) - 2014 నిర్వహించిన సర్వేలో భారత్ 114వ (గత ఏడాది 101) స్థానంలో నిలిచింది.
     

 » ఆర్థిక భాగస్వామ్యం, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి తదితర అంశాల ఆధారంగా ఈ పనితీరును లెక్కగట్టారు.
      

» మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 68, శ్రీలంక 79, చైనా 87, నేపాల్ 112, పాకిస్థాన్ 141వ స్థానాల్లో నిలిచాయి.
      

» జాబితాలో మొదటి స్థానంలో ఐస్‌లాండ్ నిలిచింది.
     

 » రెండు నుంచి అయిదు స్థానాల్లో వరుసగా ఫిన్లాండ్, నార్వే, స్వీడన్,  డెన్మార్క్ నిలిచాయి.
      

» అమెరికా 20 వ స్థానంలో నిలిచింది.
      

» రాజకీయ సాధికారికత విషయంలో భారత్ మొదటి 20 ఉత్తమ దేశాల్లో నిలవగా; ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల్లో 134వ స్థానంలో నిలిచింది.


¤ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడం వల్ల 2008 నుంచి ఇప్పటివరకు ధనిక దేశాల్లో కనీసం 26 లక్షల మంది పిల్లలు దారిద్య్ర రేఖ కంటే దిగువకు వచ్చేశారని ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునిసెఫ్) సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
     

 » మొత్తం 41 దేశాల్లో బాలల పరిస్థితిపై యునిసెఫ్ అధ్యయనం చేసింది. సంక్షోభం ముగిసిన తర్వాత ఈ దేశాల్లో పేద బాలల సంఖ్య 7.65 కోట్లకు చేరిందని తేలింది.
      

» కుటుంబ ఆదాయం పడిపోవడం వల్ల అనేక దేశాల్లో ప్రజలు ఆర్థికంగా చితికిపోయి, ఆ ప్రభావం పిల్లలపై పడిందని యునిసెఫ్ వెల్లడించింది.
అక్టోబరు - 29
¤ ప్లాట్స్ గ్లోబల్ 250 ర్యాంకింగ్స్‌లో భారత ఇంధన కంపెనీ ఓఎన్‌జీసీ అత్యుత్తమ ర్యాంకు సాధించింది. గత ఏడాది ఈ ఘనతను రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధించింది.
      

» ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన కంపెనీల్లో మంచి పనితీరును కనబరిచిన కంపెనీలకు ఈ ర్యాంకులను కేటాయిస్తారు.
      

» గత ఏడాది 22వ స్థానంలో ఉన్న ఓఎన్‌జీసీ ఈ ఏడాది 21వ స్థానానికి చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 19వ ర్యాంకు నుంచి 22కు పడిపోయింది.
      

» ఈ జాబితాలో ఎక్సాన్ మొబిల్ కార్ప్, షెవ్రాన్, రాయల్ డచ్ షెల్ కంపెనీలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
అక్టోబరు - 30
¤ ప్రపంచ బ్యాంకు వ్యాపారానికి అనువైన 189 దేశాలతో రూపొందించిన నివేదికలో పన్ను చెల్లింపుల దృష్ట్యా భారత్‌కు 156వ స్థానం లభించింది. గతేడాది కంటే భారత్ 2 స్థానాలు కిందికి దిగింది.
    

  » ఈ నివేదికలో బ్రెజిల్ 177వ స్థానంలో నిలిచింది. రష్యా 49, చైనా 120వ స్థానాల్లో నిలిచాయి.
      

» యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా ఈ నివేదికలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.