ఫిబ్రవరి - 2015 పర్యటనలు




ఫిబ్రవరి - 1

¤ నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యితో సమావేశమయ్యారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్రికుల కోసం టిబెట్ నుంచి సిక్కిం ద్వారా సాగే రెండో మార్గాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించారు.
       » భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మ్యాగజీన్‌ను చైనా భాషలో సుష్మాస్వరాజ్ ప్రారంభించారు. ఈ మ్యాగజీన్ ఇప్పటికే 15 భాషల్లో ప్రచురితమవ్వడంతో పాటు 170 దేశాల్లో అందుబాటులో ఉంది.

ఫిబ్రవరి - 2

¤ చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బీజింగ్‌లోని ప్రఖ్యాత 'గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌'లో ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో సమావేశమయ్యారు.
       » రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవరోవ్‌తోనూ సుష్మా బీజింగ్‌లో సమావేశమయ్యారు.
       » సుష్మాస్వరాజ్, చైనా ఉపప్రధాని వాంగ్‌యాంగ్ సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఎక్కువ మంది చైనా పర్యాటకులను ఆకర్షించేందుకు 'భారత్‌ను సందర్శించండి' (విజిట్ ఇండియా ఇయర్) అనే పేరుతో దీన్ని ప్రారంభించారు.
       » రష్యా-భారత్-చైనా, (ఆర్ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశం కూడా బీజింగ్‌లో జరిగింది. ఈ సమావేశంలో సుష్మాతో పాటు వాంగ్‌యీ (చైనా), సెర్గీ లవరోవ్ (రష్యా) పాల్గొన్నారు. త్రైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవాలని వీరు సమావేశంలో నిర్ణయించారు.
       » ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో 1996లో భారత్ పంపిణీ చేసిన అంతర్జాతీయ తీవ్రవాదంపై సమగ్ర ఒప్పందం (సీసీఐటీ) ముసాయిదాపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని 'ఆర్ఐసీ' దేశాలు కోరాయి.
       » అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారాన్ని పటిష్టం చేయాలన్నదే సీసీఐటీ లక్ష్యం.
       » 'షాంఘై సహకార సంస్థ' (ఎస్‌సీవో) లో భారత భాగస్వామ్యానికి చైనా, రష్యాలు మద్దతు ప్రకటించాయి.

ఫిబ్రవరి - 3

¤ టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఇంటెల్ అధ్యక్షురాలు రీనీ జేమ్స్, ఎఫ్ఎంసీజీ అగ్రగామి సంస్థ యునీలీవర్ సీఈవో పాల్ పామన్ భారత పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధాని మోదీని విడివిడిగా కలిశారు.
       » ప్రపంచంలో అతిపెద్ద అసెట్ మేనేజర్ బ్లాక్ రాక్ నిర్వహించిన 'ఇండియా ఇన్వెస్టర్ సమిట్‌'లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రపంచవ్యాప్త 21 దిగ్గజ కంపెనీ ప్రతినిధులకు మోదీ దిల్లీలో విందు ఇచ్చారు. ఇందులో వీరిద్దరు(రినీ, పాల్) కూడా ఉన్నారు. ఈ కంపెనీల పెట్టుబడుల ఆస్తుల విలువ 11 లక్షల కోట్లు.

ఫిబ్రవరి - 5

¤ ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అధ్యక్షుడు తకహికొ నకావో భారత పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
       » గతేడాది దాదాపు రూ.8400 కోట్లకు పైగా భారత్‌కు నిధులిచ్చి వివిధ రంగాల అభివృద్ధికి సహకరించినందుకు ప్రధాని మోదీ ఏడీబీని అభినందించారు.
       » భారత రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని మోదీ ఏడీబీని ఆహ్వానించారు.
       » కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోనూ తకహికొ సమావేశమయ్యారు.

ఫిబ్రవరి - 9

¤ సింగపూరు అధ్యక్షుడు డాక్టర్ టోనీ టాన్ కెంగ్ యామ్ భారత పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
       » ఈ సందర్భంగా ఆకర్షణీయ నగరాలు, నైపుణ్యాభివృద్ధి, పట్టణ పునర్ నవీకరణ, ఓడరేవుల అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించారు.

ఫిబ్రవరి - 10

¤ సింగపూరు అధ్యక్షుడు టోనీ కెంగ్ యామ్ భారత పర్యటనలో భాగంగా దిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.
       » సింగపూరులోని సాంస్కృతిక కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చేపట్టిన చర్యలను టోనీ కెంగ్‌ యామ్ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వివరించారు.
       » ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు అవుతున్న సందర్భంగాసింగపూరు అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు.

ఫిబ్రవరి - 15

¤ శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన నాలుగు రోజుల భారత పర్యటన నిమిత్తం దిల్లీ చేరుకున్నారు. భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీలంక లో తమిళులకు అధికారాలను కట్టబెట్టడం, మత్స్యకారుల సమస్యలు సహా అనేక ప్రధాన అంశాలపై సిరిసేన భారత ప్రధానితో చర్చిస్తారు.

ఫిబ్రవరి - 16

¤ రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువచ్చే రీతిలో భారత్ - శ్రీలంక  పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. రక్షణ, భద్రత పరమైన సహకారాన్ని పరస్పరం అందించుకోవాలని నిర్ణయించాయి.
       » భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
       » నలందా విశ్వవిద్యాలయం పునర్నిర్మాణ పథకంలో శ్రీలంక కు భాగస్వామ్యం కల్పించే మరో ఒప్పందం పైన రెండు దేశాలూ సంతకాలు చేశాయి.
       » అణు సంబంధిత సాంకేతికతను బదలాయించుకోవడం, వనరులను పంచుకోవడం, సిబ్బందికి శిక్షణ, రేడియో ఐసోటోపుల వినియోగం, అణు భద్రత, రేడియో ధార్మికత నుంచి రక్షణ లాంటి అంశాల్లో ఇరు దేశాలూ సహకరించుకుంటాయి. అణు విపత్తులను తట్టుకోవడం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లోనూ సహకారాన్ని అందించుకుంటాయి.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment