ఫిబ్రవరి - 2015 సైన్స్ అండ్ టెక్నాలజీ - February 2015 Science & Technology



ఫిబ్రవరి - 2 
¤ అణ్వస్త్రాన్ని మోసుకెళ్లే క్రూయిజ్ క్షిపణి 'రాద్‌'ను పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించంది. ఇది 350 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని అనేక నగరాలు దీని పరిధిలోకి వస్తాయి.     » నేల, సముద్రంలో ఈ క్షిపణి పాకిస్థాన్ వ్యూహాత్మక సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుందని ఆ దేశ సైన్యం పేర్కొంది. ఇందులో అత్యంత సంక్లిష్టమైన క్రూయిజ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు వివరించింది. ఇది శత్రువుల దృష్టి నుంచి తప్పించుకోగలదని తెలిపింది. తక్కువ ఎత్తులో దూసుకెళ్లడం, చురుగ్గా ఎటైనా కదలడం దీని ప్రత్యేకతలుగా పేర్కొంది.¤ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన తేజస్ యుద్ధ విమానంపై శీతల వాతావరణంలో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో ఈ పరీక్షలు కొద్దిరోజుల కిందట జరిగాయి.     » పరీక్షలో భాగంగా విమానంలోని ఇంజిన్ స్టార్టర్ మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ వద్ద వరుసగా మూడుసార్లు విజయవంతంగా పని చేసిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) వెల్లడించింది. దీనికోసం 85 శాతం మేర ఛార్జ్ అయిన బ్యాటరీని ఉపయోగించారు. పరీక్షకు ముందు యుద్ధ విమానాన్ని 18-20 గంటలపాటు శీతల వాతావరణంలో ఉంచారు. ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఉష్ణ వనరును ఉపయోగించకపోవడం విశేషం. 
ఫిబ్రవరి - 4
¤ 'ఈవ్‌'గా పిలిచే రోబో శాస్త్రవేత్తతో ఔషధాల పరిశోధనను వేగంగా, మరింత చౌకగా చేపట్టే అవకాశం ఉందని యూకే పరిశోధకులు వెల్లడించారు. ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించిన అన్ని రకాల విధులను ఇది సమర్థంగా నిర్వర్తించగలదని వారు వివరించారు.     » 2009లో అబెరిస్ట్విత్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల పరిశోధకులు 'ఆడమ్ రోబో శాస్త్రవేత్త'ను రూపొందించారు. ఆ యంత్రం కొత్త శాస్త్రీయ విజ్ఞానాన్ని స్వతంత్రంగా కనుగొనగలిగే తొలి యంత్రంగా పేరొందింది. 'ఆడమ్‌'ను రూపొందించిన బృందమే ప్రస్తుతం మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి 'ఈవ్‌'ను అభివృద్ధి చేసింది. ఔషధాన్ని కనిపెట్టే ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా, మరింత చౌకగా మార్చడమే వీరి లక్ష్యం.     » ఈవ్ రోబోటిక్ వ్యవస్థకు రోజుకు పదివేల రసాయనాన్ని పరీక్షించే సామర్థ్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.     » క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగిన ఒక రసాయనానికి మలేరియాపై పోరాడే సామర్థ్యం ఉన్నట్లు ఈ రోబో శాస్త్రవేత్త గుర్తించిందని వీరు తెలిపారు.¤ ప్రపంచంలోని అతి పలుచని సిలికాన్ పదార్థమైన సిలిసీన్‌తో టెక్సాస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తొలి ట్రాన్సిస్టర్‌ను రూపొందించారు. దీంతో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వేగంగా, మెరుగైన సామర్థ్యంతో పని చేసేందుకు అవకాశం ఏర్పడింది.     » ఒక అణు మందం సిలికాన్ అణువుల పొరతో దీన్ని రూపొందించారు. భవిష్యత్తు తరం కంప్యూటర్ చిప్‌ల తయారీకి ఇది మార్గం చూపగలదని పరిశోధకులు భావిస్తున్నారు.     » డేజి అకిన్వాండే ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు.
ఫిబ్రవరి - 5 
¤ సులువుగా ఎటైనా కదిలే వీలున్న, సూక్ష్మస్థాయి రోబోటిక్ హస్తాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. రిమోట్ సాయంతో శస్త్రచికిత్సలు నిర్వహించడం, పరీక్షలు కోసం శరీరం నుంచి ముక్క తీయడం (బయాప్సీ)లోను వైద్యులకు ఇది సాయపడుతుంది.     » జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ హెచ్ గ్రేషియస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని అభివృద్ధి చేసింది.¤ హెచ్ఐవీ, సిఫిలిస్‌లను ఏకకాలంలో 15 నిమిషాల్లో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్‌ఫోన్ డాంగుల్‌ను అభివృద్ధి చేశారు.      » చుక్క రక్తంతోనే ఇది పరీక్షను నిర్వహించగలదు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన శామ్యూల్ కె.సియా నేతృత్వంలోని పరిశోధకుల బృందం దీన్ని రూపొందించింది. 
ఫిబ్రవరి - 6 
¤ అంగారకుడిపై నీటిలో ఆమ్ల గుణం లోగడ అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువని తేెలింది. అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'కు చెందిన క్యూరియాసిటీ రోవర్ ఈ మేరకు నిర్ధరించింది.     » క్యూరియాసీటి రోవర్ గేల్ బిలంలోని ఇతర ప్రదేశాలను దాదాపు రెండేళ్లపాటు పరిశీలించాక, అయిదు నెలల కిందట షార్ప్ పర్వత సానువు వద్దకు చేరింది. 2014 సెప్టెంబరులో 'కాన్ఫిడెన్స్ హిల్స్' అనే ప్రదేశంలో తవ్వకాలు జరిపింది. ఇటీవల మోజావీ 2 అనే శిల వద్ద తవ్వకాలు జరిపి, నమూనా పొడిని సేకరించింది. దీన్ని కెమిన్ అనే పరికరంతో విశ్లేషించింది. ఇప్పటి వరకు పాక్షికంగా సాగిన విశ్లేషణలో జారోసైట్ అనే పదార్థం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇది అక్సీకరణం చెందిన ఖనిజం. ఇందులో ఇనుము, సల్ఫర్ ఉన్నాయి. ఈ పదార్థం ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న వాతావరణాల్లో ఏర్పడుతుంది. 
ఫిబ్రవరి - 7 
¤ నౌకాదళ రకానికి చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లోని రెండో ప్రోటోటైప్ తొలిసారిగా గగనవిహారం చేసింది. 35 నిమిషాల పాటు ఈ యుద్ధ విమానం గాల్లో విహరించింది. కెప్టెన్ శివనాథ్ దహియా దీనికి పైలట్‌గా వ్యవహరించారు.     » తేజస్‌ను దేశీయ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇందులో కీలక భాగస్వామిగా ఉంది. 
ఫిబ్రవరి - 8 
¤ గురు గ్రహ కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాలుగు భారీ ఉపగ్రహాల్లో మూడు ఒకే సమయంలో ఆ గ్రహం ముందు నుంచి పయనించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ ఫోటో తీసింది. ఐరోపా, క్యాలిస్టో, అయో అనే మూడు చందమామలు ఇందులో దర్శనమిచ్చాయి. ఈ మూడు చందమామలు ఒకే సమయంలో గురుడి ముందు నుంచి పయనించడం చాలా అరుదు. 
ఫిబ్రవరి - 10 
¤ భూమిపై నుంచి మనకు కనిపించని చందమామ మరోవైపు భాగానికి సంబంధించిన వీడియోను నాసా విడుదల చేసింది.     » సాధారణంగా మనకు కనిపించే చందమామ భాగంలో భారీ నల్లమచ్చలు, మనిషిని పోలినట్లు ఉన్న ఆకారం లేవని నాసా తెలిపింది. వాటికి బదులు వివిధ రకాల పరిమాణాల్లో ఉన్న అగ్నిపర్వత బిలాల సముదాయం కనిపిస్తుందని పేర్కొంది.     » చంద్రుడికి సంబంధించిన సుదూర భాగం 1959లో సోవియట్ లూనార్ 3 ప్రోబ్ ద్వారా తొలిసారి కనిపించిందని నాసా వెల్లడించింది.
ఫిబ్రవరి - 11
¤ విశ్వం పుట్టుకకు కారణమని భావిస్తున్న మహా విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) జరిగుండకపోవచ్చని; విశ్వానికి ఆది, అంతం ఉండకపోవచ్చని భౌతికశాస్త్ర శాస్త్రవేత్తల కొత్త సిద్ధాంతం పేర్కొంది.
      
» తాము రూపొందించిన కొత్త నమూనా బిగ్ బ్యాంగ్ ఏకత్వాన్ని పరిష్కరించగలదని ఈజిప్ట్, కెనడా పరిశోధకులు పేర్కొన్నారు. దీని ద్వారా విశ్వానికి ఆది, అంతం లేవనే విషయాన్ని ప్రదర్శించారు. క్వాంటమ్ పదాలను ఆవిష్కరించిన డేవిడ్ బోమ్ సిద్ధాంతాల ఆధారంగా ఈ కొత్త నమూనాను రూపొందించారు. 
ఫిబ్రవరి - 12
¤ సూర్యుడిపై నల్లగా, పొడవుగా కనిపిస్తున్న చారికలను అమెరికా కు చెందిన నాసా అంతరిక్ష నౌక 'సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌డీవో)' ఛాయా చిత్రాలను తీసి పంపింది. ఆ చారిక దాదాపు 8,57,780 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుతో విస్తరించి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.      » సౌర పరివర్తనాలను, భూమిపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు 2010 ఫిబ్రవరి 11న సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీని నాసా ప్రయోగించింది. 
ఫిబ్రవరి - 13 
¤ తమిళనాడులోని కుడంకళం అణువిద్యుత్తు ప్లాంటు ప్రపంచంలో రెండో అత్యుత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది. అమెరికా కు చెందిన మ్యాగజైన్ 'పవర్ ఇంజినీరింగ్' కుడంకుళం యూనిట్-1ను 2014 సంవత్సరానికి రెండో అత్యుత్తమ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.      » మొదటి స్థానంలో ఇరాన్‌కు చెందిన బుషెర్ అణువిద్యుత్తు ప్లాంట్ నిలిచింది. ఈ రెండు ప్లాంట్లను రష్యా సహకారంతో నిర్మించారు. 
ఫిబ్రవరి - 14 
¤ అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 290 కి.మీ. పరిధి ఉన్న ఈ క్షిపణిని గోవా తీరంలో ఐఎన్ఎస్ కోల్‌కత నుంచి ప్రయోగించారు.      » ఐఎన్ఎస్ కోల్‌కత ను గతేడాది ఆగస్టు 16న భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు.      » ఇప్పటివరకు యుద్ధనౌకల నుంచి ఎనిమిది క్షిపణులను మాత్రమే ప్రయోగించగలిగే వీలుండగా ఐఎన్ఎస్ కోల్‌కత నుంచి ఏకధాటిగా 16 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించవచ్చు.¤ గోవా తీరంలో నావికా దళం ఆధ్వర్యంలో థియేటర్ రెడీనెస్ ఆపరేషనల్ లెవల్ ఎక్సర్‌సైజ్ (ట్రోపెక్స్ - 2015)ను నిర్వహించారు.      » రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఫిబ్రవరి - 15 
¤ ఇస్రో దేశీయ వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు ప్రారంభించింది. స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించడం, అధునాతన పరికరాలతో దేశీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాతావరణం గురించి అధ్యయనం చేసేందుకు సన్నధ్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాన్ని వేదికగా చేసుకుంది.      » 15 ఏళ్ల కిందటి నుంచే దేశంలోని 20 కేంద్రాల ద్వారా భూతలంపై వాతావరణ అధ్యయనం జరుగుతోంది. తాజాగా వాతావరణంలో అనూహ్య మార్పులు, వాతావరణాధారిత ప్రమాదాలకూ ఆస్కారమేర్పడుతుండటంతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.      » దేశంలో నాలుగు విభిన్న వాతావరణ పరిస్థితులు, భూతల స్వరూపాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకుని ప్రయోగం ప్రారంభించింది. 8 ప్రాంతాల్లో చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అనంతపురం (ఆంధ్రప్రదేశ్), త్రివేండ్రం (కేరళ), షిల్లాంగ్ (మేఘాలయ), రాంచీ (ఝార్ఖంఢ్)లో తొలిదశను చేపట్టారు.      » ఇప్పటివరకు కేవలం అర కిలోమీటరులోపు ఎత్తున్న వాతావరణం గురించే అధ్యయనం జరిగేది. ఆపై వాతావరణంలో ఇటీవల కాలంలో భారీ మార్పులు ఉంటున్నట్లు గ్రహించారు.      » ఈ నేపథ్యంలో ఇస్రో 'నోబెల్' (నెట్‌వర్క్ అబ్జర్వేషన్ ఆఫ్ బౌండరీ లేయర్ ఎక్స్‌పరిమెంట్) ప్రాజెక్టు చేపట్టగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సంయుక్తంగా శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ భౌతిక శాస్త్ర విభాగం ద్వారా పరిశోధన ప్రారంభించింది.      » ఈ పరిశోధన ద్వారా వారానికోసారి హీలియం నింపిన బెలూన్‌కు సోడార్ సోనిక్ అనియో మీటర్ (జీపీఎస్ సోండే) కట్టి ఆకాశంలోకి వదులుతారు. 4-5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక బెలూన్ పగిలిపోయి పరికరం కిందకు పడిపోతుంది. ఆ ఎత్తులో వాతావరణ పరిస్థితులను నమోదు చేసి, భూ ఉపరితలంపై ఉన్న గ్రాహకాలకు పంపిస్తుంది. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన వివరాల ఆధారంగా రేఖా చిత్రం రూపొందించి పరిశోధకులు అధ్యయనం చేస్తారు. 
ఫిబ్రవరి - 17 
¤ భూమిపై 320 కోట్ల ఏళ్ల కిందటే జీవం వృద్ధి చెంది ఉంటుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికిచెందిన శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో గుర్తించారు. ఇప్పటివరకు 200 కోట్ల ఏళ్ల కిందట భూమిపై జీవి వృద్ధి చెంది ఉండవచ్చని పరిశోధకులు భావిస్తూ వచ్చారు.¤ మూలకణాల ఆకృతిలో మార్పు తీసుకురావడం ద్వారా స్థూలకాయాన్ని నివారించవచ్చని లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. 
ఫిబ్రవరి - 18 
¤ మనం బయటకు వదిలే గాలిని విశ్లేషించడం ద్వారా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉంటే గుర్తించే శ్వాస విశ్లేషణ (బ్రీత్ అనలైజర్) ను హై సెన్సిటివ్ ఫ్లూరోసెన్స్ ఆధారిత సెన్సర్ ఆధారంగా చైనాలోని చోంగ్ క్వింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. 
ఫిబ్రవరి - 19 
¤ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను కలుగజేసే వైరస్‌ల నుంచి 90 శాతం మేర రక్షణకు వీలుగా కొత్త హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపిలోమా వైరస్) వ్యాక్సిన్‌ను లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.      » గర్డాసిల్ 9 పేరిట దీన్ని తయారు చేశారు.¤ సైనిక సన్నద్ధతలో భాగంగా ఒడిశాలోని చాందీపూర్‌లో జరిగిన పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయాణించే ఈ క్షిపణి ప్రయాణించిన మార్గాన్ని రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్ల ద్వారా శాస్త్రవేత్తలు వీక్షించారు.      » అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న పృథ్వీ-2 క్షిపణి 350 కి.మీ.లలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు.      » 'సమీకృత నిర్దేశిత క్షిపణి అభివృద్ధి కార్యకమం' కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి క్షిపణి పృథ్వీ-2. దీన్ని 2003లో సైన్యంలో ప్రవేశపెట్టారు.¤ తొలి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌కు అమర్చిన సుఖోయ్-30 యుద్ధ విమానాన్ని హెచ్ఏఎల్ బెంగళూరులో వైమానిక దళానికి అప్పగించింది.      » బ్రహ్మోస్ క్షిపణి భారత్, రష్యాల సంయుక్త కార్యక్రమం. ఇది రెండు దేశాలతో కూడిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది 290 కి.మీ. రేంజ్‌లో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. 
ఫిబ్రవరి - 20
¤ సిరంజి ద్వారా శరీరంలో పంపించడానికి వీలున్న కొత్తరకం జిగురు ద్రవాన్ని (హైడోజెల్) మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. క్యాన్సర్, గుండెపోటు లాంటి జబ్బుల చికిత్సలో మందులను చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుందని వారు వెల్లడించారు.¤ ప్రపంచవ్యాప్తంగా భూమి, సముద్ర ఉపరితలాలపై సగటు ఉష్ణోగ్రత 2015 జనవరిలో రికార్డు స్థాయిలో నమోదైనట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (ఎన్‌వోఏఏ) పేర్కొంది.      » ఉష్ణోగ్రతలు రికార్డుల్ని నమోదు చేస్తున్న 1880 నుంచి చూస్తే ఇది రెండో స్థానంలో ఉన్నట్లు తేల్చారు.      » భూ ఉపరితలంపై జనవరి ఉష్ణోగ్రత సగటు రికార్డు స్థాయిలో రెండో స్థానంలో ఉండగా, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మూడో స్థానంలో ఉంది.      » జనవరిలో ఆర్కిటిక్ సముద్ర మంచు విస్తృతి 3,50,000 చదరపు మైళ్లతో 1981-2010 సగటు కంటే తక్కువగానే నమోదైంది. అంటార్కిటిక్ సముద్ర మంచు జనవరిలో 8,90,000 చదరపు మైళ్లతో 1981-2010 సగటు కంటే ఎక్కువగా నమోదైంది. 
ఫిబ్రవరి - 22
¤ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని నాసా వ్యోమగాములు బ్యారీ విల్‌మోర్, టెర్రీవిర్ట్స్‌లు తమ రోదసి నడకను 6 గంటల 41 నిమిషాల్లో విజయవంతంగా పూర్తిచేశారు.      » టెర్రీకి ఇదే తొలి రోదసి నడక కాగా, బ్యారీకి రెండోది.¤ చేతులతో తాకాల్సిన అవసరం లేకుండా కేవలం తల ఆడించడం ద్వారా మనల్ని అర్థం చేసుకుని పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన 'సెసేమ్ ఎనేబుల్' అనే సంస్థ రూపొందించింది.      » వెన్నుపూసకు గాయాలైనవారు, సెరిబ్రల్ పాల్సీ రోగులు, చేతుల్ని ఉపయోగించలేని ఇతర వైకల్యాలు ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌ను రూపొందించారు.      » వినూత్నమైన ఈ ఆవిష్కరణకు ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.6 కోట్లు) విలువైన పురస్కారాన్ని 'సెసేమ్ ఎనేబుల్' సంస్థ దక్కించుకుంది.
ఫిబ్రవరి - 25 
¤ ప్రమాదాల బారిన పడి చేతులు దెబ్బతిన్న ముగ్గురికి ఆస్ట్రియా  వైద్యులు 'బయోనిక్ రీ కన్‌స్ట్రక్షన్' అనే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స జరిపారు. పని చేయకుండా ఉన్న చేతులను తొలిగించి వాటి స్థానంలో మర (రోబోటిక్) చేతులను అమర్చారు. ఆలోచనలతోనే నియంత్రించడానికి వీలైన ఈ మర చేతుల ద్వారా ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి తమ పనులు చేసుకుంటున్నారు. దీన్ని వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 
ఫిబ్రవరి - 26
¤ మానవ రహిత విమానాలు వాటంతటవే సరైన స్థలం చూసుకొని నేలకు దిగే విధానాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు రూపొందించారు. ఈ విధానంతో విపత్తు సహాయం లాంటి అవసరాలను మానవ రహిత విమానలను వినియోగించే అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి వ్యవస్థను రూపొందించడం ప్రపంచంలో ఇదే తొలిసారి.¤ ప్రపంచంలోనే మొదటి సారిగా 3డి ముద్రణ యంత్రంతో విమానం ఇంజిన్‌ను ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు రూపొందించారు. దీంతో తక్కువ ఖర్చుతో, తేలికైన, మంచి ఇంధన సామర్థ్యమున్న ఇంజిన్ల తయారీకి మార్గమేర్పడింది.
ఫిబ్రవరి - 27 
¤ ఆసియాకు చెందిన టెట్రాండ్రిన్ అనే మూలిక నుంచి సేకరించిన అణువు ఎబోలా నుంచి రక్షణ కల్పింస్తుందని టెక్సాస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.      » వైరస్ ప్రవేశించడానికి, కణాల్ని ఇన్‌ఫెక్షన్‌కు గురిచేయడానికి ఉపయోగించే మార్గాల్ని ఇది మూసివేస్తుందని పరిశోధకులు గర్తించారు.      » టెట్రాండ్రిన్ సూక్ష్మ అణువుకు మానవ తెల్లరక్త కణాల ఇన్ఫెక్షన్‌ను అణచిపెట్టే శక్తి ఉన్నట్లు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. 
ఫిబ్రవరి - 28
¤ సముద్ర అంతర్భాగాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్ని పరిశీలించడానికి, సర్వే చేయడానికి నిఘా కార్యకలాపాలు నిర్వహించడానికి, నౌకలు, విమానాలు, తదితరాలు నీటిలో మునిగిపోయినప్పుడు వాటి స్థితిని దగ్గర నుంచి పరిశీలించడానికి, ఛాయాచిత్రాలు తీయడానికి ఉపయోగపడే యంత్రం 'అటానమస్ అండర్ వాటర్ వెహికిల్' (ఎ.యు.వి.)ను విశాఖపట్నంలోని 'నౌకాదళ సమరశాస్త్ర సాంకేతిక పరిశోధనశాల' (ఎన్.ఎస్.టి.ఎల్) ప్రాంగణంలో ప్రదర్శించారు. త్వరలో దీన్ని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు.      » దీని పొడవు 4.6 మీటర్లు, వెడల్పు 1.6 మీటర్లు. ఎత్తు 0.7 మీటర్లు. సముద్రంలో 400 మీటర్ల లోతులో సైతం సునాయాసంగా ప్రయాణిస్తుంది.      » మానవ రహితంగా నీటి అంతర్భాగాల్లో కార్యక్రమాలు నిర్వర్తించే రోబోలా (అండర్ వాటర్ రోబో) దీన్ని రూపొందించారు.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment