జనవరి - 2015 అవార్డులు





జనవరి - 2

¤ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరగడానికి కృషి చేసినందుకు ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఈటీవీ - ఆంధ్రప్రదేశ్, ఈటీవీ - తెలంగాణ ఛానళ్లకు పురస్కారం ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.
       » ప్రింట్ మీడియా విభాగంలో 'టైమ్స్ ఆఫ్ ఇండియా - ముంబయి'ని ఎంపిక చేసింది.
       » ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

జనవరి - 8

¤ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రబీంద్రనాథ్ రామోతర్ సహా 15 మంది 'ప్రవాస భారతీయ సమ్మాన్' పురస్కారాలకు ఎంపికయ్యారు.
       » ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా జనవరి 9న ఈ పురస్కారాలను విజేతలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రదానం చేస్తారు.
పురస్కార గ్రహీతలు: సత్య నాదెళ్ల, డొనాల్డ్ రబీంద్రనాథ్ రామోతర్, మాలా మెహతా, డాక్టర్ సంజయ్ రాజారాం, కన్వల్జిత్ సింగ్ భక్షి, రాజ్‌మల్ పరాఖ్, దురైకన్ను కరుణాకరన్, ఎస్సోప్ గూలమ్ పహాద్, షా భరత్ కుమార్ జయంతీలాల్, అష్రాఫ్ పలార్ కన్నుమ్మాళ్, మహేంద్ర నాన్‌జీ మెహతా, ప్రొఫెసర్ నాథూరాం పూరీ, డాక్టర్ లుల్లా కమలేష్, డాక్టర్ నందినీ టాండన్, లార్డ్ రాజ్ లంబా.

జనవరి - 10

¤ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ అందజేసే విక్రమ్ సారాభాయ్ స్మారక పురస్కారానికి 2014-15 సంవత్సరానికి షార్ సంచాలకుడు ఎంవైఎస్ ప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఈ అవార్డు కింద బంగారు పతకంతోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.
       » ఇస్రో ఛైర్మన్లుగా పని చేసిన ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ కస్తూరీ రంగన్,
డాక్టర్ జి.మాధవన్ నాయర్, డాక్టర్ రాధాకృష్ణన్, డీఆర్‌డీవో శాస్త్రవేత్త వీకే సారస్వత్ గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


జనవరి - 13

¤ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహించిన అరుణగ్రహ యాత్ర 'మంగళ్‌యాన్‌'కు అమెరికాకు చెందిన 'జాతీయ అంతరిక్ష సంఘం' (నేషనల్ స్పేస్ సొసైటీ - ఎన్ఎస్ఎస్) పురస్కారం లభించింది. 'స్పేస్ పయనీర్ - 2015' అవార్డును ఇస్రోకు చెందిన మార్స్ ఆర్బిటర్ కార్యక్రమ బృందానికి ప్రకటించింది.
       »  కెనడా లోని టొరంటోలో మే 20 నుంచి 24 మధ్య జరిగే 34వ వార్షిక అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో ఈ అవార్డు అందజేస్తారు.
¤ దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన సైనికుడు లాన్స్ నాయక్ మహమ్మద్ ఫిరోజ్ ఖాన్‌కు మరణానంతరం భారత ప్రభుత్వం సేనా మెడల్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈయన 2013 అక్టోబరు 15న కశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైనికులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందారు.
¤ 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు 2015 సంవత్సరానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు లభించింది. అంతర్జాతీయంగా కేంద్రీయ బ్యాంకుల అధికారుల్లో ఉత్తమ పనితీరు చూపినవారికి బ్రిటిష్ మేగజైన్ ఈ అవార్డును ఇస్తుంది.
       »  మార్చి 12న లండన్‌లో ఈ అవార్డు అందజేస్తారు.
¤ సుప్రసిద్ధ హిందీ సాహతీవేత్త కమల్ కిషోర్ గోయెంకా (77 సంవత్సరాలు)2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక 'వ్యాస్ సమ్మాన్‌'కు ఎంపికయ్యారు.
       »  ఆయన రచించిన 'ప్రేమ్ చంద్ కీ కహానియో కా కాలక్రమానుసార్ అధ్యయన్' పుస్తకానికి ఈ అవార్డు దక్కింది.
       »  ప్రేమ్‌చంద్ రచించిన చిన్న కథలను సంపూర్ణంగా అధ్యయనం చేసి 2012లో కిషోర్ ఈ పుస్తకాన్ని రాశారు. కెకె బిర్లా ఫౌండేషన్ ఏటా అందజేసే 'వ్యాస్ సమ్మాన్' కింద రూ.2.5 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. ఆయన 50కి పైగా పుస్తకాలు రచించారు.

జనవరి - 15

¤ ప్రమాదాల సంఖ్యను తగ్గించినందుకు రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిష్ఠాత్మక భద్రతా అవార్డును ఈ సంవత్సరం ఆర్టీసీ గెలుచుకుంది.
       » దిల్లీలో జరిగిన 26వ జాతీయ రోడ్డు భద్రతా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ అవార్డును ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.రమణారావుకు ప్రదానం చేశారు.

జనవరి - 16

¤ హిందీ భాష ప్రచారానికి తెలుగు-హిందీ సాహిత్య రంగాల్లో, విభిన్న సామాజిక, సాంస్కృతిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న వల్లభనేని హనుమంతరావుకు కోల్‌కతలోని భారతీయ భాషా పీఠం 'సాహిత్య శిరోమణి అవార్డు'ను ప్రకటించింది.
       » హనుమంతరావు గుంటూరు జిల్లాకు చెందినవారు.
¤ పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో అత్యుత్తమ పరిరక్షణ ప్రమాణాలను పాటించినందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2014 సంవత్సరానికి 'పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ' పురస్కారాన్ని ప్రకటించింది.
       » దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం సహజ వాయుశాఖ సహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల కార్యదర్శి సి.పార్థసారధికి ప్రదానం చేశారు.
¤ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఛైర్మన్ ఆర్.కె.త్యాగికి దిల్లీలో జిందాల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఉత్తమ సీఈవో పురస్కారాన్ని ప్రదానం చేసింది.
¤ జమ్మూకశ్మీర్ రాష్ట్రం 2014-15కు సంబంధించిన ఇ-గవర్నెన్స్ జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. జిల్లా స్థాయిలో సమర్థవంతంగా సేవలు నిర్వహించినందుకు ఈ బహుమతి లభించింది.
       » సిబ్బంది, ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని పరిపాలనా సంస్కరణల విభాగం ఈ పురస్కారానికి జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది.

జనవరి - 21

¤ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.
      »  గత సాధారణ ఎన్నికల్లో ప్రలోభాలను సమర్థంగా అడ్డుకున్నందుకు, ఎన్నికల వ్యయాన్ని సజావుగా పర్యవేక్షించినందుకు 'జాతీయ స్థాయి ప్రత్యేక పురస్కారం' విభాగంలో 'బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ - 2014' అవార్డు లభించింది.
      »  ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 450 మంది జిల్లా కలెక్టర్లు, ఎస్పీల పనితీరును విడతల వారీగా పరిశీలించిన జాతీయ ఎన్నికల కమిషన్ ఆనంద్‌ను విజేతగా ఎంపిక చేసింది.
      »  ఎన్నికల నిర్వహణలో జిల్లా యూనిట్‌గా ఉన్నతాధికారుల పనితీరును అంచనా వేసేందుకు, సమర్థ అధికారులను గుర్తించేందుకు 2011లో కేంద్రం ఈ పురస్కారాల్ని ఇవ్వాలని నిర్ణయించగా, ఎంపిక చేయడం ఇదే తొలిసారి.

జనవరి - 22

¤ భారత అమెరికన్ రచయిత్రి ఝుంపాలాహిరి రచించిన 'ది లో ల్యాండ్' పుస్తకానికి 50 వేల అమెరికన్ డాలర్ల (సుమారు రూ.30 లక్షలు) సాహిత్య పురస్కారం లభించింది.
      »  ఒక ప్రాంతం గురించి నేరుగా గానీ, ఆంగ్లానువాదం ద్వారా గానీ చేసిన రచనలకు దక్షిణాసియా స్థాయిలో ఈ పురస్కారాన్ని ఇస్తారు.
      »  జైపూర్‌లో జరుగుతున్న జైపూర్ సాహిత్య ఉత్సవంలో ఈ పురస్కారాన్ని ఆమె తరుఫున ప్రచురణకర్త కరోలిన్ న్యూబరీ స్వీకరించారు.

జనవరి - 24

¤ ప్రముఖ కవయిత్రి అరుంధతీ సుబ్రహ్మణ్యంకు 'కుష్వంత్ సింగ్ స్మారక అవార్డు'ను ప్రకటించారు.
      » జైపూర్‌లో జరుగుతున్న సాహిత్య పండగలో ఆమెకు ఈ బహుమతిని ప్రకటించారు.
      » ఆమె రచించిన 'వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్' కు ఈ గౌరవం దక్కింది.
      » ఆంగ్లంలో రచనలు చేసే, భారతీయ భాషల నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసే కవులకు అందించే ఈ అవార్డును ఈ ఏడాదే ప్రారంభించారు. పురస్కారంతోపాటు రూ. 2 లక్షల నగదును అందజేస్తారు.
¤ పాకిస్థాన్‌లోని పెషావర్ సమీపంలో సైనిక పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో చనిపోయిన 145 మంది విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక సాహస పతకం 'తంగ-ఐ-ఘజాత్‌'ను ప్రకటించింది.

జనవరి - 25

¤ ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విభిన్న రంగాలకు చెందిన మొత్తం 104 మందిని వీటికి ఎంపిక చేశారు.
      » 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ ప్రకటించారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో 17 మంది మహిళలు ఉన్నారు. నలుగురికి మరణాంతరం ఈ పురస్కారాలు ప్రకటించారు.
      » పద్మశ్రీ పురస్కారాలు గెల్చుకున్న తెలుగువారు: ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, రొమ్ముక్యాన్సర్‌పై విశేషకృషి చేస్తున్న పి.రఘురామ్, ప్రముఖ గైనకాలజిస్ట్ అనగాని మంజుల, ప్రముఖ క్రికెటర్ మిథాలిరాజ్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, సినిమా నటుడు కోట శ్రీనివాసరావు, ప్రముఖ కళాకారిణి అవసరాల కన్యాకుమారి.





జనవరి - 29

¤ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఉత్తమ సెంట్రల్ యూనివర్సిటీగా విజిటర్స్ అవార్డుకు ఎంపికైంది.
      » అతి తక్కువ సమయంలో క్షయవ్యాధి నిర్ధారణ చేసే పరీక్షను కనుక్కున్న ప్రొఫెసర్ విజయ్ చౌదరి, డాక్టర్ అమిత్ గుప్తా 'నవ్యత' అవార్డుకు ఎంపికయ్యారు. వీరు దిల్లీ యూనివర్సిటీకి చెందినవారు.
      » ఖగోళ భౌతిక శాస్త్రం, విశ్వోద్భవ శాస్త్రంలో చేసిన పరిశోధనలకు జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి 'పరిశోధన' అవార్డు లభించింది.
      » ఈ పురస్కారాలను ఫిబ్రవరి 4, 5 తేదీల్లో దిల్లీలో జరగనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల మూడో సదస్సులో రాష్ట్రపతి ప్రణబ్ ప్రదానం చేస్తారు.


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment