డిసెంబరు - 1
|
¤ దాదాపు 53 శాతం మంది భారతీయులు అంతర్జాలాన్ని (ఇంటర్‌నెట్) వాడుతున్నారని, ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువని లండన్‌కు చెందిన ప్రసిద్ధ ఏటీ కేర్నీ గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థ వెల్లడించింది. » ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలాన్ని ఉపయోగించే వారి శాతం 51గా పేర్కొంది. ఇదే విధంగా చైనాలో 36, జపాన్‌లో 39 శాతం మంది నెట్‌ను వినియోగిస్తున్నారు.
|
డిసెంబరు - 3
|
¤ అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' ప్రపంచ అవినీతి సూచి నివేదికను విడుదల చేసింది. » ఈ నివేదికలో 175 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 38 మార్కులతో 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 36 మార్కులతో 94వ స్థానంలో ఉంది.
» అవినీతి అత్యంత తక్కువ ఉన్న దేశంగా డెన్మార్క్ తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. అవినీతిరహిత అంశాలకు సంబంధించి ఆ దేశానికి 92 మార్కులు లభించాయి.
» ఉత్తర కొరియా, సోమాలియా చెరో 8 మార్కులతో చిట్టచివరి (175) స్థానంలో ఉన్నాయి.
» చైనా గత ఏడాది 80వ స్థానంలో ఉండగా, ఈ సారి 100వ స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్, నేపాల్ 126వ స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్ 145, శ్రీలంక 85, అఫ్గానిస్థాన్ 172వ స్థానంలో ఉండగా, భూటాన్‌కు 30వ స్థానం లభించింది. టాప్ టెన్ అవినీతిరహిత దేశాలు: డెన్మార్క్ (92 మార్కులు), న్యూజిలాండ్ (91), ఫిన్లాండ్ (89), స్వీడన్(87), నార్వే(86), స్విట్జర్లాండ్ (86), సింగపూర్ (84), నెదర్లాండ్స్ (83), లగ్జెంబర్గ్ (82), కెనడా(81).
|
డిసెంబరు - 4
|
¤ అంతర్జాల అందుబాటు, అంశాలపై ఆంక్షలను సడలించడం మూలంగా అంతర్జాల స్వేచ్ఛలో భారత్ గొప్ప పురోగతి సాధించిందని 'ఫ్రీడం ఆన్ ది నెట్ 2014' నివేదిక వెల్లడించింది. » 2013తో పోలిస్తే అంతర్జాల స్వేచ్ఛలో చాలా కొద్ది దేశాలే పురోగతిని నమోదు చేశాయి. అన్ని దేశాల కంటే అత్యధిక పురోగతి భారత్‌లో నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల స్వేచ్ఛ వరుసగా నాలుగో సంవత్సరం కూడా పడిపోయిందని వెల్లడించింది.
» 'ఫ్రీడం హౌజ్' అనే స్వతంత్ర పరిశీలన సంస్థ 65 దేశాల్లో అంతర్జాల స్వేచ్ఛలో పురోగతి, క్షీణతలను మదింపు వేసింది. ఎక్కువ స్వేచ్ఛ గల దేశాలకు 0, తక్కువ స్వేచ్ఛ గల దేశాలకు 100 మార్కులను వేస్తూ అంచనా వేసింది. ఇందులో భారత్‌కు గత ఏడాది 47 మార్కులు రాగా, ఈసారి 42 మార్కులతో పురోగతిని సాధించింది.
|
డిసెంబరు - 8
|
¤ అంతర్జాతీయంగా 2015లో మెరుగైన ఫలితాలు సాధిస్తాయనే 133 కంపెనీల షేర్ల జాబితాను 'గ్లోబల్ టాప్ పిక్స్' పేరిట బార్ క్లేస్ సంస్థ రూపొందించింది. ఈ జాబితాలో భారత దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, లుపిన్ ల్యాబొరేటరీస్, వోల్టాస్ చోటు పొందాయి. » ఈ జాబితాలో అమెరికా షేర్లు 54 ఉండగా, ఐరోపా మధ్య ప్రాచ్యదేశాల నుంచి 40, జపాన్ మినహా ఆసియా దేశాల నుంచి 23, జపాన్ నుంచి 16 షేర్లు ఉన్నాయి.
|
డిసెంబరు - 9
|
¤ భారతదేశ వృద్ధికి బంగారాన్ని వినియోగించేందుకు అవసరమైన విధి విధానాలపై ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ), ఫిక్కీ సంయుక్తంగా నివేదికను రూపొందించాయి.ముఖ్యాంశాలు: షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపేందుకు స్టాక్ మార్కెట్లు ఉన్నట్లే, బంగారానికి ప్రత్యేక ఎక్స్ఛేంజీని నెలకొల్పాలి. దేశీయంగా ధర నిర్ణయం గోల్డ్ ఎక్స్ఛేంజీలోనే జరగాలి. దేశంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు అనేక రకాలుగా అధికారిక - అనధికారిక పద్ధతుల్లో జరుగుతున్నాయి. అయితే ఎక్స్ఛేంజీ ద్వారా ధరను నిర్ణయిస్తే ధరపై పారదర్శకత వస్తుంది. ఇందు వల్ల బంగారానికి గిరాకీ, సరఫరాపైనా అవగాహన ఏర్పడుతుంది. దేశంలో ప్రజలు, సంస్థల వద్ద వృధాగా నిల్వ ఉన్న 22,000 టన్నుల బంగారాన్ని చలామణిలోకి తెచ్చేందుకు 'పసిడి పొదుపు ఖాతాల' లాంటివి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. బంగారం దిగుమతి, ఎగుమతులను పర్యవేక్షించేందుకు గోల్డ్ బోర్డును నెలకొల్పాలి. 'జాతీయ పసిడి విధానాన్ని' రూపొందిచడంలో ఈ బోర్డు కీలక పాత్ర పోషించాలి. బంగారం డిపాజిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలి. డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీ చెల్లించాలి. ఈ పథకాన్ని అమలు చేసే బ్యాంకుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. పసిడి ఆధారిత పింఛను, బీమా పథకాలను ప్రవేశపెట్టాలి. గత 5 ఏళ్లుగా సగటున ఏడాదికి 895 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అయ్యింది. దేశంలోనే పసిడి నిల్వల్లో 4 శాతానికి ఇది సమానం. ప్రజల వద్ద నిల్వ ఉన్న బంగారంలో కొద్ది మొత్తం వినియోగంలోకి వచ్చినా, దేశంలోని దిగుమతులపై అమిత ప్రభావం పడుతుందని నివేదిక తేల్చి చెప్పింది.¤ అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ హయాంలో అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను అమెరికా నిఘా సంస్థ-సీఐఏ కఠినంగా ప్రశ్నించే పద్ధతి గతంలో అనుకున్న దానికంటే అమానుషంగా ఉన్నట్లు అమెరికా సెనెట్ నివేదిక వెల్లడించింది. » 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత అల్‌ఖైదా అనుమానితులపై జార్జిబుష్ ప్రభుత్వం సీఐఏ ద్వారా సాగించిన ప్రశ్న పద్ధతులను ఈ నివేదిక తీవ్రంగా గర్హించింది.
|
డిసెంబరు - 14
|
¤ 2014 సంవత్సరానికి సంబంధించి దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న సంస్థల వివరాలతో 'ఫార్చ్యూన్ 500 జాబితా'ను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. » రూ.5 లక్షల కోట్లకుపైగా (రూ.5,00,973 కోట్లు) వార్షికాదాయంతో దేశంలో అతిపెద్ద సంస్థగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నిలిచింది. » తర్వాతి స్థానాల్లో వరుసగా రిలయన్స్ (రూ.4,44,021 కోట్లు), భారత్ పెట్రోలియం (రూ.2,67,718 కోట్లు) హిందుస్థాన్ పెట్రోలియం (రూ.2,36,797 కోట్లు) నిలిచాయి. » గత ఏడాది కూడా ఈ సంస్థలు ఇవే స్థానాల్లో ఉన్నాయి. » రూ.2,36,502 కోట్లతో టాటా మోటార్స్ 5వ స్థానంలో, రూ.2,26,944 కోట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6వ స్థానం, రూ.1,82,084 కోట్లతో ఓఎన్‌జీసీ 7వ స్థానం, రూ.1,49,663 కోట్లతో టాటాస్టీల్ 8వ స్థానం, రూ,99,473 కోట్లతో ఎస్సార్ ఆయిల్ 9వ స్థానం, రూ.89,175 కోట్లతో హిందాల్కో ఇండస్ట్రీస్ 10వ స్థానంలో నిలిచాయి. » గతేడాదితో పోలిస్తే ఈ 500 సంస్థల ఆదాయం 9.5 శాతం, లాభాలు 4.5 శాతం పెరిగాయి. అన్ని సంస్థల ఆదాయాల్లో ప్రభుత్వరంగ సంస్థల వాటా 38 శాతం కాగా, లాభం 6.6 శాతం పెరిగింది. 56.7 శాతం వాటా ఉన్న ప్రైవేటు రంగ సంస్థల ఆదాయం 10.2 శాతం వృద్ధి చెందింది. » ఈ 500 సంస్థల్లో 298 తయారీ రంగానికి సంబంధించినవి. మొత్తం ఆదాయంలో వీటి వాటా 67 శాతంగా ఉంది. 2013లో వీటి వాటా 68.7 శాతంగా ఉండేది.
|
డిసెంబరు - 16
|
¤ భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 11 కోట్లకు చేరింది. అమెరికా తర్వాత పెద్ద మొత్తంలో ఫేస్‌బుక్ వినియోగదారులు భారత్‌లోనే ఉన్నారు. » అమెరికాలో గత ఏడాది ఏప్రిల్‌లో పది కోట్ల మంది వినియోగదారులు ఉండగా, 2014 సెప్టెంబరు చివరికి 11.20 కోట్లకు చేరారు. » ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులు ఉన్నారు. |
డిసెంబరు - 18
|
¤ అత్యుత్తమ పనితీరు చూపుతున్న 30 మంది ప్రపంచ నేతల జాబితాను జపాన్‌కు చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ జీఎంవో రిసెర్చ్ రూపొందించింది. ఇందుకోసం 26 వేల మందిపై సర్వే నిర్వహించింది. » ఈ జాబితాలో భారత ప్రధాని మోదీ ద్వితీయ స్థానంలో నిలిచారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రథమ స్థానంలో, జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ తృతీయ స్థానంలో నిలిచారు.
» 1 నుంచి 10 పాయింట్ల వరకు కొలమానం తీసుకోగా జీ జిన్ పింగ్‌కు 7.5, మోదీకి 7.3, మెర్కెల్‌కు 7.2 పాయింట్లు వచ్చాయి.
|
డిసెంబరు - 23
|
¤ భారత్‌లో 2013లో జననాల రేటు 0.2 పాయింట్ల మేర తగ్గింది. తాజా అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2012తో పోలిస్తే జననాల రేటు ఈ మేరకు తగ్గినట్లు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) సర్వే నివేదిక పేర్కొంది. » భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ గణాంకాల అంచనాలను ఎస్ఆర్ఎస్ అందజేస్తుంది. ఈ అంచనాలను క్రూడ్ బర్త్ రేట్ (సీబీఆర్) గా పేర్కొంటారు. » సీబీఆర్ తరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 పాయింట్లుగా, పట్టణ ప్రాంతాల్లో 1.2గా ఉన్నట్లు సర్వే తెలిపింది. » 2013లో మొత్తం సంతాన సాఫల్య రేటు (టీఎఫ్ఆర్ - మహిళకు కలిగిన సంతానం సగటు సంఖ్య) 2.3 పాయింట్లకి తగ్గింది. 2012లో ఇది 2.4గా ఉన్నట్లు సర్వే నివేదిక వెల్లడించింది. » 2013లో టీఎఫ్ఆర్ రేటు పశ్బిమ బంగాలో అధికంగా 3.4గా ఉంది. 2013 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.8గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. |
|
|