ఫిబ్రవరి - 2015 అవార్డులు - February 2015 -Awards





ఫిబ్రవరి - 6

¤ 'జ్ఞానపీఠ్ అవార్డు-2014'కి ప్రముఖ మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమడే ఎంపికయ్యారు.
       » రచయిత నమ్వర్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన 'జ్ఞానపీఠ్ ఎంపిక మండలి' నెమడేను జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద రూ.10 లక్షల రూపాయలు ఇచ్చి, సన్మాన పత్రంతో గౌరవిస్తారు.
       » బాలచంద్ర నెమడే 1938లో జన్మించారు. 1963లో కేవలం 16 రోజుల్లో ఆయన రచించిన 'కోసల' నవల మరాఠీ సాహిత్య రంగంలో ఆయనకు పేరు ప్రఖ్యాతలను తెచ్చింది. ఆ తర్వాత జరీలా, జూల్, బిడార్, హిందూ - ఏక్ సముద్ర నవలలతో పాటు ఎన్నో కవితలను రాశారు.
       » ఆయన 1991లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని గెలుపొందారు.
       » మరాఠీ సాహిత్య రంగంలో జ్ఞానపీఠ్ అవార్డు గెల్చుకున్న నాలుగో రచయత నెమడేనే.
¤  భారత రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) ముఖ్య శాస్త్రవేత్త, లిపిడ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఆర్.బి.ఎన్.ప్రసాద్‌కు ప్రతిష్ఠాత్మక వాస్విక్ వార్షిక పారిశ్రామిక పరిశోధన పురస్కారం లభించింది.
       » కొవ్వు (లిపిడ్స్) సంబంధిత శాస్త్ర పరిశోధన విభాగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. రైస్ బ్రాన్ ఆయిల్, కూరగాయల నుంచి ఇంధనాలు, బయో లూబ్రికెంట్లు, డీజిల్ తదితర వాటి అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర నిర్వహించారు.

ఫిబ్రవరి - 9

¤ 57వ గ్రామీ అవార్డులను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ప్రదానం చేశారు. మన దేశానికి చెందిన రికీ కేజ్, నీలా విశ్వానీ పురస్కార గ్రహీతల్లో ఉన్నారు.
       » బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల రికీ కేజ్‌కు 'న్యూ ఏజ్ ఆల్బం' విభాగంలో గ్రామీ లభించింది. దక్షిణాఫ్రికా కళాకారుడు వౌటర్ కెల్లెర్మాన్‌తో కలిసి రికీ కేజ్ మహాత్మాగాంధీ స్ఫూర్తితో 'విండ్స్ ఆఫ్ సంసారా' అనే ఆల్బంను తయారు చేశారు.
       » ఉత్తర కాలిఫోర్నియాలో 1981 ఆగస్టు 5న జన్మించిన రికీ ఎనిమిదేళ్ల వయుసులో బెంగళూరుకు వచ్చారు. బిషప్ కాటన్ బాలుర పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్ దంత వైద్య కళాశాల నుంచి పట్టా పొందారు.
       » ఆయన 2003లో తొలిసారిగా 'కమ్యూనికేటివ్ ఆర్ట్ లాంజ్ ఫ్రం బాంబే' అనే మ్యూజిక్ ఆల్బంను విడుదల చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. ఆ తర్వాత వరుసగా మూడు ఆల్బమ్‌లు విజయవంతం కావడంతో 2008 నుంచి కొన్ని కన్నడ సినిమాలకు సంగీతాన్ని అందించారు. 'విండ్స్ ఆఫ్ సంసారా' రికీ 14వ ఆల్బమ్.
       » మరో గ్రామీ పురస్కారాన్ని భారత్‌కు అందించిన నీలా విశ్వానీ వాస్తవానికి రచయిత్రి. ఆమె చిన్నకథల సంపుటాలను వెలువరించారు. పాకిస్థాన్‌లో బాలికల విద్య కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ జీవిత కథకు (ఐయాం మలాలా!) నీలా విశ్వానీ ధ్వని రూపం (ఆడియో) కల్పించారు. 'ఐయాం మలాలా' పేరుతోనే తెచ్చిన ఈ ఆల్బంలో మలాలా స్వీయ చరిత్రను ఆమె వివరించారు. 'ఉత్తమ పిల్లల ఆల్బమ్' విభాగంలో ఇది విజేతగా నిలిచింది.
       » దివంగత సితార్ విద్వాంసుడు పండిట్ రవి శంకర్ కుమార్తె అనౌష్క శంకర్ ఉత్తమ ప్రపంచ సంగీత ఆల్బం విభాగంలో పోటి పడినప్పటికీ పురస్కారానికి ఎంపిక కాలేదు.
       » బ్రిటన్‌కు చెందిన శాం‌స్మిత్ ఏకంగా నాలుగు గ్రామీలను గెల్చుకున్నారు.
ఇతర విజేతలు
 ఈ ఏడాది ఆల్బం - మార్నింగ్ ఫేజ్ (గాయకుడు బెక్)
 ఈ ఏడాది రికార్డ్ - స్టే విత్ మీ (గాయకుడు శాంస్మిత్)
 ఈ ఏడాది పాట - స్టే విత్ మీ (శాంస్మిత్, జిమ్మి నేప్స్, విలియం ఫిలిఫ్స్)
 కొత్త కళాకారుడు - శాంస్మిత్
 ప్రజాదరణ పొందిన ఓకల్ ఆల్బం - ఇన్ ది లోన్లీ అవర్ (శాంస్మిత్)
 కంట్రీ ఆల్బమ్ - ప్లాటినమ్ (మిరండా లాంబర్)
 రాప్ ఆల్బమ్ - ది మార్షల్ మ్యాథర్స్ ఎల్‌పీ 2 (ఎమినెమ్)
 ఆర్ అండ్ బీ ఆల్బమ్ - లవ్, మ్యారేజ్, డైవోర్స్ (టోనీ బ్రాక్స్‌టన్, బేబీ ఫేస్)
 రాక్ ఆల్బమ్ - మార్నింగ్ ఫేజ్ (బెక్)
 రాక్ సాంగ్ - అయామ్ నాట్ ఇట్ ఫైన్ (హీలీ విలియమ్స్, టేలర్ యార్క్)

ఫిబ్రవరి - 10

¤  ఆర్థిక సంక్షేమానికి చేసిన కృషికి ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు బ్రిటన్ ఇటీవల ప్రవేశపెట్టిన 'చార్లెస్టన్ ఈఎఫ్‌జీ జాన్ మైనార్డ్ కేన్స్' అవార్డు అందుకోనున్నారు.
       » ప్రముఖ బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మైనార్డ్ కేన్స్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు.
       » అవార్డు కింద 7,500 బ్రిటిష్ పౌండ్లు, ప్రశంసా పత్రం ఇస్తారు. కరవు, పేదరికం, ఆర్థిక సంక్షేమానికి కృషి లాంటి విభాగాల్లో కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.

ఫిబ్రవరి - 12

¤  ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ ప్రెస్ ఫోటో' పురస్కారాన్ని ఈ ఏడాది రష్యాకు చెందిన స్వలింగ సంపర్క జంట ఫోటో గెలుచుకుంది. ఆ ఫోటోను డెన్మార్క్కు చెందిన ఫోటోగ్రాఫర్ మాడ్స్ నిస్సేన్ తీశారు.
       » రష్యాలో స్వలింగ సంపర్కులు, లింగ మార్పిడి చేయించుకున్నవారు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆ ఫోటోను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
       » సమకాలీన సమస్య విభాగంలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన స్వలింగ సంపర్క జంట ఫోటోను ఎంపిక చేశారు.
       » వార్తల విభాగంలో ఇస్తాంబుల్‌లో నిరసనల సమయంలో టర్కీకి చెందిన బులెంట్ కిలిక్ తీసిన ఫోటోకు మొదటి బహుమతి దక్కింది.

ఫిబ్రవరి - 14

¤  'డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పురస్కారం - 2014' కు డీఆర్‌డీవో అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్‌డ్ డేటా ప్రోసెసింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ గీతావరదన్ ఎంపికయ్యారు.
       » తొలిసారిగా ఈ అవార్డును ఇద్దరికి ప్రకటించారు.
       » అగ్ని క్షిపణి ప్రయోగంలో సేవలందించి 'అగ్ని పుత్రిక' గా, 'క్షిపణి మహిళ' గా టెస్సీ థామస్ పేరు తెచ్చుకోగా, 'అగ్రశ్రేణి ఉపగ్రహ సమాచార శాస్త్రవేత్త'గా గీతావరదన్ పేరు గడించారు.
       » ఈ పురస్కారాన్ని మార్చి 1న నాయుడమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రదానం చేయనున్నారు.

ఫిబ్రవరి - 16

¤  బొంబాయి మేనేజ్‌మెంట్ అసోషియేషన్ అవార్డుల కార్యక్రమంలో 2013 - 14కు జీవనకాల సాఫల్య పురస్కారాన్ని టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు ప్రదానం చేశారు.

ఫిబ్రవరి - 17

¤  ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు 'విశ్వవిఖ్యాత దర్శక బ్రహ్మ' అనే బిరుదును విశాఖపట్నంలోని టి.సుబ్బిరామి రెడ్డి కళాపీఠం ప్రదానం చేసింది.

ఫిబ్రవరి - 23

¤ అమెరికాలాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
       » అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు తెరకెక్కించిన 'బర్డ్‌మ్యాన్' నాలుగు పురస్కారాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లేతో కలిపి మొత్తం 4 విభాగాల్లో అవార్డులు పొందింది.
       » 'ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్' చిత్రం కూడా నాలుగు పురస్కారాలు సొంతం చేసుకుంది. సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, మేకప్, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో పురస్కారాలు పొందింది.
       » 'విప్‌ల్యాష్' చిత్రం మూడు విభాగాల్లో (ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సహాయ నటుడు) అవార్డులు పొందింది.
       » ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితం ఆధారంగా రూపొందించిన 'ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్‌'లో నటనకు గాను ఎడ్డి రెడ్‌మేన్‌కు ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.
       » 'స్టీల్ అలైస్' సినిమాలో నటనకుగాను జూలియన్ మూర్ ఉత్తమ నటి పురస్కారం దక్కించుకుంది. ఓరకమైన మతి మరుపు వ్యాధితో బాధపడుతూ కుంటుంబాన్ని చూసుకోవడం, ఉద్యోగాన్ని కొనసాగించడంలో ఓ మహిళ పడే ఇబ్బందుల్ని చూపిన ఆమె నటనకు ఈ అవార్డు లభించింది.
ఆస్కార్ విజేతలు:
 ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్
 ఉత్తమ నటుడు: ఎడ్డి రెడ్‌మేన్ (ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్)
 ఉత్తమ నటి: జూలియన్ మూర్ (స్టీల్ అలైస్)
 ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు (బర్డ్‌మ్యాన్)
 ఉత్తమ సహాయనటుడు: జేకే సిమ్మన్స్ (విప్‌ల్యాష్)
 ఉత్తమ సహాయనటి: పాట్రిసియా అర్క్వెట్టే (బాయ్‌హుడ్)
 ఉత్తమ ఎడిటింగ్: టామ్ క్రాస్ (విప్‌ల్యాష్)
 ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎమ్మాన్యూయెల్ లుబెజ్కీ (బర్డ్‌మ్యాన్)
 ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ఇడా (పోలెండ్ చిత్రం)
 ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే): బర్డ్‌మ్యాన్ (అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు, నికోలస్ జియాకోబెన్, అలెగ్జాండర్ డైనెలారిస్ జూనియర్, అర్మాండో బో)
 ఉత్తమ రచన (అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే): ది ఇమిటేషన్ గేమ్ (గ్రాహమ్ మూర్)
 ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్): 'గ్లోరీ...' (సెల్మా)
 ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్): అలగ్జాండ్రే డెస్‌ప్లాట్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్)
 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ఇంటర్ స్టెల్లార్ (పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్‌లే, ఇయాన్ హంటర్, స్కాట్ ఫిషర్)
 ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అమెరికన్ స్నైపర్ (అలెన్ రాబర్ట్ ముర్రే, బబ్ ఆస్మాన్)
 ఉత్తమ సౌండ్ మిక్సింగ్: విప్‌ల్యాష్ (క్రోగ్‌మన్, బెన్ విల్కిన్స్, థామస్ కర్లీ)
 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (మిలీనా కానొనెరె)
 ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఫ్రాన్సిస్ హనన్, మార్క్ కోలైర్)
 ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఆడమ్ స్టాక్ హొజెన్, అన్నా పినోక్)
 ఉత్తమ యానిమేటెడ్ (ఫీచర్ ఫిల్మ్): 'బిగ్ హీరో సిక్స్'
 ఉత్తమ లైవ్‌యాక్షన్ (షార్ట్ ఫిల్మ్): ది ఫోన్ కాల్ (మాట్ కిర్క్‌బై, జేమ్స్ లూకాస్)
 ఉత్తమ యానిమేటెడ్ (షార్ట్ ఫిల్మ్): ఫీస్ట్ (ప్యాట్రిక్ ఓ స్బోర్న్ కిస్టీనారీడ్)
 ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్: క్రైసిస్ హాట్‌లైన్: వెటెరన్స్ ప్రెస్ 1.
 ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సిటిజన్ ఫోర్
(యూఎస్ ప్రజలపై ప్రభుత్వ నిఘాను తెలిపే అమెరికా రక్షణ సంస్థ పత్రాలను యూఎస్ ఇంటెలిజెన్స్ మాజీ నిపుణుడు ఎడ్వర్డ్ స్నోడెన్ ఎలా లీక్ చేశాడన్నది ప్రధాన ఇతివృత్తంగా 'సిటిజన్ ఫోర్' డాక్యుమెంటరీని రూపొందించారు.)

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment