డిసెంబరు - 2
|
¤ కెన్యా ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదులు 36 మంది క్వారీ కార్మికులను కాల్చి చంపారు. ఈ దాడి తామే చేశామని సోమాలియాకు చెందిన అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది.¤ 119 దేశాలకు చెందిన లక్ష మందికి పైగా ఒకేసారి యూఏఈ జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. » యూఏఈ 43వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఏఈ లోని కే.ఎస్.వార్కీ అనే భారతీయుడు నడుపుతున్న 'జెమ్స్ ఎడ్యుకేషన్' గ్రూపు స్కూళ్లకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది కలిసి ఈ రికార్డు సృష్టించారు. యూఏఈ జాతీయ గీతం 'ఇషై బలాది' (లాంగ్ లివ్ మై నేషన్). » 50 దేశాలకు చెందిన విద్యార్థులు ఒకేసారి జాతీయ గీతాన్ని ఆలపించడం గతంలో గిన్నిస్ రికార్డుగా ఉంది.
|
డిసెంబరు - 3
|
¤ ఏ నిబంధనలు లేకుండా అణ్వస్త్రరహిత దేశంగా ఉండటానికి వెంటనే అంగీకరించడంపై ఐరాస సాధారణ సభలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ మేరకు ఐరాసలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్‌తో పాటు పాకిస్థాన్, అమెరికా తదితర దేశాలు ఓటు వేశాయి. తమ అణు సదుపాయాలను ఐఏఈఏ భద్రతా ప్రమాణాలకు లోబడి ఉండాలనే ప్రతిపాదనను కూడా వ్యతిరేకించాయి. » అణ్వస్త్ర నిరాయుధీకరణను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని 169 దేశాలు వ్యతిరేకించగా, 7 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. చైనా, భూటాన్‌తోపాటు అయిదు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. » ఈ ముసాయిదా తీర్మానంలోని పలు అంశాలకు విడివిడిగా ఓటింగ్ నిర్వహించారు. 9వ పేరాలోని అణ్వస్త్ర నిరాయుధీకరణలో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని, అలాగే ఐఏఈఏకు లోబడి ఉండటాన్ని అంగీకరించాల్సిందిగా భారత్, ఇజ్రాయిల్, పాకిస్థాన్ దేశాలకు విజ్ఞప్తి చేసే తీర్మానానికి వ్యతిరేకంగా రికార్డు సంఖ్యలో 165 ఓట్ల్లు వచ్చాయి. » 2015 నాటికి విజయవంతంగా నిర్వహించాల్సిన ఎన్‌పీటీ (నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ) సమీక్ష సదస్సుకు సంబంధించి పీఠికలోని 24వ పేరాను కూడా భారత్, ఇజ్రాయిల్, అమెరికా వ్యతిరేకించాయి. అయితే దీనికి 166 ఓట్లు అనుకూలంగా రావడంతో ఈ నిబంధన కొనసాగనుంది. » ప్రాంతీయ, ఉప ప్రాంతీయ స్థాయిలో సంప్రదాయ ఆయుధ నియంత్రణ నిబంధనపై భారత్ మాత్రమే వ్యతిరేకంగా ఓటేసింది. » ఎన్‌పీటీ విశ్వసనీయతపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అణ్వస్త్రరహిత దేశంగా ఎన్‌పీటీలో చేరడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.¤ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని వివాదాస్పద 'గిల్జిట్ - బాల్టిస్థాన్' ప్రాంతం పాకిస్థాన్‌కు చెందినదేనంటూ చైనా ఓ వివాదాస్పద ప్రకటన చేసింది. » చైనాలోని జింగ్జియాంగ్ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీరుతో కలిపే అత్యంత కీలకమైన 'కుంజెరబ్ కనుమ'ను ప్రస్తుత శీతాకాలానికి మూసివేస్తున్నట్లు కూడా చైనా ప్రకటించింది. » భారత్ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ 'గిల్జిట్ - బాల్టిస్థాన్' మీదుగా ఆర్థిక కారిడార్‌ను నిర్మించే కార్యక్రమంతో చైనా ముందుకెళుతోంది.
|
డిసెంబరు - 4
|
¤ ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో కొత్తగా వెయ్యి పదాలు, పదబంధాలను చేర్చారు. ముఖ్యంగా యువత ఎక్కువగా వాడుతున్న సంక్షిప్త పదాలు, వీడియో గేమ్స్, వాణిజ్య పరిభాషకు సంబంధించిన పలు పదాలను నిఘంటువులో చేర్చారు. కొత్తగా చేర్చిన పదాల్లో లొల్కట్ (హాస్యపూరిత వ్యాఖ్య ఉన్న పిల్లి చిత్రం), ఐడీసీ (ఐ డోంట్ కేర్), ఒబామా కేర్ (అమెరికా ప్రజల ఆరోగ్య బీమా కోసం తెచ్చిన చట్టానికి అనధికారిక పారిభాషిక పదం), ఆల్ డెస్కో (కార్యాలయంలో పని ఒకరి బల్ల నుంచి జరగడం) డక్‌ఫేస్ (ముఖం ముడుచుకుని పెదాలను పెద్దవిగా పెట్టి ఫొటోకు పోజివ్వడం), రీస్పాన్ (వీడియోగేముల్లో ఏదైనా పాత్ర మరణించిన తర్వాత తిరిగి ప్రత్యక్షమవడం), పర్మాడెత్ (మళ్లీ కనిపించకుండా అదృశ్యమవడం) తదితర పదాలను ఈ ఏడాది ఆక్స్‌ఫర్డ్ ఆన్‌లైన్ నిఘంటువులో చేర్చారు.
|
డిసెంబరు - 5
|
¤ మాల్దీవుల్లో జల అత్యయిక స్థితిని ప్రకటించారు. రాజధాని మాలేలోని నీటి శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి శుద్ధీకరణ కేంద్రాలకు సంబంధించిన జనరేటర్ల విద్యుత్ వ్యవస్థ ధ్వంసమవ్వడంతో అత్యయిక స్థితిని ప్రకటించారు. » హిందూ మహాసముద్ర దిగువ ప్రాంతంలో ఉండే మాలేలో సహజ జల వనరులు లేకపోవడంతో శుద్ధి చేసిన సముద్ర జలంపైనే అక్కడి ప్రజలు ఆధారపడి ఉన్నారు. దాదాపు లక్ష మంది అక్కడ నివసిస్తున్నారు. » భారత్ అయిదు విమానాలు, రెండు ఓడల ద్వారా 20 టన్నుల శుద్ధి నీటిని మాల్దీవులకు పంపించింది.
|
డిసెంబరు - 6
|
¤ ప్రముఖ గాయని ఆశాభోంస్లేకు దుబాయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (డిఫ్) జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. » భారతీయ సినిమాకు ఆమె అందించిన సేవలకు ఈ పురస్కారాన్ని డిఫ్ ప్రకటించింది. » డిఫ్‌ను ఈ నెల 10 నుంచి 17 వరకు దుబాయిలో నిర్వహిస్తారు. » గతంలో ఈ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్, యష్‌చోప్రా, సుభాష్ ఘయ్, షారుక్‌ఖాన్ లాంటి ప్రముఖులు అందుకున్నారు.
|
డిసెంబరు - 8
|
¤ ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు భారీ నష్టం కలిగించిన ఏడాదిగా 2014 నిలిచిపోతుందని ఐరాస బాలల సంస్థ - యునిసెఫ్ పేర్కొంది. » మధ్య ఆఫ్రికా, ఇరాక్, దక్షిణ సూడాన్, సిరియా , ఉక్రెయిన్, పాలస్తీనా తదితర దేశాల్లో దాదాపు 1.50 కోట్ల మంది బాలలు కల్లోల బాధితులుగా మిగిలిపోయారని వెల్లడించింది. » సాయుధ పోరాటాలు జరుగుతున్న ప్రాంతాల్లో 23 కోట్ల మంది పిల్లలు ఉన్నారని యునిసెఫ్ తెలిపింది. తరగతి గదుల్లో చదువుకుంటున్న, ఇంట్లో నిద్రపోతున్న పిల్లల్ని సైతం దారుణంగా హత మార్చారని, అనేక మందిని అపహరించి, హింసించి, చివరకు బానిసలుగా అమ్మేశారని యునిసెఫ్ వెల్లడించింది. అంతర్యుద్ధాలు, కలహాలు, వ్యాధుల కారణంగా పిల్లలు పెద్ద ఎత్తున బలైపోయినట్లు యునిసెఫ్ ప్రకటించింది. » యునిసెఫ్ కార్యనిర్వాహక సంచాలకుడు ఆంటోని లేక్.¤ ఈజిప్టుకి చెందిన 2500 ఏళ్లనాటి మినిర్దిస్ అనే 14 ఏళ్ల బాలుడి మమ్మీ (మృతదేహం)నిషికాగోలోని ఫీల్డ్ మ్యూజియం తొలిసారిగా రసాయన పూతలతో శుద్ధి చేసేందుకు తెరిచింది.
|
డిసెంబరు - 9
|
¤ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో భారత్‌కు ఘన విజయం లభించింది. భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు ఉత్పత్తులపై అధిక సుంకం విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం సరికాదని డబ్ల్యూటీవో తేల్చి చెప్పింది. సబ్సిడీలు, దేశీయ చర్యలకు సంబంధించి చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా అమెరికా చర్యలు ఉన్నాయని డబ్ల్యూటీవో పునర్విచారణ మండలి ప్రకటించింది. డబ్ల్యూటీవో ఒప్పందానికి అనుగుణంగా అమెరికా తన నిబంధనావళిని సవరించుకోవాలని సూచించింది. » భారత్ ఎగుమతి చేసే హాట్ రోల్డ్ కార్బన్ స్టీల్ ఉత్పత్తులపై 300 శాతం దిగుమతి సుంకాన్ని అమెరికా విధించింది. ఈ నిర్ణయాన్ని భారత్ వ్యతిరేకించింది.¤ భారత రాజ్యాంగాన్ని మొదటిసారిగా అరబిక్ భాషలోకి అనువదించారు. కైరోలోని అరబ్‌లీగ్ దేశాల సచివాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో లీగ్ సెక్రటరీ జనరల్ నబిల్ ఎల్ అరబీ దీన్ని ఆవిష్కరించారు. » భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత దేశంలో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించిన తీరు అద్భుతమని నబిల్ ఎల్ అరబీ కొనియాడారు. » భారత విదేశాంగ శాఖ తరఫున రాయబారి అనిల్ వాధ్వా, ఈజిప్ట్‌లో భారత రాయబారి నవదీప్ సూరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
|
డిసెంబరు - 11
|
¤ సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని లుయూయంగ్ నగరంలో పాడైన కరెన్సీ నోట్లతో విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. కాలుష్యం కారణంగా చైనా కేంద్రీయ బ్యాంకు బొగ్గుకు బదులు పాడైన కరెన్సీనోట్లను వాడటానికి అనుమతినిచ్చింది. ఒక టన్ను పాడైన కాగితపు కరెన్సీతో 660 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
|
డిసెంబరు - 14
|
¤ జపాన్ ప్రధానమంత్రిగా షింజో అబే మరోసారి గెలుపొందారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలపై రిఫరెండంగా ఈ ఎన్నికలు జరిగాయి. » షింజో అబే నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు (ఎల్‌డీపీ), ఆయన భాగస్వామి కొమిటో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. » మొత్తం 475 స్థానాలకు 333 స్థానాల్లో వీరు గెలుపొందారు.¤ దాదాపు 40 ఏళ్ల కిందట ఆపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వ్యక్తిగతంగా విక్రయించిన ఆపిల్ - 1 కంప్యూటర్ న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ వేసిన వేలంలో 3.65 లక్షల డాలర్లు పలికింది. » 1976లో స్టీవ్ జాబ్స్ తన తల్లిదండ్రులకు చెందిన గ్యారేజీలో దీన్ని విక్రయించారు. ఈ కంప్యూటర్ ఇప్పటికీ పని చేస్తుంది. ఇది మొదటి ప్రీ-అసెంబుల్డ్ పర్సనల్ కంప్యూటర్. దీన్ని మొదట కొనుగోలు చేసిన చార్లెస్ రికెట్స్ పేరిట 'రికెట్స్ ఆపిల్-1 పర్సనల్ కంప్యూటర్' అని పిలుస్తున్నారు.¤ అమెరికా కాంగ్రెస్ అత్యంత కీలకమైన వ్యయ బిల్లును ఆమోదించింది. 1.1 లక్షల కోట్ల డాలర్ల ఈ బిల్లుకు ప్రతినిధుల సభ డిసెంబరు 11 న ఆమోద ముద్ర వేసింది.¤ మారిషెస్ ప్రధానమంత్రిగా అనిరుధ్ జగన్నాథ్‌ను నియమిస్తూ అధ్యక్షుడు కైలాస్ పర్యాగ్ ఉత్తర్వులు జారీ చేశారు. » ఇటీవల జరిగిన మారిషెస్ పార్లమెంట్ ఎన్నికల్లో జగన్నాథ్ నేతృత్వంలోని లెపెప్ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన్ని ప్రధానమంత్రిగా నియమించారు. » పార్లమెంట్‌లోని 62 స్థానాల్లో లెపెప్ కూటమి 47 సీట్లు గెలుచుకుంది.
|
డిసెంబరు - 15
|
¤ కార్మిక సంఘాల సమ్మెతో బెల్జియం స్తంభించింది ఇతర దేశాలతో రవాణా సంబంధాలూ నిలిచిపోయాయి. » కొత్త ప్రధానమంత్రి చార్లెస్ మైఖేల్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నెల రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నాయి. ¤ ఆస్ట్రేలియాలోని ప్రముఖ వాణిజ్యనగరం సిడ్నీలో ఒక సాయుధ దుండగుడు కేఫ్‌లోకి చొరబడి పలువురిని బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. సాయుధ పోలీస్ బలగాలు కేఫ్‌లోకి ప్రవేశించి బందీలను విడిపించడంతో ఆపరేషన్ ముగిసింది. ప్రముఖ లింట్ చాకొలేట్ కేఫ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
|
డిసెంబరు - 16
|
¤ పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఒక సైనిక పాఠశాలపై తాలిబన్ ఆత్మాహుతి దళం ఆకస్మికంగా దాడిచేసి 132 మంది విద్యార్థులను కాల్చి చంపింది. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది పాఠశాల సిబ్బంది కూడా హతమయ్యారు. » కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్ సైన్యం 'జర్బ్ ఎ అజబ్' పేరుతో 2014 జూన్‌లో భారీ ఎత్తున మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ సైనిక ఆపరేషన్‌లో ఉత్తర వజీరిస్థాన్, పక్కనే ఉన్న గిరిజన ప్రాంతంలోని 1300 మందికి పైగా ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ ఘటనకు ప్రతీకారంగా తాజా దాడి జరిపినట్లు తాలిబన్ ప్రకటించింది. » కరాచీలో 2008లో ఆత్మాహుతి బాంబు దాడిలో 150 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న తర్వాత జరిగిన అత్యంత పాశవిక దుశ్చర్య ఇదే. ¤ రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. గత కొద్ది నెలల్లోనే అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు సగానికి పడిపోవడంతో ప్రధానంగా చమురు ఎగుమతులపైనే ఆధారపడిన రష్యా ఆర్థిక వ్యవస్థ పతనం అంచులకు చేరింది. » డాలర్‌తో రూబుల్ మారకపు విలువ ఒకే రోజు 10 శాతానికిపైగా క్షీణించింది. రూబుల్‌ను బలోపేతం చేయడానికి రష్యా కేంద్ర బ్యాంకు రాత్రికి రాత్రే ఊహించని విధంగా వడ్డీ రేట్లను ఏకంగా 6.5 శాతం పెంచి 17 శాతం చేసింది. అయినప్పటికీ రూబుల్ క్షీణించడంతో అక్కడి ట్రేడర్లు, విశ్లేషకులు ఆందోళనకు గురయ్యారు.
|
డిసెంబరు - 19
|
¤ ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (54 సంవత్సరాలు) కి పాకిస్థాన్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయండంపై భారత్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో పాకిస్థాన్ అతడిని తిరిగి నిర్భంధంలోకి తీసుకుంది. » ఇటీవల పాకిస్థాన్‌లోని పెషావర్‌లో విద్యార్థులపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా విమర్శలు ఎదురవ్వడంతో లఖ్వీని రావాల్పిండి జైలు నుంచి బయటకు రాకముందే అడ్డుకున్నారు. ముందస్తు నిర్బంధ చట్టం (మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్- ఎంపీవో) కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ చట్టం కింద కనీసం మూడు నెలల పాటు అతడిని జైల్లో ఉంచవచ్చు.
|
డిసెంబరు - 20
|
¤ ఎబోలా వైరస్ వల్ల ఇప్పటివరకు 7373 మంది మరణించినట్లు రికార్డుల్లో నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. » లైబీరియా, సియెర్రా లియోన్, గినియాల్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వీటికి తోడు మాలిలో ఆరుగురు, నైజీరియాలో 8 మంది, అమెరికాలో ఒకరు మరణించారని వెల్లడించింది. » గినియా, సియెర్రా లియోన్, లైబీరియాలో నమోదైన కేసులు 19,031కి చేరాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
|
డిసెంబరు - 26
|
¤ పాకిస్థాన్‌లోని ఖైబర్ ఏజెన్సీలో గుండి ప్రాంతంలోని జమురుద్ వద్ద భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో తాలిబన్ కమాండర్, పెషావర్ ఊచకోత కీలక సూత్రధారి సద్దాం మరణించాడు.
|
డిసెంబరు - 27
|
¤ సుమారు అయిదు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో చైనా నిర్మించిన నీటి మళ్లింపు ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. » యాంగ్జీ నదికి ఉపనది అయిన హన్ జియాంగ్ నుంచి మొదలైన నీటి ప్రవాహం బీజింగ్ చేరడానికి పదిహేను రోజులు పట్టింది. సుమారు 1200 కిలోమీటర్ల పొడవైన ఈ నీటి మళ్లింపు పథకం పనులు 12 ఏళ్ల క్రితం మొదలయ్యాయి. |
డిసెంబరు - 28
|
¤ ఇండోనేషియాలోని సురబయ నుంచి సింగపూర్‌కు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం డిసెంబరు 27న అదృశ్యమైంది. ఎ 320 - 200 రకానికి చెందిన ఈ విమానంలో 155 మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ 162 మందిలో 149 మంది ఇండోనేషియాకు చెందినవారే. » ఈ విమానం సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి చేరుకోవాలి. కానీ, జావా సముద్రం మీదుగా వెళ్తున్న ఈ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. » మలేషియావిమానం ప్రమాదానికి గురికావడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. » ఈ ఏడాది మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరిన బోయింగ్ - 777 విమానం (ఎంహెచ్ 370) ఏమయిందో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. దానిలో 239 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. » జులై 17న ఉక్రెయిన్‌లో తిరుగుబాటుదారులు క్షిపణిదాడితో మలేషియాఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 (ఎంహెచ్ 17) విమానాన్ని కూల్చి వేశారు. అందులో ఉన్న 298 మంది ప్రాణాలు కోల్పోయారు. ¤ ఇటలీకి చెందిన 'నార్మన్ అట్లాంటిక్' ఓడ ప్రమాదానికి గురైంది. గ్రీసు తీరంలోని కొర్ఫు దీవికి 44 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. » 478 మంది ప్రయాణికులు, సిబ్బందితో పశ్చిమ గ్రీసు నుంచి ఇటలీకి బయలుదేరిన ఈ ఓడ అడ్రియటిక్ సముద్ర జలాల మధ్యలో ఉండగా మంటల్లో చిక్కుకుంది. ¤ అతి పెద్ద చైనీస్ - ఫ్రెంచ్ నిఘంటువు (డిక్షనరీ)ని చైనా ముద్రించింది. 70 లక్షల పదాలున్న ఈ నిఘంటువును తయారు చేయడానికి 16 ఏళ్లు పట్టిందని చైనా ప్రకటించింది. ¤ అఫ్గానిస్థాన్‌లో నాటో ప్రారంభించిన యుద్ధం ముగిసింది. 13 ఏళ్ల పోరాటం తర్వాత కాబూల్‌లోని నాటో కార్యాలయంలో చిన్న వేడుకను నిర్వహించి ముగింపు పలికారు. తాలిబన్ల హెచ్చరికలతో ఈ కార్యక్రమాన్ని రహస్యంగా జరిపారు. 2001 నుంచి దాదాపు 3500 మంది విదేశీ సైనికులు అఫ్గాన్ పోరాటంలో మరణించారు. |
డిసెంబరు - 29
|
¤ 2014లో అత్యంత అధికంగా ఉపయోగించిన కొన్ని పదాలను పలు నిఘంటువులు, బాషా పర్యవేక్షణ బృందాలు ప్రముఖమైనవిగా పేర్కొన్నాయి. » వేప్ (WAPE) అనే పదాన్ని వేపర్/ వేపొరైజ్ అనే పదానికి సంక్షిప్త రూపంగా వాడినట్లు ఆక్స్‌ఫర్డ్ నిఘంటవు పేర్కొంది. ఈ ఏడాదిలో ఇదే తమ ప్రముఖ పదమని ఆక్స్‌ఫర్డ్ తెలిపింది. » మరియమ్ వెబ్‌స్టర్ వారు 'కల్చర్' అనే మాటను తమ ప్రముఖ పదంగా పేర్కొన్నారు. సెలబ్రిటీ కల్చర్, కంపెనీ కల్చర్, రేప్ కల్చర్ ఇలా పలు అంశాలకు జోడిస్తూ కల్చర్ అనే మాటను అత్యంత ప్రముఖంగా వాడారు. » కాలిన్స్ ఆంగ్ల నిఘంటవు 'ఫొటోబాంబ్' ను ప్రధాన పదంగా పేర్కొంది. సంబంధిత అంశానికి సంబంధించిన అవగాహన లేకుండానే సదరు ఫొటోగ్రాఫ్ నేపథ్యంలోకి తొంగి చూసి జోక్యం చేసుకోవడానికి ఈ పదాన్ని వాడింది. » 'ఓవర్ షేర్' అనే పదాన్ని ఛాంబర్స్ నిఘంటువు ప్రధాన పదంగా పేర్కొంది. వ్యక్తిగత జీవిత వివరాలను ఆమోదయోగ్యం కాని రీతిలో బహిర్గతం చేయడానికి ఈ మాటను వాడారు. ¤ అడ్రియాటిక్ సముద్రంలో మంటల్లో చిక్కుకున్న ఓడ నుంచి ప్రయాణికులు, సిబ్బంది మొత్తాన్ని సహాయ బృందాలు రక్షించాయి. ఈ ప్రమాదంలో మొత్తం మీద ఏడుగురు ప్రయాణికులు మరణించినట్లు ఇటలీ తీర రక్షణ దళం తెలిపింది. ¤ ముంబయి దాడుల సూత్రధారి జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ నిర్బంధంపై పాకిస్థాన్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. » ఈ పరిణామంపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. |
డిసెంబరు - 30
|
¤ బ్రిటన్‌లో తొలి ఎబోలా కేసు నమోదైంది. స్కాట్లండ్‌కు చెందిన నర్సు పాలిన్ కెఫర్‌కే (39 సంవత్సరాలు) కు ఎబోలా సోకినట్లు నిర్ధారించారు. » సియొర్రాలియోన్‌లో ఎబోలా సోకినవారికి చికిత్స చేసి వచ్చిన కెఫర్‌కే కు ఈ వ్యాధి సోకింది. ¤ బంగ్లాదేశ్‌లోని ఛాందసవాద 'జమాతే ఎ ఇస్లామి' పార్టీకి చెందిన అగ్రనేత ఎ.టి.ఎం.అజారుల్ ఇస్లాం (62 సంవత్సరాలు)కు యుద్ధ నేరాల ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. » పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా 1971లో జరిగిన విముక్తి పోరాట సమయంలో చేసిన అకృత్యాలకు ఆయనకు ఈ శిక్ష పడింది. ¤ డిసెంబరు 28న ఇండోనేషియాలోని సురబయ నుంచి సింగపూర్‌కు 162 మందితో బయలుదేరి కనిపించకుండా పోయిన ఎయిర్ ఏషియా విమాన శకలాలు ఇండోనేషియాలోని బోర్నియా తీరానికి సమీపంలో జావా సముద్రం పైభాగాన తేలుతూ లభ్యమయ్యాయి. ¤ ముంబయి దాడుల సూత్రధారి జకీయుర్ రెహ్మాన్ లఖ్వీని నిర్బంధంలో ఉంచిన పాక్ ప్రభుత్వ ఆదేశాన్ని అక్కడి న్యాయస్థానం రద్దు చేసిన పరిమాణాలపై భారత్ తీవ్ర నిరసన తెలిపిన నేపథ్యంలో అతడు విడుదల కావడానికి కొద్దిగా ముందే ఓ అపహరణ కేసులో మళ్లీ అరెస్టు చేశారు. |
|
|