ఫిబ్రవరి - 4
¤ ప్రముఖ వ్యాపారవేత్త, జేకే గ్రూప్ ఛైర్మన్ గౌర్ హరి సింఘానియా (79) కాన్పూర్‌లో మరణించారు.
» 1935 జూన్ 12న కాన్పూర్‌లో జన్మించిన సింఘానియా 1994 నుంచి జేకే ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా, జేకే సిమెంట్ లిమిటెడ్‌కు ప్రమోటర్ డైరెక్టర్‌గా ఉన్నారు.
» ఈయన క్రికెట్ అకాడమీని స్థాపించి ఎంతో మంది క్రీడాకారుల్ని ప్రోత్సహించారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)కి ప్రముఖ పోషకుడిగా కూడా వ్యవహరించారు.
ఫిబ్రవరి - 13
¤ తెలుగు సాహితీ రంగంలో జాతీయ స్థాయిలో పేరు పొందిన ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి (69 సంవత్సరాలు) నిజామాబాద్‌లో మరణించారు.
» చిత్తూరు జిల్లాకు చెందిన కేశవరెడ్డి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా ఆస్పపత్రిలో చర్మవ్యాధి నిపుణులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు.
నవలలు: అతడు అడివిని జయించాడు (14 భాషల్లోకి అనువాదం అయింది), మూగవాని పిల్లన గ్రోవి, చివరి గుడిసె, శ్మశానం దున్నేరు, బానిసలు, భగవాను వాచ, సిటీ బ్యూటిఫుల్, మునెమ్మ, రాముడుండాడు- రాజ్జముండాది.. .
» ఆయన్ని తెలుగు విశ్వవిద్యాలయం హంస పురస్కారంతో గౌరవించింది. అంతర్జాతీయ తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ అజో-విభో ఫౌండేషన్ నుంచి ఉత్తమ నవలా రచయిత పురస్కారం అందుకున్నారు.
ఫిబ్రవరి - 18
¤ శతాధిక చిత్రాల నిర్మాత, మూవీ మొఘల్‌గా పేరుగాంచిన దగ్గుబాటి రామానాయుడు (78 సంత్సరాలు) అనారోగ్యంతో హైదరాబాద్‌లో మరణించారు.
» ప్రకాశం జిల్లా కారంచేడులో జూన్ 6, 1936న జన్మించిన రామానాయుడు భారతీయ కరెన్సీ రూపాయినోటుపై కనిపించే భాషలన్నింటిలోనూ సినిమాలు తీశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన నిర్మాతగా గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. 13 భాషల్లో 140కి పైగా సినిమాలు చేసిన ఏకైక నిర్మాతగా చరిత్ర సృష్టించారు..
» 1964లో ఎన్.టి.రామారావు ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు భీముడు' సినిమాతో నిర్మాతగా సినీరంగ ప్రయాణం ప్రారంభించారు. చివరిగా 'గోపాల గోపాల' చిత్రాన్ని నిర్మించారు.
» 'సూరిగాడు' సినిమా 1993లో ఇండియన్ పనోరమకి ఎంపికైంది. 1994లో 'ఆంధ్ర వైభవం' చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ నిర్మాత పురస్కారం అందుకున్నారు. 1999లో బెంగాలీలో నిర్మించిన 'అసుఖ్' ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది. 2001లో 'ప్రేమించు' చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసలతో పాటు అయిదు నంది అవార్డులు దక్కాయి.
» 1999లో బాపట్ల నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
» శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌తో పాటు ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలను అందుకున్నారు. భారత ప్రభుత్వం 2013లో ఆయన్ను పద్మభూషణ్‌తో సత్కరించింది.
ఫిబ్రవరి - 19
¤ ప్రముఖ మహిళా వ్యంగ్య చిత్రకారిణి (కార్టూనిస్టు) రాగతి పండరి (50 సంవత్సరాలు) అనారోగ్యంతో విశాఖపట్నంలో మరణించారు.
¤ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ స్టెర్న్ గ్లాస్ (91) అమెరికాలోని న్యూయార్క్‌లోని ఇతాకాలో మరణించారు. చంద్రుడిపై తొలిసారిగా చేపట్టిన నడకకు సంబంధించిన చిత్రాలను తీయడంలో తోడ్పడిన పరిశోధనల్ని ఆయన చేపట్టారు.
» తొలి దశలో ఎర్నెస్ట్‌ను ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అనువర్తన భౌతికశాస్త్రంపై పరిశోధనలు చేసేలా ప్రోత్సహించారు. ఈ పరిశోధనలు ద్వారా ఎర్నెస్ట్ సునిశితమైన టీవీ కెమెరా గొట్టాన్ని రూపొందించారు. దీనివల్ల 1969లో చంద్రుడిపై నడక చిత్రాలను తక్కువ కాంతిలో కూడా బంధించడం సాధ్యమైందని కార్నెల్ వర్సిటీ తెలిపింది.
ఫిబ్రవరి - 25
¤ ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అజయ్ విన్సెంట్ (86 సంవత్సరాలు) చెన్నైలో మరణించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాలకు పని చేశారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment